యువతి ఫోన్ ట్యాప్ చేయించిన మోడీ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉండే అర్హత నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ మహిళా నేతలు అన్నారు. గుజరాత్లో ఓ మహిళా ఆర్కిటెక్ ఫోన్ను చట్టవిరుద్ధంగా మోడీ ట్యాప్ చేయించారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2009లో అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా, ఓ ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కోబ్రా పోస్ట్, గులైల్ ఇన్వెస్టిగేటివ్ పోర్టల్లు ఈ నెల 15న బయటపెట్టాయి.
నరేంద్ర మోడీయే తన అనుచరుడు అమిత్ షాతో ఇదంతా చేయించారని కేంద్ర మంత్రులు జయంతి నటరాజన్, గిరిజా వ్యాస్, యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా ఆరోపించారు. మహిళా గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిన మోడీపై సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలన్నారు. ఆ యువతి వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గుజరాత్ను పాలించే నైతిక, రాజకీయ అర్హత ఆయన కోల్పోయారని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ అనర్హుడన్నారు.