కపిల్ సిబల్ పై రీటా బహుగుణ గరం గరం..
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మహిళా నేత రీటా బహుగుణ జోషీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన నుంచి డబ్బులు తీసుకుని తిరిగివ్వలేదని కపిల్ సిబల్ ఆరోపించడమే రీటా బహుగుణ ఆగ్రహానికి ప్రధాన కారణం. తనపై వ్యాఖ్యలు చేసిన సిబల్ క్షమాపణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. యూపీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తమ పార్టీ నేత రీటా బహుగుణ బీజేపీలో చేరారన్న కారణంగా సిబల్ ఆమెపై ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత డబ్బు తీసుకుని తిరిగివ్వలేదన్న తరహాలో కాంగ్రెస్ ఎంపీ సిబల్ ప్రచారం చేసి హడావిడి చేశారు. అందులో భాగంగా రీటాను.. ఆ వలస పక్షి తన డబ్బులతో ఎగిరిపోయింది అన్నట్లు సిబల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కపిల్ సిబల్ వ్యాఖ్యలపై స్పందించిన రీటా బహుగుణ.. సిబల్ వంటి సీనియర్ నేతలు ఇలాంటి చవకబారు రాజకీయాలకు పాల్పడుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిబల్ నుంచి తన నియోజకవర్గం కోసం ఎంపీలాడ్(ఎంపీ నిధులు) ఫండ్ తీసుకున్నానని, అయితే అది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదని ఆమె ఘాటుగా స్పందించారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే సిబల్ కు, లక్నో కలెక్టర్ కు తన ఖాతా రద్దు చేయాలని, నిధులను వెనక్కి తీసుకోవాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు.