ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి త్వరలో ఆ పార్టీకి హ్యాండ్ ఇవ్వనున్నారు. రీటా బహుగుణ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఇతర పార్టీ నేతలతో కలిసి బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కలిసినట్లు తెలుస్తోంది. కాగా ఉత్తరప్రదేశ్ ను 'హస్త'గతం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా రీటా బహుగుణ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు.
కాగా రీటా బహుగుణ గతంలో యూపీసీసీ చీఫ్గా పని చేశారు. అయితే 2012 యూపీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రీటా బహుగుణ లక్నో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీలో చేరతారనే మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఆమె బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మాస్ అప్పిరియన్స్ లేకపోయినప్పటికీ ఆరోపణలు చేయడంలో ఏ మాత్రం వెనుకాడే తత్వం కాదు రీటా బహుగుణది. రాజకీయాల్లో ప్రవేశించి చిన్న చిన్నగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై పూర్తి పట్టున్న ఆమెను ...బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనుకుంటోంది.