సౌత్ పాయాంగన్ ప్రావిన్సులో కాలి నడకన ఉన్నాం నేను, నా సొదరి కిమ్ యో జోంగ్. అంతకు క్రితమే ఎరువుల ప్లాంట్‌కి నేను రిబ్బన్ కట్ చేశాను. అయితే అది రిబ్బన్‌ని కట్ చేసినట్లుగా లేదు. పొడవైన వెడల్పాటి పల్చటి తివాచీని అడ్డంగా కట్టి, చేతికి చిన్న కత్తెర ఇచ్చారు. చేతికది ఆరో వేలులా ఉంది తప్ప కత్తెరలా లేదు.
‘‘నా సోదరి కిమ్ యో జోంగ్‌కి ఇవ్వండి. తనైతే తన సున్నితమైన వేళ్లతో ఒడుపుగా కత్తిరించగలదనే అనుకుంటున్నాను’’ అన్నాను ఆ ప్లాంటు వాళ్లతో.. రిబ్బన్ కటింగ్‌కి ముందు.
‘‘మీరైతే బాగుంటుంది’’ అన్నారు వాళ్లు! నా సోదరి ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా ఉండి, నేను తన పక్కన ఒక సోదరుడిగా మాత్రమే ఉండి ఉంటే అప్పుడు రిబ్బన్ కట్ చేయమని నా సోదరికి కత్తెర ఇచ్చి ఉండేవాళ్లు కావచ్చు. వాళ్లకు కావలసింది అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు. అంతే తప్ప అన్నా చెల్లెళ్లు కాదు. కిమ్ జోంగ్ ఉన్ గానీ, కిమ్ యో జోంగ్ గానీ కాదు. అదే మాట నా సోదరితో అన్నాను. నవ్వింది.
‘‘కిమ్, ఈ ఎరువుల ప్లాంటువాళ్లకే కాదు, ఉత్తర కొరియా ప్రజలకు కూడా నువ్వో, నేనో కాదు కావలసింది. ఒక అధ్యక్షుడు. లేదా అధ్యక్షురాలు. మూడు వారాలు అయింది నువ్వు ఉత్తర కొరియా ప్రజలకు కనిపించక. వాళ్లేమీ కంగారు పడలేదు. నీ తర్వాత నేనే అంటున్నారు తప్ప, నువ్వు కనిపించడం లేదేమిటని నన్ను కూడా అడగడం లేదు’’ అని ఆశ్చర్యపడింది నా సోదరి.
ఉత్తర కొరియా ప్రజలు కిమ్‌ని పట్టించుకోవడం లేదంటే ఉత్తర కొరియాను ఇంకెవరో పట్టించుకుంటున్నట్లు! ఎవరై ఉంటారు? దక్షిణ కొరియా? అమెరికా? అమెరికా అయితే అయి ఉండదు. నేను కనిపించనప్పటి నుంచీ నన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు ట్రంప్. ‘కిమ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని, కిమ్ ఎలా ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఉత్తర కొరియా ప్రజలే.. ఏంటట? ఎవరట? అని అస్సలు పట్టనట్లే ఉండిపోయారు. మనిషి పోవడం అంటే డెడ్ అయ్యాడనో, బ్రెయిన్ డెడ్ అయిందనో కాదు. మనుషులకు పట్టకపోవడం.
‘‘ఏంటి కిమ్ ఆలోచిస్తున్నావు?’’ అంది నా సోదరి.
‘‘ఏం లేదు. ట్రంప్ మీద నాకు గౌరవ భావన కలుగుతోంది. నేననుకోవడం.. ఇన్నాళ్లూ నేను ఉండే ఉంటానని అనుకుని నాతో మాట్లాడేందుకు అనేకసార్లు ప్రయత్నించి ఉంటాడనీ, ఇప్పుడు ఉన్నానని తెలిసింది కాబట్టి నేను తనతో మాట్లాడ్డం కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటాడనీ..’’ అన్నాను.
‘‘నిజమే’’ అంది నా సోదరి. ‘‘ట్రంప్‌కి ఫోన్ చేసి మాట్లాడు కిమ్.. బాగుంటుంది’’ అని కూడా అంది.
మరికొంత దూరం నడిచాం. నాతోపాటు మూడు వారాలుగా నా సోదరీ వాకింగ్ చేస్తూనే ఉంది. వెయిట్ తగ్గాలన్న విల్ పవర్‌ని నాలో తగ్గకుండా చూసేందుకు! ఎంతైనా నా సోదరి. ఒకరి కోసం ఒకరు ఎవరు నడుస్తున్నారిప్పుడు!
ట్రంప్‌కు ఫోన్ చేయబోయాను. ట్రంప్ నుంచే కాల్!
ట్రంప్ పెద్దగా ఇంగ్లిష్‌లో నవ్వుతున్నాడు. ‘‘కిమ్.. కిమ్‌లా ఉండాలి కిమ్ బ్రో..’’ అంటున్నాడు.
‘‘అవును. కొంచెం లాగేశాను కదా. డబుల్ చిన్ పోయింది. పొట్ట లోపలికి పోయింది. చూసే వుంటావ్ రిబ్బన్ కటింగ్ ఫొటోలో..’’ అన్నాను.
‘‘చూశాను బ్రో. అందుకే అంటున్నా.. కిమ్ కిమ్‌లా ఉండాలని. న్యూక్లియర్ ప్లాంట్‌కి రిబ్బన్ కట్ చేయవలసినవాడు, ఫెర్టిలైజర్ ఫ్లాంట్‌కి కట్ చేయడం ఏంటి!!’’ అన్నాడు.. మళ్లీ పెద్దగా నవ్వుతూ.
కిమ్ జోంగ్ (ఉ.కొరియా అధ్యక్షుడు).. రాయని డైరీ
Published Sun, May 3 2020 12:01 AM | Last Updated on Sun, May 3 2020 12:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment