uttarakhand chief minister
-
ఉత్తరాఖండ్ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!
డెహ్రాడూన్: మహిళల టోర్న్ జీన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను 200 ఏండ్లు అమెరికా పాలించిందని, భారతీయులను బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు అమెరికా కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తెలిపారు. రవి అస్తమించని రాజ్యంగానూ పేరుపొందిన అమెరికా ఇవాళ కొవిడ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిందంటూ వ్యాఖ్యానించడం వివాదాన్ని రేపింది. స్వయంగా ముఖ్యమంత్రికి బ్రిటన్‌కు అమెరికాకు తేడా తెలియకుండా మాట్లాడటం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా అమెరికా విఫలమైతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్తంలోని ఇండియా మాత్రం మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేయగలిగిందంటూ ఉత్తరాఖండ్ సీఎం మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని చాలా దేశాలను పాలించిన అమెరికా ప్రస్తుతం కరోనాను అదుపు చేయడంలో తలలు పట్టుకుంటోందని విమర్శించారు. భారత్‌తో పోల్చితే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 50 లక్షల వరకు చేరిందని చెప్పారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని అమెరికా ప్రభుత్వం మరొకసారి లాక్డౌన్ విధించే యోచన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో నరేంద్ర మోదీ తప్ప ఈ దేశానికి మరెవరైనా ప్రధాని అయి ఉంటే, భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో భారత ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు. కానీ ‘కొంతమంది ప్రధాని ఆదేశాలను మనం పాటించడంలేదని వ్యాఖ్యానించారు. మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలను కొందరు మాత్రమే పాటిస్తున్నారు’ అని తీరాత్ సింగ్ రావత్ అన్నారు. టోర్న్ జీన్స్ వస్త్రధారణపై తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సినీ ప్రపంచం, రాజకీయ నేతలు, విద్యార్థినులు, మహిళలు తప్పుబట్టారు. అంతేకాదు,సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆయనను తీవ్యంగా దుయ్యబట్టారు. దీంతో దిగొచ్చిన ఆయన క్షమాపణ తెలిపారు. కానీ మహిళలు జీన్స్ ధరించడం అభ్యంతరం లేదంటూనే చిరిగిన వాటిని ధరించడం సరైంది కాదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. #WATCH "...As opposed to other countries, India is doing better in terms of handling #COVID19 crisis. America, who enslaved us for 200 years and ruled the world, is struggling in current times," says Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/gHa9n33W2O — ANI (@ANI) March 21, 2021 (చదవండి: మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?) -
ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం
-
ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం
హాజరైన ప్రధాని మోదీ,అమిత్ షా తదితరులు డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్ రావత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఉత్తరాఖండ్ 9వ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్‌తో గవర్నర్ కృష్ణ కాంత్ పాల్ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా, మరో ఇద్దరు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా సత్పాల్ మహరాజ్, ప్రకాశ్ పంత్, హరక్ సింగ్ రావంత్, యశ్పాల్ ఆర్య, సుబోధ్ ఉనియల్, మదన్ కౌశిక్, అరవింద్ పాండే.. సహాయ మంత్రులుగా ధన్సింగ్ రావత్, రేఖ ఆర్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, జేపీ నడ్డా, హరియాణా సీఎం మనోహర్ ఖట్టర్సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను భాజపా 57 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం తమ నేతగా త్రివేంద్రæను ఎన్నుకుంది. ఉత్తరాఖండ్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు జార్ఖండ్ పార్టీ ఇన్చార్జిగా త్రివేంద్ర సింగ్ రావత్ కృషి చేశారు. డొయివాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 24 వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అయిన రావత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమిత్‌షాతో కలిసి యూపీలో పార్టీ గెలుపునకు కృషి చేశారు. త్రివేంద్ర సింగ్‌కు మోదీ అభినందనలు ఉత్తరాఖండ్ కొత్త సీఎం త్రివేంద్రకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీటర్లో అభినందనలు తెలిపారు. రావత్ ప్రభుత్వం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అభివృద్ధిని సాధిస్తుందన్న నమ్మకముందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కొత్త సీఎంకు ప్రధాని ఆశీస్సులు
-
కొత్త సీఎంకు ప్రధాని ఆశీస్సులు
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరక్ సింగ్ రావత్ సహా మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటారని భావించిన సత్పాల్ మహరాజ్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఉమాభారతి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లాగే, ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీ సాధించింది. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తొలుత సత్పాల్ మహరాజ్ లాంటి పెద్ద పేర్లు వినిపించినా, చివరకు త్రివేంద్ర సింగ్ రావత్‌ను ఖరారు చేశారు. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి మొదలుపెట్టి.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఈయన ఎదిగారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉండటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఈయనను వరించిందని అంటున్నారు. -
సీఎంపై స్టింగ్ ఆపరేషన్.. బయటికొచ్చిన సీడీ
ఉత్తరాఖండ్ రాజకీయాలు మంచి ఆసక్తికరంగా మారాయి. అక్కడి ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీలను కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయటపెట్టారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారు. తనకు మద్దతిస్తే డబ్బులిస్తానని రావత్ మభ్యపెట్టారని అన్నారు. మార్చి 23వ తేదీన ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారని, ఇందులో ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడారని రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేల ఆరోపణలను ముఖ్యమంత్రి హరీష్ రావత్ తోసిపుచ్చారు. వాళ్ల ఆరోపణలలో వాస్తవం లేదని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ కూడా అన్నారు. -
బీఫ్‌పై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
హరిద్వార్: గొడ్డుమాంసం, గోవధ చేసేవారిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చేసేవారికి భారత్‌లో నివసించే హక్కులేదని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 'గోవులను ఏ మతానికి చెందినవారు చంపినా సరే.. వాళ్లు భారత్‌కు అతిపెద్ద శత్రువు. అలాంటి వ్యక్తులకు దేశంలో నివసించే హక్కులేదు' అని ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం అన్నారు. గోవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, బీజేపీ పాలిత హరియాణ ముఖ్యమంత్రి ఎమ్ ఎల్ ఖట్టర్ ఇటీవల బీఫ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని వ్యాఖ్యానించారు. -
సీఎం కాన్వాయ్ పై రాళ్లు రువ్విన బీజేపీ కార్యకర్తలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం రాళ్లు రువ్వారు. నైనిటాల్ జిల్లాలోని హల్దవానీలో ఓ కుటుంబాన్ని పరామర్శించి తిరిగొస్తుండగా సీఎం కాన్వాయ్ పై బీజేపీ కార్యక్తలు ఈ దాడికి పాల్పడ్డారు. వారు విసిరిన రాళ్లు సీఎం ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దానికి తగిలాయి. హరీష్ రావత్ కారు ముందు సీటులో కూర్చోవడంతో ఆయన ఎటువంటి గాయాలు కాలేదని ఏడీజీ రాంసింగ్ మీనా తెలిపారు. రాళ్లు రువ్విన నలుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నట్ట చెప్పారు. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో బాధిత కుటుంబాన్ని రావత్ అంతకుముందు పరామర్శించారు. దోషులను చట్టప్రకారం శిక్షిస్తామని హామీయిచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏడీజీ తెలిపారు. -
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా
గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన విజయ్ బహుగుణ కొత్త ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రి హరీశ్ రావత్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేస్తారని కొద్ది నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజీజ్ ఖురేషీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బహుగుణ స్థానంలో కేంద్రమంత్రి హరీశ్ రావత్ పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. ఆయన పేరు ఖరారైందని, అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనని పీసీసీ వర్గాలు తెలిపాయి. రేసులో రాష్ట్ర మంత్రి ప్రీతమ్ సింగ్ పేరు కూడా వినిపిస్తున్నా.. అధిష్టానం రావత్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ‘‘పార్టీ పెద్దల సూచనల ప్రకారం నా పదవికి రాజీనామా చేశాను. రేపు పార్టీ ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొనే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని వారిని కోరుతున్నా’’ అని బహుగుణ విలేకరులతో అన్నారు. పదవి నుంచి తప్పించడానికి గల కారణాలపై విలేకరులు ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పేందుకు బహుగుణ నిరాకరించారు. ‘‘ఇన్నాళ్లూ దేశానికి సేవ చేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక ముందు కూడా రాష్ట్ర అభివృద్ధికి నా వంతుగా ఏం చేయగలనో అది చేస్తా’’ అని చెప్పారు. సీఎల్పీలో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు పార్టీ పరిశీలకులుగా హైకమాండ్ నుంచి కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ, అంబికాసోనీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. గత ఏడాది ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో విజయ్ బహుగుణ పనితీరుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. పెను విపత్తు సంభవించిన నాలుగు రోజుల తర్వాతగానీ ఆయన సహాయ పునరావాస చర్యలకు పూనుకోలేదని ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే బహుగుణను తొలగించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. కాగా, పైపై మార్పులతో కాంగ్రెస్ భవిష్యత్తు బాగుపడదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మట్టికరవడం ఖాయమని బీజేపీ విమర్శించింది. -
ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ రాజీనామా?
కాంగ్రెస్ అధిష్ఠానం తనను తొలగించే అవకాశం ఉందన్న కథనాలు రావడంతో.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ అజీజ్ ఖురేషీకి ఆయన తన రాజీనామా లేఖ సమర్పించారని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి పదవి రేసులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ అందరికంటే ముందున్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రీతమ్ సింగ్, లోక్‌సభ సభ్యుడు సత్పాల్ మహరాజ్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే హరీష్ రావత్ ఒక్కరికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా హరీష్ రావత్ పేరు సీఎం రేసులో వినిపించింది. కానీ అనూహ్యంగా విజయ్ బహుగుణను సీఎం చేశారు. హరీష్ రావత్‌ను ముఖ్యమంత్రిని చేయొద్దంటూ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి ఈనెల 11న ఓ లేఖ రాశారు. విజయ్ బహుగుణ సర్కారు బాగానే పనిచేస్తోందని, అందువల్ల రావత్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే బహుగుణను తప్పించాలని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. పైపెచ్చు, ఈ పదవి కోసం ఢిల్లీ నాయకులను రావత్ ఈనెల మొదట్నుంచే కలవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మిగిలిన నాయకులు కూడా సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు అవకాశం ఇస్తే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానని రావత్ ఈనెల 14న బహిరంగంగా ప్రకటించారు.