Madav singaraju
-
రాయని డైరీ.. హరీశ్ రావత్ (73), కాంగ్రెస్
వికలమైన మనసుతో బుధవారం నేను భగవాన్ కేదార్‌నాథ్‌కి ట్వీట్ పెడితే గురువారం ఆ భగవానుడే చెప్పి చేయించినట్లుగా ప్రియాంకా గాంధీ నాకు ఫోన్ చేశారు! ‘‘నమస్తే రావత్జీ! రేపు ఢిల్లీ వచ్చి రాహుల్జీని కలవండి’’ అని చెప్పి, ఫోన్ పెట్టేశారు ప్రియాంక!! రాహుల్‌ని ‘రాహుల్జీ’ని చెయ్యడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, రావత్‌జీని ‘రావత్’గా చేయడానికి డెహ్రాడూన్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ఢిల్లీలో ఎవరూ గమనిస్తున్నట్లు లేరు. ‘‘దేవేంద్ర యాదవ్ నన్ను లెక్కచేయడం లేదు రాహుల్జీ. అందుకే ఆ కేదారేశ్వరుడికి మొర పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో నాకో దారి చూపించమని, లేదంటే కాస్త విశ్రాంతిని ప్రసాదించమని ఆయన్ని వేడుకున్నాను..’’ అని శుక్రవారం ఢిల్లీ వెళ్లీ వెళ్లగానే రాహుల్‌తో చెప్పేశాను. ‘‘రావత్జీ! మీరలా వికలమైన మనసుతో మీ ఇష్టదైవానికి ట్వీట్ చేయడం నన్ను, మమ్మీని, ప్రియాంకను ఎంతో బాధించింది. మీ ట్వీట్‌ను కేదారేశ్వరుడొక్కడే చూడడు కదా! నరేంద్ర మోదీజీ చూస్తారు. మమతాజీ చూస్తారు. అమరీందర్‌సింగ్ కూడా చూస్తారు. ట్వీట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా?’’ అన్నాడు రాహుల్. ‘‘క్షణికావేదనలో అలా చేసేశాను రాహుల్జీ. కానీ దేవేంద్ర యాదవ్ అన్నీ తనే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. ‘రావత్‌కి అంత శక్తి లేదు’ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మీరు చెప్పండి రాహుల్జీ. రెండుసార్లు ఉత్తరాఖండ్‌కి సీఎంని అయిన నాకే అంత శక్తి లేకుంటే.. ఎక్కడి నుంచో ఉత్తరాఖండ్ ఇన్ఛార్జిగా వచ్చిన దేవేంద్ర యాదవ్‌కి ఉంటుందా?!’’ అని అడిగేశాను. ‘‘దేవేంద్ర యాదవ్ ఎక్కడి నుంచో రాలేదు రావత్జీ. ఢిల్లీ నుంచే వచ్చాడు’’ అన్నాడు రాహుల్. ‘‘సంతోషం రాహుల్జీ! ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా సంతోషమే. అందుకే కదా.. డెహ్రాడూన్‌కి మొన్న మీరు వచ్చినప్పుడు కూడా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో.. డయాస్ మీద మీతో పాటు ఎవరెవరు ఉండాలో నిర్ణయించవలసింది నేను కదా, దేవేంద్ర యాదవ్ నిర్ణయించేశాడేమిటి అనే ఆలోచన కూడా నాకు రాలేదు!’’ అన్నాను. రాహుల్ అలా వింటూ ఉండిపోయాడు. వినడం వరకేనని నిర్ణయించుకున్నాకే నన్ను ఢిల్లీ పిలిపించినట్లున్నాడు! ‘‘రాహుల్జీ, మీరు మా ఇద్దర్నీ కలిసి పని చెయ్యమన్నారు. దేవేంద్ర యాదవ్ తనొక్కడే చాలనుకుంటున్నాడు. ‘పేరుకే స్టేట్ ఇన్ఛార్జ్. స్టేట్‌లో ఛార్జ్ మొత్తం నాదే’ అని ప్రచారం చేసుకుంటున్నాడు. సీఎం క్యాండిడేట్ని ముందే ప్రకటిస్తే తప్ప అతడు, నేను కలిసి పనిచేసే పరిస్థితి లేదు రాహుల్జీ’’ అన్నాను. ‘‘పరిస్థితా? ప్రసక్తా రావత్జీ’’ అన్నాడు రాహుల్! అంత లోతుగా అతడు ఆలోచించగలడని నేను అనుకోలేదు. ‘‘రావత్జీ! 2017లో అమరీందర్ సింగ్‌ని తప్ప, ఆ తర్వాత ఎవర్నీ మనం సీఎం క్యాండిడేట్‌గా ఎన్నికలకు ముందే ప్రకటించలేదు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. ఎన్నికలు అయ్యాకే సీఎంగా ఎంపికయ్యారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పేరు కూడా ఎన్నికలు అయ్యాకే సీఎంగా బయటికొచ్చింది. వాళ్లిద్దరూ ఈరోజుకీ సీఎంలుగా ఉన్నారు. ముందే సీఎంగా ప్రకటించి, సీఎంని చేసిన అమరీందర్ సింగ్ ఏమయ్యారో మీకు తెలిసిందే కదా’’ అన్నాడు రాహుల్! ఒక నమస్కారం పెట్టి, వచ్చేశాను. డెహ్రాడూన్‌లో అడుగుపెట్టగానే.. పంజాబ్ నుంచి అమరీందర్‌సింగ్ ఫోన్! ‘‘రావత్జీ! పంజాబ్ స్టేట్ ఇన్‌ఛార్జ్‌గా మీరు నాకు తవ్వారు. ఉత్తరాఖండ్ స్టేట్ ఇన్ఛార్జిగా దేవేంద్ర యాదవ్ ఇప్పుడు మీకు తవ్వుతున్నాడు. కాంగ్రెస్సే కోరి తవ్వకాలు జరిపించుకుంటున్నప్పుడు మీరెంత, నేనెంత, ఆ కేదారేశ్వరుడెంత చెప్పండి’’ అన్నారాయన! -
రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్)
‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్న చోట బాల్ పెన్‌తో గీస్తుండగా చిన్న డౌట్ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా? అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! ఇంకు పెన్ను గానీ, బాల్ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే. కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్ పెన్‌తో న్యూస్ పేపర్‌పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. స్క్రీన్ మీద జూమ్‌లో రాహుల్ బాబు!! అతడి చేతిలో పింగాణీ ప్లేట్ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్ టైమ్ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. ‘‘గుడ్ మార్నింగ్ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే! ‘‘గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. స్పూన్ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్ తీసుకున్నాడు రాహుల్. ఆ టైమ్‌లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్ బాబూ.. కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. ‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్ బాబూ..’’ అన్నాను. ‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్‌షా, నడ్డా మీట్ అయ్యారు. అదే రోజు శరత్ పవార్, ప్రశాంత్ కిశోర్ మీట్ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్. రాహుల్‌లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. ‘‘సర్జరీ అయినా, సర్జికల్ స్ట్రయిక్స్ అయినా కొంత టైమ్ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్‌లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్‌లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. రాహుల్‌లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు! ‘‘రాహుల్ బాబూ.. నా ముందు టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్ కట్ అయింది. -మాధవ్ శింగరాజు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
‘‘భలే చేస్తున్నాడు కదా’’ అన్నాడు అమిత్‌షా డిలైట్‌ఫుల్‌గా! అంత శక్తి, అంత కాంతి.. అతడి ముఖంలో కనిపించగానే నాకు అర్థమైంది.. శక్తికాంత దాస్ గురించే ఆ మాట అన్నాడని. ‘‘అవును భలే చేస్తున్నాడు. ముందే రఘురామ్ రాజన్ ఇలా చేసి ఉంటే ఈ లాక్డౌన్లో శక్తికాంత్ని మిస్ అయ్యేవాళ్లం’’ అన్నాడు రాజ్‌నాథ్‌సింగ్. ‘‘అప్పుడు మిస్ అవడానికి ఏముంటుంది! రాజనే ఉండేవాడు. రాజనే లాక్డౌన్లో భలే చేస్తుండేవాడు’’ అన్నాడు అమిత్ షా. ‘‘నేనూ అదే అంటున్నా అమిత్జీ.. రాజన్ ఉండి ఉంటే శక్తికాంత్ కూడా భలే చేయగలడని మనకు ఈ రోజు తెలిసి ఉండేది కాదు కదా..’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘అసలు శక్తికాంత్ భలే చేయగలడని మనకు తెలియాల్సిన అవసరం ఎందుకుండేది.. రాజన్ ఉండి ఉంటే’’ అన్నాడు అమిత్ షా. ఎవరూ ఆగడం లేదు. ‘‘మీతో నేను ఏకీభవించే విషయం మీరిద్దరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్న విషయం అయి ఉండాలని నేను కోరుకుంటాను’’ అన్నాను ఇద్దరి వైపు చూస్తూ. ‘‘లేదు మోదీజీ ఇద్దరం అంటున్నది ఒకటే.. శక్తికాంత్ భలే చేస్తున్నాడని! మధ్యలో రాజన్ పేరు రావడం వల్ల రెండు వేర్వేరు అభిప్రాయాలను మేము వ్యక్తం చేయబోతు న్నామన్న భావన మీలో కలగడంలో తప్పేమీ లేదు’’ అన్నాడు అమిత్‌షా. ‘‘అవును.. మోదీజీ! మా ఇద్దరి అభిప్రాయం ఒక్కటే. శక్తికాంత్ భలే చేస్తున్నాడని. మధ్యలోకి రాజన్ పేరును నేను తేవడం కూడా శక్తికాంత్ భలేగా చేస్తున్నాడని మరింత బాగా చెప్పడం కోసమే’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘అది బాగా చెప్పడం అవదు రాజ్‌నాథ్‌జీ. చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం అవుతుంది. రాజన్ కంటే బాగా చేస్తున్నాడని గానీ, రాజన్ బాగా చేసి ఉంటే శక్తికాంత్ బాగా చేస్తాడని తెలియకపోయేది అనడం గానీ.. శక్తికాంత్ భలే చేస్తున్నాడని చెప్పడం అవదు. భలే చేస్తున్నాడు అంటున్నప్పుడు.. భలేగా ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలి తప్ప, ఎవరికంటే భలేగా చేస్తున్నాడో చెప్పడం వల్ల భలేగా వాళ్లు చేసింది పోయి, భలేగా ఎవరో చేయనిది ముందుకొస్తుంది. అప్పుడు శక్తికాంత్ గురించి భలేగా చేస్తున్నాడని నువ్వేం అనుకున్నట్లు?!’’ అన్నాను. అమిత్‌షా ముఖం వెలిగిపోయింది. ‘భలేగయింది’ అన్నట్లు చూశాడు రాజ్‌నాథ్ వైపు. అమిత్‌షా ఫోన్ వెలుగుతోంది. తన ముఖం వెలుగులో తన ఫోన్ వెలుగును అతడు గ్రహించినట్లు లేడు. అమిత్‌షా ఫోన్ వెలుగుతోందని రాజ్‌నాథ్ గ్రహించాడు కానీ.. అమిత్‌షా వెలుగుతో, అతడి ఫోన్ వెలుగుతో తనకు సంబంధం ఏమిటన్నట్లు కూర్చున్నాడు. వెలిగి వెలిగి అమిత్‌షా ఫోన్ ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు రాజ్‌నాథ్.. ‘‘అమిత్జీ మీ ఫోన్ వెలుగుతోంది’’ అని! ఫోన్ చూసుకుని, ఫోన్లో వెలిగి ఆరిపోయిన నంబర్ చూసుకుని ఆ నంబర్‌కి ఫోన్ చేశాడు అమిత్‌షా. నేను, అమిత్‌షా, రాజ్‌నాథ్.. ముగ్గురమే ఉన్నాం హాల్లో. పక్కపక్కన ఉన్న ముగ్గురిలో ఇద్దరికి వినిపించకుండా మూడో వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడంటే.. ఏదో పెద్ద విషయం వినిపించబోతున్నాడనే. ‘‘శక్తి చాలడం లేదట’’ అన్నాడు అమిత్‌షా, ఫోన్ పెట్టేసి. ‘‘ఎవరు?’’ అన్నాను. ‘‘శక్తికాంత దాస్’’ ‘‘దేనికి శక్తి చాలడం లేదట’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘రాజన్ పెడుతున్న టార్చర్ తట్టుకోడానికి. గంటకోసారి ఫోన్ చేసి.. ‘ఇలా కాదు ఎకానమీని ఎత్తడం. హెల్ప్ కావాలంటే చెప్పు’ అంటున్నాడట’’ అన్నాడు అమిత్‌షా. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నిత్యానంద (స్వామీజీ)
నిత్యం ఈ మనుషులు పెట్టే పరుగులు చూస్తుంటే, పరుగులు పెట్టేందుకే వీరు జన్మించి, జీవిస్తున్నారా అనే సందేహం నాకు ఏమాత్రం కలగకూడనిది. కానీ ఈవేళ కలుగుతోంది! ఐన్‌స్టీన్ కనిపెట్టిన ఈ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాను వట్టి ఫేక్ అని తేల్చేసిన నిత్యానందకు, ‘నా పని పూర్తయ్యే వరకు బయటికి రాకు’ అని సూర్య భగవానుడినే ఆజ్ఞాపించి నలభై నాలుగు నిమిషాల పాటు ఆయన్ని ఆకాశం వెనకే ఉంచేసిన నిత్యానందకు, ఆవులను.. ఎద్దులను.. సింహాలను.. పులులను, వానరాలను సంస్కృతంలో, తమిళంలో మాట్లాడించిన నిత్యానందకు.. కలగకూడని సందేహాలు కలుగుతున్నాయంటే భూగోళానికివి తిమిరాంధకార యుగారంభ ఘడియలనే!! అర్థం, పరమార్థం, అంతరార్థం లేని పరుగులతో మనుషులు అద్వైత భావనకు విఘాతం కలిగిస్తున్నారు. ‘నేను’ అనే భావన వీడితేనే పరుగు ఆగుతుంది. ఆశ్రమానికి వచ్చిన కొత్తలో ఒక యువతిని అడిగాను.. నిత్యానంద మీద నీ అమూల్యమైన అభిప్రాయం ఏమిటని. ‘ఆయన ఎక్కడ ఉంటారు?’ అని తన అమాయకమైన కనురెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది ఆ యువతి. ‘నేనే కదా నిత్యానందను. తెలియకనే అడిగావా?’ అన్నాను. ‘అలాంటప్పుడు మీరు నిత్యానంద మీద నీ అభిప్రాయం ఏంటని కాకుండా.. నా మీద నీ అభిప్రాయం ఏంటని అడిగి ఉండాల్సింది కదా!’ అంది. ఆ సాయంత్రం అద్వైతం గురించి చెప్పాక.. జ్ఞానం కోసం ఆశ్రమానికి వచ్చిన ఆ యువతికి ఇక పరుగులు తీసే అవసరమే లేకపోయింది. నేను దేశం దాటి వచ్చే సమయానికి నా కోసం రెండు రాష్ట్రాల పోలీసులు పరుగులు తీస్తూ ఉన్నారు. అవి వారిని చట్టం తీయిస్తున్న పరుగులే తప్ప వారి చేత నిత్యానంద తీయిస్తున్నవి కావని గ్రహించగలిగి ఉంటే వారికింత ప్రయాసే ఉండేది కాదు. ‘‘గురూజీ.. భోజనం వేళయింది’’ అనే మాట వినిపించింది! ఆ మాటలో నాకు ఏ రుచీ పచీ కనిపించడం లేదు. ఏ ఘుమఘుమలూ నన్ను నిండైన ఆ విస్తరి వైపు ఆకర్షించడం లేదు. ఈ రాత్రి మరో సందేహ వైపరీత్యం కూడా నన్ను ఎటూ కదలనివ్వకుండా చేస్తోంది. ‘‘జగమెరిగిన నిత్యానందుడు అంటే జగాన్ని ఎరిగిన నిత్యానందుడా? నిత్యానందను ఎరిగిన జగమా? ఎలా అర్థమౌతోంది నీకు?’’ అని భోజనం సిద్ధం చేసి వచ్చిన పరిచారకుడిని అడిగాను. ‘‘నాకంత నాలెడ్జి లేదు గురూజీ’’ అన్నాడు! ‘‘నిత్యానందుడి సేవలో ఎన్నాళ్లుగా తరిస్తున్నావ్?’’ అని అడిగాను. ‘‘ఇవాళే కొత్తగా వచ్చాను గురూజీ. మీరూ ఇవాళే కొత్తగా వచ్చారు. మీకిది పరాయి దేశం. మాకు మీరు పరాయి జ్ఞానం’’ అన్నాడు! నిత్యానంద ఒక పామరుడికి వ్యక్తిగా కాక ఒక జ్ఞానరూపంగా సాక్షాత్కరిస్తున్నాడంటే నిత్యానందుడు జగం ఎరిగినవాడే కాదు, జగం ఎరిగిన నిత్యానందుడు కూడా! ‘‘ఇంత జ్ఞానం నీకెలా వచ్చింది’’ అని అడిగాను. ‘‘ఎంత జ్ఞానం?’’ అన్నాడు. ‘‘నిత్యానందను జ్ఞానరూపంగా చూసే జ్ఞానం!’’ అన్నాను. ‘‘నేనే కాదు, మరికొందరు జ్ఞానులు కూడా బయట మీ కోసం వేచి ఉన్నారు. మిమ్మల్ని వెదుక్కుంటూ మీ దేశం నుంచి వచ్చారు. స్వామివారికిది భోజనం వేళ అని వారిని ఆపి ఉంచాను’’ అన్నాడు. జీవికి పరుగు తప్పదా అనే సందేహం మళ్లీ మొదలైంది నాలో. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. ఎం.ఎస్.కె. ప్రసాద్ (సెలక్టర్)
లండన్ నుంచి ఇండియా బయల్దేరాం. ఫ్లయిట్ ఎక్కేముందు ఇండియా నుంచి వినోద్ రాయ్ ఫోన్ చేశారు. వెంటనే లిఫ్ట్ చేసి, ‘‘గుడ్ మాణింగ్ సర్’’ అన్నాను. రాయ్ పెద్దగా నవ్వారు. ‘‘క్యాచ్ పట్టినట్టుగా పట్టావ్ కదయ్యా’’ అన్నారు. ‘‘ఏంట్సార్ పట్టేది!! అన్నాను. ‘‘అదేనయ్యా.. దినేష్ కార్తీక్ కొట్టిన బంతిని నీషమ్ అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు కదా. అలా నువ్వు నా కాల్ని పట్టేశావు. నేను కదా ముందుగా నీకు గుడ్ మాణింగ్ చెప్పాల్సింది. నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు నాకు ఫోన్ చెయ్యలేదు.. హాహాహా..’’ అన్నారు! ముందు పంపాల్సిన ప్లేయర్‌ని ముందు పంపి, వెనుక పంపాల్సిన ప్లేయర్‌ని వెనుక పంపి వుంటే ఇప్పుడు మేమంతా ఇండియా ఫ్లయిట్ ఎక్కేందుకు ముందూవెనుకా ఆలోచించే పని ఉండేది కాదని రాయ్ నాకు చెప్పదలచుకున్నారని అర్థమైంది. ఆయన నాకు చెప్పదలచుకున్నారని నేను అర్థం చేసుకున్న ఇంకో విషయం.. సెమీస్‌లో మ్యాచ్ పోయాక ఈ రెండు మూడు రోజుల్లో ఒక్కసారి కూడా నేను ఆయనకు ఫోన్ చెయ్యలేదని నాకు గుర్తు చేయడం. ‘‘సారీ సర్. చెయ్యాల్సింది’’ అన్నాను. ‘‘చెయ్యలేకపోయావ్ సరే, ‘చెయ్యలేకపోయాను’ అనైనా చెయ్యాల్సింది’’ అన్నారు! ఆయన ఇగో బాగా హర్ట్ అయినట్లుంది. ఇండియా హర్ట్ అయినా పర్వాలేదు. ఇగోలు హర్ట్ కాకూడదు. వినోద్ రాయ్ ఇగోను అసలే హర్ట్ కానీయకూడదు. క్రికెట్ బాగోగుల కమిటీ చైర్మన్ ఆయన. ‘‘చేద్దామనుకున్నాను సర్. ఓడిపోయాక చేసి చెప్పేది, చెప్పి చేసేదీ ఏముంటుందని చెయ్యలేదు’’ అన్నాను. ‘‘గెలిస్తే ‘కంగ్రాట్స్’ అని నేనే ముందుగా ఫోన్ చెయ్యడం కామన్. ఓడిపోతే ‘సారీ’ అని నీకై నువ్వే ముందుగా ఫోన్ చెయ్యకపోవడం అన్‌కామన్. పిటీ ఏంటంటే.. ఓడిపోయినా నేనే నీకు ఫోన్ చేసి నీ చేత సారీ చెప్పించుకోవడం’’ అని మళ్లీ ‘ హాహాహా..’ అన్నారు. ఇండియా న్యూజిలాండ్‌పై ఓడిపోడానికి కారణం నేనేనని ఆయన అనుకుంటున్నట్లు న్నారు! అలాగైతే ఇండియా దక్షిణాఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద, పాకిస్తాన్ మీద, ఆప్గానిస్తాన్ మీద, వెస్టిండీస్ మీద, బంగ్లాదేశ్ మీద గెలవడానికి కూడా నేనే కారణం అని ఆయన అనుకోవాలి. కెప్టెన్ ఉండగా, కోచ్ ఉండగా, మ్యాచ్ మట్టిపాలవడానికి కారణం సెలక్టర్స్ కమిటీ ఛైర్మన్ మాత్రమే అయితే.. అంతమందీ ఉండగా గెలిచిన మ్యాచ్లన్నిటిలోనూ గెలుపుకు సెలక్టర్స్ కమిటీ ఛైర్మనే కారణం అవ్వాలి కదా! ‘‘గెలుపు ఓటములకు కారణం నేనేనని మీరు అనుకుంటున్నట్లయితే కనుక నేను నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను సర్’’ అన్నాను. ‘‘ఓటమికి మాత్రమే కారణాలు ఉంటాయి మిస్టర్ ఎమెస్కే. గెలుపుకు కారణమేంటని ఎవరూ చూడరు. తప్పుల్ని దిద్దుకుంటానని అంటున్నావ్. దిద్దుకోలేని తప్పేదైనా చేసి ఉంటే మాత్రం నిన్ను ఇంకొకరు దిద్దవలసి వస్తుంది. నిన్ను నువ్వు దిద్దుకోడానికి ఉండదు’’ అన్నారు! అంబటి రాయుడిని టీమ్‌లోకి తీసుకోనందుకు ఈయన ఇలా అనడం లేదు కదా అని ఒక్కక్షణం అనిపించింది. ‘‘మీరంతా ఇండియా రాగానే చిన్న మీటింగ్ ఉంటుంది ఎమెస్కే. కెప్టెన్ కోహ్లీకి, కోచ్ రవిశాస్త్రికి కలిపి ఒక మీటింగ్. నీకొక్కడికే సపరేట్గా ఒక మీటింగ్. ఆ సంగతి చెప్పడానికే ఫోన్ చేశాను’’ అన్నారు వినోద్ రాయ్! నాకొక్కడికే సపరేట్గా ఒక మీటింగా! నాకేదో అర్థమవుతోంది. ‘‘సర్.. మా నేటివ్ ప్లేస్ గుంటూరుకు వెళ్లి కొన్ని యుగాలు అవుతోంది. ముంబైలో ఫ్లయిట్ దిగ్గానే ఒకసారి గుంటూరు వెళ్లొస్తాను సర్’’ అన్నాను. ‘‘గుంటూరా! అంబటి రాయుడిది కూడా గుంటూరే కదా’’ అన్నారు సడన్‌గా ఆయన. -
ఎం.జె.అక్బర్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఫ్లయిట్లో ఉన్నాను. మరికొన్ని గంటల్లో ఇండియాలో ఉంటాను. ఎయిర్ హోస్టెస్ వచ్చింది.. ‘‘ఏమైనా తీసుకుంటారా?’’ అని. ‘‘ఏమైనా తీసుకోవచ్చా’’ అని నవ్వుతూ అడిగాను. ‘‘తీసుకోవచ్చు కానీ, మీకోసం ఏవైతే సిద్ధం చేయబడి ఉంటాయో వాటిలోంచి మాత్రమే మీరు ఏదైనా తీసుకోవలసి ఉంటుంది’’ అని తనూ నవ్వింది. అమ్మాయిలు తెలివిగా ఉంటున్నారు. తెలివి లేని అమ్మాయిలే ‘మీటూ’ అంటూ పాతవన్నీ తవ్వుకుని తలస్నానం చేస్తున్నారు. ఆఫ్రికాలో ఫ్లయిట్ ఎక్కేముందు నాకు తెలియని యంగ్ రిపోర్టర్ ఒకతను ఫోన్ చేశాడు. ‘‘అక్బర్జీ.. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదా?’’ అని అతడు పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. ‘‘ఏయ్.. ఆపు’’ అన్నాను. అతడు ఆపలేదు. ‘‘ఏమైందో ఏడ్వకుండా చెప్పు’’ అన్నాను. ‘‘అక్బర్జీ ఈ దేశంలో మగవాడికి..’’ అని మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘నా నంబర్ నీకెలా దొరికింది’’ అని కసిరాను. ‘‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నుంచి సంపాదించాను అక్బర్జీ’’ అన్నాడు. ‘‘ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కదా నువ్వు నా నంబర్ సంపాదించవలసింది. ఇప్పుడు నేను ఏ పేపర్లో ఉన్నానని ఎడిటర్స్ గిల్డ్‌కి వెళ్లి అడిగావ్?’’ అని కోప్పడ్డాను. ‘‘ముందు ఎక్స్టర్నల్ మినిస్ట్రీకే వెళ్లాను అక్బర్జీ. స్మృతీజీని అడిగాను మీ నంబర్ కావాలని. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు’’ అని చెప్పాడు! నాకర్థమైంది. స్మృతీ ఇరానీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మోదీజీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడే ఆలోచించే పని పెట్టుకోలేదు. ‘అక్బర్‌ని మోదీ మోసుకొచ్చాడు కాబట్టి, మోదీనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని అంటున్నాడు. ‘‘సర్లే.. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు.. ఫ్లయిట్ టైమ్ అవుతోంది’’ అన్నాను. ‘‘ఇక్కడ నా టైమ్ అయిపోయేలా ఉంది అక్బర్జీ’’ అన్నాడు! మళ్లీ ఏడుపు. ఆఫీస్‌లో తన పక్కన కూర్చునే అమ్మాయిని టచ్ చేశాడట. ఆ అమ్మాయి ‘మీటూ’ అనేసిందట! ‘‘ఉద్యోగం పోయేలా ఉందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్జీ’’ అన్నాడు. ‘‘కేసు ఫైల్ అయిందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్జీ’’ అన్నాడు. ‘‘మరెందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాను. ‘‘ట్విట్టర్లో, ఫేస్బుక్లో నేను తనను టచ్ చేశానని రాసింది అక్బర్జీ’’ అన్నాడు. ‘‘అందులో అంతగా ఏడవాల్సిందే ముందీ!’’ అన్నాను. ‘‘పరువు పోయేలా ఉంది అక్బర్జీ’’ అని మళ్లీ స్టార్ట్ చేశాడు. ‘‘ఊరుకోవయ్యా బాబూ.. పరువు పోయేలా ఉంటుంది కానీ అదెక్కడికీ పోదు. ఇంక ఆ పిల్లని టచ్ చెయ్యడం మాని.. నీ పని నువ్వు చూస్కో’’ అని చెప్పాను. ‘‘టచ్ చెయ్యకుండా ఉండలేకపోతున్నాను అక్బర్జీ’’ అన్నాడు. ‘‘సీటు మార్పించుకో’’ అని చెప్పాను. ‘‘గుండె ఆగిపోతుందేమో అక్బర్జీ’’ అన్నాడు. కోపం ఆపుకోలేకపోయాను. ‘‘నువ్వన్నది నిజమే. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదు. గుండె ఆగి చచ్చిపో’’ అన్నాను. ఢిల్లీలో ఫ్లయిట్ దిగగానే ఓ మహిళా రిపోర్టర్ ఉత్సాహంగా నా మీదకు తోసుకొచ్చింది. ‘‘సార్.. ప్రియ, గజాలా, సబా, షట్ప, సుమ, సుపర్ణ, ప్రేరణ.. లేటెస్టుగా మజ్లీ! వీళ్లందర్నీ మీరు.. మీడియాలో ఉన్నప్పుడు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరెప్పుడు రిజైన్ చెయ్యబోతున్నారు సార్?’’ అని అడిగింది. నాకు ఆ కుర్రాడు గుర్తొచ్చాడు. వాడి ఏడుపు గుర్తొచ్చింది. పాపం.. పదేళ్ల తర్వాత చిక్కవలసినవాడు.. బిగినింగ్‌లోనే బుక్కైపోయాడు. -మాధవ్ శింగరాజు -
ఉర్జిత్ పటేల్ (ఆర్బీఐ గవర్నర్) రాయని డైరీ
మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్లం వెళుతున్నాం. ఎవరి ఇళ్లకు వాళ్లం అని అనుకున్నానే కానీ, వెనక్కి తిరిగి చూస్తే మిగతా ఐదుగురూ నా వెనుకే వస్తున్నారు! మీటింగ్ అయ్యాక మా ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుందని వాళ్లకు చెప్పినట్లుగా నాకేమీ గుర్తుకు లేదు. నవ్వాను. నవ్వారు. ‘‘మీరేదైనా చేస్తారు అనుకున్నాను’’ అన్నారు మిసెస్ పామీ దువా. ‘‘అవునవును.. మీరేదైనా చేస్తారని మేమూ అనుకున్నాం’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర, ప్రొఫెసర్ చేతన్! దువా, రవీంద్ర, చేతన్.. మా బ్యాంకు వాళ్లు కాదు. మానిటరీ పాలసీ మెంబర్లుగా గవర్నమెంటు పంపినవాళ్లు. వాళ్లు అలా అనగానే ఆచార్య, మైఖేల్ పాత్రా నావైపు చూశారు. వాళ్లిద్దరూ మావాళ్లు. మా బ్యాంకు వాళ్లు. రూపాయి రేటు పడిపోకుండా నేనేదైనా చేస్తానని కమిటీ సభ్యులంతా అనుకున్నారట! మీటింగుల్లో కూర్చొని ఏం చేస్తాం.. రూపాయి పడిపోకుండా?! పడేది పడుతుంది. లేచేది లేస్తుంది. పడుతూ లేస్తూ ఉన్నదానిని తక్కువ పడి, తక్కువ లేస్తూ ఉండేలా చూడాలి గానీ, అరచేత్తో రూపాయిని బిగించి పట్టుకుంటే దేశం ఊపిరాడక చచ్చిపోతుంది. దేశం చచ్చిపోయాక, రూపీ వాల్యూ పెరిగి ఎవరికి లాభం? ‘‘అలాక్కాదు ఉర్జిత్. మన మీటింగ్ అయితే ముగిసింది కానీ, మీటింగ్ మీద దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు ముగిసిపోలేదు’’ అన్నారు మిసెస్ దువా! ‘‘నిజానికి ఉర్జిత్.. మీటింగ్ మీద దేశ ప్రజలు ఆశలు పెట్టుకోలేదు. మీ మీద పెట్టుకున్నారు’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర. ఆశల్దేముంది? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరి మీదైనా పెట్టుకోవచ్చు. ఆశ అప్పటికప్పుడు నెరవేరుతుందా.. మీటింగ్ అయ్యేలోపు! బ్యాంకు కాంపౌండ్‌లో మామిడి చెట్టు కింద అరుగులు ఉన్నాయి. వాటిల్లో ఒక అరుగు మీద కూర్చున్నాను. మావాళ్లిద్దరూ ఒక అరుగు మీద, గవర్నమెంటు వాళ్లు ముగ్గురూ ఒక అరుగు మీద కూర్చున్నారు. ‘‘మన ఆరుగురం ఇక్కడిలా కూర్చోవడం ఎవరైనా చూస్తే ఆరుబయట మళ్లీ ఒక మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతోందేమో అనుకుంటారు’’ అని నవ్వారు ప్రొఫెసర్ చేతన్. మామిడి చెట్టు పైకి చూశాను. మిగతావాళ్లూ చూశారు. ‘‘ఈ చెట్టు చూడండి.. మనం మీటింగ్‌కు వెళ్లే ముందు ఈ చెట్టుకు పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. మీటింగ్ నుంచి వచ్చాక కూడా పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే.. మీటింగ్ అయింది కదా అని మామిడి చెట్టు గానీ, మానిటరీ పాలసీ గానీ పూత తొడిగి, పిందెలు వేయవని. కాయలు కాసి, పండ్లు ఇవ్వవని’’ అన్నాను. ‘‘కానీ ఉర్జిత్.. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా.. రూపాయి మీరేం చెబితే అది వింటుంది. చెట్లు పండ్లివ్వకపోవచ్చు. చెట్లకు మీరు డబ్బులు కాయించగలరు. మా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పిల్లలకి ఈ విషయమే నేను చెబుతుంటాను’’ అన్నారు మిసెస్ దువా. ‘‘అవును ఉర్జిత్. మీరు పెద్ద పెద్దవాళ్లను ఇంప్రెస్ చేసినవారు. పీవీ నరసింహారావు, పి. చిదంబరం, రఘురామ్ రాజన్.. ఇలాంటి వాళ్లందర్నీ’’ అన్నాడు ప్రొఫెసర్ చేతన్. ‘‘పెద్ద ఎకనమిస్ట్ కదా మీరు, రూపాయికి ఏదైనా చేయవలసింది’’ అన్నారు మిసెస్ దువా మళ్లీ. రూపాయిని మించిన ఎకనమిస్ట్ ఎవరుంటారు? మిసెస్ దువాతో అదే మాట చెప్పి, అరుగు మీద నుంచి లేచాను. -
కుమారస్వామి (సీఎం) రాయని డైరీ
మూడు రోజులైంది! ఇంకా మూడు రోజులు తక్కువ ఐదేళ్లవ్వాలి. ఐదేళ్లూ అవుతుందా, మూణ్ణాళ్లకే ఐదేళ్లు అవుతుందా చూడాలి. రేపటికిగానీ తెలీదు. పాలిటిక్స్‌లో రేపు జరగాల్సిందంటూ ఏమీ ఉండదు. అయినా సరే, ఏ రోజుకారోజు.. రేపటికి గానీ తెలియని రోజే. ఐదేళ్లు కంప్లీట్ అవ్వాలని మనం అనుకుంటే అవుతుందా? కంప్లీట్ అవనివ్వాలని అనుకునేవాళ్లు అనుకోవాలి. ఇవేమీ రాకరాక వచ్చిన ఐదేళ్లు కాదు. వస్తాయి అనుకుని ఎదురుచూసిన ఐదేళ్లు కాదు. వస్తాయో రావో అనుకున్న ఐదేళ్లు కాదు. వస్తే రానియ్, పోతే పోనియ్ అనుకున్న ఐదేళ్లు కాదు. కర్ణాటక ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి, ఇచ్చివెళ్లిన ఐదేళ్లూ కాదు. కాంగ్రెస్ రాలేక, బీజేపీని రానివ్వలేక.. ‘తీస్కో కుమారస్వామీ’ అని నా చేతుల్లో పెట్టేసిన ఐదేళ్లు. ఈ ఐదేళ్ల మీద.. తీసుకున్నవాళ్లకు ఎంత హక్కు ఉంటుందో, ఇచ్చిన వాళ్లకూ అంతే హక్కు ఉంటుందని తీసుకున్నవాళ్లు మర్చి పోయినా, ఇచ్చినవాళ్లు గుర్తుపెట్టుకోకుండా ఉంటారా? గుర్తు చేయకుండా ఉంటారా?! కాంగ్రెస్ ఎప్పుడెవర్ని వరెస్ట్‌గా ట్రీట్ చేస్తుందో కాంగ్రెస్‌కే తెలీదు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు రాత్రి హిల్టన్ హోటల్లో డీకే శివకుమార్ దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ‘ఏమైంది శివా’ అని భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగాను. ‘హోమ్‌సిక్’ అన్నాడు. ‘అది కాదులే.. చెప్పు’ అన్నాను. మనిషి కదిలిపోయాడు! ‘ఇంత చేశానా! మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్నీ, మీ జేడీఎస్ ఎమ్మెల్యేల్నీ బీజేపీ కంట పడకుండా ఒక చోట కలిపి కూర్చోబెట్టానా! ఢిల్లీ వెళ్లి, నేనే ఇదంతా చేశాను అని చెబితే రాహుల్ నన్ను కనీసం కూర్చోమని కూడా అనలేదు! అనకపోతే అనకపోయాడు, ఎక్కడ కూర్చుంటావ్? క్యాబినెట్‌లోనా, పీసీసీ సీట్లోనా అనైనా అడగాలి కదా! అడగలేదు. నేనేమైనా సన్యాసం తీసుకోడానికి రాజకీయాల్లోకి వచ్చానా? లేకపోతే చెస్, ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చానా? నేనూ కాంగ్రెస్ వాడినే కదా. నాకూ ఆశలుంటాయి కదా? నాకూ హోమ్‌సిక్ ఉంటుంది కదా?’ అన్నాడు. ‘ఊరుకో శివా’ అన్నాను. అతడి ఎమోషన్‌కి నేను బరస్ట్ అయ్యేలా ఉన్నాను. నేనే రాహుల్‌ని అయ్యుంటే వెంటనే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంని చేసేయాలన్నంత ఆపేక్ష కలిగింది నాకు అతడి మీద. పోనీ శివకుమార్ మా పార్టీ వాడైనా బాగుండేది.. హోమ్ సిక్ లేకుండా హోమ్ మినిస్టర్‌గా పెట్టుకునేవాళ్లం. రేపు ఆర్ఆర్ నగర్ పోలింగ్. కాంగ్రెస్‌కి బలమైన సీటు. జేడీఎస్‌కి బలమైన క్యాండిడేటు. కాంగ్రెస్‌కి సపోర్ట్ ఇస్తే, బీజేపీకి సపోర్ట్ చేస్తాం అంటున్నారు కార్యకర్తలు. ‘ఏం చేద్దాం శివా’ అని అడిగాను. ‘ఏదో ఒకటి చేద్దాం’ అన్నాడు. రేపటికి ఐదు రోజులు అవుతుంది నేను ప్రమాణ స్వీకారం చేసి! - మాధవ్ శింగరాజు -
ట్రంప్ (అమెరికా ప్రెసిడెంట్)రాయని డైరీ
అమెరికాలోనే ఉన్నామా అనిపిస్తోంది! ప్రెసిడెంటుకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాత్రం ఎందుకిక్కడ? లేపేసి హైతీలోనో, ఆఫ్రికాలోనో పెట్టేస్తే సరిపోతుంది. ఐక్యరాజ్యసమితిని కూడా ఇక్కడి నుంచి లేపేయాలి. ఐక్యరాజ్యసమితిలా లేదది. ఐక్య ఆఫ్రికాసమితిలా బిహేవ్ చేస్తోంది. ఎవర్నీ ఒక మాట అనకుండా కూర్చోడానికైతే అమెరికాకు ఒక ప్రెసిడెంట్ ఎందుకు? ‘షిట్‌హోల్’.. అన్నానట! నాకైతే గుర్తు లేదు. అంతా ఫీలైపోతున్నారు. ‘షిట్‌హోల్’ అని నేను ఎప్పుడు అన్నానో, ఎందుకు అన్నానో, ఎవర్ని అన్నానో మరి! పనికిమాలిన విషయాల్ని మీడియా వెంటనే పట్టేసుకుంటుంది. అన్నవాళ్లకు గుర్తుండదు. అనిపించుకున్న వాళ్లకూ గుర్తుండదు. మీడియా గుర్తుపెట్టుకుంటుంది. సిక్ పీపుల్. వాషింగ్టన్ పోస్ట్‌ని కూడా ఇక్కణ్ణుంచి లేపేయాలి. అమెరికా శుభ్రమౌతుంది. ప్రజలు ఓట్లేస్తేనే కాదు, పేపర్లూ ఇష్టపడితేనే ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్ అవుతారు అనే చట్టం లేదు కాబట్టి ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతోంది అమెరికా. ‘షిట్‌హోల్’ అనడం ఏంటని వీళ్లందరి అబ్జెక్షన్! ‘దేశాలన్నీ కలిసి నిర్మించిందే అమెరికా..’ అని అంటున్నవాళ్లు.. భాషలన్నీ కలిసిందే అమెరికన్ లాంగ్వేజ్ అని ఎందుకు అనుకోరు? ‘షిట్‌హోల్’ అని అంటే మాత్రం.. షిట్హోలే ఎందుకు కనిపించాలి ఈ డర్టీ డెమోక్రాట్స్కి. నా ఉద్దేశంలోని పారిశుద్ధ్యం వీళ్లకు అర్థం కాదా? కడుపులో ఏదుంటే అదేగా వస్తుంది. మనిషన్నాక అదే రావాలి. ఇంకేదో రాకూడదు. కోపంలో కోపం రావడం, విసుగులో విసుగు రావడం నేచురల్. కోపంలో, విసుగులో కూడా నోట్లోంచి çపూలగుత్తుల పరిమళాలు రావడం అన్ నేచురల్. ఈ డెమోక్రాట్లు, మీడియాక్రాట్లు అంతా అన్ నేచురల్. బయటి వాళ్లను ఇంట్లోకి పిలిచి, ఇంట్లోని వాళ్లను బయటికి తరిమేసే రకం. అందర్నీ రానివ్వాలంటారు, అమెరికా డెవలప్ అవ్వాలంటారు! కుదురుతుందా? డెవలప్మెంట్ అంటే మన తో అవసరం ఉన్నవాళ్లు రావడం కాదు. మనకు అవసరం ఉన్నవాళ్లు రావడం. నేనన్నది ఈ మాటే. దాన్ని వదిలేసి, ‘షిట్‌హోల్’ని పట్టుకున్నారు. వీళ్లకూ తెలుసు.. అమెరికాకు అవసరమైన వాళ్లే అమెరికాకు కావాలని. ఆ మాట ధైర్యంగా చెప్పలేరు. ఒబామా చెప్పలేడు. వాషింగ్టన్ పోస్టూ చెప్పలేదు. ఒక కంట్రీని నేను షిట్‌హోల్ అనుకున్నప్పుడు షిట్‌హోల్ అనే అంటాను. ఎందుకనుకున్నానో అడగడం మానేసి, ఎందుకన్నావ్ అని అడుగుతున్నారు! ఇంకోలా ఎలా అనగలను? ‘దయచేసి నా షిట్‌హోల్ కంట్రీలోకి రాకండి’ అనైతే అనలేను కదా. అప్రియమైన మనుషుల్ని దూరంగా పెట్టడం కోసం ప్రియమైన పదాల్ని వెదుక్కునేంత టైమ్ ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్‌ని కాదు నేను. మాధవ్ శింగరాజు -
రాహుల్ గాంధీ రాయని డైరీ
హ్యాపీగా ఉంది. అమ్మే పక్కన ఉండి అన్నీ జరిపించింది. నాన్న ఉంటే నాన్నే అన్నీ జరిపించి ఉండేవారు. నాన్నమ్మ ఉంటే నానమ్మే అన్నీ జరిపించి ఉండేది. ఒకవేళ నానమ్మ చనిపోకుండా ఉన్నా, ఆవిడకు నూరేళ్లు పూర్తయ్యాయి కాబట్టి, నానమ్మే పక్కన ఉండి అన్నీ జరిపించడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుగా ఉండేది. స్పీచ్‌లో అమ్మ నానమ్మని గుర్తు చేసుకుంది. నాన్నని గుర్తు చేసుకుంది. నన్ను కూడా గుర్తు చేసుకుంది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో అమ్మ చెబుతూంటే అందరితో పాటు నాకూ వినాలనిపించింది. లైఫ్‌లో నేను చాలా దెబ్బలు తిన్నానని చెప్పింది. పాలిటిక్స్‌లో నాపై పర్సనల్ ఎటాక్స్ చాలా జరిగాయని చెప్పింది. అయినా కూడా నేను చాలా సహనంగా ఉన్నానని చెప్పింది. నేషన్‌ని చక్కగా లీడ్ చేస్తానని కూడా చెప్పింది. అమ్మ తన స్పీచ్‌లో నానమ్మని ఇందిరాజీ అంది. నాన్నని రాజీవ్‌జీ అంది. నన్ను కూడా రాహుల్జీ అంది! అమ్మ అలా నన్ను ‘జీ’ అంటూంటే నాకు నవ్వొచ్చింది. మనసులో చాలాసేపు నవ్వుకున్నాను. ముందు అమ్మ మాట్లాడింది. తర్వాత నేను మాట్లాడాను. అమ్మకన్నా ముందు మన్మోహన్జీ మాట్లాడారు. మన్మోహన్జీ మాట్లాడారు కానీ, మాట్లాడలేకపోయారు. మాటలు రావడం లేదన్నారు. అమ్మ నానమ్మను గుర్తు చేసుకున్నట్లే, మన్మోహన్జీ నానమ్మ వాళ్ల నాన్న.. నానమ్మకు రాసిన ఒక ఉత్తరాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంపార్టెంట్ అకేషన్స్‌లో ఎమోషన్స్ అదిమి పెట్టుకోవాలని నానమ్మకు వాళ్ల నాన్న ఆ ఉత్తరంలో రాశారట. ‘ఎమోషనల్ అవడానికి నన్నీవేళ మీరు అనుమతిస్తారా అని అడిగేందుకు మీ మన్నింపును కోరుతున్నాను’ అన్నారు మన్మోహన్జీ. ‘నన్ను ఎమోషనల్ అవ్వనివ్వండి’ అని ఆయన అడిగిన పద్ధతి కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది. మన్మోహన్జీ తన స్పీచ్‌లో ఇంకొకరిని కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన ఎవరో మన్మోహన్‌జీకి గుర్తులేనట్లుంది. ‘ఒక ప్రొఫెసర్’ అని మాత్రమే గుర్తు చేసుకున్నారు. భయపెట్టే రాజకీయాలు.. ఆశలు రేకెత్తించే రాజకీయాలకు చోటు లేకుండా చేస్తాయని ఆ ప్రొఫెసర్ అన్నాట్ట. ఆ మాట చెప్తూ మన్మోహన్జీ నావైపు చూశారు. ‘రాహుల్జీ.. ఆశలు రేకెత్తించే రాజకీయాల కోసం మీవైపు మేమంతా ఆశగా చూస్తున్నాం’ అన్నారు. ‘జీ’ అన్నట్లు చూశాను. సాయంత్రం పెద్దవాళ్లంతా ఇంటికి వచ్చారు. నా ఫ్రెండ్స్ సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య కూడా ఉన్నారు. ప్రియాంక అందరికీ టీలు అందిస్తోంది. మిస్టర్ వాద్రా అక్కడే ఉన్నారు. సచిన్, ఆదిత్యల మధ్య చేరి మిస్టర్ వాద్రా ఏదో అంటున్నారు! ముగ్గురూ నవ్వుతూ నావైపు చూస్తున్నారు. అమ్మ, నేను, మన్మోహన్జీ కూర్చొని ఉన్నాం. ఆజాద్, ఖార్గే వచ్చి నాకు పూలగుచ్ఛం ఇచ్చారు. ‘జరగవలసింది జరిపించారు. జరిపించాల్సిన దాన్ని కూడా జరగనివ్వండి సోనియాజీ’ అన్నారు. అమ్మ కూడా నవ్వుతూ నావైపు చూసింది. -మాధవ్ శింగరాజు -
ఎండు కొమ్మ
‘‘నవ్వితే మీరు బాగుంటారు!’’తలతిప్పి చూశాడు ఫ్రెడ్డీ. మామూలుగా చూడ్డం కాదు. విసురుగా చూశాడు.‘‘ఎవరు మీరు?’’ అన్నాడు.‘‘హారతి’’ అంది నవ్వుతూ.‘‘లుక్.. మీరు కూడా ఇదే ఆఫీస్‌లో, ఇదే సెక్షన్లో పని చేస్తుంటారన్నంత వరకే మీరు నాకు తెలుసు. మీరు కూడా నా గురించి అంతకుమించి తెలుసుకోవడాన్ని నేను ఇష్టపడను’’ అన్నాడు ఫ్రెడ్డీ వీలైనంతసౌమ్యంగా.చేతులతో హారతి తిప్పినట్లుగా.. ఫ్రెడ్డీ ముఖం చుట్టూ కళ్లు తిప్పింది హారతి.‘‘నిజం. నవ్వితే మీరు బాగుంటారు’’ అంది హారతి మళ్లీ.‘‘నాకు నవ్వే అలవాటు లేదు’’ అన్నాడు ఫ్రెడ్డీ కోపంగా.‘‘అందుకే అంటున్నా.. నవ్వితే బాగుంటారని’’.. అనేసి వెళ్లిపోయింది హారతి.‘‘దెయ్యం’’.తిట్టుకున్నాడు ఫ్రెడ్డీ. నిజానికి హారతి ఆ రోజు దేవతలా ఉంది. రోజూ చుడీదార్లో ఆఫీసుకు వచ్చే హారతి, ఆ రోజు చీరలో వచ్చింది. ఆఫీస్‌లో చేరి రెండు నెలలు అవుతున్నా ఫ్రెడ్డీని పలకరించే చొరవ చేయని హారతి ఆ రోజు అతడి డెస్క్ దగ్గరికి వెళ్లి మరీ పలకరించింది. చుడీదార్లోని హారతికి, చీరలోని హారతికీ ఉన్న తేడాను ఫీల్ అవలేదు ఫ్రెడ్డీ. అసలతడు చుడీదార్లో ఉన్న హారతినైనా ఏనాడైనా చూస్తేనే కదా!హారతి న్యూ రిక్రూటీ. ఫ్రెడ్డీ ఆల్రెడీ అక్కడ రెండేళ్ల నుంచీ ఎంప్లాయీ.ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఫ్రెడ్డీని, ఎప్పుడూ నవ్వుతూ ఉండే హారతిని చూస్తే ఆ సెక్షన్లో ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది. కొట్టుకుని చావడానికి ముచ్చటైన జంట అని.‘‘మేడమ్ పిలుస్తున్నారు’’.బాయ్ వచ్చి చెప్పాడు ఫ్రెడ్డీకి. మేడమ్ కోపంతో ఉన్నారని అర్థమైంది ఫ్రెడ్డీకి. జనరల్‌గా ఆమె ఇంటర్కమ్లోనే ఫ్రెడ్డీని పిలుస్తారు.డోర్ నెట్టుకుని కాబిన్లోకి వెళ్లి, మేడమ్ ఎదురుగా నిలబడ్డాడు.‘‘వాష్‌రూమ్‌తో అవసరం రాకుండానే అమ్మాయిలు పని మధ్యలో వాష్‌రూమ్‌కి ఎందుకు వెళ్లొస్తారో తెలుసా ఫ్రెడ్డీ’’ అని అడిగారు ఆవిడ.. శాంతంగా.ఫ్రెడ్డీ బ్లాంక్ ఫేస్ పెట్టాడు.‘‘నాకెలా తెలుస్తుంది మేడమ్!’’ అన్నాడు.‘‘చెప్తాను విను. నీలాంటి స్టుపిడ్స్ ఏడిపిస్తే.. ఏడ్చి ముఖం కడుక్కోడానికి వెళ్తారు’’ అన్నారు ఆవిడ. ఫ్రెడ్డీ ముఖంలోకి కోపం రక్తంలా చిమ్మింది. ‘‘ఏమంటున్నారు మేడమ్!’’ అన్నాడు.‘‘బిహేవ్ యువర్సెల్ఫ్ అంటున్నాను ఫ్రెడ్డీ. ఆడపిల్లలు ఉన్న చోట పనిచేస్తున్నావ్. వాళ్లేం దెయ్యాలు కాదు నిన్ను పీక్కు తినడానికి. ఇవాళ హారతిని ఏమన్నావ్.. చెప్పు’’ అన్నారు ఆవిడ.‘‘హారతి ఎవరు మేడమ్!’’ అన్నాడు ఫ్రెడ్డీ.నిజంగానే అప్పుడతడు హారతి ఎవరా అని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ హారతి ఎవరో అతడికి గుర్తొచ్చినా, హారతిని అతడేమన్నాడో అతడికి గుర్తుకొచ్చేది కాదు. గుర్తుపెట్టుకునేవీ, గుర్తు చేసుకునేవీ ఏవీ ఉండవు అతడి మాటల్లో.ఫ్రెడ్డీని తీక్షణంగా చూశారు ఆవిడ.‘‘హారతి ఎవరా? ఈ ఒక్క మాట చాలు ఫ్రెడ్డీ.. అమ్మాయిలంటే నీకెంత చులకన భావనో చెప్పడానికి. గో... గో అండ్ డూ యువర్ వర్క్’’ అన్నారు అసహనంగా.‘‘దెయ్యం’’.తిట్టుకున్నాడు ఫ్రెడ్డీ.. క్యాబిన్ బయటికి రాగానే.అతడు తిట్టుకున్నది మేడమ్‌ని కాదు. తనపై మేడమ్‌కి కంప్లయింట్ చేసిన అమ్మాయిని. అప్పుడైనా హారతిని అతడు ఓ అమ్మాయి అనుకున్నాడు తప్ప, హారతి అనే అమ్మాయి అనుకోలేదు. ఫ్రెడ్డీని కొత్తలో కొందరు రెడ్డీ అనేవాళ్లు. రెడ్డీ కాదు, ఫ్రెడ్డీ అని తెలిసి ‘అదేం పేరో?’ అనుకునే వారు.ఫ్రెడ్డీకి అమ్మానాన్న ఎవరో తెలీదు. ఊహ రాకముందే ఒక చర్చి ఫాదర్‌కు దత్తతగా వచ్చేశాడు. దత్తతకు ఇచ్చినవాళ్లు మళ్లీ చూడ్డానికి రాలేదు. చాలాకాలం పాటు అతడు.. పిల్లలందరికీ ఫాదర్ మాత్రమే ఉంటాడని, అది కూడా చర్చి ఫాదర్ మాత్రమే ఉంటాడని అనుకున్నాడు. కొద్దిగా వయసొచ్చాక అతడికి తెలిసిఆశ్చర్యపోయిందేమి టంటే.. పిల్లలకు మదర్ కూడా ఉంటుందని! మరి తనకెందుకు మదర్ లేదనే ఆలోచన రాకుండా పెంచాడు ఫాదర్.. ఫ్రెడ్డీని.ఫాదర్ దగ్గర ఫ్రెడ్డీ అనే కుక్కపిల్ల ఉండేది. అదంటే ఆయనకు వాత్సల్యం. అది చనిపోయిన రోజే వాడు దొరికాడు కాబట్టి ఫ్రెడ్డీ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పోయాక ఒక్కడే మిగిలాడు ఫ్రెడ్డీ. ఎవర్నీ దగ్గరకురానివ్వలేదు. ఎవరికీ దగ్గరగా వెళ్లలేదు. ఆ ఇంట్లో స్త్రీ లేదు కాబట్టి, అతడి జీవితంలోనూ స్త్రీ లేదు. మేడమ్ తనని ‘స్టుపిడ్’ అని తిట్టిన రోజు రాత్రి సెమెట్రీకి వెళ్లి చాలాసేపు ఫాదర్ సమాధి దగ్గర కూర్చొని వచ్చాడు ఫ్రెడ్డీ. మేడమ్ తిట్టడానికీ, అతడు సెమెట్రీకి వెళ్లడానికీ సంబంధం లేదు. వెళ్లానిపించింది, వెళ్లాడు. లేచి వచ్చేస్తుంటే, వెనుక నుంచి ఓ చెయ్యి అతడి భుజాన్ని తట్టింది! అది మగ మనిషి తట్టినట్లు అనిపించలేదు. ఆడ మనిషి తడితే ఎలా ఉంటుందో అతడికి తెలిసే అవకాశం లేదు. మరి ఎవరు తట్టినట్లు? వెనక్కి తిరిగి చూశాడు. చీకట్లో మసగ్గా ఏదో కనిపించింది. ఎండు కొమ్మకు ఊగుతున్న ఫొటో ఫ్రేమ్ అది. అదే తన భుజానికి తగిలినట్లుంది. దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. ఎవరిదో అమ్మాయి ఫొటో. ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడ్డం ఫ్రెడ్డీ జీవితంలో అదే మొదటిసారి. ఆమె కళ్లల్లో ఎంత కాంతి! చేతివేళ్లతో ఫొటోలోని ఆ అమ్మాయిని తాకాడు. ఒక అమ్మాయిని టచ్ చెయ్యడం జీవితంలో అదే మొదటిసారి ఫ్రెడ్డీకి. ఎందుకో తెలియదు.. అతడికి ఏడుపు రాబోయింది. ఇంటికి వచ్చేశాడు. ‘‘సారీ.. అబద్ధం చెప్పి, మేడమ్ చేత మిమ్మల్ని తిట్టించాను’’ అంది హారతి.‘‘మీరే కదా నిన్న నా దగ్గరికి వచ్చిన హారతి’’ అన్నాడు ఫ్రెడ్డీ, తలతిప్పి చూసి.ఆ అమ్మాయి ముఖం వెలిగిపోయింది. ఫ్రెడ్డీ నోటి నుంచి తన పేరు వినడం ఆమెకు బాగుంది.‘‘ఏం చెప్పారు మేడమ్‌కి నా మీద’’ అని అడిగాడు.‘‘నన్ను మీరు దెయ్యం అన్నారని చెప్పాను’’ అంది హారతి.నవ్వాడు ఫ్రెడ్డీ.‘‘నవ్వకపోయినా మీరు బాగుంటారు’’ అని, అతడి చేతిని తన చేత్తో చిన్నగా తాకి వెళ్లిపోయింది హారతి.‘‘దెయ్యం’’నవ్వుకున్నాడు ఫ్రెడ్డీ.రాత్రి తను తాకిన అమ్మాయిలా అనిపించింది, ఇప్పుడు తనని తాకి వెళ్లిన అమ్మాయి! - మాధవ్ శింగరాజు -
మెహబూబా రాయని డైరీ
అన్నీ ఆర్టికల్ 370 ప్రకారమే జరిగేటట్లయితే నాన్నగారు ఇంకో ఐదేళ్లు బతికి ఉండాల్సింది.. సీయెంగా టెర్మ్ పూర్తయ్యే వరకైనా! రాకపోకలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. రాజ్యాంగం చేతుల్లో ఉంటాయనుకుంటాం కానీ అక్కడా ఉండవు. దేవుడి రాజ్యాంగం దేవుడికి ఉంటుంది. బీజేపీ రాజ్యాంగం బీజేపీకి ఉంటుంది. కశ్మీర్ రాజ్యాంగం కశ్మీర్‌కు ఉంటుంది. ఇన్ని రాజ్యాంగాల మధ్య నాన్నగారు సతమతమై ఉంటారా?! విమానాల రాకపోకల వేళలను సూచించే పట్టికలో లేని విమానం ఒకటి శ్రీనగర్ వచ్చి వెళ్లిందని ఒమర్ ట్వీట్ చేశాడు. అతడు మాట్లాడుతున్నది రాం మాధవ్ ప్రత్యేక విమానంలో మా ఇంటికి వచ్చి వెళ్లడం గురించి. ‘ఆవిడగారు.. బీజేపీతో కలిసి కశ్మీర్లో గవర్నమెంటును ఎలా ఫామ్ చేస్తారు?’ అని ఎవరు కనిపిస్తే వాళ్లను పట్టుకుని అడిగేస్తున్నాడు ఒమర్. ‘అక్కడ జేఎన్‌యూలో మన శ్రీనగర్ ప్రొఫెసర్నీ, మన శ్రీనగర్ స్టూడెంట్స్‌నీ బీజేపీ వాళ్లు దేశద్రోహులుగా ట్రీట్ చేస్తుంటే ఇక్కడ మెహబూబా ముఫ్తీ మేడమ్.. బీజేపీ వేసిన కుర్చీలో కూర్చొని కశ్మీర్‌ని ఏలడానికి సిద్ధమయ్యారు’ అని ట్వీట్లు, మీట్లు పెట్టేస్తున్నాడు! నేను కూర్చున్నది లేదు. కూర్చుంటానని అన్నదీ లేదు. నా ఇంట్లో నేను కూర్చున్నా సీయెం సీట్లో కూర్చున్నట్లే అనిపిస్తున్నట్లుంది ఒమర్‌కి. పోగొట్టుకున్న సీటు కదా.. పాపం అలాగే అనిపిస్తుందేమో మరి. రాం మాధవ్ వచ్చీ రాగానే భారంగా ఒక శ్వాస తీసుకున్నాడు. ‘నాన్నగారు పోయిన బాధ నుంచి బయట పడడానికి ఈ నెలా పది రోజుల సమయం.. చాలినంత వ్యవధి కాకపోవచ్చు కానీ, రాజకీయంగా దీనినొక సుదీర్ఘమైన విరామంగానే మనం భావించాలి. ప్రజలు వినియోగించుకున్న ఓటు హక్కును ఇంకా ఎంతకాలమిలా గవర్నరు చేతిలో పెడతాం చెప్పండి?’ అన్నాడు. నిర్ణయానికి నేను తీసుకున్న వ్యవధి కన్నా, నన్నొక నిర్ణయం తీసుకోమని ఆయన చెప్పిన విధానమే లెంగ్త్ ఎక్కువగా ఉంది. ఆలోచించుకోనివ్వండి అన్నాను. ‘త్వరగా ఆలోచన ముగించండి’ అని ఫ్లైట్ ఎక్కేశాడు. నా ఆలోచనంతా బీజేపీ గురించే. నా పని నన్ను చేయనిస్తుందా? నేనూ ఒక చెయ్యేస్తానంటూ వస్తుందా? ఇంటికి వచ్చిన వాళ్లకు ‘టీ’ అయినా ఇవ్వనిస్తుందా? సెపరేటిస్టులతో మనకేంటి పిచ్చాపాటీ అంటుందా? ఆర్టికల్ త్రీ సెవన్టీని అవసరమైనప్పుడైనా చదవనిస్తుందా? ‘అదెందుకు పక్కన పడేయ్.. వి ఆర్ ఆల్ ఇండియన్స్’ అంటుందా? అన్నీ సందేహాలే! గోడపై నాన్నగారి ఫొటో వైపు చూశాను. మోదీజీ చేతుల మధ్య గాఢమైన ఆలింగనంలో చిరునవ్వు నవ్వుతూ ఉన్నారాయన. నాన్నగారు ప్రమాణ స్వీకారం చేశాక మోదీజీ ఆత్మీయంగా ఆయన్ని హత్తుకున్నప్పటి ఫొటో అది. కానీ నాన్నగారు చనిపోయినప్పుడు మోదీజీ రాలేదు! చూడ్డానికి రాలేదు. సానుభూతికీ రాలేదు. పరామర్శకూ రాలేదు. రాజకీయాలకు మాత్రమే విలువిచ్చే ఈ పెద్ద మనిషి.. రేపు నేను సీయెం అయ్యాక కశ్మీర్ ప్రజల మనోభావాలకు విలువను ఇవ్వనిస్తాడా?! మాధవ్ శింగరాజు