రేసులో ‘ఏనుగు’ కుప్పకూలింది
లక్నో : ఎన్నికల రేసులో ’ఐరావతం’ కుప్పకూలిపోయింది. కమలం ధాటికి ఏనుగు నిలబడలేకపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమి పాలైంది. పట్టుమని పాతిక సీట్లు కూడా సాధించలేకపోయింది ఏనుగుపార్టీ. ఎన్నికల ఫలితాలకు ముందు అధికారంపై ధీమా వ్యక్తం చేసిన బీఎస్పీ తాజా ఫలితాలతో యూపీలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. మొత్తం 403 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన మాయావతి పార్టీ పట్టుమని 20 స్థానాలను కూడా గెలవలేకపోయింది.
దళితులు, మైనార్టీల మద్ధతుతో మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని మాయావతి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. 2007 ఎన్నికల్లో సామాజిక సమీకరణాలతో అద్భుత విజయం సొంతం చేసుకున్న మాయావతి.. ఈ సారి కూడా దళిత-బ్రాహ్మిణ్, మైనార్టీల అండతో గెలుపొందాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 2012 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఎస్పీ ఈసారి అత్యంత దారుణంగా 19 సీట్లకు పడిపోయింది. యూపీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎస్పీకి ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే మొదటిసారి.
మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు షాక్ కు గురి చేశాయన్నారు. ఈవీఎంల టాంపరింగ్ వల్లే యూపీలో బీజేపీ గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికలు రద్దు చేసి పాత పద్ధతిలో నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు.