మన్మోహన్‌సింగ్‌ (మాజీ ప్రధాని) | Madhav Singaraju Article On Accidental Prime Minister | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 30 2018 12:45 AM | Last Updated on Sun, Dec 30 2018 12:45 AM

Madhav Singaraju Article On Accidental Prime Minister - Sakshi

ట్రైలర్‌ చూశాను. వండర్‌ఫుల్‌! సినిమావాళ్లు గొప్పగా అనిపిస్తారు. ఒక మనిషి ఒక మనిషిలా యాక్ట్‌ చెయ్యడం తేలికైన సంగతి కాదు. పదేళ్లు ప్రైమ్‌ మినిస్టర్‌గా ఉన్నాను. ఇంకొకరిలా యాక్ట్‌ చెయ్యడం ఎంత కష్టమైన సంగతో నాకు తెలుసు. 

అనుపమ్‌ ఖేర్‌ బాగా చేశాడు. డైలాగ్స్‌ లేకుండా యాక్ట్‌ చెయ్యడం కష్టమే. అయినా బాగా చేశాడు. క్లోజప్‌లో మరీ నాలా ఏం లేడు. నడుస్తున్నప్పుడు మాత్రం, సేమ్‌ నేనే! సోనియాజీగా వేసిన నటి కూడా సరిగ్గా సరిపోయింది. కళ్లు మూసుకుని ఆమె వాయిస్‌ వింటే సోనియాజీనే సడన్‌గా నా ఆఫీస్‌ రూమ్‌లోకి వచ్చి, ‘దేఖియే మన్మోహన్‌జీ’ అన్నట్లుంది. ప్రియాంక గా చేసిన అమ్మాయి అయితే అల్టిమేట్‌! ప్రియాంకే చేసిందంటే నమ్మేస్తారు. 

ట్రైలర్‌ మొత్తం మీద సూట్‌ కాకుండా ఉన్నది ఒక్కరే. రాహుల్‌ బాబు! కుర్రాడు మరీ పల్చగా ఉన్నాడు. నా క్యారెక్టర్, రాహుల్‌ క్యారెక్టర్‌ కాస్త తారుమారు అయినట్లున్నాయి. అనుపమ్‌ ఖేర్‌ ఇంకొంచెం బలహీనంగా, రాహుల్‌గా వేసిన అబ్బాయి మరికొంచెం బలంగా ఉండాల్సింది. 

పుస్తకం మీద ఉన్న టైటిలే కాకుండా, సినిమాకు వేరే ఏదైనా పేరు పెట్టి ఉండవలసింది. ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనడంలో దేశ ప్రజల్ని విస్మయపరిచే ప్రత్యేకత ఏముంటుంది? 

శుక్రవారం పార్టీ ఫౌండేషన్‌ జరిగింది. ఒకరోజు ముందు ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఇది నేను గమనించలేదు. మీడియా నుంచి వచ్చానని చెప్పి, ఓ కుర్రాడు అడిగాడు.. ‘సర్, ఫౌండేషన్‌ డేకి సరిగ్గా ఇరవై నాలుగ్గంటల ముందు ట్రైలర్‌ని రిలీజ్‌ చెయ్యడం వెనుక బీజేపీ వ్యూహం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాడు! 

ముందసలు బీజేపీ రిలీజ్‌ చేయించిందని నేను అనుకుంటేనే కదా, రిలీజ్‌ చేయించడం వెనుక బీజేపీ ఉద్దేశం ఏమై ఉంటుందని నేను అనుకోవడం?! 

‘‘అది చెప్పలేను కానీ, నీ తర్వాతి ప్రశ్న ఏమై ఉంటుందో నేను ఊహించగలను’’ అన్నాను. అతడేం ఆశ్చర్యపోలేదు! 

‘‘సర్‌.. మొదట గానీ, తర్వాత గానీ నేనేం ప్రశ్న వేస్తానో నాకే తెలియనప్పుడు నేను వేయబోయే ప్రశ్నను మీరు ముందే ఊహించగలిగారంటే.. ఫౌండేషన్‌ డేకి సరిగ్గా ముందు రోజు బీజేపీ మీ బయోపిక్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయించడం వెనుక ఉద్దేశాన్ని కూడా మీరు ఊహించే ఉంటారు కదా. అదేమిటో చెప్పండి’’ అన్నాడు. 

‘‘ఏ పత్రిక?’’ అని అడిగాను. ఏ పత్రికో చెప్పాడు. ‘‘ఎన్నాళైంది ఉద్యోగంలో చేరి?’’ అని అడిగాను. ‘‘ఎన్నాళ్లో కాలేదు సర్‌’’ అన్నాడు. 

‘‘సంజయ బారూ నీకు తాతగారు కానీ కాదు కదా’’ అన్నాను. 

‘‘లేదు సర్‌. సంజయ బారూ నాకు తాతగారు కాదు’’ అన్నాడు. 

‘‘అదే అనుకున్నా.. సంజయ బారూ నీకు తాతగారు అవడానికి లేదు. ఎందుకంటే నువ్వే సంజయ బారూకి తాతలా ఉన్నావ్‌’’ అన్నాను. 

‘‘థ్యాంక్యూ సర్‌’’ అని మొహమాట పడ్డాడు! 

సంజయ బారూ ఐదేళ్లు నా దగ్గర మీడియా అడ్వైజర్‌గా పని చేసి వెళ్లాక గానీ ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అంటూ నాపై పుస్తకం రాయలేదు. ఈ కుర్రాడు డ్యూటీలో జాయిన్‌ అయిన రోజే ఆ పుస్తకానికి రెండో భాగం రాయడానికి పార్టీ ఆఫీస్‌ను వెతుక్కుంటూ వచ్చినట్లున్నాడు. 

‘‘కేక్‌ తిని వెళ్లు. చూశావ్‌ కదా, రాహుల్‌ బాబే స్వయంగా నా చెయ్యి పట్టి, కేక్‌ కట్‌ చేయించాడు’’ అన్నాను.

కదల్లేదు.

‘‘నువ్వడగబోయే రెండో ప్రశ్నకు కూడా ఇదే సమాధానం’’ అని చెప్పాను.

మాధవ్‌ శింగరాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement