మేనిఫెస్టో లేకుండానే ఎన్నికల బరిలోకి..
లక్నో: మిగతా పార్టీలకంటే భిన్నంగా మేనిఫెస్టో ప్రకటించకుండానే నేరుగా ఎన్నికల బరిలోకిదిగిన బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) ప్రచారపర్వంలో దూసుకుపోతున్నది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం 61వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా లక్నోలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగామా వద్దని, సేవా కార్యక్రమాలు చేపడితే చాలని మాయ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘అచ్ఛే దిన్(మంచి రోజులు) తెస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని విధాలుగా విఫలమైంది. పెద్ద నోట్లు రద్దుచేసి 50 రోజులు పూర్తవుతున్నా ప్రజల ఇబ్బందులు తొలిగిపోలేదు. ఏ ఒక్క వాగ్ధానాన్నీ మోదీ నిలుపుకోలేకపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి బురే దిన్(చెడ్డరోజులు) మొదలువుతాయి. ఆ మేరకు వాళ్లు(బీజేపీ) సిద్ధంగా ఉండాలి’ అని మాయావతి అన్నారు.
దేశంలో దళితులపై చోటుచేసుకుంటున్న హింసను ఖండిండచం ఒక్కటే సరిపోదని, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం వారికి సమానహక్కులు అందాల్సిందేనని, ఆ మేరకు బీఎస్పీ కృషి చేస్తున్నదని తెలిపారు. తన సోదరుడి ఇల్లు, సంస్థలపై ఐటీ దాడులను ప్రస్తావిస్తూ.. ‘నా తమ్ముడుగానీ, ఇతర కుటుంబసభ్యులుగానీ తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవడానికి అధికార బీజేపీ ఎందుకు వెనుకడుగు వేస్తోంది?’ అని మాయవతి ప్రశ్నించారు.
ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలు ప్రకటించే రాజకీయ పార్టీలు.. ఎన్నికల తర్వాత ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తాయని, అయితే బీఎస్పీ మాత్రం ఇందుకు భిన్నంగా, మేనిఫెస్టో ప్రకటించకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తుందని మాయావతి అన్నారు. ఇప్పటికే 400 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ ముస్లింమైనారిటీలకు గణనీయంగా 97 టికెట్లు ఇచ్చింది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 8 వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది.