అమెరికాలోనే ఉన్నామా అనిపిస్తోంది! ప్రెసిడెంటుకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాత్రం ఎందుకిక్కడ? లేపేసి హైతీలోనో, ఆఫ్రికాలోనో పెట్టేస్తే సరిపోతుంది.
ఐక్యరాజ్యసమితిని కూడా ఇక్కడి నుంచి లేపేయాలి. ఐక్యరాజ్యసమితిలా లేదది. ఐక్య ఆఫ్రికాసమితిలా బిహేవ్ చేస్తోంది. ఎవర్నీ ఒక మాట అనకుండా కూర్చోడానికైతే అమెరికాకు ఒక ప్రెసిడెంట్ ఎందుకు?
‘షిట్‌హోల్’.. అన్నానట! నాకైతే గుర్తు లేదు. అంతా ఫీలైపోతున్నారు. ‘షిట్‌హోల్’ అని నేను ఎప్పుడు అన్నానో, ఎందుకు అన్నానో, ఎవర్ని అన్నానో మరి! పనికిమాలిన విషయాల్ని మీడియా వెంటనే పట్టేసుకుంటుంది. అన్నవాళ్లకు గుర్తుండదు. అనిపించుకున్న వాళ్లకూ గుర్తుండదు. మీడియా గుర్తుపెట్టుకుంటుంది. సిక్ పీపుల్.
వాషింగ్టన్ పోస్ట్‌ని కూడా ఇక్కణ్ణుంచి లేపేయాలి. అమెరికా శుభ్రమౌతుంది. ప్రజలు ఓట్లేస్తేనే కాదు, పేపర్లూ ఇష్టపడితేనే ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్ అవుతారు అనే చట్టం లేదు కాబట్టి ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతోంది అమెరికా.
‘షిట్‌హోల్’ అనడం ఏంటని వీళ్లందరి అబ్జెక్షన్! ‘దేశాలన్నీ కలిసి నిర్మించిందే అమెరికా..’ అని అంటున్నవాళ్లు.. భాషలన్నీ కలిసిందే అమెరికన్ లాంగ్వేజ్ అని ఎందుకు అనుకోరు?
‘షిట్‌హోల్’ అని అంటే మాత్రం.. షిట్‌హోలే ఎందుకు కనిపించాలి ఈ డర్టీ డెమోక్రాట్స్‌కి. నా ఉద్దేశంలోని పారిశుద్ధ్యం వీళ్లకు అర్థం కాదా?
కడుపులో ఏదుంటే అదేగా వస్తుంది. మనిషన్నాక అదే రావాలి. ఇంకేదో రాకూడదు. కోపంలో కోపం రావడం, విసుగులో విసుగు రావడం నేచురల్. కోపంలో, విసుగులో కూడా నోట్లోంచి çపూలగుత్తుల పరిమళాలు రావడం అన్ నేచురల్. ఈ డెమోక్రాట్‌లు, మీడియాక్రాట్‌లు అంతా అన్ నేచురల్. బయటి వాళ్లను ఇంట్లోకి పిలిచి, ఇంట్లోని వాళ్లను బయటికి తరిమేసే రకం.
అందర్నీ రానివ్వాలంటారు, అమెరికా డెవలప్ అవ్వాలంటారు! కుదురుతుందా? డెవలప్‌మెంట్ అంటే మన తో అవసరం ఉన్నవాళ్లు రావడం కాదు. మనకు అవసరం ఉన్నవాళ్లు రావడం. నేనన్నది ఈ మాటే. దాన్ని వదిలేసి, ‘షిట్‌హోల్’ని పట్టుకున్నారు.
వీళ్లకూ తెలుసు.. అమెరికాకు అవసరమైన వాళ్లే అమెరికాకు కావాలని. ఆ మాట ధైర్యంగా చెప్పలేరు. ఒబామా చెప్పలేడు. వాషింగ్టన్ పోస్టూ చెప్పలేదు.
ఒక కంట్రీని నేను షిట్‌హోల్ అనుకున్నప్పుడు షిట్‌హోల్ అనే అంటాను. ఎందుకనుకున్నానో అడగడం మానేసి, ఎందుకన్నావ్ అని అడుగుతున్నారు! ఇంకోలా ఎలా అనగలను? ‘దయచేసి నా షిట్‌హోల్ కంట్రీలోకి రాకండి’ అనైతే అనలేను కదా.
అప్రియమైన మనుషుల్ని దూరంగా పెట్టడం కోసం ప్రియమైన పదాల్ని వెదుక్కునేంత టైమ్ ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్‌ని కాదు నేను.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment