‘‘భలే చేస్తున్నాడు కదా’’ అన్నాడు అమిత్‌షా డిలైట్‌ఫుల్‌గా!
అంత శక్తి, అంత కాంతి.. అతడి ముఖంలో కనిపించగానే నాకు అర్థమైంది.. శక్తికాంత దాస్ గురించే ఆ మాట అన్నాడని.
‘‘అవును భలే చేస్తున్నాడు. ముందే రఘురామ్ రాజన్ ఇలా చేసి ఉంటే ఈ లాక్‌డౌన్‌లో శక్తికాంత్‌ని మిస్ అయ్యేవాళ్లం’’ అన్నాడు రాజ్‌నాథ్‌సింగ్.
‘‘అప్పుడు మిస్ అవడానికి ఏముంటుంది! రాజనే ఉండేవాడు. రాజనే లాక్‌డౌన్‌లో భలే చేస్తుండేవాడు’’ అన్నాడు అమిత్ షా.
‘‘నేనూ అదే అంటున్నా అమిత్‌జీ.. రాజన్ ఉండి ఉంటే శక్తికాంత్ కూడా భలే చేయగలడని మనకు ఈ రోజు తెలిసి ఉండేది కాదు కదా..’’ అన్నాడు రాజ్‌నాథ్.
‘‘అసలు శక్తికాంత్ భలే చేయగలడని మనకు తెలియాల్సిన అవసరం ఎందుకుండేది.. రాజన్ ఉండి ఉంటే’’ అన్నాడు అమిత్ షా. ఎవరూ ఆగడం లేదు.
‘‘మీతో నేను ఏకీభవించే విషయం మీరిద్దరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్న విషయం అయి ఉండాలని నేను కోరుకుంటాను’’ అన్నాను ఇద్దరి వైపు చూస్తూ.
‘‘లేదు మోదీజీ ఇద్దరం అంటున్నది ఒకటే.. శక్తికాంత్ భలే చేస్తున్నాడని! మధ్యలో రాజన్ పేరు రావడం వల్ల రెండు వేర్వేరు అభిప్రాయాలను మేము వ్యక్తం చేయబోతు న్నామన్న భావన మీలో కలగడంలో తప్పేమీ లేదు’’ అన్నాడు అమిత్‌షా.
‘‘అవును.. మోదీజీ! మా ఇద్దరి అభిప్రాయం ఒక్కటే. శక్తికాంత్ భలే చేస్తున్నాడని. మధ్యలోకి రాజన్ పేరును నేను తేవడం కూడా శక్తికాంత్ భలేగా చేస్తున్నాడని మరింత బాగా చెప్పడం కోసమే’’ అన్నాడు రాజ్‌నాథ్.
‘‘అది బాగా చెప్పడం అవదు రాజ్‌నాథ్‌జీ. చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం అవుతుంది. రాజన్ కంటే బాగా చేస్తున్నాడని గానీ, రాజన్ బాగా చేసి ఉంటే శక్తికాంత్ బాగా చేస్తాడని తెలియకపోయేది అనడం గానీ.. శక్తికాంత్ భలే చేస్తున్నాడని చెప్పడం అవదు. భలే చేస్తున్నాడు అంటున్నప్పుడు.. భలేగా ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలి తప్ప, ఎవరికంటే భలేగా చేస్తున్నాడో చెప్పడం వల్ల భలేగా వాళ్లు చేసింది పోయి, భలేగా ఎవరో చేయనిది ముందుకొస్తుంది. అప్పుడు శక్తికాంత్ గురించి భలేగా చేస్తున్నాడని నువ్వేం అనుకున్నట్లు?!’’ అన్నాను.
అమిత్‌షా ముఖం వెలిగిపోయింది. ‘భలేగయింది’ అన్నట్లు చూశాడు రాజ్‌నాథ్ వైపు.
అమిత్‌షా ఫోన్ వెలుగుతోంది. తన ముఖం వెలుగులో తన ఫోన్ వెలుగును అతడు గ్రహించినట్లు లేడు. అమిత్‌షా ఫోన్ వెలుగుతోందని రాజ్‌నాథ్ గ్రహించాడు కానీ.. అమిత్‌షా వెలుగుతో, అతడి ఫోన్ వెలుగుతో తనకు సంబంధం ఏమిటన్నట్లు కూర్చున్నాడు.
వెలిగి వెలిగి అమిత్‌షా ఫోన్ ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు రాజ్‌నాథ్.. ‘‘అమిత్‌జీ మీ ఫోన్ వెలుగుతోంది’’ అని!
ఫోన్ చూసుకుని, ఫోన్‌లో వెలిగి ఆరిపోయిన నంబర్ చూసుకుని ఆ నంబర్‌కి ఫోన్ చేశాడు అమిత్‌షా.
నేను, అమిత్‌షా, రాజ్‌నాథ్.. ముగ్గురమే ఉన్నాం హాల్లో. పక్కపక్కన ఉన్న ముగ్గురిలో ఇద్దరికి వినిపించకుండా మూడో వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడంటే.. ఏదో పెద్ద విషయం వినిపించబోతున్నాడనే.
‘‘శక్తి చాలడం లేదట’’ అన్నాడు అమిత్‌షా, ఫోన్ పెట్టేసి.
‘‘ఎవరు?’’ అన్నాను.
‘‘శక్తికాంత దాస్’’
‘‘దేనికి శక్తి చాలడం లేదట’’ అన్నాడు రాజ్‌నాథ్.
‘‘రాజన్ పెడుతున్న టార్చర్ తట్టుకోడానికి. గంటకోసారి ఫోన్ చేసి.. ‘ఇలా కాదు ఎకానమీని ఎత్తడం. హెల్ప్ కావాలంటే చెప్పు’ అంటున్నాడట’’ అన్నాడు అమిత్‌షా.
మాధవ్ శింగరాజు
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
Published Sun, Apr 19 2020 12:03 AM | Last Updated on Sun, Apr 19 2020 12:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment