రాయని డైరీ.. నరేంద్ర మోదీ (ప్రధాని) | Madhav Singaraju Rayani Dairy On Narendra Modi | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. నరేంద్ర మోదీ (ప్రధాని)

Published Sun, May 19 2019 12:24 AM | Last Updated on Sun, May 19 2019 12:24 AM

Madhav Singaraju Rayani Dairy On Narendra Modi - Sakshi

కేదార్‌నాథ్‌కి బయలుదేరి వెళ్లే ముందు రెండు చేతులూ జోడించి గాంధీజీకి నమస్కరిస్తుండగా అమిత్‌షా లోపలికి వచ్చారు. 
‘‘కూర్చోండి అమిత్‌జీ’’ అన్నాను.. వెనక్కు తలతిప్పకుండానే. దిగ్భ్రాంతిపూర్వకమైన ఒక మహోద్వేగంతో.. ఉన్నచోట ఉన్నట్లే శిలలా నిలబడిపోయారు అమిత్‌షా!
మహాత్మునికి నమస్కరించాక మహాత్ముని పక్కనే ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి, బీఆర్‌ అంబేడ్కర్‌కి, సుభాష్‌ చంద్రబోస్‌కి నమస్కరించి అమిత్‌ షా దగ్గరికి వచ్చాను. 
‘‘నిలబడే ఉన్నారు?!’’ అన్నాను. 
‘‘వందన సమర్పణ జరుగుతున్నప్పుడు నిలబడే కదా ఉండాలి మోదీజీ’’ అన్నారు! పద్ధతుల్లో అమిత్‌ని మించినవారు బీజేపీలోనే లేరు. వాజ్‌పేయిని పద్ధతులకు పితామహుడని అంటుంటారు కానీ, నాకెందుకో పద్ధతుల్లో ఫస్ట్‌ ప్లేస్‌ అమిత్‌షా దే అనిపిస్తుంది.
‘‘కూర్చోండి అమిత్‌జీ. మీ ప్రయాణం కూడా ఇవాళే కదా సోమ్‌నాథ్‌కి’’ అన్నాను. 
అవునన్నట్లు తల ఊపి, ‘‘వాళ్లొచ్చారు. బయట కూర్చొని ఉన్నారు. మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు’’ అన్నారు. 
‘‘నాకెందుకట సారీ! గాంధీజీకి చెప్పమనండి’’ అన్నాను. 
‘‘అన్నాను మోదీజీ. మీకు చెబితే గాంధీజీకి చెప్పినట్లేనని వాళ్లు భావిస్తున్నారు. సాధ్వి ప్రజ్ఞ కళ్లు ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్నాయి. గాడ్సేని దేశభక్తుడు అని తను కీర్తిస్తున్నప్పుడు.. గాంధీజీని ఎంతగానో ప్రేమించే మిమ్మల్ని ఆ మాట గాయపరుస్తుందని తను ఊహించనే లేదట’’ అన్నాడు.
లేచి నిలుచుని గాంధీజీ వైపు తిరిగి మళ్లొకసారి నమస్కరించి కూర్చున్నాను.  
‘‘అనంత్‌ కుమార్‌ హెగ్డే, నళిన్‌ కుమార్‌ కతీల్‌ కూడా బాగా ఫీల్‌ అవుతున్నారు’’ అన్నారు అమిత్‌షా. ‘‘ఎందుకట? షోకాజ్‌ నోటీస్‌లు ఇచ్చినందుకా?’’ అన్నాను.
‘‘అందుక్కాదు మోదీజీ. గాడ్సే తరఫున మాట్లాడి, గాంధీజీని ఎంతగానో ఆరాధించే మీ మనసును నొప్పించామే అని చింతిస్తున్నారు. ‘డెబ్బై ఏళ్ల తర్వాతనైనా తన దేశభక్తిపై డిబేట్‌ జరుగుతున్నందుకు గాడ్సే ఆత్మ సంతృప్తి చెందుతుంది’ అని అంటున్నప్పుడు ఆ మాటకు మీ ఆత్మ క్షోభిస్తుందని అనంత్‌ కుమార్‌ కూడా అస్సలు ఊహించలేదట’’ అన్నారు అమిత్‌షా.
‘అవునా!’ అన్నట్లు చూశాను.
‘‘అవును మోదీజీ. కతీల్‌ కూడా వాడిపోయిన ముఖంతో ఉన్నాడు. మీరెంతగానో పూజించే బాపూజీని చంపిన ఒక వ్యక్తి గురించి అతడసలు మాట్లాడకూడదనే అనుకున్నాడట కానీ.. డెబ్బై రెండు మందిని చంపిన కసబ్‌ కంటే, పదిహేడు వేల మందిని చంపిన రాజీవ్‌గాంధీ కంటే, ఒకరిని మాత్రమే చంపిన గాడ్సే క్రూరుడు ఎలా అవుతాడు అని ఏదో వాదన కోసం అన్నాడట’’ అన్నాడు అమిత్‌షా. 
లేచి నిలబడి గాంధీజీ దగ్గరికి వెళ్లాను. 
‘‘మహాత్మా క్షమించు’’ అని రెండు చేతులు జోడిస్తూ.. వెనక్కు తిరగ కుండానే, ‘‘మీరు లేచారేమిటి అమిత్‌జీ’’ అన్నాను. 
మళ్లీ ఆయన  దిగ్భ్రాంతిపూర్వకమైన ఒక మహోద్వేగంతో ఉన్నచోట ఉన్నట్లే  శిలలా నిలబడిపోయారు!
‘‘నేను లోపలికి వచ్చినప్పుడు, ఇప్పుడు మీ వెనకే లేచి వచ్చినప్పుడు వెనక్కు తిరిగి చూడకుండానే మీ వెనుక నేనున్నట్లు ఎలా తెలుసుకోగలిగారు మోదీజీ’’ అని అడిగారు ఆశ్చర్యపోతూ. 
‘‘గాంధీజీలో మీరు కనిపిస్తున్నారు అమిత్‌జీ. అందుకే గమనించగలిగాను’’ అని చెప్పాను. ఆయన మళ్లీ ఆశ్చర్యపోయారు.
గాంధీజీలోనే కాదు అమిత్‌జీ.. పటేల్‌లో, అంబేడ్కర్‌లో, నేతాజీలో కూడా మీరు కనిపిస్తున్నారు అని చెప్పి ఆయన్ని మళ్లొకసారి ఆశ్చర్యానికి గురి చెయ్యదలచుకోలేదు నేను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement