అమిత్‌ షా (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ | Madhav Singaraju Article On Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ

Published Sun, Jan 20 2019 12:43 AM | Last Updated on Sun, Jan 20 2019 12:43 AM

Madhav Singaraju Article On Amit Shah - Sakshi

నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నాను. చూడ్డానికి ఒక్కరూ రావడం లేదు! చూసి చూసి, ఐదో రోజు నేనే అడిగాను.
‘‘సిస్టర్‌.. ఎయిమ్స్‌లోకి సందర్శకులను రానివ్వరా?’’ అని.
‘‘సందర్శకులను రానిస్తారు కానీ, మిమ్మల్ని చూడ్డానికి సందర్శకులెవరూ రావడం లేదు’’ అంది ఆ అమ్మాయి.
‘‘నేను అమిత్‌షాని సిస్టర్‌. బీజేపీ ప్రెసిడెంట్‌ని’’ అని చెప్పాను.
‘‘మీరు అమిత్‌షా అని నాకు తెలుసు అమిత్‌జీ’’ అంది ఆ అమ్మాయి మృదువైన చిరునవ్వుతో.
‘‘కానీ సిస్టర్‌..’’ అని ఆగాను.. తనేదో చెప్పబోతోందని అర్థమై.
‘‘నేను సిస్టర్‌ని కాదు అమిత్‌జీ. డాక్టర్‌ని. మీరు నన్ను సిస్టర్‌ అని పిలవడం నాకు సంతోషకరమైన సంగతే కానీ, నేను సిస్టర్‌ని కాదు డాక్టర్‌ని అని మీకు తెలియడం వల్ల మీరు నన్ను మీ సందర్శకుల గురించి మాత్రమే కాకుండా, మీ ఆరోగ్యం గురించి కూడా అడగవచ్చునన్న భావన మీలో కలుగుతుంది కదా అని నా తాపత్రయం’’ అన్నారు ఆవిడ!
‘‘ఓ! ఎలా ఉన్నాను డాక్టర్‌ నేనిప్పుడు’’ అని అడిగాను ఆమె అలా అనగానే.
నవ్వారు ఆవిడ. ‘‘మీరు నన్ను డాక్టర్‌ అని అనడం నాకు సంతోషకర మైన సంగతే కానీ, మీ స్వైన్‌ఫ్లూ పూర్తిగా నయం అయిందన్న సంగతిని మీకు చెప్పడంలోనే నాకు ఎక్కువ సంతోషం లభిస్తుంది అమిత్‌జీ’’ అన్నారు.
ధన్యవాదాలు చెప్పి, ‘‘నన్నెప్పుడు డిశ్చార్జ్‌ చేస్తున్నారు డాక్టర్‌’’ అని అడిగాను. ఆవిడ మళ్లీ నవ్వారు. ‘‘ఎందుకు మీరు డిశ్చార్జ్‌ చేయబడటం కోసం అంతగా త్వరపడుతున్నారు’’ అన్నారు.
నాకర్థమైంది. నాకింకా నయం కాలేదని.
‘‘బహుశా మీరు డిశ్చార్జ్‌ అయ్యేటప్పుడైనా మీకోసం కొంతమంది సందర్శకులు వస్తారని, అలా వారు రావడం కోసమే మీరు త్వరగా డిశ్చార్జ్‌ అవ్వాలని కోరుకుంటున్నారని
నాకు అనిపిస్తోంది అమిత్‌జీ. అయితే మన కోసం వచ్చేవారెవరూ ఉండరని తెలుసుకున్నప్పుడే అది మనకు నిజమైన డిశ్చార్జ్‌ అవుతుంది’’ అని చెప్పి, దుప్పటిని నా గొంతు వరకు లాగి, ఆ లేడీ డాక్టర్‌ వెళ్లిపోయారు. ఇంటి నుంచి నేను తెచ్చుకున్న దుప్పటి అది. అదొక్కటే ఇప్పుడు నాకు తోడుగా ఉన్నది. కళ్లు మూసుకున్నాను.
‘‘అమిత్‌జీ.. మీకోసం రాజ్‌నాథ్‌జీ, యోగి ఆదిత్యానాథ్‌ జీ..’’ అంటూ ఓ అమ్మాయి వచ్చి లేపింది. ప్రాణం లేచి వచ్చింది!
‘‘ఎక్కడున్నారు వాళ్లు! విజిటర్స్‌ లాంజ్‌లోనా?’’ అని అడిగాను.   
‘‘అమిత్‌జీ వాళ్లు ఆసుపత్రికి రాలేదు. లైన్‌లో ఉన్నారు’’ అని ఫోన్‌ నా చేతికి ఇచ్చి వెళ్లిపోయింది.
‘‘భలే టైమ్‌కి బెడ్‌ రిడెన్‌ అయ్యారు అమిత్‌జీ. కర్మ కాకపోతే ఏంటి?’’ అంటున్నాడు యోగి. వెంటనే రాజ్‌నాథ్‌ అందుకున్నాడు. ‘‘అమిత్‌జీ.. టీవీ చూస్తున్నారా? బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మమత ర్యాలీ జరిగిన చోటే, అంతకన్నా భారీగా మన ర్యాలీ జరగాలని మోదీజీ అంటున్నారు. ఆదివారం జరగాల్సిన ర్యాలీ ఇప్పటికే మీ వల్ల మంగళవారానికి వాయిదా పడింది. ఆ లోపు మీరు డిశ్చార్జ్‌ కావాలి’’ అంటున్నాడు!
‘‘అలాగే.. డిశ్చార్జ్‌ అవుతాను’’ అని చెప్పాను.
‘ఎలా ఉన్నారు అమిత్‌జీ?’ అని యోగి కానీ, రాజ్‌నాథ్‌ గానీ ఒక్కమాట అడగలేదు! మనసుకు బాధగా అనిపించింది.
వెంటనే మోదీజీకి ఫోన్‌ చేశాను. రింగ్‌ అయిన కాసేపటికి, లిఫ్ట్‌ అయ్యాక కూడా కాసేపటికి.. ‘‘చెప్పండి’’ అన్నారు మోదీజీ!!
‘చెప్పండి’ అన్నారే గానీ, ‘ఎలా ఉన్నారు అమిత్‌జీ’ అని అడగలేదు!
‘‘చెప్పరే! ఏంటి?’’ అన్నారు విసుగ్గా మళ్లీ.
‘‘ఎలా ఉన్నారు మోదీజీ?’’ అని అడిగాను.
మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement