ప్రెస్‌వాళ్లు వచ్చి కూర్చున్నారు.
తెలంగాణలో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆ సీఎం పెట్టిన ప్రెస్ మీట్‌కు వచ్చినట్లుగా వచ్చింది మీడియా మొత్తం! హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ముందు పార్టీ ఆఫీసు బాగా చిన్నదైపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకరిద్దరు మీడియా మిత్రులు ఒకే కుర్చీపై సర్దుకుని కూర్చోవడం గమనించాను.
‘‘ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని వారిలోంచి ఒకరు అడగడంతో నా ప్రమేయం లేకుండానే ప్రెస్ మీట్ మొదలైంది.
అసలైతే ప్రెస్ మీట్‌ను నేను ఇంకోలా ప్రారంభించాలని తలచాను. ‘‘మీరెలా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు?’’ అని నేనే ప్రెస్‌ను అడగదలచుకున్నాను. మోదీజీ అయితే ఇలానే అడుగుతారు ప్రెస్‌ని. అయినా, ఆయనెప్పుడు విజయాన్ని ఆస్వాదించారని! ఆరేళ్లుగా ప్రతిపక్షాల అపజయాలను ఆస్వాదించడంతోనే సరిపోతోంది మోదీజీకి.
‘‘చెప్పండి, ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని గద్దించినట్లుగా తన ప్రశ్నను రిపీట్ చేశాడు ఆ పత్రికా ప్రతినిధి.
‘‘విజయం ఆసనం లాంటిది. ఆసనంపై ఆసీనమవడమే కానీ, ఆస్వాదించడం ఉండదు’’ అన్నాను. ఆ మాటకు ఎవరైనా నవ్వుతారని ఆశించాను. నవ్వలేదు! ప్రెస్ మీట్‌లో కేసీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేటీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేసీఆర్ లేదా కేటీఆర్ మాటలకే నవ్వడానికి వీళ్లు అలవాటు పడ్డారా?! అలా అలవాటు చేయబడ్డారా?!
‘మిత్రులారా, బీజేపీ విజయం గురించి అడగడానికి మీ దగ్గర ప్రశ్నలేమీ ఉండవని నాకు తెలుసు. టీఆర్‌ఎస్ అపజయం గురించి మీరు కొన్ని ప్రశ్నలు వేయవచ్చు..’’ అన్నాను.
‘‘టీఆర్‌ఎస్‌ది అపజయం అని మీరెలా అంటారు బండి గారు’’ అన్నాడు ఓ ప్రతినిధి.
ఆశ్చర్యపోయాను.
‘‘కొన్ని గంటల ముందే కదా.. ప్రెస్‌కి మా విజయాన్ని గుర్తించవలసిన పరిస్థితి ఏర్పడి మీరంతా నన్ను కలుసుకున్నది. ఆ కొత్తదనమైనా లేకుండా అప్పుడే మీరు నన్ను బండి గారు అంటున్నారేమిటి! నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నదేమిటంటే.. బీజేపీ విజయాన్ని మీరు టీఆర్‌ఎస్ అపజయంగా భావించో లేదా, టీఆర్‌ఎస్ అపజయాన్ని బీజేపీ విజయంగా భావించో బీజేపీని ఏ విధంగానూ అంగీకరించేందుకు మనసొప్పక, ఆ అనంగీకారతతో నన్ను ‘బండి’ అని సంబోధిస్తున్నారని! ఇక నా అభ్యర్థన ఏమిటంటే.. నేను మీ చేత బండి అని పిలిపించుకోడానికి నాక్కొంత శక్తిని, తగినంత సమయాన్ని ఇమ్మని. ఇప్పటికైతే సంజయ్ అనొచ్చు’’ అన్నాను.
ఈలోపు మరొక ప్రతినిధి చెయ్యి లేపాడు.
‘‘సంజయ్ గారూ.. టీఆర్‌ఎస్ సీట్లు తగ్గి, బీజేపీ సీట్లు ఎక్కువ రావడానికి మీకు కనిపి స్తున్న కారణాలు ఏమిటి? మీకు అనిపిస్తున్న కారణాలు ఏమిటి?’’ అని అడిగాడు.
‘‘మిత్రమా.. నాకు కనిపిస్తున్న కారణాలు, నాకు అనిపిస్తున్న కారణాలు ఏమిటని మీరు అడిగారు. నిజానికి మీకు కదా కారణాలు కనిపించవలసినదీ, కారణాలుగా ఏవైనా అనిపించవలసినదీ. కనుక మీరే చెప్పండి’’ అని అడిగాను. తర్వాత కొన్ని ప్రశ్నలు. వాటికి జవాబులుగా నా ప్రశ్నలు.
చివరి ప్రశ్న ఒక మహిళా ప్రతినిధి నుంచి వచ్చింది. ‘‘సంజయ్ గారూ.. మీరేమైనా చెప్పదలచుకున్నారా?’’ అని!
గుడ్ క్వొశ్చన్ అన్నాను.
‘‘అయితే గుడ్ ఆన్సర్ ఇవ్వండి’’ అన్నారు నవ్వుతూ ఆ ప్రతినిధి.
‘‘నేను చెప్పదలచినది, గ్రేటర్ ఫలితాలు చెప్పేశాయి’’ అన్నాను.
Comments
Please login to add a commentAdd a comment