రీటా నిష్క్రమణకు రాహుల్ కారణమా?
రీటా నిష్క్రమణకు రాహుల్ కారణమా?
Published Fri, Oct 21 2016 3:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీటా బహుగుణ పార్టీకి తీలోదకాలిచ్చి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆమె చెబుతున్నట్లు రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమా? మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ నాయకత్వ లోపం కారణంగానే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని తమిళనాడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జయంతి నటరాజన్, ఒడిషాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ హిమంత్ విశ్వశర్మ గతేడాది ఆరోపించిన విషయం తెల్సిందే. వారి తరహాలోనే రాహుల్ నాయకత్వంలో పార్టీ బలపడే అవకాశం లేనందునే తాను బీజేపీలోకి జంప్ చేశానని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ రీటా బహుగుణ ప్రకటించారు.
యూపీ పార్టీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ప్రకటించకపోయినా అంతర్గత చర్చల్లో రాహుల్ గాంధీకి నాయకత్వ పరిణతి లేకపోవడం వల్లన పార్టీ బలోపేతం కాలేకపోతోందని అంటున్నారు. 'ఫర్వాలేదు, పార్టీ బలోపేతం అవుతోందని అనుకుంటున్నంతలోనే పార్టీలో ఏదో ఉపద్రవం ముంచుకొస్తోంది. ప్రతిసారి ఇలాగే అవుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాక్ భూభాగంలో సర్జికల్ దాడులు జరిపినప్పుడు సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీయే ఆ తర్వాత మాట మార్చి సర్జికల్ దాడులకు సాక్ష్యాధారాలు చూపించమని అడగడం, సైనికుల రక్తంతో మోదీ రాజకీయం చేస్తున్నారంటూ అనుచిత విమర్శలు చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది' అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని యూపీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడొకరు మీడియాతో వ్యాఖ్యానించారు. కిసాన్ ర్యాలీతో పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలోనే రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ తగదునమ్మా అంటూ మోదీని విమర్శించడం రాజకీయ పరిణతి లేకపోవడమేనని మరో కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఈ కారణాలకంటే రీటా బహుగుణ పార్టీ వీడడానికి వ్యక్తిగత కారణాలే ఎక్కువగా ఉన్నాయి. 2003 నుంచి 2008 వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, 2007 నుంచి 2012 వరకు యూపీసీసీ అధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగిన రీటా బహుగుణను గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టడం ఆమెకు కోపం తెప్పించింది. పొరుగు రాష్ట్రం నుంచి షీలా దీక్షిత్‌ను తీసుకొచ్చి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఆమెను నొప్పించింది. యూపీ పార్టీ ఎన్నికల కమిటీలోకి కేవలం సభ్యురాలిగా మాత్రమే తీసుకొని ఏ ప్యానెల్ బాధ్యతలు కూడా అప్పగించకపోవడం ఆమె కోపాన్ని రెట్టింపు చేసింది. రీటా బహుగుణ బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకురాలే అయినా ఆమెకు ఎప్పుడూ అలాంటి గుర్తింపు లేదు. ఆవేశపూరిత నాయకురాలిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమవతీ నందన్ బహుగుణ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తన సోదరుడు విజయ్ బహుగుణను కాంగ్రెస్ పార్టీ అధిస్టానం 2014న తప్పించినప్పుడు రీటా బహుగుణ తన కుటుంబ సభ్యులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని సన్నిహితుల వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడే ఆమె సోదరుడు విజయ్ బహుగుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడంతో ఆ పార్టీలో చేరేందుకు రీటా బహుగుణకు మార్గం సులువైంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఆమె తన నియోజకవర్గమైన లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి గెలిచిన ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను ఓడించడం అసాధ్యం. అందుకనే మోదీ సర్జికల్ దాడులను ప్రశంసించడం ద్వారా త్వరలో తాను తీసుకోబోయే పార్టీ తీర్థం గురించి ఆమె ముందుగానే ఉప్పందించారు. ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమవుతాయనే ఆందోళనతో ఉన్న బీజేపీ ఇప్పుడు రీటా బహుగుణ చేరికతో షీలా దీక్షిత్‌కు పోటీగా ఆమెను దించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Advertisement