రాయని డైరీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌ ప్రధాని) | Madhav Singaraju Rayani Dairy On Imran Khan | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌ ప్రధాని)

Published Sun, Mar 15 2020 12:54 AM | Last Updated on Sun, Mar 15 2020 12:54 AM

Madhav Singaraju Rayani Dairy On Imran Khan - Sakshi

సీరియస్‌గా ఒక పనిలో ఉన్నప్పుడు, మనకు బాగా దగ్గరి వాళ్లెవరో నాన్‌–సీరియస్‌ పనొకటి చేసి మన మూడ్‌ని చెడగొట్టేస్తారు. 
మిడతల బెడదపై ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు నా మూడ్‌ పాడైంది. 
‘‘చూశారా మసూద్‌ అజార్‌ ఏం చేశాడో!’’ అన్నాను తలపట్టుకుని.
‘‘ఇమ్రాన్‌జీ.. స్క్రీన్‌ మీద మీరు తలపట్టుకోవడం కనిపిస్తోంది కానీ, మీరెందుకు తలపట్టుకున్నదీ వినిపించడం లేదు’’ అన్నారు మఖ్దూమ్‌ ఖుస్రో భక్తియార్‌. ఫుడ్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ ఆయన. 
‘‘అవును ఇమ్రాన్‌జీ.. నాకైతే మీరు తలపట్టుకోవడం కూడా సరిగా కనిపించడం లేదు. మా స్క్రీన్‌ మీద మీ పిక్చర్‌ బ్రేక్‌ అవుతోంది’’ అన్నారు డాక్టర్‌ అబ్దుల్‌ హఫీస్‌ షేక్‌. ఫైనాన్స్‌ అడ్వైజర్‌ ఆయన. 
నా పక్కనే ఉన్న డాక్టర్‌ ఫిర్దోజ్‌ ఆషిక్‌ అవాన్‌ వైపు చూశాను. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌లో నా ప్రత్యేక సలహాదారు ఆమె.
‘‘మేడమ్‌ ఫిర్దోజ్‌.. అవతలి వైపు స్క్రీన్‌ల మీద మీకు మన ఫుడ్‌ సెక్యూరిటీ మినిస్టర్, మన ఫైనాన్స్‌ అడ్వైజర్‌ కనిపిస్తున్నారా?’’ అని అడిగాను. ‘‘హా.. కనిపిస్తూనే ఉన్నారు కదా ఇమ్రాన్‌ జీ’’ అన్నారు ఆమె.
‘‘మరి ఇక్కడున్న ప్రైమ్‌ మినిస్టర్‌ వాళ్లకెందుకు కనిపించడం లేదు’’ అని అడిగాను ఆశ్చర్యపడుతూ. 
‘‘కాదు కాదు ఇమ్రాన్‌జీ. మీరు కనిపిస్తూనే ఉన్నారు. కానీ సరిగా కనిపించడం లేదని మాత్రమే మేం అంటున్నాం. మీ పక్కన ఉన్న మీ ఇన్ఫర్మేషన్‌ అడ్వైజర్‌ మేడమ్‌ ఫిర్దోజ్‌ని కూడా మేము చూడగలుగుతున్నాం’’ అన్నారు అటువైపు నుంచి ఫుడ్‌ సెక్యూరిటీ మినిస్టర్, ఫైనాన్స్‌ అడ్వైజర్‌. 
వాళ్ల వైపు చూశాను. 
‘‘నేననుకోవడం నా కన్నా కూడా మేడమ్‌ ఫిర్దోజ్‌నే మీరు స్పష్టంగా చూడగలుగుతు న్నారని. నేను ఇంకొకటి కూడా అనుకుంటు  న్నాను మిస్టర్‌ మినిస్టర్‌ అండ్‌ మిస్టర్‌ ఫైనాన్స్‌ అడ్వైజర్‌. మేడమ్‌ ఫిర్దోజ్‌ నా పక్కన ఉన్నందు వల్లనే మీరు ఆ మాత్రమైనా నన్ను చూడగలుగుతున్నారని..’’ అన్నాను. 
ఫిర్దోజ్‌ ఇబ్బందిగా కదిలారు.
‘‘ఉండండి.. రెండు నిమిషాల్లో స్క్రీన్‌లన్నీ సెట్‌ చేస్తాను’’ అని పైకి లేచారు. 
‘‘మీరు కూర్చోండి మేడమ్‌ ఫిర్దోజ్‌. ఈ ప్రపంచంలో రెండు నిమిషాల్లో ఏదీ సెట్‌ కాదు. సెట్‌ అయిందీ అంటే, తనంతటదే సెట్‌ అయిందనే కానీ, మనమేదో సెట్‌ చేసినందు వల్ల అయిందని కాదు. కరెంటు పోతుంది. మనం సెట్‌ చేస్తామా! దానంతటదే కదా వచ్చేస్తుంది’’ అన్నాను. 
‘‘వావ్‌!!’’ అన్నారు ఫిర్దోజ్‌. 
‘‘దేనికి వావ్‌ అన్నారు మేడమ్‌ ఫిర్దోజ్‌’’ అన్నాను. 
‘‘స్క్రీన్‌లన్నీ సెట్‌ అయ్యాయి’’ అన్నారు. అటువైపు స్క్రీన్‌ల మీద బొటనవేలెత్తి చూపిస్తున్నారు.. సెట్‌ అయింది అన్నట్లు. 
‘‘చూశారా మసూద్‌ అజార్‌ ఏం చేశాడో! అజార్‌ మిస్సింగ్‌ అని నేను ప్రపంచాన్ని నమ్మిస్తే, ప్రపంచానికి అతడు ఆడియో మెసేజ్‌ రిలీజ్‌ చేశాడు! వెల్‌డన్‌ తాలిబన్‌ అంటాడు. తాలిబన్‌ల నుంచి తప్పించుకోడానికే అమెరికా ఒప్పందం చేసుకుంది అంటాడు. అవసరమా మనకిప్పుడీ వెల్‌డన్‌లు, తాలిబన్‌లు’’ అన్నాను. 
‘‘నిజమే ఇమ్రాన్‌జీ. దేశం మిడతల సమస్యలో ఉన్నప్పుడు మసూద్‌ అజార్‌ కూడా ఒక మిడతలా సమస్య అవడం కరెక్టు కాదు’’ అన్నారు ఫుడ్‌ సెక్యూరిటీ మినిస్టర్‌. 
‘‘చైనా నుంచి లక్ష బాతుల్ని తెప్పిస్తున్నాం ఇమ్రాన్‌జీ. ఒక్కో బాతు రోజుకు రెండొందల మిడతల్ని తినేస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు’’ అన్నారు ఫైనాన్స్‌ అడ్వైజర్‌.
బాతులు మిడతల్ని తినేస్తే పర్వాలేదు. మిడతలే బాతుల్ని తరిమికొట్టి, మసూద్‌ అజార్‌లా ఏదైనా మెసేజ్‌ ఇస్తే?!!
- మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement