uttarapradesh elections
-
రేసులో ‘ఏనుగు’ కుప్పకూలింది
లక్నో : ఎన్నికల రేసులో ’ఐరావతం’ కుప్పకూలిపోయింది. కమలం ధాటికి ఏనుగు నిలబడలేకపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమి పాలైంది. పట్టుమని పాతిక సీట్లు కూడా సాధించలేకపోయింది ఏనుగుపార్టీ. ఎన్నికల ఫలితాలకు ముందు అధికారంపై ధీమా వ్యక్తం చేసిన బీఎస్పీ తాజా ఫలితాలతో యూపీలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. మొత్తం 403 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన మాయావతి పార్టీ పట్టుమని 20 స్థానాలను కూడా గెలవలేకపోయింది. దళితులు, మైనార్టీల మద్ధతుతో మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని మాయావతి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. 2007 ఎన్నికల్లో సామాజిక సమీకరణాలతో అద్భుత విజయం సొంతం చేసుకున్న మాయావతి.. ఈ సారి కూడా దళిత-బ్రాహ్మిణ్, మైనార్టీల అండతో గెలుపొందాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 2012 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఎస్పీ ఈసారి అత్యంత దారుణంగా 19 సీట్లకు పడిపోయింది. యూపీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎస్పీకి ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే మొదటిసారి. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు షాక్ కు గురి చేశాయన్నారు. ఈవీఎంల టాంపరింగ్ వల్లే యూపీలో బీజేపీ గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికలు రద్దు చేసి పాత పద్ధతిలో నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు. -
పని చేయని ప్రశాంత్ కిషోర్ టెక్నిక్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ వ్యూహాల ముందు ప్రశాంత్ కిషోర్ టెక్నిక్‌లు పని చేయలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారత రాజకీయ ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ను విజయపథాన నడిపించడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మర్మోగిపోయింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. అంతేకాకుండా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రశాంత్‌కు విభేదాలు వచ్చినట్టు సమాచారం. మరోవైపు 90వ దశకం తర్వాత యూపీలో నానాటికి ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో మరింత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమాజ్‌వాదీతో పొత్తు కట్టినా హస్తం పార్టీకి ప్రయోజనం రాలేదు. పైగా పార్టీ చరిత్రలో యూపీలో అత్యంత దారుణ స్థాయికి పడిపోయింది. అఖిలేష్ యాదవ్‌తో బేరాలాడి మరీ 105 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది స్థానాలను కూడా గెలవలేకపోయింది. కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. అలాగే హస్తం పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం రాలేదు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రియాంకాగాంధీ స్వయంగా ప్రచారం చేసినా కూడా హస్తం అభ్యర్థులు గెలవలేకపోయారు. ప్రియాంకా గాంధీ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రియాంక కేవలం కాగితం పులిగానే మిగిలిపోయారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి పనులతోనే యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆమె వ్యాఖ్యానించారు. -
సీటు వచ్చిన ఆనందంలో హార్ట్ ఎటాక్
ఆగ్రా: ఒక్కోసారి పట్టరాని సంతోషం వచ్చినా.. భరించలేని బాధ వచ్చినా కష్టమే అంటుంటారు. వీటివల్ల ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ సమాజ్ వాది పార్టీ నేతకు ఇలాగే జరిగింది. ఆయన జీవితంలోకి అదృష్టం మెయిన్డోర్లో నుంచి ఆ వెంటనే వెనకడోర్ నుంచి వెళ్లిపోయింది. పోతూపోతూ ఆయన ప్రాణాలు తీసుకెళ్లింది. తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని సంబురాల్లో మునిగిన ఎస్పీ నేత ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. దాంతో అప్పటి వరకు సంబురాల్లో మునిగిన ఆయను కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగ్రా కంట్ స్థానానికి చండ్రసేన్ తప్లు(45) అనే ఎస్పీ నేతకు టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన సంబురంలో మునిగిపోయారు. అందరితో కలిసి పార్టీ చేసుకున్నారు. ములాయంకు ధన్యవాదాలు చెప్పిన ఆయన తనకు సీటు వచ్చిన ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుంటూ సంతోషంగా గడిపారు. కానీ, గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పగా సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ నుంచి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇవ్వడంతో తీసుకెళుతుండగా మధుర టోల్ ప్లాజా వద్ద ప్రాణాలుకోల్పోయారు. అతని మృతిపట్ల ములాయం సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.