ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా
గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన విజయ్ బహుగుణ
కొత్త ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రి హరీశ్ రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేస్తారని కొద్ది నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజీజ్ ఖురేషీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బహుగుణ స్థానంలో కేంద్రమంత్రి హరీశ్ రావత్ పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. ఆయన పేరు ఖరారైందని, అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనని పీసీసీ వర్గాలు తెలిపాయి.
రేసులో రాష్ట్ర మంత్రి ప్రీతమ్ సింగ్ పేరు కూడా వినిపిస్తున్నా.. అధిష్టానం రావత్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ‘‘పార్టీ పెద్దల సూచనల ప్రకారం నా పదవికి రాజీనామా చేశాను. రేపు పార్టీ ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొనే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని వారిని కోరుతున్నా’’ అని బహుగుణ విలేకరులతో అన్నారు. పదవి నుంచి తప్పించడానికి గల కారణాలపై విలేకరులు ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పేందుకు బహుగుణ నిరాకరించారు. ‘‘ఇన్నాళ్లూ దేశానికి సేవ చేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక ముందు కూడా రాష్ట్ర అభివృద్ధికి నా వంతుగా ఏం చేయగలనో అది చేస్తా’’ అని చెప్పారు. సీఎల్పీలో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు పార్టీ పరిశీలకులుగా హైకమాండ్ నుంచి కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ, అంబికాసోనీ శనివారం రాష్ట్రానికి రానున్నారు.
గత ఏడాది ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో విజయ్ బహుగుణ పనితీరుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. పెను విపత్తు సంభవించిన నాలుగు రోజుల తర్వాతగానీ ఆయన సహాయ పునరావాస చర్యలకు పూనుకోలేదని ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే బహుగుణను తొలగించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. కాగా, పైపై మార్పులతో కాంగ్రెస్ భవిష్యత్తు బాగుపడదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మట్టికరవడం ఖాయమని బీజేపీ విమర్శించింది.