‘‘ఎక్కడున్నావ్?’’ అన్నాడు విజయ్‌మాల్యా ఫోన్ చేసి, ముందూ వెనుకా ఏమీ లేకుండా.
‘‘ఎవర్నువ్వు?’’ అన్నాను.
‘‘ఆ.. ఎవర్నా! నిర్మలా సీతారామన్‌ని. విజయ్‌మాల్యా గొంతుతో మాట్లాడుతున్నా ఇండియా నుంచి’’ అన్నాడు!
‘‘మాల్యా.. మందులో ఉన్నట్లున్నావ్. తాగినవాడు మాట్లాడుతూ కూర్చుంటే తాగనివాడు వింటూ కూర్చోవడం బ్యాంకులకు ఎగ్గొట్టిన అప్పుల్ని తీర్చడం కన్నా కష్టమైన విషయం. నాకు వినే మూడ్, మాట్లాడే మూడ్.. రెండూ లేవు. ఫోన్ పెట్టేయ్’’ అన్నాను.
‘‘ఎక్కడున్నావ్?’’ అన్నాడు మళ్లీ, ఫోన్ పెట్టేయకుండా.
వినేలా లేడు. ఇండియాలో ఉన్నప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీలు, సీఈవోలు ఇలాగే సమయం సందర్భం లేకుండా ఫోన్‌లు చేసేవాళ్లు.. ‘ఎప్పుడు కడతావ్?’ అని. ‘భోజనం చేస్తున్నా’ అనేవాడిని. అయినా వినకుండా ‘ఎప్పుడు కడతావ్?’ అనేవాళ్లు. ‘బాత్రూమ్‌లో ఉన్నా’ అనేవాడిని. అయినా వినకుండా ‘ఎప్పుడు కడతావ్?’ అనేవాళ్లు.
‘ఏంటి కట్టడం?’ అన్నాను ఓ రోజు. ‘భోజనం చేస్తున్నారా?’ అని అడిగారు! ‘ఏంటి కట్టడం?’ అన్నాను మళ్లీ ఇంకో రోజు. ‘బాత్రూమ్‌లో ఉన్నారా?’ అని అడిగారు!
కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి, కొత్త వ్యక్తి ఫోన్ చేశాడు.
‘‘మిస్టర్ నీరవ్ మోదీ.. మీరు భోజనం చేస్తూ గానీ, బాత్రూమ్‌లో స్నానమాచరిస్తూ గానీ లేకపోతే నేను చెప్పబోయేది వినడం కోసం రెండు నిముషాలు వెచ్చించగలరా? మీరిక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే.. నేను మిమ్మల్ని ఏమీ అడగబోవడం లేదు. చెప్పబోవాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాను. నేనిప్పుడు మీకెంతో ప్రియమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా మీకు పరిచయం అవుతున్నాను. నన్ను కొనసాగించమంటారా?’’ అని అభ్యర్థించాడు!
బ్యాంకుల సంస్కరణ అంతగా ఎప్పుడు జరిగిందో నేను గుర్తించనే లేదు!
‘కొనసాగించండి’ అన్నాను.
అతడు మొదలుపెట్టాడు.
‘మిస్టర్ నీరవ్ మోదీ.. బ్యాంకులో మీరు డబ్బు వేసుకుంటే మీకు వడ్డీ వస్తుంది కదా. అలాగే బ్యాంకు మీ దగ్గర డబ్బు వేసుకుంటే బ్యాంకుకూ వడ్డీ రావాలి కదా. గాట్ మై పాయింట్..’ అన్నాడు.
‘గాట్ యువర్ పాయింట్ .. ‘ఎప్పుడు కడతావ్’ అనే కదా మీరు అడుగుతున్నారు’ అన్నాను. ‘వాట్ ఐ మీన్..’ అంటూ ఏదో చెప్పబోయాడు. ఫోన్ పెట్టేశాను. తర్వాత లండన్ వచ్చేశాను.
‘‘మాట్లాడవేంటి.. ఎక్కడున్నావ్..’’ అన్నాడు మాల్యా మళ్లీ.
‘‘నీలాగా బెయిల్ మీద ఉంటే ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లోనో, బ్రిక్ లేన్‌లోనో, ఆబే రోడ్‌లోనో ఉన్నానని చెప్పేవాడిని’’ అన్నాను. ఆ మాటకు బాగా హర్ట్ అయినట్లున్నాడు మాల్యా.
‘‘మందులో ఉన్నవాడికీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి నీరవ్. జైల్లో ఉన్నవాడిని బెయిల్‌లో ఉన్నవాడు ‘ఎక్కడున్నావ్ ?’ అని అడక్కూడదని నాకూ తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే నిన్ను ఏవిధంగానూ సంతోషపెట్టని వాళ్ల మధ్య నువ్వీ క్షణంలో లేవు కదా అని..’’ అన్నాడు.
‘‘లేను చెప్పు’’ అన్నాను.
‘‘నీ బ్యాంకులో నీవి ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా’’ అన్నాడు.
‘‘నావేమిటి? నేను కట్టాల్సినవి’’ అన్నాను.
మాల్యా నవ్వాడు.
‘‘ఇకనుంచీ నువ్వు ‘డబ్బు కట్టలేకపోయానే’ అనే చింతతో అనుక్షణం కుమిలిపోనక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను నీరవ్. లాభాల కోసమట.. ఇండియాలో బ్యాంకుల్ని కలిపేస్తున్నారు. నీకు సంతోషం కలిగించే విషయం చెప్పనా.. నీ బ్యాంకులో కూడా రెండు పెద్ద బ్యాంకులు కలుస్తున్నాయి’’ అన్నాడు!
రాయని డైరీ.. నీరవ్ మోదీ (ఆర్థిక నేరస్తుడు)
Published Sun, Sep 1 2019 12:50 AM | Last Updated on Sun, Sep 1 2019 12:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment