
ఇంఫాల్: మణిపూర్‌లో గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికిముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మణిపూర్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త నేత విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే విషయానికొస్తే..
రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన(President's rule) విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. అలాగే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా తొలగించి, ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనప్పుడు కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356(Article 356)ను ఉపయోగిస్తూ వస్తోంది.
దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1951 జూన్ 20న పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా ఆర్టికల్ 356ను ఉపయోగించారు. ఆయన పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. నాడు పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం(Communist government)లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిని విధించారని కొందరు రాజకీయ నిపుణులు చెబుతుంటారు. కాగా అధికారిక రికార్డుల ప్రకారం 1959లో మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. జవహర్‌లాల్ నెహ్రూకు కేరళ వామపక్ష ప్రభుత్వం నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
Comments
Please login to add a commentAdd a comment