రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్‌) | Veerappa Moily Rayani Dairy By Madav Singaraju | Sakshi
Sakshi News home page

రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్‌)

Published Sun, Jun 13 2021 9:22 AM | Last Updated on Sun, Jun 13 2021 9:24 AM

Veerappa Moily Rayani Dairy By Madav Singaraju - Sakshi

‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్‌ పేపర్‌ మీద ఖాళీగా ఉన్న చోట బాల్‌ పెన్‌తో గీస్తుండగా చిన్న డౌట్‌ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా?
అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! 
ఇంకు పెన్ను గానీ, బాల్‌ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే.

కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్‌ పెన్‌తో న్యూస్‌ పేపర్‌పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. 
స్క్రీన్‌ మీద జూమ్‌లో రాహుల్‌ బాబు!!
అతడి చేతిలో పింగాణీ ప్లేట్‌ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్‌లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్‌ టైమ్‌ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. 
‘‘గుడ్‌ మార్నింగ్‌ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే!
‘‘గుడ్‌ మార్నింగ్‌ రాహుల్‌ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. 

స్పూన్‌ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్‌ తీసుకున్నాడు రాహుల్‌.
ఆ టైమ్‌లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్‌ బాబూ.. కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. 
‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్‌. 
రాహుల్‌ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. 
‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్‌ బాబూ..’’ అన్నాను. 
‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్‌ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్‌షా, నడ్డా మీట్‌ అయ్యారు. అదే రోజు శరత్‌ పవార్, ప్రశాంత్‌ కిశోర్‌ మీట్‌ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్‌ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్‌ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్‌? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్‌. 

రాహుల్‌లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. 
‘‘సర్జరీ అయినా, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అయినా కొంత టైమ్‌ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్‌ పేపర్‌ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్‌లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్‌లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. 
రాహుల్‌లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు!
‘‘రాహుల్‌ బాబూ.. నా ముందు టీపాయ్‌ మీద ఉన్న న్యూస్‌ పేపర్‌ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్‌ కట్‌ అయింది.

-మాధవ్‌ శింగరాజు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement