ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం | Trivendra Singh oath as Uttarakhand CM | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం

Published Sun, Mar 19 2017 1:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం - Sakshi

ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం

హాజరైన ప్రధాని మోదీ,అమిత్‌ షా తదితరులు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్‌ రావత్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. డెహ్రాడూన్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఉత్తరాఖండ్‌ 9వ సీఎంగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌తో గవర్నర్‌ కృష్ణ కాంత్‌ పాల్‌ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు కేబినెట్‌ మంత్రులుగా, మరో ఇద్దరు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్‌ మంత్రులుగా సత్పాల్‌ మహరాజ్, ప్రకాశ్‌ పంత్, హరక్‌ సింగ్‌ రావంత్, యశ్‌పాల్‌ ఆర్య, సుబోధ్‌ ఉనియల్, మదన్‌ కౌశిక్, అరవింద్‌ పాండే.. సహాయ మంత్రులుగా ధన్‌సింగ్‌ రావత్, రేఖ ఆర్య ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, జేపీ నడ్డా,  హరియాణా సీఎం మనోహర్‌  ఖట్టర్‌సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను భాజపా 57 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం తమ నేతగా త్రివేంద్రæను ఎన్నుకుంది. ఉత్తరాఖండ్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు జార్ఖండ్‌ పార్టీ ఇన్‌చార్జిగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కృషి చేశారు. డొయివాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 24 వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌ అయిన రావత్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమిత్‌షాతో కలిసి యూపీలో పార్టీ గెలుపునకు కృషి చేశారు.

త్రివేంద్ర సింగ్‌కు మోదీ అభినందనలు
ఉత్తరాఖండ్‌ కొత్త సీఎం త్రివేంద్రకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీటర్‌లో అభినందనలు తెలిపారు. రావత్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అభివృద్ధిని సాధిస్తుందన్న నమ్మకముందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement