‘‘మెస్మరైజ్ చేశారు మోదీజీ మీ సన్‌రైజ్ కవిత్వంతో..’’ అని ఉదయాన్నే ఫోన్ చేశాడు హర్షవర్ధన్! ‘‘హర్షవర్ధన్.. నిన్న కదా నా కవిత్వానికి నువ్వు మెస్మరైజ్ అవాల్సింది’’ అన్నాను. ‘‘నేను మళ్లీ ఈరోజు విన్నాను మోదీజీ. నిన్న వ్యాక్సిన్ ఏర్పాట్లలో ఉండి.. విన్నానని, బాగుందనీ చెప్పలేకపోయాను. ‘అభీ తో సూరజ్ ఉగా హై..’ అని మీ గొంతులోంచి దిగుతున్న కవిత్వం, సూర్యుణ్ణి పైకి లేపుతోంది’ అన్నాడు.
‘నా కవిత్వం బాగుందన్న విషయాన్ని నువ్వు నీ కవిత్వంతో చెప్పక్కర్లేదు హర్షవర్ధన్. చెప్పు.. ఏంటి? ’’ అన్నాను.
‘‘జనవరి ఫస్ట్ ఉదయం ఆలస్యంగా లేవకూడదనుకుని డిసెంబర్ థర్టీ ఫస్ట్‌న త్వరగా పడుకున్నాను మోదీజీ. త్వరగా పడుకున్నందువల్ల త్వరగా నిద్ర పట్టింది కానీ, త్వరగా నిద్ర లేవలేకపోయాను! మధ్యాహ్నం అయింది. ‘సూర్యుడిప్పుడే మేల్కొన్నాడు’ అని మోదీజీ గొప్ప కవిత్వం రాసి చదివారు విన్నారా?’ అని అమిత్‌జీ ఫోన్ చేసి అడిగారు. ‘వినబోతుంటేనే మీరు ఫోన్ చేశారు’ అని ఆయనకు చెప్పి, విన్నాక మీకు ఫోన్ చేశాను మోదీజీ’’ అన్నాడు.
‘‘ఏం చెబుతామని ఫోన్ చేశావో అది చెప్పు హర్షవర్ధన్. జనవరి ఫస్ట్ కోసం చదివిన కవిత్వం అది. ఫస్ట్ వెళ్లిపోయింది కదా.. నెక్స్›్ట ఏమిటో చెప్పు..’’ అన్నాను.
‘‘నెక్స్›్ట మళ్లీ రెండువేల ఇరవై రెండులోనే కదా మోదీజీ ఇంకో జనవరి ఫస్ట్ సన్‌రైజ్ ఉంటుంది’’ అన్నాడు!!
దేశంలోకి కరోనా ఎంటరైనప్పటి నుంచి హర్షవర్ధన్ నెలల్నీ, రోజుల్నీ వదిలేసి, సంవత్సరాల్లోనే మాట్లాడుతున్నాడు! కరోనా ఎప్పటికి పోతుంది? కనీసం ఏడాది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఏడాది తర్వాతే. వ్యాక్సిన్ పని చేస్తుందా? ఏడాదికి గానీ తెలి యదు. మళ్లీ రాకుండా ఉంటుందా? ఏడాది చూసి గానీ చెప్పలేం. ఏడాదిగా ఇంతే! ఇప్ప టికీ హర్షవర్ధన్ తన స్టాండ్‌పై తను ఉన్నాడు.
‘అలా ఎలా చెబుతావ్ హర్షవర్ధన్?’ అని ఓ రోజు ఫోన్ చేసి అడిగాను. తన స్టాండు మార్చుకోలేదు! ‘ఆరోగ్యశాఖ ధైర్యం చెప్ప కూడదు మోదీజీ. ప్రజల్లో భయం పోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భయం చెప్పిందే కానీ..వ్యాక్సినొస్తుందని గానీ, వచ్చిన వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని గానీ ఏనాడూ ధైర్యం చెప్పలేదు’ అన్నాడు. ఇప్పుడైనా స్టాండు దిగాడో లేదో?!
‘‘ వ్యాక్సిన్ డ్రై రన్ బాగానే జరుగుతోందా హర్షవర్ధన్? మనవి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు కదా. ఫారిన్ వాళ్ల ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తోందట? రష్యా వాళ్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ గురించి ఏమైనా తెలిసిందా?’’ అని అడిగాను.
‘‘ఇప్పుడే అడిగితే బాగా పని చేస్తుందని చెబుతారు మోదీజీ. ఏడాది తర్వాత అడుగుదాం’’ అన్నాడు!
‘‘బాగా పనిచేస్తుంటే మనమూ ఫైజర్ వ్యాక్సిన్ తెప్పించుకుందాం హర్షవర్థన్. కోవి షీల్డ్, కోవాగ్జిన్ కోసం ఆగడం ఎందుకు? డ్రై రన్ కూడా మొదలుపెట్టేశాం కదా..’’ అన్నాను.
‘‘మోదీజీ.. ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో తెలీదు. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో తెలీదు. మన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లు ఎలా పని చేస్తాయో తెలీదు. ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను’’ అన్నాడు!
‘చెప్పగలను’ అన్నాడు కాబట్టి చెప్పడం కోసం ఆగాను.
‘‘మోదీజీ.. డిసెంబర్ థర్టీఫస్టంతా నాకు గొంతునొప్పిగా ఉంది. కాస్త జ్వరంగా కూడా ఉంది. రెండు మూడు పొడి దగ్గులూ దగ్గాను. జనవరి ఫస్ట్ మధ్యాహ్నం నుంచీ అవేమీ లేవు. అందుకే అన్నాను.. మెస్మరైజ్ చేశారు మీ సన్‌రైజ్ కవిత్వంతో.. అని. అది చెప్పడానికే ఫోన్ చేశాను’’ అన్నాడు!!
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని).
Published Sun, Jan 3 2021 1:00 AM | Last Updated on Sun, Jan 3 2021 4:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment