సీటు వచ్చిన ఆనందంలో హార్ట్ ఎటాక్
ఆగ్రా: ఒక్కోసారి పట్టరాని సంతోషం వచ్చినా.. భరించలేని బాధ వచ్చినా కష్టమే అంటుంటారు. వీటివల్ల ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ సమాజ్ వాది పార్టీ నేతకు ఇలాగే జరిగింది. ఆయన జీవితంలోకి అదృష్టం మెయిన్‌డోర్‌లో నుంచి ఆ వెంటనే వెనకడోర్ నుంచి వెళ్లిపోయింది. పోతూపోతూ ఆయన ప్రాణాలు తీసుకెళ్లింది. తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని సంబురాల్లో మునిగిన ఎస్పీ నేత ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. దాంతో అప్పటి వరకు సంబురాల్లో మునిగిన ఆయను కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు.
వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగ్రా కంట్ స్థానానికి చండ్రసేన్ తప్లు(45) అనే ఎస్పీ నేతకు టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన సంబురంలో మునిగిపోయారు. అందరితో కలిసి పార్టీ చేసుకున్నారు. ములాయంకు ధన్యవాదాలు చెప్పిన ఆయన తనకు సీటు వచ్చిన ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుంటూ సంతోషంగా గడిపారు. కానీ, గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పగా సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ నుంచి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇవ్వడంతో తీసుకెళుతుండగా మధుర టోల్ ప్లాజా వద్ద ప్రాణాలుకోల్పోయారు. అతని మృతిపట్ల ములాయం సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.