మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్లం వెళుతున్నాం. ఎవరి ఇళ్లకు వాళ్లం అని అనుకున్నానే కానీ, వెనక్కి తిరిగి చూస్తే మిగతా ఐదుగురూ నా వెనుకే వస్తున్నారు! మీటింగ్ అయ్యాక మా ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుందని వాళ్లకు చెప్పినట్లుగా నాకేమీ గుర్తుకు లేదు.
నవ్వాను. నవ్వారు.
‘‘మీరేదైనా చేస్తారు అనుకున్నాను’’ అన్నారు మిసెస్ పామీ దువా. ‘‘అవునవును.. మీరేదైనా చేస్తారని మేమూ అనుకున్నాం’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర, ప్రొఫెసర్ చేతన్! దువా, రవీంద్ర, చేతన్.. మా బ్యాంకు వాళ్లు కాదు. మానిటరీ పాలసీ మెంబర్లుగా గవర్నమెంటు పంపినవాళ్లు.
వాళ్లు అలా అనగానే ఆచార్య, మైఖేల్ పాత్రా నావైపు చూశారు. వాళ్లిద్దరూ మావాళ్లు. మా బ్యాంకు వాళ్లు.
రూపాయి రేటు పడిపోకుండా నేనేదైనా చేస్తానని కమిటీ సభ్యులంతా అనుకున్నారట! మీటింగుల్లో కూర్చొని ఏం చేస్తాం.. రూపాయి పడిపోకుండా?! పడేది పడుతుంది. లేచేది లేస్తుంది. పడుతూ లేస్తూ ఉన్నదానిని తక్కువ పడి, తక్కువ లేస్తూ ఉండేలా చూడాలి గానీ, అరచేత్తో రూపాయిని బిగించి పట్టుకుంటే దేశం ఊపిరాడక చచ్చిపోతుంది. దేశం చచ్చిపోయాక, రూపీ వాల్యూ పెరిగి ఎవరికి లాభం?
‘‘అలాక్కాదు ఉర్జిత్. మన మీటింగ్ అయితే ముగిసింది కానీ, మీటింగ్ మీద దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు ముగిసిపోలేదు’’ అన్నారు మిసెస్ దువా!
‘‘నిజానికి ఉర్జిత్.. మీటింగ్ మీద దేశ ప్రజలు ఆశలు పెట్టుకోలేదు. మీ మీద పెట్టుకున్నారు’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర.
ఆశల్దేముంది? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరి మీదైనా పెట్టుకోవచ్చు. ఆశ అప్పటికప్పుడు నెరవేరుతుందా.. మీటింగ్ అయ్యేలోపు!
బ్యాంకు కాంపౌండ్‌లో మామిడి చెట్టు కింద అరుగులు ఉన్నాయి. వాటిల్లో ఒక అరుగు మీద కూర్చున్నాను. మావాళ్లిద్దరూ ఒక అరుగు మీద, గవర్నమెంటు వాళ్లు ముగ్గురూ ఒక అరుగు మీద కూర్చున్నారు.
‘‘మన ఆరుగురం ఇక్కడిలా కూర్చోవడం ఎవరైనా చూస్తే ఆరుబయట మళ్లీ ఒక మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతోందేమో అనుకుంటారు’’ అని నవ్వారు ప్రొఫెసర్ చేతన్.
మామిడి చెట్టు పైకి చూశాను. మిగతావాళ్లూ చూశారు.
‘‘ఈ చెట్టు చూడండి.. మనం మీటింగ్‌కు వెళ్లే ముందు ఈ చెట్టుకు పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. మీటింగ్ నుంచి వచ్చాక కూడా పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే.. మీటింగ్ అయింది కదా అని మామిడి చెట్టు గానీ, మానిటరీ పాలసీ గానీ పూత తొడిగి, పిందెలు వేయవని. కాయలు కాసి, పండ్లు ఇవ్వవని’’ అన్నాను.
‘‘కానీ ఉర్జిత్.. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా.. రూపాయి మీరేం చెబితే అది వింటుంది. చెట్లు పండ్లివ్వకపోవచ్చు. చెట్లకు మీరు డబ్బులు కాయించగలరు. మా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పిల్లలకి ఈ విషయమే నేను చెబుతుంటాను’’ అన్నారు మిసెస్ దువా.
‘‘అవును ఉర్జిత్. మీరు పెద్ద పెద్దవాళ్లను ఇంప్రెస్ చేసినవారు. పీవీ నరసింహారావు, పి. చిదంబరం, రఘురామ్ రాజన్.. ఇలాంటి వాళ్లందర్నీ’’ అన్నాడు ప్రొఫెసర్ చేతన్.
‘‘పెద్ద ఎకనమిస్ట్ కదా మీరు, రూపాయికి ఏదైనా చేయవలసింది’’ అన్నారు మిసెస్ దువా మళ్లీ.
రూపాయిని మించిన ఎకనమిస్ట్ ఎవరుంటారు? మిసెస్ దువాతో అదే మాట చెప్పి, అరుగు మీద నుంచి లేచాను.
Published Sun, Oct 7 2018 12:32 AM | Last Updated on Sun, Oct 7 2018 12:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment