ఫ్లయిట్‌లో ఉన్నాను. మరికొన్ని గంటల్లో ఇండియాలో ఉంటాను. ఎయిర్ హోస్టెస్ వచ్చింది.. ‘‘ఏమైనా తీసుకుంటారా?’’ అని.
‘‘ఏమైనా తీసుకోవచ్చా’’ అని నవ్వుతూ అడిగాను. ‘‘తీసుకోవచ్చు కానీ, మీకోసం ఏవైతే సిద్ధం చేయబడి ఉంటాయో వాటిలోంచి మాత్రమే మీరు ఏదైనా తీసుకోవలసి ఉంటుంది’’ అని తనూ నవ్వింది. అమ్మాయిలు తెలివిగా ఉంటున్నారు. తెలివి లేని అమ్మాయిలే ‘మీటూ’ అంటూ పాతవన్నీ తవ్వుకుని తలస్నానం చేస్తున్నారు.
ఆఫ్రికాలో ఫ్లయిట్ ఎక్కేముందు నాకు తెలియని యంగ్ రిపోర్టర్ ఒకతను ఫోన్ చేశాడు. ‘‘అక్బర్‌జీ.. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదా?’’ అని అతడు పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. ‘‘ఏయ్.. ఆపు’’ అన్నాను. అతడు ఆపలేదు.
‘‘ఏమైందో ఏడ్వకుండా చెప్పు’’ అన్నాను. ‘‘అక్బర్‌జీ ఈ దేశంలో మగవాడికి..’’ అని మళ్లీ మొదలుపెట్టాడు.
‘‘నా నంబర్ నీకెలా దొరికింది’’ అని కసిరాను. ‘‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నుంచి సంపాదించాను అక్బర్‌జీ’’ అన్నాడు.
‘‘ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కదా నువ్వు నా నంబర్ సంపాదించవలసింది. ఇప్పుడు నేను ఏ పేపర్‌లో ఉన్నానని ఎడిటర్స్ గిల్డ్‌కి వెళ్లి అడిగావ్?’’ అని కోప్పడ్డాను.
‘‘ముందు ఎక్స్‌టర్నల్ మినిస్ట్రీకే వెళ్లాను అక్బర్‌జీ. స్మృతీజీని అడిగాను మీ నంబర్ కావాలని. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు’’ అని చెప్పాడు!
నాకర్థమైంది. స్మృతీ ఇరానీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మోదీజీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడే ఆలోచించే పని పెట్టుకోలేదు. ‘అక్బర్‌ని మోదీ మోసుకొచ్చాడు కాబట్టి, మోదీనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని అంటున్నాడు.
‘‘సర్లే.. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు.. ఫ్లయిట్ టైమ్ అవుతోంది’’ అన్నాను. ‘‘ఇక్కడ నా టైమ్ అయిపోయేలా ఉంది అక్బర్‌జీ’’ అన్నాడు! మళ్లీ ఏడుపు. ఆఫీస్‌లో తన పక్కన కూర్చునే అమ్మాయిని టచ్ చేశాడట.
ఆ అమ్మాయి ‘మీటూ’ అనేసిందట! ‘‘ఉద్యోగం పోయేలా ఉందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్‌జీ’’ అన్నాడు. ‘‘కేసు ఫైల్ అయిందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్‌జీ’’ అన్నాడు. ‘‘మరెందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాను.
‘‘ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో నేను తనను టచ్ చేశానని రాసింది అక్బర్‌జీ’’ అన్నాడు.
‘‘అందులో అంతగా ఏడవాల్సిందే ముందీ!’’ అన్నాను. ‘‘పరువు పోయేలా ఉంది అక్బర్‌జీ’’ అని మళ్లీ స్టార్ట్ చేశాడు.
‘‘ఊరుకోవయ్యా బాబూ.. పరువు పోయేలా ఉంటుంది కానీ అదెక్కడికీ పోదు. ఇంక ఆ పిల్లని టచ్ చెయ్యడం మాని.. నీ పని నువ్వు చూస్కో’’ అని చెప్పాను.
‘‘టచ్ చెయ్యకుండా ఉండలేకపోతున్నాను అక్బర్‌జీ’’ అన్నాడు. ‘‘సీటు మార్పించుకో’’ అని చెప్పాను. ‘‘గుండె ఆగిపోతుందేమో అక్బర్‌జీ’’ అన్నాడు. కోపం ఆపుకోలేకపోయాను.
‘‘నువ్వన్నది నిజమే. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదు. గుండె ఆగి చచ్చిపో’’ అన్నాను.
ఢిల్లీలో ఫ్లయిట్ దిగగానే ఓ మహిళా రిపోర్టర్ ఉత్సాహంగా నా మీదకు తోసుకొచ్చింది.
‘‘సార్.. ప్రియ, గజాలా, సబా, షట్ప, సుమ, సుపర్ణ, ప్రేరణ.. లేటెస్టుగా మజ్లీ! వీళ్లందర్నీ మీరు.. మీడియాలో ఉన్నప్పుడు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరెప్పుడు రిజైన్ చెయ్యబోతున్నారు సార్?’’ అని అడిగింది.
నాకు ఆ కుర్రాడు గుర్తొచ్చాడు. వాడి ఏడుపు గుర్తొచ్చింది. పాపం.. పదేళ్ల తర్వాత చిక్కవలసినవాడు.. బిగినింగ్‌లోనే బుక్కైపోయాడు.
-మాధవ్ శింగరాజు
Published Sun, Oct 14 2018 1:07 AM | Last Updated on Sun, Oct 14 2018 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment