కాంగ్రెస్‌ను కాపీ కొడుతున్న బీజేపీ | BJP copying congress party to collapse government | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను కాపీ కొడుతున్న బీజేపీ

Published Tue, Mar 22 2016 2:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌ను కాపీ కొడుతున్న బీజేపీ - Sakshi

కాంగ్రెస్‌ను కాపీ కొడుతున్న బీజేపీ

డెహ్రాడూన్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వాలను తమ తైనాతీలైన గవర్నర్లను ఉపయోగించి పడగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇప్పుడు అదే అలవాటును కేంద్రంలో అధికారంలోవున్న భారతీయ జనతా పార్టీ పుణికి పుచ్చుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయం సాధించిన బీజేపీ మణిపూర్‌లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉత్తరఖండ్‌పై దృష్టిని సారించింది.

కాంగ్రెస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల సహకారంతో రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసుకున్నారు. హరీష్ రావత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ఫిర్యాదు చేశారు. మార్చి 28వ తేదీన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా రావత్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో రావత్ తిరుగుబాటు రాజకీయాలను నెరపుతున్న నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా సభాపతిని కోరారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నాయకుడు హరక్ సింగ్ రావత్, బహుగుణ కుమారుడు సాకేత్, కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి అనిల్ గుప్తా సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలందరికి అనర్హత నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రావత్ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందా? ఓడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా? వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న అంశాలపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. రావత్ బల పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను దువ్వుతున్నారు. వారి మద్దతుతో రావత్ బల పరీక్ష నెగ్గినట్లయితే వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తారు. ఆ వెంటనే ఎన్నికలను కోరుకుంటారు.

ఎలాగు ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. అలా కాకుండా బల పరీక్షలో రావత్ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు సభ్యుల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మరీ అప్పుడు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులకు కట్టబెడతారా, లేక పార్టీకి చెందిన నాయకులకు అప్పగిస్తారా? అన్న అంశం తెర ముందుకు వస్తుంది.

కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుల్లో విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్‌లు ఉన్నారు. కానీ వారికి మంచి ఇమేజ్ లేదు. 2013లో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యారన్న కారణంగా బహుగుణ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలోనే రావత్ ముఖ్యమంత్రిగా వచ్చారు.హరక్ సింగ్ రావత్ అంత పాపులర్ లీడర్ కాకపోవడమే కాకుండా సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని అభాసుపాలయ్యారు. బీజేపీకి సొంత పార్టీలోనూ చరిస్మాటిక్ నాయకుడు లేరు. ఉన్న హైప్రోఫైల్ లీడర్ బీసీ ఖండూరికి 85 ఏళ్లు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వయోభారం కారణంగా ఆయన సీఎం బాధ్యతలను నిర్వహించలేరు. ఏదేమైనా ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement