‘ఉగ్రవాద శక్తులకు సీఎం మద్దతు’
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ మండిపాటు
సంగ్రూర్ (పంజాబ్): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ’కొన్నిరోజుల కిందట బాంబు పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోయారు. ఆ పేలుళ్లకు కారణమైన శక్తులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు పలుకుతున్నారు. వాళ్లను మళ్లీ నిలబెట్టాలని చూస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగ్రూర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మాజీ మిలిటెంట్ నివాసంలో బస చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఉగ్రవాద, మిలిటెంట్ శక్తులు గతంలో పంజాబ్‌ను నాశనం చేశారని, హింసాయుత చర్యలకు పాల్పడ్డారని, ఇప్పుడే అవే శక్తులు మరోసారి తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారికి కేజ్రీవాల్ అండగా నిలబడుతున్నారని రాహుల్ ఆరోపించారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రజాసంక్షేమం కన్నా సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నదని ఆరోపించారు.