
ప్రమాణ స్వీకారం పదిహేడున గానీ, పద్దెనిమి దిన గానీ ఉండొచ్చు. ‘బూకనకేరే సిద్ధలింగప్ప యడ్యూరప్ప అనే నేను’.. అని నేను ప్రమాణ స్వీకారం చేస్తానా, లేక ‘బి.శ్రీరాములు అనే నేను’ అని శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేస్తాడా అన్నదే డౌటుగా ఉంది!
అమిత్‌షా రెండు చోట్ల నుంచి శ్రీరాములు చేత పోటీ చేయిస్తున్నప్పుడే నాకు డౌటు వచ్చింది.. సీఎం క్యాండిడేట్ నేనా? శ్రీరాములా? అని!
‘నువ్వే సీఎం. శ్రీరాములు డిప్యూటీ సీఎం’ అన్నాడు అమిత్‌షా.
ఎక్కడైనా సీఎంలు, మాజీ సీఎంలు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సీఎం కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు. నేను మాజీ సీఎంనని తెలిసి కూడా నన్ను ఒక్క చోటే పోటీ చేయించాడు అమిత్‌షా! సేఫ్ సైడ్‌గా రెండో చోట కూడా నిలబడతానని చెప్పబోతోంటే నా ఫేస్ సైడ్ కూడా చూడలేదు. సభలకి జనాల్ని రప్పించలేకపోతున్నానని మొన్న మాండ్యాలో నా ముఖం మీదే కాలూపుతూ కూర్చున్నాడు. ఆ రాజసం చూళ్లేక నేనే కళ్లు మూసుకున్నాను.
బీజేపీ నుంచి రెండు చోట్ల పోటీ చేసింది శ్రీరాములు ఒక్కడే. అందులో ఒకటి సిద్ధరామయ్య నిలబడిన సీటు. అక్కడ సిద్ధరామయ్యపై శ్రీరాములు గెలిస్తే, ఇక్కడ నా సీట్లో నేను గెలిచినా అది పెద్ద లెక్కలోకి రాదు! సీఎంనే ఓడించాడని చెప్పి శ్రీరాముల్ని సీఎంని చేసేస్తాడు అమిత్‌షా.
సెంటిమెంటు ప్రకారం చూసినా శ్రీరాములే సీఎం అయ్యే ప్రమాదం కనిపి స్తోంది. సిద్ధరామయ్యలో రాముడున్నాడు. శ్రీరాములులో రాముడున్నాడు. సిద్ధరామ య్యను శ్రీరాములు ఓడిస్తే.. కాంగ్రెస్ రాముణ్ణి బీజేపీ రాముడు ఓడించినట్లవుతుంది. అప్పుడు సీటు శ్రీరాములుది అవుతుంది.
ఇంకో లాజిక్ ప్రకారం చూసినా శ్రీరాములే సీఎం అయ్యేలా ఉన్నాడు. శ్రీరాములు గాలి జనార్దన్‌రెడ్డి మనిషి. జనార్దన్‌రెడ్డి బీజేపీకి కావలసిన మనిషి. ఫస్ట్ టైమ్ బీజేపీ లైఫ్‌లో ఒక సౌత్ స్టేట్ వచ్చిందంటే అది అతడి వల్లే. సీఎం సీటు కోసం అప్పట్లో లెక్క తగ్గితే జనార్దన్‌రెడ్డే ఎమ్మెల్యేలని వెంటబెట్టుకొచ్చాడు. అప్పుడు నేను అడక్కపోయినా అంతా నన్ను సీఎంని చేశారు కాబట్టి, ఇప్పుడు నేను అడిగినా నన్ను సీఎంని చేయకపోయే నైతిక హక్కు తనకు ఉంటుందని బీజేపీ అనుకుం టుంది. బీజేపీ అనుకున్నా, అనుకోకున్నా అమిత్‌షా అనుకుంటాడు.
అమిత్‌షాకి ఉన్నంత జనార్దన్‌రెడ్డికీ ఉంది. ‘నేను బీజేపీకి క్యాంపెయిన్ చెయ్యడం లేదు. నా ఫ్రెండ్ శ్రీరాములుకు చేస్తున్నాను’ అని జనార్దన్ ప్రచారం చేశాడు. రేప్పొద్దున బీజేపీకి అరకొర సీట్లు తగ్గినా అప్పుడు కూడా ఫ్రెండ్ శ్రీరాములు కోసమే అతడు కావలసి నంత మంది ఎమ్మెల్యేల్ని కానుకగా ఇవ్వగలడు.
ఫ్రెండ్‌కి అంత చేసినవాడికి.. ఫ్రెండ్‌ని ఏదో ఒకటి చేసి చూపించకుండా ఉంటాడా అమిత్‌షా!!
-మాధవ్ శింగరాజు