హఠాత్తుగా ఇంత మార్పు ఎందుకో?
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మిక పాకిస్థాన్ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేతల విమర్శలు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్... మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత కొద్ది నెలల వరకూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడని నరేంద్ర మోదీలో హఠాత్తుగా ఇంత మార్పేంటబ్బా అంటూ ఎద్దేవా చేశారు. ఇదంతా కన్ఫ్యూజుడ్ పాలసీ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై మనీష్ తివారీ స్పందిస్తూ...గతంలో అటల్ బిహారీ వాజ్పేయ్ లాహోర్లో పర్యటించిన అనంతరం 'కార్గిల్' యుద్ధం జరిగిందని, మరి ఇప్పుడూ అంటూ ప్రశ్నించారు. అది ఒక వ్యాపారి చేసిన ముందస్తు ఏర్పాటని, దేశ ప్రయోజనాల పెంపు, ఉగ్రవాద నియంత్రణకు కాకుండా ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రధాని పాక్ వెళ్లారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. పాక్‌తో మోదీ సంబంధాలు అవివేకం, గత నిర్ణయాలకు భిన్నం అని ఆయన ఆక్షేపించారు. మరోవైపు కాంగ్రెస్ నేతల విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది.