రాయని డైరీ.. ఎం.ఎస్‌.కె. ప్రసాద్‌ (సెలక్టర్‌) | Madhav Singaraju Rayani Dairy On MSK Prasad | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. ఎం.ఎస్‌.కె. ప్రసాద్‌ (సెలక్టర్‌)

Published Sun, Jul 14 2019 12:18 AM | Last Updated on Sun, Jul 14 2019 12:18 AM

Madhav Singaraju Rayani Dairy On MSK Prasad - Sakshi

లండన్‌ నుంచి ఇండియా బయల్దేరాం. ఫ్లయిట్‌ ఎక్కేముందు ఇండియా నుంచి వినోద్‌ రాయ్‌ ఫోన్‌ చేశారు. వెంటనే లిఫ్ట్‌ చేసి, ‘‘గుడ్‌ మాణింగ్‌ సర్‌’’ అన్నాను. 

రాయ్‌ పెద్దగా నవ్వారు. ‘‘క్యాచ్‌ పట్టినట్టుగా పట్టావ్‌ కదయ్యా’’ అన్నారు. 

‘‘ఏంట్సార్‌ పట్టేది!! అన్నాను.

‘‘అదేనయ్యా.. దినేష్‌ కార్తీక్‌ కొట్టిన బంతిని నీషమ్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టేశాడు కదా. అలా నువ్వు నా కాల్‌ని పట్టేశావు. నేను కదా ముందుగా నీకు గుడ్‌ మాణింగ్‌ చెప్పాల్సింది. నేను నీకు ఫోన్‌ చేశాను. నువ్వు నాకు ఫోన్‌ చెయ్యలేదు.. హాహాహా..’’ అన్నారు!

ముందు పంపాల్సిన ప్లేయర్‌ని ముందు పంపి, వెనుక పంపాల్సిన ప్లేయర్‌ని వెనుక పంపి వుంటే ఇప్పుడు మేమంతా ఇండియా ఫ్లయిట్‌ ఎక్కేందుకు ముందూవెనుకా ఆలోచించే పని ఉండేది కాదని రాయ్‌ నాకు చెప్పదలచుకున్నారని అర్థమైంది. ఆయన నాకు చెప్పదలచుకున్నారని నేను అర్థం చేసుకున్న ఇంకో విషయం.. సెమీస్‌లో   మ్యాచ్‌ పోయాక ఈ రెండు మూడు రోజుల్లో ఒక్కసారి కూడా నేను ఆయనకు ఫోన్‌ చెయ్యలేదని నాకు గుర్తు చేయడం. 

‘‘సారీ సర్‌. చెయ్యాల్సింది’’ అన్నాను. 

‘‘చెయ్యలేకపోయావ్‌ సరే, ‘చెయ్యలేకపోయాను’ అనైనా చెయ్యాల్సింది’’ అన్నారు! ఆయన ఇగో బాగా హర్ట్‌ అయినట్లుంది. ఇండియా హర్ట్‌ అయినా పర్వాలేదు. ఇగోలు హర్ట్‌ కాకూడదు. వినోద్‌ రాయ్‌ ఇగోను అసలే హర్ట్‌ కానీయకూడదు. క్రికెట్‌ బాగోగుల కమిటీ చైర్మన్‌ ఆయన. 

‘‘చేద్దామనుకున్నాను సర్‌. ఓడిపోయాక చేసి చెప్పేది, చెప్పి చేసేదీ ఏముంటుందని చెయ్యలేదు’’ అన్నాను. 

‘‘గెలిస్తే ‘కంగ్రాట్స్‌’ అని నేనే ముందుగా ఫోన్‌ చెయ్యడం కామన్‌. ఓడిపోతే ‘సారీ’ అని నీకై నువ్వే ముందుగా ఫోన్‌ చెయ్యకపోవడం అన్‌కామన్‌. పిటీ ఏంటంటే.. ఓడిపోయినా నేనే నీకు ఫోన్‌ చేసి నీ చేత సారీ చెప్పించుకోవడం’’ అని మళ్లీ ‘ హాహాహా..’ అన్నారు.

ఇండియా న్యూజిలాండ్‌పై ఓడిపోడానికి కారణం నేనేనని ఆయన అనుకుంటున్నట్లు న్నారు! అలాగైతే ఇండియా దక్షిణాఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద, పాకిస్తాన్‌ మీద, ఆప్గానిస్తాన్‌ మీద, వెస్టిండీస్‌ మీద, బంగ్లాదేశ్‌ మీద గెలవడానికి కూడా నేనే కారణం అని ఆయన అనుకోవాలి. కెప్టెన్‌ ఉండగా, కోచ్‌ ఉండగా,   మ్యాచ్‌ మట్టిపాలవడానికి కారణం సెలక్టర్స్‌ కమిటీ ఛైర్మన్‌ మాత్రమే అయితే.. అంతమందీ ఉండగా గెలిచిన మ్యాచ్‌లన్నిటిలోనూ గెలుపుకు సెలక్టర్స్‌ కమిటీ ఛైర్మనే కారణం అవ్వాలి కదా! 

‘‘గెలుపు ఓటములకు కారణం నేనేనని మీరు అనుకుంటున్నట్లయితే కనుక నేను నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను సర్‌’’ అన్నాను. 

‘‘ఓటమికి మాత్రమే కారణాలు ఉంటాయి మిస్టర్‌ ఎమెస్కే. గెలుపుకు కారణమేంటని  ఎవరూ చూడరు. తప్పుల్ని దిద్దుకుంటానని అంటున్నావ్‌. దిద్దుకోలేని తప్పేదైనా చేసి ఉంటే మాత్రం నిన్ను ఇంకొకరు దిద్దవలసి వస్తుంది. నిన్ను నువ్వు దిద్దుకోడానికి ఉండదు’’ అన్నారు!

అంబటి రాయుడిని టీమ్‌లోకి తీసుకోనందుకు ఈయన ఇలా అనడం లేదు కదా అని ఒక్కక్షణం అనిపించింది.

‘‘మీరంతా ఇండియా రాగానే చిన్న మీటింగ్‌ ఉంటుంది ఎమెస్కే. కెప్టెన్‌ కోహ్లీకి, కోచ్‌ రవిశాస్త్రికి కలిపి ఒక మీటింగ్‌. నీకొక్కడికే సపరేట్‌గా ఒక మీటింగ్‌. ఆ సంగతి చెప్పడానికే ఫోన్‌ చేశాను’’ అన్నారు వినోద్‌ రాయ్‌!
నాకొక్కడికే సపరేట్‌గా ఒక మీటింగా! 

నాకేదో అర్థమవుతోంది. 

‘‘సర్‌.. మా నేటివ్‌ ప్లేస్‌ గుంటూరుకు వెళ్లి కొన్ని యుగాలు అవుతోంది. ముంబైలో ఫ్లయిట్‌ దిగ్గానే ఒకసారి గుంటూరు వెళ్లొస్తాను సర్‌’’ అన్నాను.  

‘‘గుంటూరా! అంబటి రాయుడిది కూడా గుంటూరే కదా’’ అన్నారు సడన్‌గా ఆయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement