మాధవ్ శింగరాజు
జీవితంలో ప్రతిదీ అదృష్టమే. జీవితంలోని వేడి, జీవితంలోని చల్లదనం కూడా! పామ్ బీచ్ ‘మరలాగో’ రెసిడెన్స్‌లో ఉన్నాం నేను, మెలానియా. అద్దాల్లోంచి బయట ఫ్లోరిడా నగరం అస్పష్టంగానైనా కనిపించటం లేదు! దట్టంగా పొగమంచు. లోపల మా శరీర ఉష్ణోగ్రతలకు తగ్గట్లుగా మా వేర్వేరు గదుల గోడలు వాటికవి తమ సెంటీగ్రేడ్‌ల హెచ్చుతగ్గులను అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా అలా ఉండకూడదా, ఒకరి కోసం ఒకరు?!
‘‘రేపు ఈ సమయానికి మనం వైట్ హౌస్ గోడల మధ్యకు మారి ఉంటాం...’ అన్నాను, మెలానియాతో మాట కలుపుతూ. ఆమెకు వైట్ హౌస్ నచ్చదు. ‘‘ఒకవేళ నువ్వు అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనా నేను మాత్రం ఇక్కడే పామ్ బీచ్‌లోనో, లేదంటే న్యూయార్క్ సిటీలోనో ఉండిపోతాను...’’ అని ఎన్నికలకు ముందే ఆమె చెప్పేసింది, వైట్ హౌస్ ఆమెకు నచ్చకపోవటానికి కారణం... నేను ఆమెకు నచ్చకపోవడం! నచ్చని మనిషితో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు, ఉన్నది స్వర్గమే అయినా అది నరకంలా అనిపిస్తుంది.
మెలానియా తనకు నచ్చినట్లు తను ఉంటుంది. ఆమె ‘ఎస్’లు, ఆమె ‘నో’ లు ఆమెకు ఉన్నాయి. ఆమె నా ఎలక్షన్ ర్యాలీలకు రాలేదు. నేను గెలిచాక, ఫ్యామిలీ గ్రూప్ ఫొటోకి రాలేదు. ఇప్పుడైనా వైట్ హౌస్‌కి వస్తాను అనటం లేదు. వస్తుంటాను అంటోంది! అదృష్టం ఏమిటంటే – ‘రేపు నేను రావటం లేదు’ అని ఇప్పటివరకైతే తను అనలేదు.
మెలానియా తిరిగి తన గదిలోకి వెళ్లిపోయింది. నాతో ఏం చెప్పాలని వచ్చిందో, ఏం చెప్పకూడదని అనుకుందో ఆమె చెబితే తప్ప నాకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు.
‘‘గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రెసిడెంట్...’’అంటూ జేడీ వాన్స్ వచ్చి కూర్చున్నాడు. అతడు మనిషిలా లేడు. మంచు ముద్దలా ఉన్నాడు! అతడి వాలకం చూస్తుంటే బయటి ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోయి ఉంటాయని అనిపిస్తోంది.
వాన్స్ నా వైస్ ప్రెసిడెంట్. క్యాపిటల్ హిల్‌లో రేపు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. నా జీవితానికి పట్టిన మరొక అదృష్టం అతడు.
వాన్స్ నన్ను ‘ఇడియట్’ అన్నాడు. ‘నేనెప్పటికీ ట్రంప్‌ను ఇష్టపడను’ అన్నాడు.‘ట్రంప్ ఒక చెత్త వెధవా లేక అమెరికన్ హిట్లరా అన్నది తేల్చుకోలేకపోతున్నాను’ అన్నాడు. చివరికి నా రన్నింగ్ మేట్‌గా వచ్చేశాడు.
అభిప్రాయాలు మార్చుకునే వాళ్లే నిజమైన స్నేహితులు. జీవితమంతా ఒకే అభిప్రాయంతో ఉండేవారు భార్యలు లేదా శత్రువులు. ‘‘చెప్పండి మిస్టర్ వైస్ ప్రెసిడెంట్! వెచ్చగా ఏమైనా సేవిస్తారా?’’ అని అడిగాను.
‘‘వెచ్చగా కాదు, వేడిగా ఏమైనా తెప్పించండి ప్లీజ్...’’ అన్నాడు వాన్స్, అరిచేతుల్ని ఒరిపిడిగా రుద్దుకుని, చెవులపై బిగింపుగా అద్దుకుంటూ. లోపల పింగాణీ కప్పుల చప్పుడవుతోంది! మెలానియా సూప్‌ను సిద్ధం చేయించే పనిలో పడినట్లుంది.
‘‘మిస్టర్ ప్రెసిడెంట్! నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్ట్ చూశారా? జనవరి 20న చలి, మంచు, ఈదురు గాలులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు కనుక 7 డిగ్రీల కంటే కిందికి పడిపోతే, రోనాల్డ్ రీగన్ తర్వాత మీదే కోల్డెస్ట్ ఇనాగరే షన్ అవుతుంది...’’ అని నవ్వారు వాన్స్. 2016 ఇనాగరేషన్‌లో 48 డిగ్రీల వేడిలో చెమటలు తుడుచుకోవటం గుర్తొచ్చి నేనూ నవ్వాను.
‘‘మేడమ్ ఫస్ట్ లేడీకి నా వైఫ్ ఉష తన బెస్ట్ విషెస్ చెప్పమంది...’’ అంటూ, తను తెచ్చిన పూలబొకేను టేబుల్ మీద ఉంచాడు వాన్స్.
మెలానియాకు ‘ఫస్ట్ లేడీ’ అనిపించుకోవటం ఇష్టం లేదు. ఫస్ట్ లేడీ అనిపించుకోవాలని తనకు అనిపించేలా నేను ఏనాడూ బిహేవ్ చేయలేదని ఆమె కంప్లైంట్! కంప్లైంట్‌లు కూడా జీవితం ప్రసాదించే అదృష్టాలే. అయితే అవి పరీక్షించుకోవలసిన అదృష్టాలు కావచ్చు!
Comments
Please login to add a commentAdd a comment