ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ రాజీనామా?
కాంగ్రెస్ అధిష్ఠానం తనను తొలగించే అవకాశం ఉందన్న కథనాలు రావడంతో.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ అజీజ్ ఖురేషీకి ఆయన తన రాజీనామా లేఖ సమర్పించారని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి పదవి రేసులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ అందరికంటే ముందున్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రీతమ్ సింగ్, లోక్సభ సభ్యుడు సత్పాల్ మహరాజ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే హరీష్ రావత్ ఒక్కరికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా హరీష్ రావత్ పేరు సీఎం రేసులో వినిపించింది. కానీ అనూహ్యంగా విజయ్ బహుగుణను సీఎం చేశారు.
హరీష్ రావత్ను ముఖ్యమంత్రిని చేయొద్దంటూ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి ఈనెల 11న ఓ లేఖ రాశారు. విజయ్ బహుగుణ సర్కారు బాగానే పనిచేస్తోందని, అందువల్ల రావత్ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే బహుగుణను తప్పించాలని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. పైపెచ్చు, ఈ పదవి కోసం ఢిల్లీ నాయకులను రావత్ ఈనెల మొదట్నుంచే కలవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మిగిలిన నాయకులు కూడా సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు అవకాశం ఇస్తే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానని రావత్ ఈనెల 14న బహిరంగంగా ప్రకటించారు.