ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో భారీ వరదల కారణంగా మూతపడిన ప్రఖ్యాత కేదార్‌నాథ్ దేవాలయంలో 86 రోజుల తర్వాత బుధవారం పూజలు పునఃప్రారంభమయ్యాయి.
కేదార్‌నాథ్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో భారీ వరదల కారణంగా మూతపడిన ప్రఖ్యాత కేదార్‌నాథ్ దేవాలయంలో 86 రోజుల తర్వాత బుధవారం పూజలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ పునరుద్ధరణ అనంతరం బుధవారం ఉదయం 7 గంటలకు శుభప్రదమైన ‘సర్వార్థ సిద్ధి యోగం’ సమయంలో వేదమంత్రాలు పఠిస్తూ పురోహితులతో కలసి గర్భగుడిలోకి ప్రవేశించిన ప్రధాన పూజారి రావల్ భీమ శంకర్ లింగ్ శివాచార్య ‘శుద్ధీకరణ’, ‘ప్రాయశ్చిత్తీకరణ’ చేసి పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, పలువురు మంత్రులు హాజరు కావాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణం కారణంగా రాలేకపోయారు. వరదల వల్ల ఉత్తరాఖండ్‌లో వేలాది మంది మృత్యువాత పడటం, ఒక్క కేదార్‌నాథ్ లోయలోనే 400 మంది వరకూ చనిపోవడం తెలిసిందే. ఆలయం సైతం శవాలదిబ్బగా మార డంతో పూజలు నిలిపేశారు. కేదార్‌నాథ్‌కు యాత్రికులను అనుమతించడంపై 30న నిర్ణయం తీసుకోనున్నారు.