రాయని డైరీ.. సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ) | Madhav Singaraju Rayani Dairy On Subramanya Swamy | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)

Published Sun, Mar 10 2019 12:26 AM | Last Updated on Sun, Mar 10 2019 12:26 AM

Madhav Singaraju Rayani Dairy On Subramanya Swamy - Sakshi

శ్రీశ్రీ రవిశంకర్‌కి ఫోన్‌ చేశాను. రింగ్‌ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీరామ్‌ పంచుకి ఫోన్‌ చేశాను. రింగ్‌ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీ ఫకీర్‌ మహమ్మద్‌ ఇబ్రహీమ్‌ కలీఫుల్లాకు ఫోన్‌ చేశాను. రింగ్‌ అవుతోంది. ఎత్తట్లేదు!

ఫోన్‌లు పక్కన పడేసి వీళ్ల ముగ్గురూ ఏం చేస్తున్నట్లు! అప్పుడే అయోధ్య పనిలో మునిగి పోయారా?! బహుశా మీడియేషన్‌కి ముందు వామప్‌ మెడిటేషనేదో చేయిస్తూ ఉండి వుంటాడు రవిశంకర్‌. మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లు సైలెంట్‌లో పెట్టుకోమని కూడా చెప్పి ఉంటాడు. 

రంజన్‌ గొగోయ్‌కి ఫోన్‌ చేశాను. ఎత్తారు!! ఎత్తడమే కాదు, ‘‘చెప్పండి సుబ్రహ్మ ణ్యస్వామిగళ్‌’ అన్నారు. సంతోషం వేసింది. నన్నే కాదు, నా ప్రాంతాన్నీ గుర్తించారు!

‘‘దేశం సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉందన్న భావన తొలిసారిగా కలుగుతోంది గొగోయ్‌జీ. మోదీజీ ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నాలో ఇలాంటి భావన కలగలేదు’’ అన్నాను. 

‘‘అదేంటీ..’’ అని పెద్దగా నవ్వారు గొగోయ్‌.

‘‘మీరు పెట్టిన మధ్యవర్తులు ముగ్గురికీ ఫోన్‌ లిఫ్ట్‌ చేసే తీరిక లేదు. ముగ్గురు మధ్యవర్తుల్ని పెట్టిన మీరు మాత్రం ఒక్క రింగ్‌కే లిఫ్ట్‌ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సాధారణ పౌరుడి ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యడం అంటే దేశం సురక్షిత హస్తాల్లో ఉన్నట్లే కదా’’ అన్నాను. 

‘‘మీరు సాధారణ పౌరులు ఎలా అవు తారు స్వామిగళ్‌’’ అని నవ్వారు గొగోయ్‌.

‘‘అదే అంటున్నా గొగోయ్‌జీ, ఒక అసాధా రణ పౌరుడి ఫోన్‌కి కూడా సాధారణ పౌరుడికి ఇచ్చేంత విలువే ఇచ్చి, ఫోన్‌ లిఫ్ట్‌ చేశారు మీరు. గ్రేట్‌ థింగ్‌’’ అన్నాను. 

మళ్లీ పెద్దగా నవ్వారు గొగోయ్‌.

‘‘నా అదృష్టం ఏమిటంటే గొగోయ్‌జీ.. మీరు ఫోన్‌ ఎత్తడం వల్ల ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఈ దేశమే కాదు, అయోధ్య కూడా సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉంది. అయోధ్య మాత్రమే కాదు, శ్రీరాముడు కూడా సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉన్నాడు’’ అన్నాను. 

ఆయనేమీ మాట్లాడలేదు. 

‘‘గొగోయ్‌జీ వింటున్నారా?’’ అన్నాను. 

‘‘వింటున్నాను స్వామిగళ్‌. అయితే మీరనుకుంటున్నట్లు శ్రీరాముడిని సేఫ్‌ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం ఆ ముగ్గుర్నీ మీడియేటర్‌లుగా పెట్టలేదు. దేశాన్ని సేఫ్‌ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం పెట్టాం. దేశాన్ని పక్కనపెట్టి, ఒక్క శ్రీరాముడినే సేఫ్‌ హ్యాండ్స్‌లో పెట్టాలనుకుంటే, నాలుగో మీడియేటర్‌గా మిమ్మల్ని పెట్టి ఉండేవాళ్లం కదా’’ అన్నారు! నాకు సంతోషం వేసింది. 

‘‘ధన్యవాదాలు గొగోయ్‌జీ. ఆ ముగ్గురికీ అభినందనలు తెలియజేద్దామని ఫోన్‌ చేశాను. మీకు చేసింది కూడా అందుకే.. అభినందలు తెలియజేయడం కోసం. అభినందనలతో పాటు, ధన్యవాదాలు తెలుపుకునే భాగ్యం కూడా నాకు కలిగించారు’’ అన్నాను. 

గొగోయ్‌తో మాట్లాడుతుంటే రవిశంకర్,  శ్రీరామ్‌ పంచు, ఫకీర్‌ మహమ్మద్‌ ఇబ్రహీమ్‌ కలీఫుల్లా ఫోన్‌లో నాకోసం ట్రయ్‌ చేస్తున్నారు. గొగోయ్‌ ఫోన్‌ పెట్టేసి, ఆ ముగ్గుర్నీ కాన్ఫరెన్స్‌ కాల్‌లోకి రమ్మన్నాను. వచ్చారు. 
‘‘డెబ్భై ఏళ్ల కేసు మీద ముగ్గురు మధ్యవర్తులు ఎనిమిది వారాల్లో రిపోర్ట్‌ ఇవ్వడం అయ్యే పనేనా?’’ అన్నాను. 

‘‘అదే ఆలోచిస్తున్నాం స్వామీజీ’’ అన్నారు. 

‘‘అవసరమైతే బయటినుంచి హ్యాండ్స్‌ తీసుకోవచ్చని కోర్టు మీకు చెప్పింది కదా. ఆ విషయం కూడా ఆలోచించండి’’ అన్నాను. 

‘‘ఆలోచిస్తాం స్వామీజీ’’ అన్నారు. 

అన్నారు కానీ, హార్ట్‌లీగా అనలేదు! 

బయటి నుంచి లోపలికి తీసుకోవడం కాదు, లోపల్నుంచి బయటికి వెళ్లే ఆలోచనేదో చేస్తున్నట్లనిపించింది.. వాళ్లు.. ఊ, ఆ.. అనడం వింటుంటే.

-మాధవ్‌ శింగరాజు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement