పంజాబ్‌లో ఇవాళ పోలింగ్. పంజాబ్‌తో పాటు యూపీలోనూ అతి ముఖ్యమైన మూడో విడత పోలింగ్ ఉన్నప్పటికీ.. పోలింగ్‌కి సరిగ్గా రెండు రోజుల ముందు భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తను హర్ట్ అయ్యానంటూ పంజాబ్ ప్రజలను ఉద్దేశించి, ఇంటి నుంచే హఠాత్తుగా ఒక వీడియో విడుదల చేయడంతో యూపీ అన్నది ఎన్నికల్లో ముఖ్యం, ప్రాముఖ్యం కాకుండా పోయింది!
మన్మోహన్‌సింగ్ భారతదేశ తొలి సిక్కు ప్రధాని. పంజాబ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఆ మాత్రం హర్ట్ అయ్యే అవసరం ఆయనకు ఉంటుంది. పంజాబ్‌ని, పంజాబ్ రైతుల్ని నరేంద్ర మోదీ అవమానించడం పంజాబీ అయిన తన హృదయాన్ని లోతుగా గాయపరిచిందని మన్మోహన్ ఆవేదన! లోతుగా మనసు గాయపడినవాళ్లు మౌనంగా ఉండిపోతారు. అసలు ఉండటమే ఎప్పుడూ లోతైన మౌనంతో ఉండే మన్మోహన్‌సింగ్ గాయపడటం వల్ల కొత్తగా మౌనం వహించడానికి లోపల చోటు లేకనో ఏమో బయటికి రెండు మాటలు అనేశారు! ‘ఫేక్ నేషనలిజం’ అన్నారు. ‘ఫెయిల్డ్ ఎకానమీ’ అన్నారు.
నాలుగేళ్లు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా, మూడేళ్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా, రెండేళ్లు ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా, ఐదేళ్లు ఆర్థికమంత్రిగా, పదేళ్లు ప్రధానమంత్రిగా పని చేసిన ఎనభై తొమ్మిదేళ్ల నాయకుడు ‘ఫేక్’, అని, ‘ఫెయిల్’ అనీ ఎలా అంత తేలిగ్గా అనేయగలరు?! ‘మాకు ఓట్లు వెయ్యండి’ అని ఒక మాజీ ప్రధాని అడిగే విధానం ఇదే కనుకైతే.. ‘వాళ్లకు ఓట్లు వేయకండి’ అని ప్రస్తుత ప్రధాని చెప్పే విధానానికీ ఆయన సిద్ధపడేగా ఉండాలి. నెహ్రూజీని మోదీజీ విమర్శిస్తుంటే సహించలేకపోతున్న మన్మోహన్.. తను మోదీజీని విమర్శిస్తుంటే అంతా సహిస్తూ కూర్చోవాలని ఎలా ఆశిస్తారు?! దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కావచ్చు. దేశాన్ని దేశంలా నడిపిస్తున్న తొలి ప్రధాని మాత్రం మోదీజీనే.
మోదీజీ ఆలింగనాలు చేసుకుంటారు, ఉయ్యాలలూగుతారు, బిర్యానీలు తింటారు.. ఇవా మోదీజీపై ఆయన చేసే విమర్శలు!! దేశాధినేతల్ని మోదీజీ ఆలింగనం చేసుకుంటే, జిన్‌పింగ్‌తో కలిసి ఉయ్యాలలూగితే, నవాజ్ షరీఫ్‌తో కలిసి బిర్యానీ తింటే అది ఫేక్ నేషనలిజం ఎలా అవుతుంది? ఆర్థిక అభివృద్ధి సూచీలు ఆకాశం వైపు సాగుతుంటే అది
ఫెయిల్డ్ ఎకానమీ ఎలా అవుతుంది?
ఎకానమీ ఫెయిల్ అవడం అంటే నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌ని నడపడం కోసం ఆ సంస్థ అధినేత చిత్రా రామకృష్ణ హిమాలయాల్లోని ఒక అజ్ఞాత యోగీశ్వరుడిని సంప్రదించడం. దేశంలో వరుసగా ఇరవై రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్‌లోనే ఉండిపోవడం. దేశం నుంచి పెట్టుబడులు పక్షుల్లా ఎగిరిపోవడం. బలహీనమైన ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ అపఖ్యాతి పాలవడం. ఇవన్నీ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండగా జరిగినవే.
ఇక ఫేక్ నేషనలిజం అంటే.. పోలింగ్‌కి కొన్ని గంటల ముందు మాత్రమే మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్ గుర్తుకురావడం. తను పంజాబీనని గుర్తు చేసుకోవడం! పెద్దరికాన్ని కూడా పక్కనపెట్టి కాంగ్రెస్ ఆశించినట్లు, కాంగ్రెస్ ఆదేశించినట్లు ఆయన చిన్న మాటలు మాట్లాడుతున్నారనిపిస్తోంది.మన్మోహన్‌జీ అంటే కాంగ్రెస్‌లో రెస్పెక్ట్ లేకపోవచ్చు. బీజేపీలో రెస్పెక్ట్ ఉంది. దేశానికి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు బ్లెస్సింగ్స్ కోసం ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాను. అంతకుక్రితమే ఆయన రాజ్యసభ టర్మ్ అయిపోయింది కనుక బడ్జెట్ రోజు సభలో ఆయన ఉండరు. అందుకనే ఇంటికి వెళ్లి కలిశాను. రెండు నెలల తర్వాత కొత్త టర్మ్‌లో మళ్లీ ఆయన రాజ్యసభకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో మన్మోహన్‌జీ ఉంటే సభకు వచ్చే నిండుదనమే వేరు. కాంగ్రెస్‌లో ఆ నిండుతనం ఆయనకు ఎక్కడిది?
Comments
Please login to add a commentAdd a comment