‘‘నవ్వితే మీరు బాగుంటారు!’’తలతిప్పి చూశాడు ఫ్రెడ్డీ. మామూలుగా చూడ్డం కాదు. విసురుగా చూశాడు.‘‘ఎవరు మీరు?’’ అన్నాడు.‘‘హారతి’’ అంది నవ్వుతూ.‘‘లుక్.. మీరు కూడా ఇదే ఆఫీస్‌లో, ఇదే సెక్షన్‌లో పని చేస్తుంటారన్నంత వరకే మీరు నాకు తెలుసు. మీరు కూడా నా గురించి అంతకుమించి తెలుసుకోవడాన్ని నేను ఇష్టపడను’’ అన్నాడు ఫ్రెడ్డీ వీలైనంతసౌమ్యంగా.చేతులతో హారతి తిప్పినట్లుగా.. ఫ్రెడ్డీ ముఖం చుట్టూ కళ్లు తిప్పింది హారతి.‘‘నిజం. నవ్వితే మీరు బాగుంటారు’’ అంది హారతి మళ్లీ.‘‘నాకు నవ్వే అలవాటు లేదు’’ అన్నాడు ఫ్రెడ్డీ కోపంగా.‘‘అందుకే అంటున్నా.. నవ్వితే బాగుంటారని’’.. అనేసి వెళ్లిపోయింది హారతి.‘‘దెయ్యం’’.తిట్టుకున్నాడు ఫ్రెడ్డీ.
నిజానికి హారతి ఆ రోజు దేవతలా ఉంది. రోజూ చుడీదార్‌లో ఆఫీసుకు వచ్చే హారతి, ఆ రోజు చీరలో వచ్చింది. ఆఫీస్‌లో చేరి రెండు నెలలు అవుతున్నా ఫ్రెడ్డీని పలకరించే చొరవ చేయని హారతి ఆ రోజు అతడి డెస్క్ దగ్గరికి వెళ్లి మరీ పలకరించింది. చుడీదార్‌లోని హారతికి, చీరలోని హారతికీ ఉన్న తేడాను ఫీల్ అవలేదు ఫ్రెడ్డీ. అసలతడు చుడీదార్‌లో ఉన్న హారతినైనా ఏనాడైనా చూస్తేనే కదా!హారతి న్యూ రిక్రూటీ. ఫ్రెడ్డీ ఆల్రెడీ అక్కడ రెండేళ్ల నుంచీ ఎంప్లాయీ.ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఫ్రెడ్డీని, ఎప్పుడూ నవ్వుతూ ఉండే హారతిని చూస్తే ఆ సెక్షన్‌లో ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది. కొట్టుకుని చావడానికి ముచ్చటైన జంట అని.‘‘మేడమ్ పిలుస్తున్నారు’’.బాయ్ వచ్చి చెప్పాడు ఫ్రెడ్డీకి. మేడమ్ కోపంతో ఉన్నారని అర్థమైంది ఫ్రెడ్డీకి. జనరల్‌గా ఆమె ఇంటర్‌కమ్‌లోనే ఫ్రెడ్డీని పిలుస్తారు.డోర్ నెట్టుకుని కాబిన్‌లోకి వెళ్లి, మేడమ్ ఎదురుగా నిలబడ్డాడు.‘‘వాష్‌రూమ్‌తో అవసరం రాకుండానే అమ్మాయిలు పని మధ్యలో వాష్‌రూమ్‌కి ఎందుకు వెళ్లొస్తారో తెలుసా ఫ్రెడ్డీ’’ అని అడిగారు ఆవిడ.. శాంతంగా.ఫ్రెడ్డీ బ్లాంక్ ఫేస్ పెట్టాడు.‘‘నాకెలా తెలుస్తుంది మేడమ్!’’ అన్నాడు.‘‘చెప్తాను విను. నీలాంటి స్టుపిడ్స్ ఏడిపిస్తే.. ఏడ్చి ముఖం కడుక్కోడానికి వెళ్తారు’’ అన్నారు ఆవిడ. ఫ్రెడ్డీ ముఖంలోకి కోపం రక్తంలా చిమ్మింది.
‘‘ఏమంటున్నారు మేడమ్!’’ అన్నాడు.‘‘బిహేవ్ యువర్‌సెల్ఫ్ అంటున్నాను ఫ్రెడ్డీ. ఆడపిల్లలు ఉన్న చోట పనిచేస్తున్నావ్. వాళ్లేం దెయ్యాలు కాదు నిన్ను పీక్కు తినడానికి. ఇవాళ హారతిని ఏమన్నావ్.. చెప్పు’’ అన్నారు ఆవిడ.‘‘హారతి ఎవరు మేడమ్!’’ అన్నాడు ఫ్రెడ్డీ.నిజంగానే అప్పుడతడు హారతి ఎవరా అని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ హారతి ఎవరో అతడికి గుర్తొచ్చినా, హారతిని అతడేమన్నాడో అతడికి గుర్తుకొచ్చేది కాదు. గుర్తుపెట్టుకునేవీ, గుర్తు చేసుకునేవీ ఏవీ ఉండవు అతడి మాటల్లో.ఫ్రెడ్డీని తీక్షణంగా చూశారు ఆవిడ.‘‘హారతి ఎవరా? ఈ ఒక్క మాట చాలు ఫ్రెడ్డీ.. అమ్మాయిలంటే నీకెంత చులకన భావనో చెప్పడానికి. గో... గో అండ్ డూ యువర్ వర్క్’’ అన్నారు అసహనంగా.‘‘దెయ్యం’’.తిట్టుకున్నాడు ఫ్రెడ్డీ.. క్యాబిన్ బయటికి రాగానే.అతడు తిట్టుకున్నది మేడమ్‌ని కాదు. తనపై మేడమ్‌కి కంప్లయింట్ చేసిన అమ్మాయిని. అప్పుడైనా హారతిని అతడు ఓ అమ్మాయి అనుకున్నాడు తప్ప, హారతి అనే అమ్మాయి అనుకోలేదు.
ఫ్రెడ్డీని కొత్తలో కొందరు రెడ్డీ అనేవాళ్లు. రెడ్డీ కాదు, ఫ్రెడ్డీ అని తెలిసి ‘అదేం పేరో?’ అనుకునే వారు.ఫ్రెడ్డీకి అమ్మానాన్న ఎవరో తెలీదు. ఊహ రాకముందే ఒక చర్చి ఫాదర్‌కు దత్తతగా వచ్చేశాడు. దత్తతకు ఇచ్చినవాళ్లు మళ్లీ చూడ్డానికి రాలేదు. చాలాకాలం పాటు అతడు.. పిల్లలందరికీ ఫాదర్ మాత్రమే ఉంటాడని, అది కూడా చర్చి ఫాదర్ మాత్రమే ఉంటాడని అనుకున్నాడు. కొద్దిగా వయసొచ్చాక అతడికి తెలిసిఆశ్చర్యపోయిందేమి టంటే.. పిల్లలకు మదర్ కూడా ఉంటుందని! మరి తనకెందుకు మదర్ లేదనే ఆలోచన రాకుండా పెంచాడు ఫాదర్.. ఫ్రెడ్డీని.ఫాదర్ దగ్గర ఫ్రెడ్డీ అనే కుక్కపిల్ల ఉండేది. అదంటే ఆయనకు వాత్సల్యం. అది చనిపోయిన రోజే వాడు దొరికాడు కాబట్టి ఫ్రెడ్డీ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పోయాక ఒక్కడే మిగిలాడు ఫ్రెడ్డీ. ఎవర్నీ దగ్గరకురానివ్వలేదు. ఎవరికీ దగ్గరగా వెళ్లలేదు. ఆ ఇంట్లో స్త్రీ లేదు కాబట్టి, అతడి జీవితంలోనూ స్త్రీ లేదు.
మేడమ్ తనని ‘స్టుపిడ్’ అని తిట్టిన రోజు రాత్రి సెమెట్రీకి వెళ్లి చాలాసేపు ఫాదర్ సమాధి దగ్గర కూర్చొని వచ్చాడు ఫ్రెడ్డీ. మేడమ్ తిట్టడానికీ, అతడు సెమెట్రీకి వెళ్లడానికీ సంబంధం లేదు. వెళ్లానిపించింది, వెళ్లాడు.
లేచి వచ్చేస్తుంటే, వెనుక నుంచి ఓ చెయ్యి అతడి భుజాన్ని తట్టింది! అది మగ మనిషి తట్టినట్లు అనిపించలేదు. ఆడ మనిషి తడితే ఎలా ఉంటుందో అతడికి తెలిసే అవకాశం లేదు. మరి ఎవరు తట్టినట్లు?
వెనక్కి తిరిగి చూశాడు. చీకట్లో మసగ్గా ఏదో కనిపించింది. ఎండు కొమ్మకు ఊగుతున్న ఫొటో ఫ్రేమ్ అది. అదే తన భుజానికి తగిలినట్లుంది. దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. ఎవరిదో అమ్మాయి ఫొటో. ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడ్డం ఫ్రెడ్డీ జీవితంలో అదే మొదటిసారి. ఆమె కళ్లల్లో ఎంత కాంతి! చేతివేళ్లతో ఫొటోలోని ఆ అమ్మాయిని తాకాడు. ఒక అమ్మాయిని టచ్ చెయ్యడం జీవితంలో అదే మొదటిసారి ఫ్రెడ్డీకి. ఎందుకో తెలియదు.. అతడికి ఏడుపు రాబోయింది. ఇంటికి వచ్చేశాడు. ‘‘సారీ.. అబద్ధం చెప్పి, మేడమ్ చేత మిమ్మల్ని తిట్టించాను’’ అంది హారతి.‘‘మీరే కదా నిన్న నా దగ్గరికి వచ్చిన హారతి’’ అన్నాడు ఫ్రెడ్డీ, తలతిప్పి చూసి.ఆ అమ్మాయి ముఖం వెలిగిపోయింది. ఫ్రెడ్డీ నోటి నుంచి తన పేరు వినడం ఆమెకు బాగుంది.‘‘ఏం చెప్పారు మేడమ్‌కి నా మీద’’ అని అడిగాడు.‘‘నన్ను మీరు దెయ్యం అన్నారని చెప్పాను’’ అంది హారతి.నవ్వాడు ఫ్రెడ్డీ.‘‘నవ్వకపోయినా మీరు బాగుంటారు’’ అని, అతడి చేతిని తన చేత్తో చిన్నగా తాకి వెళ్లిపోయింది హారతి.‘‘దెయ్యం’’నవ్వుకున్నాడు ఫ్రెడ్డీ.రాత్రి తను తాకిన అమ్మాయిలా అనిపించింది, ఇప్పుడు తనని తాకి వెళ్లిన అమ్మాయి!
- మాధవ్ శింగరాజు
ఎండు కొమ్మ
Published Sun, Nov 19 2017 2:38 AM | Last Updated on Sun, Nov 19 2017 2:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment