Vijay Bahuguna
-
రీటా నిష్క్రమణకు రాహుల్ కారణమా?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీటా బహుగుణ పార్టీకి తీలోదకాలిచ్చి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆమె చెబుతున్నట్లు రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమా? మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ నాయకత్వ లోపం కారణంగానే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని తమిళనాడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జయంతి నటరాజన్, ఒడిషాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ హిమంత్ విశ్వశర్మ గతేడాది ఆరోపించిన విషయం తెల్సిందే. వారి తరహాలోనే రాహుల్ నాయకత్వంలో పార్టీ బలపడే అవకాశం లేనందునే తాను బీజేపీలోకి జంప్ చేశానని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ రీటా బహుగుణ ప్రకటించారు. యూపీ పార్టీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ప్రకటించకపోయినా అంతర్గత చర్చల్లో రాహుల్ గాంధీకి నాయకత్వ పరిణతి లేకపోవడం వల్లన పార్టీ బలోపేతం కాలేకపోతోందని అంటున్నారు. 'ఫర్వాలేదు, పార్టీ బలోపేతం అవుతోందని అనుకుంటున్నంతలోనే పార్టీలో ఏదో ఉపద్రవం ముంచుకొస్తోంది. ప్రతిసారి ఇలాగే అవుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాక్ భూభాగంలో సర్జికల్ దాడులు జరిపినప్పుడు సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీయే ఆ తర్వాత మాట మార్చి సర్జికల్ దాడులకు సాక్ష్యాధారాలు చూపించమని అడగడం, సైనికుల రక్తంతో మోదీ రాజకీయం చేస్తున్నారంటూ అనుచిత విమర్శలు చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది' అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని యూపీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడొకరు మీడియాతో వ్యాఖ్యానించారు. కిసాన్ ర్యాలీతో పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలోనే రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ తగదునమ్మా అంటూ మోదీని విమర్శించడం రాజకీయ పరిణతి లేకపోవడమేనని మరో కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ కారణాలకంటే రీటా బహుగుణ పార్టీ వీడడానికి వ్యక్తిగత కారణాలే ఎక్కువగా ఉన్నాయి. 2003 నుంచి 2008 వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, 2007 నుంచి 2012 వరకు యూపీసీసీ అధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగిన రీటా బహుగుణను గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టడం ఆమెకు కోపం తెప్పించింది. పొరుగు రాష్ట్రం నుంచి షీలా దీక్షిత్‌ను తీసుకొచ్చి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఆమెను నొప్పించింది. యూపీ పార్టీ ఎన్నికల కమిటీలోకి కేవలం సభ్యురాలిగా మాత్రమే తీసుకొని ఏ ప్యానెల్ బాధ్యతలు కూడా అప్పగించకపోవడం ఆమె కోపాన్ని రెట్టింపు చేసింది. రీటా బహుగుణ బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకురాలే అయినా ఆమెకు ఎప్పుడూ అలాంటి గుర్తింపు లేదు. ఆవేశపూరిత నాయకురాలిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమవతీ నందన్ బహుగుణ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తన సోదరుడు విజయ్ బహుగుణను కాంగ్రెస్ పార్టీ అధిస్టానం 2014న తప్పించినప్పుడు రీటా బహుగుణ తన కుటుంబ సభ్యులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని సన్నిహితుల వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడే ఆమె సోదరుడు విజయ్ బహుగుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడంతో ఆ పార్టీలో చేరేందుకు రీటా బహుగుణకు మార్గం సులువైంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఆమె తన నియోజకవర్గమైన లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి గెలిచిన ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను ఓడించడం అసాధ్యం. అందుకనే మోదీ సర్జికల్ దాడులను ప్రశంసించడం ద్వారా త్వరలో తాను తీసుకోబోయే పార్టీ తీర్థం గురించి ఆమె ముందుగానే ఉప్పందించారు. ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమవుతాయనే ఆందోళనతో ఉన్న బీజేపీ ఇప్పుడు రీటా బహుగుణ చేరికతో షీలా దీక్షిత్‌కు పోటీగా ఆమెను దించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
'ఆ నిర్ణయానికి స్వాగతం'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పరిపాలనను మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం రెబల్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ బహుగుణ స్వాగతించారు. ఇదొక మంచి ముందడుగని అన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్పందిస్తూ హరీశ్ రావత్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినందున ఆయనను తొలగించాల్సిందేనని చెప్పారు. అయితే, రాష్ట్రపతి పాలన ఎంతో కాలం సాగదని, త్వరలోనే మరోసారి ఎన్నికలు జరుగుతాయని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటు జరిగితే బాగుండేదని అన్నారు. -
కాంగ్రెస్‌ను కాపీ కొడుతున్న బీజేపీ
డెహ్రాడూన్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వాలను తమ తైనాతీలైన గవర్నర్లను ఉపయోగించి పడగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇప్పుడు అదే అలవాటును కేంద్రంలో అధికారంలోవున్న భారతీయ జనతా పార్టీ పుణికి పుచ్చుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయం సాధించిన బీజేపీ మణిపూర్‌లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉత్తరఖండ్పై దృష్టిని సారించింది. కాంగ్రెస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల సహకారంతో రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసుకున్నారు. హరీష్ రావత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ఫిర్యాదు చేశారు. మార్చి 28వ తేదీన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా రావత్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో రావత్ తిరుగుబాటు రాజకీయాలను నెరపుతున్న నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా సభాపతిని కోరారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నాయకుడు హరక్ సింగ్ రావత్, బహుగుణ కుమారుడు సాకేత్, కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి అనిల్ గుప్తా సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలందరికి అనర్హత నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రావత్ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందా? ఓడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా? వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న అంశాలపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. రావత్ బల పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను దువ్వుతున్నారు. వారి మద్దతుతో రావత్ బల పరీక్ష నెగ్గినట్లయితే వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తారు. ఆ వెంటనే ఎన్నికలను కోరుకుంటారు. ఎలాగు ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. అలా కాకుండా బల పరీక్షలో రావత్ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు సభ్యుల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మరీ అప్పుడు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులకు కట్టబెడతారా, లేక పార్టీకి చెందిన నాయకులకు అప్పగిస్తారా? అన్న అంశం తెర ముందుకు వస్తుంది. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుల్లో విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్‌లు ఉన్నారు. కానీ వారికి మంచి ఇమేజ్ లేదు. 2013లో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యారన్న కారణంగా బహుగుణ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలోనే రావత్ ముఖ్యమంత్రిగా వచ్చారు.హరక్ సింగ్ రావత్ అంత పాపులర్ లీడర్ కాకపోవడమే కాకుండా సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని అభాసుపాలయ్యారు. బీజేపీకి సొంత పార్టీలోనూ చరిస్మాటిక్ నాయకుడు లేరు. ఉన్న హైప్రోఫైల్ లీడర్ బీసీ ఖండూరికి 85 ఏళ్లు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వయోభారం కారణంగా ఆయన సీఎం బాధ్యతలను నిర్వహించలేరు. ఏదేమైనా ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా
గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన విజయ్ బహుగుణ కొత్త ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రి హరీశ్ రావత్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేస్తారని కొద్ది నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజీజ్ ఖురేషీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బహుగుణ స్థానంలో కేంద్రమంత్రి హరీశ్ రావత్ పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. ఆయన పేరు ఖరారైందని, అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనని పీసీసీ వర్గాలు తెలిపాయి. రేసులో రాష్ట్ర మంత్రి ప్రీతమ్ సింగ్ పేరు కూడా వినిపిస్తున్నా.. అధిష్టానం రావత్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ‘‘పార్టీ పెద్దల సూచనల ప్రకారం నా పదవికి రాజీనామా చేశాను. రేపు పార్టీ ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొనే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని వారిని కోరుతున్నా’’ అని బహుగుణ విలేకరులతో అన్నారు. పదవి నుంచి తప్పించడానికి గల కారణాలపై విలేకరులు ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పేందుకు బహుగుణ నిరాకరించారు. ‘‘ఇన్నాళ్లూ దేశానికి సేవ చేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక ముందు కూడా రాష్ట్ర అభివృద్ధికి నా వంతుగా ఏం చేయగలనో అది చేస్తా’’ అని చెప్పారు. సీఎల్పీలో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు పార్టీ పరిశీలకులుగా హైకమాండ్ నుంచి కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ, అంబికాసోనీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. గత ఏడాది ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో విజయ్ బహుగుణ పనితీరుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. పెను విపత్తు సంభవించిన నాలుగు రోజుల తర్వాతగానీ ఆయన సహాయ పునరావాస చర్యలకు పూనుకోలేదని ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే బహుగుణను తొలగించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. కాగా, పైపై మార్పులతో కాంగ్రెస్ భవిష్యత్తు బాగుపడదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మట్టికరవడం ఖాయమని బీజేపీ విమర్శించింది. -
ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ రాజీనామా?
కాంగ్రెస్ అధిష్ఠానం తనను తొలగించే అవకాశం ఉందన్న కథనాలు రావడంతో.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ అజీజ్ ఖురేషీకి ఆయన తన రాజీనామా లేఖ సమర్పించారని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి పదవి రేసులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ అందరికంటే ముందున్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రీతమ్ సింగ్, లోక్‌సభ సభ్యుడు సత్పాల్ మహరాజ్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే హరీష్ రావత్ ఒక్కరికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా హరీష్ రావత్ పేరు సీఎం రేసులో వినిపించింది. కానీ అనూహ్యంగా విజయ్ బహుగుణను సీఎం చేశారు. హరీష్ రావత్‌ను ముఖ్యమంత్రిని చేయొద్దంటూ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి ఈనెల 11న ఓ లేఖ రాశారు. విజయ్ బహుగుణ సర్కారు బాగానే పనిచేస్తోందని, అందువల్ల రావత్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే బహుగుణను తప్పించాలని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. పైపెచ్చు, ఈ పదవి కోసం ఢిల్లీ నాయకులను రావత్ ఈనెల మొదట్నుంచే కలవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మిగిలిన నాయకులు కూడా సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు అవకాశం ఇస్తే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానని రావత్ ఈనెల 14న బహిరంగంగా ప్రకటించారు. -
కేదార్‌నాథ్‌లో పూజలు పునఃప్రారంభం
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో భారీ వరదల కారణంగా మూతపడిన ప్రఖ్యాత కేదార్నాథ్ దేవాలయంలో 86 రోజుల తర్వాత బుధవారం పూజలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ పునరుద్ధరణ అనంతరం బుధవారం ఉదయం 7 గంటలకు శుభప్రదమైన ‘సర్వార్థ సిద్ధి యోగం’ సమయంలో వేదమంత్రాలు పఠిస్తూ పురోహితులతో కలసి గర్భగుడిలోకి ప్రవేశించిన ప్రధాన పూజారి రావల్ భీమ శంకర్ లింగ్ శివాచార్య ‘శుద్ధీకరణ’, ‘ప్రాయశ్చిత్తీకరణ’ చేసి పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, పలువురు మంత్రులు హాజరు కావాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణం కారణంగా రాలేకపోయారు. వరదల వల్ల ఉత్తరాఖండ్‌లో వేలాది మంది మృత్యువాత పడటం, ఒక్క కేదార్నాథ్ లోయలోనే 400 మంది వరకూ చనిపోవడం తెలిసిందే. ఆలయం సైతం శవాలదిబ్బగా మార డంతో పూజలు నిలిపేశారు. కేదార్‌నాథ్‌కు యాత్రికులను అనుమతించడంపై 30న నిర్ణయం తీసుకోనున్నారు. -
11 నుంచి కేదార్‌నాథ్‌లో పూజలు
డెహ్రాడూన్: భారీ వరద ముంచెత్తిన కేదార్నాథ్ పుణ్యక్షేత్రం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోనుంది. ఈనెల 11 నుంచి అక్కడ పూజలు పునఃప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఆదివారం వెల్లడించారు. వరదల తాకిడికి కాలిబాట పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో ఈనెల 30 వరకు భక్తుల సందర్శనకు అనుమతించట్లేదని చెప్పారు.