చదవాలన్న ఆశ బలంగా ఉన్నప్పుడు.. చదవలేక పోతామేమోనన్న భయమూ ఆ వెనకే ఆశను బలహీనపరుస్తూ ఉంటుంది. తమిళనాడు పిల్లలకు మెడిసిన్ పెద్ద ఆశ. కానీ భయం! ‘నీట్’లో పోటీ కి వచ్చే పెద్ద నగరాల పిల్లల్ని తట్టుకోగలమా? మేలురకపు ఇంగ్లిషును సులువుగా, మెలకువలతో మాట్లాడగలిగిన వాళ్లను నెగ్గుకువెళ్లగలమా? ఖరీదైన కోచింగ్ సెంటర్‌లలో తర్ఫీదై వచ్చినవాళ్లకు దీటుగా నిలవగలమా? ఇంట్లో ఏ గొడవా లేక ఏకధ్యానంతో స్థిమితంగా కూర్చొని టెస్ట్‌కి చక్కగా ప్రిపేర్ అయి వచ్చినవాళ్లతో తలపడగలమా? ఇన్ని భయాలు!
నీట్.. ప్రభుత్వం పెట్టిన భయం. ఊహు.. భయం కాదు. ప్రభుత్వం సృష్టించిన భూతం! ఎవరి రాష్ట్రంలో వాళ్లు కష్టపడి చదివి వాళ్ల టెస్ట్‌లు వాళ్లు రాసుకుంటూ ఉన్నప్పుడు.. ‘అంతకష్టం ఎందుకు?! ఇక నుంచీ దేశం మొత్తానికి ఒకటే టెస్ట్’ అంటూ నీట్ పరీక్షను తెచ్చిపెట్టారు! దేశం మొత్తం ఒకేలా ఉందా.. దేశం మొత్తం పెన్ను, పేపరు పట్టుకుని కూర్చొని ఒకే టెస్టు రాయడానికి?! భయంతోనైనా, భూతంతోనైనా పోరాడేందుకు శక్తి కావాలి. సామాన్యమైన ఇళ్లల్లో, అసమానతల సమాజాల్లో, అనుకూలతలు లేని గ్రామాల్లో.. పోరాడేంత శక్తి పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది?! గురువారం అసెంబ్లీకి వెళుతున్నప్పుడు టీటీకే రోడ్డులో ఒక యువకుడు ‘సిఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ’ అనే ప్లకార్డు పట్టుకుని కాన్వాయ్‌కి ఎదురొచ్చాడు! నీట్ ఎగ్జామ్‌ని అపోజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడట. నీట్ వద్దన్న మిగతా స్టేట్‌లకు కూడా నీట్ లేకుండా చెయ్యమని అతడి అభ్యర్థన.
అసెంబ్లీ ప్రాంగణంలోకి కారు మలుపు తిరుగుతుండగా, ఆ ముందురోజు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన 45 నిముషాల ప్రసంగంలోని రెండు మాటలు మళ్లొకసారి నా హృదయాన్ని మృదువుగా తాకాయి. ఆయనెంత అర్థవంతంగా మాట్లాడారు! ‘ఉత్తరప్రదేశ్‌లోని నా సోదరునికి రాజ్యాంగం ఎలాంటి హక్కులనైతే కల్పించిందో అవే హక్కులను తమిళనాడులోని నా సోదరుడికీ ప్రసాదించింది. ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ప్రత్యేకమైన రాజకీయ ఆత్మాభిమానం ఉంటుంది. వాటిని గౌరవించకుండా ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పరిపాలించడానికి మీరేమీ చక్రవర్తి కాదు’ అని మోదీకి ఎంత మర్యాదగా పాఠాలు చెప్పారు!
కారు దిగి, అసెంబ్లీ వరండాలో నడుస్తున్నాను. స్పీకర్ ఎదురొచ్చి, నీట్ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారని చెప్పారు! నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించమని కోరుతూ ఐదు నెలల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లు అది. ఏ కారణాలైతే చూపి తమిళనాడు నీట్‌ని వద్దందో.. అవే కారణాలు చూపి నీట్‌ని వద్దనడానికి వీల్లేదనేశారట గవర్నర్ గారు. నీట్‌ని ‘యాంటీ–పూర్’ అని మేము అంటే.. నీట్‌ని వద్దనడం ‘యాంటీ–పూర్’ అని గవర్నర్! మోదీకి ఏమాత్రం తీసిపోవడం లేదు గవర్నర్‌లు. మోదీ తనని తాను చక్రవర్తినని అనుకుంటుంటే, గవర్నర్‌లు తమని తాము మోదీలమని అనుకుంటున్నారు.
ఆరోజు అన్నాదురై వర్ధంతి. సభలో నివాళులు అర్పించి కూర్చున్నాం. ‘ఆడుక్కు దాడియం, నాటుక్కు గవర్నురు తేవై ఇల్లయ్’ అని అన్నాదురై తరచూ అంటుండేవారని నాన్నగారు నా చిన్నప్పుడు చెబుతుండేవారు. ఆ మాట నాకు బాగా నవ్వు తెప్పించేది. మేకకు గడ్డం, రాష్ట్రానికి గవర్నర్ అక్కర్లేదని అన్నాదురై అలా బలంగా విశ్వసిస్తుండేవారట! గవర్నర్‌లపై ముఖ్యమంత్రులకు విశ్వాసాలు ఊరకే ఏర్పడతాయా?! విశ్వాసాలను ఏర్పరచడమే పనిగా కొంతమంది గవర్నర్‌లు రాష్ట్రాలకు బదలీ అయి వస్తారనుకుంటాను. శనివారం నీట్‌పై సెక్రటేరియట్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ, అన్నాడిఎంకె రాలేదు. నీట్ పరీక్ష రాసే పని మనకైతే లేదుగా అనుకున్నట్లున్నారు!!
Comments
Please login to add a commentAdd a comment