ఏం చేశాడని వల్లభ్‌భాయ్‌కి అంతెత్తు విగ్రహం? | Madhav Singaraju Rayani Dairy On Narendra Modi | Sakshi
Sakshi News home page

రాయని డైరీ నరేంద్ర మోదీ (ప్రధాని)

Published Sun, Oct 21 2018 12:24 AM | Last Updated on Sun, Oct 21 2018 8:53 AM

Madhav Singaraju Rayani Dairy On Narendra Modi - Sakshi

విమర్శించేవాళ్లు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్లు.. విమర్శించడానికి దేశంలో ఎక్కడెక్కడ నిర్మాణాత్మకమైన పనులు జరుగుతున్నాయో సర్వేలు జరిపిస్తూ ఉంటారు. వాళ్లకు భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ ఎవరో గుర్తుండరు. స్వాతంత్య్రం కోసం సుభాస్‌ చంద్రబోస్‌ ఏం చేశాడో గుర్తుండదు. స్వాతంత్య్రం వచ్చాక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌  ఎన్ని కొమ్ముల్ని ఒంచిందీ వాళ్లకు గుర్తుండదు. ఎన్నేళ్లయినా వాళ్లు మర్చిపోని విషయం ఒక్కటే. వాళ్ల కుటుంబం లోని వాళ్ల పేర్లు, పుట్టిన రోజులు!

ఈరోజు ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ఉంది. ‘ఏడాదికి ఒక్కసారే, ఆగస్టు పదిహేనున మాత్రమే కదా ఎర్రకోటపై జెండా ఎగరవల సింది?’ అని వెంటనే విమర్శలు మొదల య్యాయి. స్వాతంత్య్రం వచ్చిన రోజొక్కటే కాదు, స్వాతంత్య్రాన్ని తెచ్చేందుకు పెద్ద ప్రయత్నం జరిగిన ప్రతిరోజునూ ఈ దేశ ప్రజలు స్మరించుకోవాలి. కానీ ఆ కుటుంబం లోని వాళ్లు ప్రజల్లో ఒకరిగా లేరు! ప్రజలకు ఏదో చేసిన ఒక ప్రత్యేక కుటుంబంగా ఉండిపోయారు. 

సుభాస్‌ చంద్రబోస్‌ అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని స్థాపించి ఈ రోజుకు డెబ్బై ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భం స్వాతంత్య్ర దినో త్సవం కన్నా ఏం తక్కువ? స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వాన్ని నెలకొల్పింది ఆ కుటుం బంలోని వ్యక్తే కావచ్చు. కానీ స్వాతంత్య్రం కోసం ప్రభుత్వాన్ని స్థాపించిన శక్తి సుభాస్‌ చంద్రబోస్‌. అంత ధీరత్వం ఎవరికుంటుంది? దేశమే లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం! 

ఈ నెలాఖర్లోనే ఇంకో ముఖ్యమైన రోజు ఉంది. అది కూడా ఆ కుటుంబానికి గుర్తుండ కపోవచ్చు. అక్టోబర్‌ ముప్పైఒకటి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ జయంతి. ఆ రోజు గుజరాత్‌లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ విగ్రహ ఆవిష్కరణ. ఏం చేశాడని వల్లభ్‌భాయ్‌కి అంతెత్తు విగ్రహం? ఏం చేశాడని అన్ని కోట్ల విగ్రహం అని వాళ్లు మళ్లీ మొదలుపెట్టారు. దేశాన్ని యూనిటీగా ఉంచాడు. అది చాలదా? ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ కన్నా ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ గొప్పది నా ఉద్దేశంలో. యూనిటీ ఉంటేనే లిబర్టీ వస్తుంది. యూనిటీ ఉంటేనే లిబర్టీ నిలుస్తుంది. నిలుపు కోవడం కోసం ఇన్నేళ్లుగా ఈ దేశ ప్రజలు ఆ ‘కుటుంబం’తో పోరాడుతున్నారంటే.. ఒక్కొక్కరు ఒక్కో బోస్‌తో, ఒక్కో పటేల్‌తో సమానం.

విమర్శించేవాళ్లు కొన్నిసార్లు ప్రశ్నలు కూడా వేస్తారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధా నాలు వినరు. ‘ఆ కుటుంబం’లోని నాలుగో  తరం యువ నాయకుడికి విమర్శించాలన్న తపన తప్ప.. పాపం, వేరే వ్యసనాలేం లేవు. ‘పదిహేనేళ్ల కాంగ్రెస్‌ సంస్కరణల్ని మోదీ ధ్వంసం చేశాడు’ అంటాడు! ‘నోట్లను రద్దు చేసి, జీఎస్టీ పద్దులు వేసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు’ అంటాడు. క్యాపిటలిస్టుల్ని భుజాలపైకి, నెత్తి మీదికి ఎక్కించుకుంటు న్నాడని అంటాడు. విమర్శించడానికి ఏమీ లేకపోతే ‘రాఫెల్‌ డీల్‌’ అంటాడు. డీల్‌లో అనిల్‌ అంబానీకి ఎంతిచ్చావ్‌ అంటాడు!! 

బుధవారం ఇంకో భారీ ఈవెంట్‌ ఉంది. స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ లిటరసీ, ఫైనాన్షి యల్‌ ఇంక్లూజన్, స్వచ్ఛ భారత్‌.. క్యాంపెయి న్‌లన్నీ కలిపి చేసిన పోర్టల్‌ ఓపెనింగ్‌ ఆ రోజు. ముఖేశ్‌ అంబానీ, కుమార మంగళం, సునీల్‌ మిట్టల్, ఆనంద్‌ మహీంద్రా.. ఇంకా రెండు     వేల మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. లక్షమంది ఐటీ నిపుణులు టెలికాన్ఫరెన్స్‌లోకి వస్తున్నారు. ప్రజలకు ఏమైనా చేయడానికి తలపెట్టిన కార్పొరేట్‌ యజ్ఞమది. నాలుగోతరం నాయకుడు ఇప్పటికే అనుకుని ఉంటాడు.. అనిల్‌ రాకుండా ముఖేశ్‌ వస్తున్నాడంటే.. అది రాఫెల్‌ ఎఫెక్టే అయి ఉంటుందని. 

చరిత్ర గుర్తులేనివారు, వర్తమానాన్ని అర్థం చేసుకోలేనివారు, భవిష్యత్తుని ఊహించ లేని వారు మాత్రమే అతడిలా చక్కటి విమర్శకులు అవుతారు.

మాధవ్‌ శింగరాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement