
తేజస్వీ యాదవ్‌ని మోదీజీ ఆ మాట అనకుండా ఉండాల్సింది. ‘జంగిల్ రాజ్ కా యువరాజ్’ అంటే బిహార్ యువ ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా ఉంది!
ముప్పై ఏళ్ల వాడు కనుక, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కనుక బిహార్‌లో ఎన్నికలు ఉన్నా, లేకున్నా తేజస్వి యువరాజే అని బిహార్ ప్రజలు అనుకుంటే కనుక ‘జంగిల్ కా యువరాజ్’ అనే మాటను మోదీజీ నా భవిష్యత్తును ముందే ఊహించి అనినట్లు అవుతుంది. తండ్రీ కొడుకులకు నితీశ్ నమ్మకద్రోహం చేశాడని అనుకుని కూడా నాకు ఓట్లేసే వాళ్లున్నారు. వాళ్లను కూడా మోదీజీ ఓటు వేయనిచ్చేలా లేరు.
మొదటి విడతలో మోదీ ప్రచారం బాగానే పని చేసిందని కార్యకర్తలు అంటున్నారు. అదే ఆందోళన కలిగిస్తోంది. మోదీజీ ప్రచారం పని చెయ్యడం అంటే తేజస్వీ యాదవ్‌ని నేను ఎన్నికల తర్వాత తేజస్వీజీ అనవలసి రావడం! గతంలో నేను అన్నవి మోదీజీ మనసులో పెట్టుకునే తేజస్విని యువరాజ్ అంటున్నారా?! ఆయన మనసులో పెట్టుకున్నా లేకున్నా, అప్పుడు నేనన్నవైతే ఇప్పుడు నా మనసులోకి ఒకటొకటిగా వస్తున్నాయి.
పదేళ్లు వెనక్కు వెళ్లాను. 2010 బిహార్ ఎన్నికలకు మోదీజీ ప్రచారానికి వస్తానన్నారు. ‘గుజరాత్ సీఎం వచ్చి బిహార్‌లో చేసే ప్రచారం ఏముంటుంది!’ అన్నాను. ‘మోదీజీ ఉంటే బాగుంటుంది కదా’ అని అడ్వాణీజీ అన్నారు. ‘బిహార్‌లో మాకు సుశీల్ మోదీ ఉన్నారు. నరేంద్ర మోదీ అవసరం లేదు’ అన్నాను. ఆ ఎన్నికల్లో నాకు అంత ధైర్యం ఎలా ఉండేదో ఈ ఎన్నికల్లో ఇప్పుడు అర్థం కావడం లేదు!
‘మోదీ ఒక్కరే కాదు, ఆయనతో పాటు వరుణ్ గాంధీ కూడా బిహార్ ప్రచారానికి వస్తారు’ అని అడ్వాణీ కబురు పెట్టారు. అప్పట్లో ఎన్.డి.ఎ. చైర్మన్ ఆయన. ‘వరుణ్ కూడా అక్కర్లేదు’ అన్నాను.
‘ఎన్.డి.ఎ.లో మీ పార్టీ కూడా భాగస్వామి అయినప్పుడు మీ ఎన్నికల ప్రచారంలో మనవాళ్లు కూడా భాగస్వాములు అవ్వాలి కదా నితీశ్’ అని అడ్వాణీజీ. అంత గట్టిగా నేనెలా వద్దని అన్నానో, అంత మెత్తగా ఆయన ఎందుకు ఉండిపోయారో ఆ తర్వాతెప్పుడూ నేను గుర్తు చేసుకోలేదు.
ఇప్పుడైనా బిహార్‌లో మోదీజీ వల్ల నితీశ్ గెలుస్తాడా, నితీశ్ వల్ల మోదీజీ గెలుస్తారా అని ఇప్పటి ఎన్.డి.ఎ. చైర్మన్ అమిత్ షా అంచనా వేస్తున్నారు కానీ, ఈ ఇద్దరి వల్ల తేజస్వీ యాదవ్ గానీ గెలవడు కదా అని ఆలోచిస్తున్నట్లు లేరు.
‘‘మీ గురించి మోదీజీ, మోదీజీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవాలి’’అని మూడు విడతల ర్యాలీకి మ్యాప్ గీసి పంపారు అమిత్ షా!
‘‘అదెలా సాధ్యం అమిత్‌జీ. గతంలో ఆయన నన్ను చాలా అన్నారు. ఇప్పటికీ నేను ఆయన్ని చాలానే అంటూ ఉన్నాను కదా!’’ అని అన్నాను. అమిత్‌జీ నవ్వారు.
‘‘నితీశ్‌జీ.. ‘గెలవడం ముఖ్యం అయినప్పుడు ఏమైనా చేస్తారు. గెలవలేం అని తెలుస్తున్నప్పుడు చేయకూడనిదైనా చేస్తారు’ అని గతంలో మీరు ఎవరితోనైనా, మీతో ఎవరైనా అనినట్లు మీకు గుర్తుందా?! అని అడిగారు.
అది నేను సమాధానం చెప్పే అవసరం లేని ప్రశ్న. అమిత్ షా ఏదైనా చెప్పదలచుకుంటే ఇలాగే ప్రశ్న రూపంలో అడుగుతారు.
ఇంకో రెండు విడతలు మిగిలే ఉన్నాయి. మూడునొకటి, ఏడునొకటి. తొలిæవిడత ప్రచారంలో ప్రజల వైపు చూస్తూ మోదీజీని నేను ‘శ్రద్ధేయ’ అని కొనియాడాను. మోదీజీ కూడా ప్రజల వైపు చూస్తూ నన్ను ‘భావి ముఖ్యమంత్రి’ అని కీర్తించారు!
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మనిషిని పట్టుకుని ‘భావి ముఖ్యమంత్రి’ అని ప్రజలకు పరిచయం చేశారంటే ఆయన తన మనసులో ఏదైనా పెట్టుకుని ఉండాలి. లేదా తేజస్వీ యాదవ్‌ని పెట్టుకుని ఉండాలి.
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment