కాంగ్రెస్‌ను వీడి మంత్రి అయ్యారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషికి సముచిత ప్రాధాన్యం లభించింది. బీజేపీలో చేరిన కొన్ని నెలలకే ఆమె కేబినెట్ మంత్రి అయ్యారు.
లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్‌పై గెలిచిన రీటాకు మంత్రి పదవి దక్కింది. ఆదివారం యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేయగా, కేబినెట్ మంత్రిగా రీటా ప్రమాణం చేశారు. ఇక బీఎస్పీని వీడి బీజేపీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యకు మంత్రి పదవి లభించింది.
2007 నుంచి 2012 వరకు యూపీసీసీ అధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రీటా పనిచేశారు. ఆమె తండ్రి హేమవతీ నందన్ బహుగుణ మాజీ ముఖ్యమంత్రి. రీటా సోదరుడు విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతేడాది అక్టోబరులో రీటా కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.