ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న అమిత్‌షా
న్యూఢిల్లీ: వచ్చే 2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి మోదీకి, మోదీని అధికారం నుంచి తొలగించాలనే బృందానికి మధ్యే పోటీ ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందజేసిందని, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని ప్రశంసించారు.
ప్రతిపక్షాలు మాత్రం మోదీ హఠావో అన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్నందుకు మోదీ ప్రభుత్వానికి షా అభినందనలు తెలిపారు. మోదీ కఠోరంగా శ్రమిస్తూ, గొప్ప ప్రజాదరణను పొందుతున్నార న్నారు. ‘అత్యంత కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని బీజేపీ దేశానికి ఇచ్చింది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. రోజుకు 15–18 గంటలు పనిచేస్తన్నారు. ఇటువంటి ప్రధాని బీజేపీకి చెందిన వ్యక్తి అయినందుకు ఎంతో గర్విస్తున్నాం’అని ఆయన అన్నారు.
కుటుంబ రాజకీయాలకు స్వస్తి
ఈ సందర్భంగా మోదీ తీసుకున్న పలు సంస్కరణల గురించి అమిత్ షా ప్రస్తావించారు. కుటుంబ, కుల రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికి.. అభివృద్ధి రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. అవినీతిని అడ్డుకునేందుకు ఆయన తీసుకున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. తద్వారా దేశ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. పేదలకు ఎల్పీజీ సిలిండర్లు, గృహాలు, విద్యుత్ సదుపాయం, మరుగుదొడ్లు అందజేసేందుకు ఎన్నో పథకాలు రూపొందించారని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు వాటిని గుర్తుంచుకుంటారని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తానే ప్రధానిని అవుతానని వ్యాఖ్యానించారని.. అయితే ఈ వ్యాఖ్యలకు సొంత పార్టీవారితో పాటు, శరద్ పవార్, మమతా బెనర్జీ, అఖిలేశ్ వంటి ప్రతిపక్ష నాయకులూ మద్దతివ్వలేదన్నారు.
ఇంధన ధరల తగ్గింపుపై యోచన
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలపైనా ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది రోజులు ఇంధన ధరలు పెరిగితేనే వాళ్లు విసిగిపోతున్నారా? ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది’అని షా వెల్లడించారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ.. ‘యుద్ధాన్ని బీజేపీ చివరి అవకాశంగా భావిస్తుంది.
ఎటువంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత నాలుగేళ్లలో అత్యధిక శాతం ఉగ్రవాదులు హతమయ్యారు’అని పేర్కొన్నారు. మరోవైపు, కేంద్రంలో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న మోదీకి బిహార్ సీఎం నితీశ్ అభినందనలు తెలిపారు. బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఓ ట్వీట్ చేస్తూ నాలుగేళ్లలో మోదీ చేసిన అభివృద్ధి తక్కువ, ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలో స్త్రీలు, దళితులపై దాడులు, నిరుద్యోగం, సామాజిక ఉద్రిక్తతలు పెరిగిపోయాయని ఎండగట్టారు.
పాలనపై సర్వేలో పాల్గొనండి: మోదీ
నాలుగేళ్లుగా తమ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో తెలియజేసేందుకు ఓ సర్వేలో పాల్గొనాలని మోదీ దేశ ప్రజలను కోరారు. ‘నమో’ యాప్‌లో సర్వేలో పాల్గొని ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలన్నారు. పరిశుభ్రత, పేదలకు అందుబాటు ధరల్లో వైద్యం, ఉద్యోగావకాశాలు, గ్రామాల విద్యుద్దీకరణ, రైతుల శ్రేయస్సు, అవినీతిపై పోరు, ధరల పెరుగుదల, చట్టాల అమలు, విద్య తదితర అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు నమో యాప్‌లో రేటింగ్ ఇవ్వొచ్చు. కేంద్ర ప్రభుత్వ పాలనతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకూ రేటింగ్ ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment