ఉత్తమ్‌కుమార్‌ మాటెత్తడానికే వణుకు.. | TPCC Chief Uttam Kumar Reddy Rayani Dairy | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌)

Published Sun, Nov 29 2020 1:26 AM | Last Updated on Sun, Nov 29 2020 1:51 PM

TPCC Chief Uttam Kumar Reddy Rayani Dairy - Sakshi

ప్రత్యర్థి కళ్లలోని భయాన్ని బాగా దగ్గరగా చూస్తున్నప్పుడు కలిగే గెలుపు భావన ముందు, నిజమైన గెలుపు కూడా ఒక గెలుపులా అనిపించదు. మోదీ, కేసీఆర్, ఒవైసీ కళ్లలో అలాంటి భయాన్ని కొన్నాళ్లుగా నేను చూస్తున్నాను. ఘన విజయం సాధించబోతున్న కాంగ్రెస్‌ను తలచుకుని కావచ్చు ఆ భయం.  గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలు టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు ఒక కొత్త కాంగ్రెస్‌ను, శక్తిమంతమైన కాంగ్రెస్‌ను, తిరుగులేని కాంగ్రెస్‌ను, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు సుడిగాలిలా తిరుక్కుంటూ వెళ్లగలిగిన కాంగ్రెస్‌ను చూపించబోతున్నాయి. ఫలితాలు అలా చూపిస్తున్నప్పుడు, ఫలితాలను వారు అలా చూస్తున్నప్పుడు, వారి కళ్లలోకి రాహుల్‌ గాంధీ చూస్తున్నప్పుడు.. నేను రాహుల్‌ గాంధీ కళ్లలోకి చూస్తూ ఉంటాను డిసెంబర్‌ నాలుగున!

రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యాక కానీ, అధ్యక్షుడిగా ఉండలేనని వెళ్లాక గానీ, ఉంటే బాగుంటుందని మళ్లీ ఆయన్ని అందరం బతిమాలినప్పుడు గానీ, బతిమాలినా ఆయన ఉండనప్పుడు గానీ ఇంత పెద్ద గిఫ్టును ఎవరూ గానీ ఆయనకు ఇచ్చి ఉండరు. దేశంలోని ఒక టీపీసీసీ అధ్యక్షుడిగా తొలిసారి ఒక గెలుపును రాహుల్‌ చేతికి నేను గిఫ్టులా ఇవ్వబోతున్నాను. బహుశా అది కూడా ఊహించి ఉండాలి మోదీ, కేసీఆర్, ఒవైసీ.   

కాంగ్రెస్‌ అంటే ఎంత భయం లేకుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం మోదీ ఆదిత్యనాథ్‌ని హైదరాబాద్‌ పంపిస్తాడు! ఇక్కడ ఉత్తమ్‌కుమార్‌ ఉన్నాడనే కదా ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒకరు రావడం. కాంగ్రెస్‌ అంటే ఎంత భయం లేకుంటే మోదీ బీజేపీ చీఫ్‌ నడ్డాను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ పంపిస్తాడు. ఇక్కడ ఉత్తమ్‌కుమార్‌ అనే ఒక చీఫ్‌ ఉన్నాడనే కదా. కాంగ్రెస్‌ అంటే ఎంత భయం లేకుంటే  హోమ్‌మంత్రి అమిత్‌షాను, సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌ పంపిస్తాడు! ఇక్కడ ఉత్తమ్‌కుమార్‌ అనే ఎంపీ ఉన్నాడనే కదా. కాంగ్రెస్‌ అంటే, ఉత్తమ్‌కుమార్‌ అంటే ఎంత భయం లేకుంటే వీళ్లందర్నీ పంపించమని మోదీని బండి సంజయ్‌ అడిగి ఉంటాడు!

కేసీఆర్‌ని చూసో, కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ను చూసో భయం కాదు బీజేపీకి. కాంగ్రెస్‌ను చూసి. కాంగ్రెస్‌లో ప్రజాకర్షణ కలిగిన రాహుల్‌గాంధీని చూసి. రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాకపోయినా అతడి నాయకత్వంలో పని చేస్తున్న నా వంటి కాంగ్రెస్‌ కార్యకర్తల్ని చూసి. 

కేసీఆర్‌ అండ్‌ సన్‌ కూడా బీజేపీని చూసి భయపడటం లేదు. ఎం.ఐ.ఎం.ను చూసి భయపడటం లేదు. మిగ్‌ 21, మిగ్‌ 23 యుద్ధ విమానాలు నడిపిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ పైలట్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వారికి కలలోకి వస్తున్నాడు. కాంగ్రెస్‌ పైలట్‌గా ఆ కలలో విజయ విన్యాసాలు చేస్తున్నాడు. అది చూసి భయపడుతున్నారు! 

అందరి భయాలను గమనిస్తూనే ఉన్నాను. బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి, ఒవైసీకి తొడగొడుతున్న కేసీఆర్, కేటీఆర్‌.. ఉత్తమ్‌కుమార్‌ ముందు తోక ముడుస్తున్నారు. కేసీఆర్‌ని, కేటీఆర్‌ని ‘బస్తీమే సవాల్‌’ అంటున్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఒవైసీ.. ఉత్తమ్‌కుమార్‌ మాటెత్తడానికే వణికిపోతున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తుందనీ, కాంగ్రెస్‌ది ల్యాండ్‌స్లైడ్‌ విక్టరీ కాబోతోందని మోదీకి కూడా తెలిసిపోయినట్లుంది. హైదరాబాద్‌ వచ్చి కూడా వాక్సిన్‌ కోసమని అట్నుంచటే పుణె వెళ్లిపోయారు. 

ఒక్క కాంగ్రెస్‌ను ఓడించడానికి ఇంతమంది ఒక్కటై కాంగ్రెస్‌కు భయపడటం చూస్తుంటే పోలింగ్‌కు ముందే, కౌంటింగ్‌కు ముందే, ఫలితాల వెల్లడికి ముందే పార్టీలన్నీ ఓడిపోయాయని! భయపడుతూ గెలిచినా అది ఓటమే. ధైర్యంగా ఓడినా అది గెలుపే. ఎలా చూసినా కాంగ్రెస్సే అంతిమ విజేత.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement