మణిరత్నం-రాయని డైరీ | Madhav Singaraju Unwritten Diary About Mani Ratnam | Sakshi
Sakshi News home page

మణిరత్నం-రాయని డైరీ

Published Sun, Oct 6 2019 4:33 AM | Last Updated on Sun, Oct 6 2019 4:33 AM

Madhav Singaraju Unwritten Diary About Mani Ratnam - Sakshi

బెడ్‌రూమ్‌ తలుపులు తీసి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. బాల్కనీలోంచి మళ్లీ బెడ్‌రూమ్‌లోకి వెళుతున్నప్పుడు తలుపుపై ఏదో కాగితం అంటించి ఉంది! ఆ కాగితం మీద ‘రాజద్రోహం’ అని రాసి ఉంది!! 

రోజూ నిద్ర లేవగానే బాల్కనీలోకి వచ్చి నిలబడి, వీధికి అవతలివైపు ఉన్న పచ్చని చెట్లను చూస్తూ గుండె నిండా గాలి పీల్చుకోవడం అలవాటు. అలా గుండెల్నిండా గాలి పీల్చుకుంటున్నప్పుడు నా వెన గ్గుండా ఎవరో వచ్చి తలుపుపై కాగితం అంటించి వెళ్లి ఉండాలి. లేదా నేను నిద్ర లేవకముందే వచ్చి అంటించి వెళితే, నేను తలుపును చూసుకోకుండా బాల్కనీలోకి వచ్చి గుండెల్నిండా గాలి పీల్చుకుని తిరిగి బెడ్‌రూమ్‌లోకి వస్తున్నప్పుడు ఆ కాగితాన్ని చూసి ఉండాలి. 

సుహాసిని కాఫీ కప్పు అందించి వెళ్లడానికి వచ్చింది. ఆమె ఎప్పుడూ అందించి వెళ్లిపోతుంది. లేదంటే వెళ్లిపోవడం కోసం అందించడానికి వచ్చినట్లుగా ఉంటుంది. 
‘‘కూర్చో’’ అన్నాను. 
(చదవండి : మణిరత్నంపై రాజద్రోహం కేసు)

వచ్చి కూర్చుంది. 
‘‘మీరెప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మోదీకి వ్యతిరేకంగా ఆ సంతకం పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉండాల్సింది. లేదా ఆలోచించి సంతకం పెట్టాల్సింది. ఇప్పుడు చూడండి. రాజద్రోహం కేసు పెట్టారు’’ అంది సుహాసిని. 

‘‘నేనూ ఊహించలేదు సుహా. పరమత సహనంపై చక్కటి సినిమాలు తీశారు కదా. ఓ సంతకం పెట్టేయండి అని కేరళ నుంచి అదూర్‌ గోపాలకృష్ణన్‌ ఫోన్‌ చేసి చెబితే పెట్టేశాను. ఎప్పుడు పెట్టానో గుర్తులేదు. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అసలు పెట్టినట్లే గుర్తులేదు’’ అన్నాను. 

‘‘పెద్ద పెద్ద సినిమాలు తీస్తేనే ఏం కాలేదు. చిన్న సంతకం పెడితే ఏమైందో చూడండి’’ అంది సుహాసిని పైకి లేస్తూ!
‘‘సుహా.. వెళ్లిపోతున్నావా? వెళ్లబోతున్నావా?’’ అన్నాను. 
‘‘వెళ్లడం లేదు. వెళ్లబోవడం లేదు. నిలుచున్నానంతే. చెప్పండి’’ అంది. 

‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ని ఆపేద్దామనుకుంటున్నాను సుహా’’ అన్నాను. 
సుహాసిని షాక్‌ తింది!
‘‘అయ్యో ఆపేస్తారా! రెండేళ్లుగా కష్టపడి ప్లాన్‌ చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో సెట్స్‌ కూడా వేశారు. వాళ్లెవరో ఇంత మైదా పిండితో రాజద్రోహం అని తలుపుపై కాగితం అంటించి వెళ్లారని మీరు మీ ప్రేక్షకులకు ద్రోహం చేస్తారా!’’ అంది సుహాసిని.

‘‘లేదు సుహా. పొన్నియన్‌ సెల్వన్‌ని ఆపేసి, గీతాంజలి 2 తీద్దామనుకుంటున్నాను. గుర్తుంది కదా.. గీతాంజలి ఎంత హిట్టయిందో. కళ్ల ముందే ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. గీతాంజలిని మళ్లీ తెరపైకి తెస్తాను’’ అన్నాను.
‘‘తెరపైకి తెస్తారు సరే. గీతాంజలిని ఎక్కడ నుంచి తెస్తారు’’ అంది.  
నవ్వాను. 

‘‘గీతాంజలి దొరికింది సుహా. కథను అల్లుకోవాలి అంతే’’ అన్నాను. 
‘‘ఎక్కడా?!!’ అంది. పేపర్‌లో షెహ్లా రషీద్‌ ఫొటో చూపించాను. 
‘‘సుహా.. ఈ అమ్మాయే నా గీతాంజలి 2. యాక్టివిస్టు. ఎలా ఉంది? డేర్‌ డెవిల్‌. ‘ప్రైమ్‌ మినిస్టర్‌ని గౌరవించాలని రాజ్యాంగంలో ఉందా? ఐపీసీలో ఉందా? పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో ఉందా?’ అని అడుగుతోంది. మాకు సపోర్ట్‌గా అడుగుతోంది సుహా. లెటర్‌పై సంతకం పెట్టిన మా నలభై తొమ్మిది మందికి సపోర్ట్‌గా అడుగుతోంది. ఈ అమ్మాయే నా కొత్త గీతాంజలి’’ అన్నాను ఎగ్జయిటింగ్‌గా. 
తనూ ఎగ్జయిట్‌ అయింది. ‘‘అయితే ఈ సినిమాకు నలభై తొమ్మిది అనే పేరు బాగుంటుంది. కావాలంటే ట్యాగ్‌లైన్‌గా ‘గీతాంజలి 2’ అని పెట్టుకోవచ్చు’’ అంది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement