రాహుల్ యాత్ర ముగియగానే.. కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలతో పూర్వ వైభవం కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నెలరోజులపాటు యూపీ అంతా కలియతిరిగి.. ‘రైతు యాత్ర’ను ముగిసిన కొద్దివారాలకే యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ జోషీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ దిగ్గజం హేమవతి నందన్ బహుగుణ తనయురాలైన ఆమె హస్తాన్ని వీడి.. కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో గురువారమిక్కడ ఆమె కమలంలో చేరారు.
67 ఏళ్ల రీటా ప్రస్తుతం లక్నోలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెతోపాటు ఆమె సోదరుడు, మాజీ ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ కూడా బీజేపీలో చేరారు. గతంలో కాంగ్రెస్ యూపీ చీఫ్‌గా చాలాకాలంపాటు రీటా బహుగుణ సేవలందించారు. అయితే. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, యూపీ పార్టీ చీఫ్‌గా రాజ్ బబ్బర్‌ను నియమించి తనను పక్కనబెట్టడంతో ఆమె అసంతృప్తి చెంది పార్టీ మారారు.
బీజేపీ చేరిన సందర్భంగా రీటా మాట్లాడుతూ రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నియమించుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోల్ మేనేజర్‌గా ఉండగలడు కానీ, పోల్ డైరెక్టర్ కాలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కోసమే తాను కమలం పార్టీలో చేరినట్టు చెప్పారు. పీవోకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు చూపించాలనడం దారుణమన్నారు. యూపీలో మాఫియా రాజ్యం ఏలుతోందని, యూపీలో శాంతిభద్రతలతో కూడిన సుపరిపాలన రావాలంటే ఎస్పీ, బీఎస్పీ మాఫియా నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ఆమె పేర్కొన్నారు.