ఆ మినిస్టర్ నిన్నేమైనా అన్నాడా?
అమృత ఇవాళ కూడా అలసిపోయి ఇంటికి వచ్చింది. రాజ్యసభ టీవీలో తను న్యూస్ యాంకర్. ‘‘వర్షాకాల సమావేశాలు అయిపోయాయి కదా, ఇంకా దేనికి అమృత.. ఈ అలసట’’ అని తన ముంగురుల్ని సవరిస్తూ అడిగాను. నవ్వి ఊరుకుంది. నవ్వినప్పుడు తను బాగుంటుంది. నవ్వి ఊరుకోవడమే బాగుండదు.
‘‘ఏమైంది అమృత?’’... మళ్లీ అడిగాను. తను మాట్లాడకపోతే నాకేమీ తోచదు. తోచనప్పుడు బయటికెళ్లి ఏదో ఒక ప్రెస్‌మీట్ పెట్టేయాలనిపిస్తుంది. ప్రెస్‌మీట్ పెట్టి వచ్చాక కూడా అమృత ఏమీ మాట్లాడకపోతే రాజ్యసభ చానల్ ఆన్ చేయాలని పిస్తుంది. అందులో అమృత చదివొచ్చిన వార్తల్నే.. అవి మళ్లీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తుంటాను. పక్కన అమృతను పెట్టుకుని, టీవీలో అమృతను చూస్తుండడం నాకు బాగుంటుంది.
స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంది అమృత. తన వైపే చూస్తూ కూర్చున్నాను. అందంగా ఉంది. నెలాఖర్లో మా ఫస్ట్ యానివర్సరీ. పెళ్లయి అప్పుడే ఏడాది అవుతోందా!
‘‘విజయ్.. నేను ఉద్యోగం మానేస్తాను’’ అంది అమత సడెన్‌గా! నా కన్నా పాతికేళ్ల చిన్న పిల్ల నన్ను విజయ్ అనడం.. రియల్లీ ఐ లైక్ ఇట్. తన వయసులోకి నా వయసుని అలా ఏమాత్రం గౌరవం లేకుండా ఈడ్చుకెళ్లడాన్ని నేను ఇష్టపడతాను. ‘‘వాట్ హ్యాపెన్డ్ అమృత..’’ అన్నాను.
‘‘ఒకే ఫీల్డులో ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవచ్చు కానీ, పెళ్లి చేసుకున్నాక ఒకే ఫీల్డులో ఉండకూడదు విజయ్..’’ అంది అమత. ‘‘ఏం జరిగింది అమతా’’ అని అడిగాను. ‘‘ఏం లేదు’’ అంది.
ఏం లేకుండా ఉంటుందా? తను రాజ్యసభ యాంకర్, నేను రాజ్యసభ మెంబర్. తను నా భార్య, నేను తన భర్త. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అనేస్తుంది లోకం.
‘‘ఆ... ఐ అండ్ బి మినిస్టర్ నిన్నేమైనా అన్నాడా?’’ అన్నాను. ‘‘ఛ ఛ.. అలాంటిదేమీ లేదు’’ అంది అమృత. ‘‘పోనీ, నన్నేమైనా అన్నాడా?’’ అన్నాను. ‘‘కాంగ్రెస్, బీజేపీ.. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాయిగా’’ అంది అమృత. ‘‘మరి.. నిన్నూ అనక, నన్నూ అనక..?’’ అన్నాను.
‘‘ఇద్దర్నీ కలిపి అన్నారట విజయ్! మా డైరెక్టర్ చెప్పారు.. ‘తప్పుల్లేకుండా ఎలా మాట్లాడాలో ఇంటికెళ్లాక వాళ్లాయనకు నేర్పించమని ఆ పిల్లకు చెప్పు’ అన్నారట ఐ అండ్ బి మినిస్టర్’’ అంది అమత. అర్థమైంది. ‘పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్’ అనడానికి బదులు పొరపాటున నేను ‘ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్’ అన్నందుకు వెంకయ్యనాయుడు సెటైర్ వేసినట్లున్నారు!
పెద్ద పార్టీ అన్నాక ఏవో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుంటే.. పెద్ద పార్టీ అయిపోవచ్చని బీజేపీ భ్రమపడుతున్నట్లుంది. వెదికే పనిలో ఉన్నవారు ఎప్పటికీ ఎదగలేరని రేపు ఉదయాన్నే నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పాలి.
-మాధవ్ శింగరాజు
దిగ్విజయ్‌సింగ్ (కాంగ్రెస్)రాయని డైరీ