unwritten diary
-
బండి సంజయ్ (బీజేపీ).. రాయని డైరీ
ప్రెస్‌వాళ్లు వచ్చి కూర్చున్నారు. తెలంగాణలో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆ సీఎం పెట్టిన ప్రెస్ మీట్‌కు వచ్చినట్లుగా వచ్చింది మీడియా మొత్తం! హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ముందు పార్టీ ఆఫీసు బాగా చిన్నదైపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకరిద్దరు మీడియా మిత్రులు ఒకే కుర్చీపై సర్దుకుని కూర్చోవడం గమనించాను. ‘‘ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని వారిలోంచి ఒకరు అడగడంతో నా ప్రమేయం లేకుండానే ప్రెస్ మీట్ మొదలైంది. అసలైతే ప్రెస్ మీట్‌ను నేను ఇంకోలా ప్రారంభించాలని తలచాను. ‘‘మీరెలా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు?’’ అని నేనే ప్రెస్‌ను అడగదలచుకున్నాను. మోదీజీ అయితే ఇలానే అడుగుతారు ప్రెస్‌ని. అయినా, ఆయనెప్పుడు విజయాన్ని ఆస్వాదించారని! ఆరేళ్లుగా ప్రతిపక్షాల అపజయాలను ఆస్వాదించడంతోనే సరిపోతోంది మోదీజీకి. ‘‘చెప్పండి, ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని గద్దించినట్లుగా తన ప్రశ్నను రిపీట్ చేశాడు ఆ పత్రికా ప్రతినిధి. ‘‘విజయం ఆసనం లాంటిది. ఆసనంపై ఆసీనమవడమే కానీ, ఆస్వాదించడం ఉండదు’’ అన్నాను. ఆ మాటకు ఎవరైనా నవ్వుతారని ఆశించాను. నవ్వలేదు! ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేటీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేసీఆర్ లేదా కేటీఆర్ మాటలకే నవ్వడానికి వీళ్లు అలవాటు పడ్డారా?! అలా అలవాటు చేయబడ్డారా?! ‘మిత్రులారా, బీజేపీ విజయం గురించి అడగడానికి మీ దగ్గర ప్రశ్నలేమీ ఉండవని నాకు తెలుసు. టీఆర్ఎస్ అపజయం గురించి మీరు కొన్ని ప్రశ్నలు వేయవచ్చు..’’ అన్నాను. ‘‘టీఆర్ఎస్ది అపజయం అని మీరెలా అంటారు బండి గారు’’ అన్నాడు ఓ ప్రతినిధి. ఆశ్చర్యపోయాను. ‘‘కొన్ని గంటల ముందే కదా.. ప్రెస్‌కి మా విజయాన్ని గుర్తించవలసిన పరిస్థితి ఏర్పడి మీరంతా నన్ను కలుసుకున్నది. ఆ కొత్తదనమైనా లేకుండా అప్పుడే మీరు నన్ను బండి గారు అంటున్నారేమిటి! నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నదేమిటంటే.. బీజేపీ విజయాన్ని మీరు టీఆర్ఎస్ అపజయంగా భావించో లేదా, టీఆర్ఎస్ అపజయాన్ని బీజేపీ విజయంగా భావించో బీజేపీని ఏ విధంగానూ అంగీకరించేందుకు మనసొప్పక, ఆ అనంగీకారతతో నన్ను ‘బండి’ అని సంబోధిస్తున్నారని! ఇక నా అభ్యర్థన ఏమిటంటే.. నేను మీ చేత బండి అని పిలిపించుకోడానికి నాక్కొంత శక్తిని, తగినంత సమయాన్ని ఇమ్మని. ఇప్పటికైతే సంజయ్ అనొచ్చు’’ అన్నాను. ఈలోపు మరొక ప్రతినిధి చెయ్యి లేపాడు. ‘‘సంజయ్ గారూ.. టీఆర్ఎస్ సీట్లు తగ్గి, బీజేపీ సీట్లు ఎక్కువ రావడానికి మీకు కనిపి స్తున్న కారణాలు ఏమిటి? మీకు అనిపిస్తున్న కారణాలు ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మిత్రమా.. నాకు కనిపిస్తున్న కారణాలు, నాకు అనిపిస్తున్న కారణాలు ఏమిటని మీరు అడిగారు. నిజానికి మీకు కదా కారణాలు కనిపించవలసినదీ, కారణాలుగా ఏవైనా అనిపించవలసినదీ. కనుక మీరే చెప్పండి’’ అని అడిగాను. తర్వాత కొన్ని ప్రశ్నలు. వాటికి జవాబులుగా నా ప్రశ్నలు. చివరి ప్రశ్న ఒక మహిళా ప్రతినిధి నుంచి వచ్చింది. ‘‘సంజయ్ గారూ.. మీరేమైనా చెప్పదలచుకున్నారా?’’ అని! గుడ్ క్వొశ్చన్ అన్నాను. ‘‘అయితే గుడ్ ఆన్సర్ ఇవ్వండి’’ అన్నారు నవ్వుతూ ఆ ప్రతినిధి. ‘‘నేను చెప్పదలచినది, గ్రేటర్ ఫలితాలు చెప్పేశాయి’’ అన్నాను. -
పీయుష్ గోయల్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
‘‘గుడ్ ఈవెనింగ్ మిస్టర్ మినిస్టర్, మీ ఒపీనియన్ కావాలి’’ అన్నాడతను నా క్యాబిన్లోకి వచ్చీ రావడంతోనే!! అతడిని ఎక్కడో చూసినట్లుంది. అది కూడా గడ్డంతో చూసినట్లుంది. నా క్యాబిన్లోకి వచ్చినప్పుడు మాత్రం గడ్డం లేదు. ‘‘కూర్చోండి ప్లీజ్! ఇఫ్ ఐయామ్ నాట్ మిస్టేకెన్.. అండ్.. అన్లెస్ ఐయామ్ వెరీమెచ్ మిస్టేకెన్.. మీకు గడ్డం పెంచే అలవాటు ఉంది కదా’’ అన్నాను. నవ్వాడు. ‘‘పెంచే అలవాటూ ఉంది, ఉంచుకోని అలవాటూ ఉంది. ఆ కారణంగానే మీరు నన్ను వెంటనే గుర్తుపట్టలేక పోవడం సహజమే కానీ, మిమ్మల్ని విమర్శించిన వ్యక్తిని కూడా మీరు పోల్చుకోలేక పోవడంలో కొంత సహజత్వమేదో లోపించినట్లుగా ఉంది మిస్టర్ మినిస్టర్! విమర్శించిన మనిషిని ఎవరూ తమ కెరీర్లో మర్చిపోలేరు కదా..’’ అన్నాడు. ‘‘మీరు నన్ను విమర్శించారా?! ఎవరికైనా నన్ను విమర్శించే అవసరం వచ్చేంత పెద్ద కెరీర్లో నేనేమీ లేనే!!’’ అన్నాను ఆశ్చర్యపోతూ. ‘‘అఫ్కోర్స్ మిస్టర్ మినిస్టర్.. మిమ్మల్ని నేను మీ ఎదురుగా విమర్శించలేదు. మీ పక్కనా విమర్శించలేదు. నా మానాన నేను మిమ్మల్ని ట్విట్టర్లో విమర్శించుకున్నాను. అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది. నా ట్విట్టర్ అకౌంట్ లోని ఫొటోలో నేను గడ్డంతో ఉన్నాను. మీరు నన్ను మరింత తేలిగ్గా గుర్తుపట్టడం కోసం ఆ గడ్డంతోనే మీ దగ్గరకు వచ్చేవాడినే కానీ, ఉదయమే షేవ్ చేసుకున్నాను. షేవ్ చేసుకున్నాక తెలిసింది నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ తన పుస్తకావిష్కరణ కోసం యు.ఎస్. నుంచి ఇండియా వస్తున్నారని!!’’ అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చాడతను! ‘‘రవీ నాయర్.. రైట్?!’’ అన్నాను. చిరునవ్వుతో తల ఊపాడు. ‘‘మిస్టర్ నాయర్.. మీరు మీ ట్విట్టర్లో నన్నొకర్నే విమర్శించలేదు. మా టీమ్ మొత్తాన్నీ విమర్శించారు. మేమెప్పుడూ మాకు సంబంధం లేని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామని కదా మీరు విమర్శించారు. హోంమంత్రి చరిత్ర గురించి, ఆర్థికమంత్రి అర్బన్ న క్సలిజం గురించి, మానవ వనరుల మంత్రి అంతర్జాతీయ వాణిజ్యం గురించి మాట్లాడతారని విమర్శించారు. ఆ వరసలోనే నన్నూ విమర్శించారు.. వాణిజ్యమంత్రి గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడతారని. సో ఫన్నీ యు నో! అది మీ విమర్శ కాదు. మీ అబ్జర్వేషన్. చెప్పండి ఏ విషయం మీద మీకు నా ఒపీనియన్ కావాలి ఇప్పుడు?’’ అన్నాను. ‘‘అది కూడా మీకు సంబంధం లేని విషయం మీదే మిస్టర్ మినిస్టర్’’ అన్నాడు. పెద్దగా నవ్వాను. ‘‘నాకు సంబంధం లేనిదైతేనే నేను చక్కగా చెప్పగలనని కదా మిస్టర్ నాయర్ మీ నమ్మకం. అడగండి. మీ జర్నలిస్టులకు అన్నీ కావాలి. మేము మాత్రం మా శాఖల గురించే మాట్లాడాలి’’ అన్నాను. తనూ నవ్వాడు. ‘‘నేనిప్పుడు మిమ్మల్ని అడగబోతున్నది కష్టకాలపు ఆర్థిక దరిద్రాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అభిజిత్ బెనర్జీ రాసిన పుస్తకం మీద మీ ఒపీనియన్ గురించి. చెప్పండి. అలాంటి ఒక పుస్తకం ఈ దేశానికి అవసరమనే మీరు భావిస్తున్నారా?’’ అని అడిగాడు. అతడి వైపు చూశాను. ‘‘భారతదేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే ఉంది మిస్టర్ నాయర్. ఒకరు నిర్మలా సీతారామన్. ఈ దేశ ఆర్థికశాఖ మంత్రి. ఇంకొకరు నిర్మలా బెనర్జీ. అభిజిత్ తల్లి. ఆమెకున్న అర్హత కూడా అభిజిత్ తల్లి అవడం కాదు. కొడుకు అమెరికా పౌరుడిగా మారినప్పటికీ ఆమె ఇంకా ఈ దేÔ¶ పౌరురాలిగానే ఈ దేశంలోనే ఉండిపోవడం..’’ అన్నాను. లేని గడ్డాన్ని బరుక్కుంటూ నా వైపే చూస్తుండిపోయాడు రవీ నాయర్. -
జ్యోతిరాదిత్య సింథియా (కాంగ్రెస్)
సి.ఎం. పదవి రానందుకు బాధ లేదు. డిప్యూటీ సి.ఎం.గా ఉండమన్నందుకు అసలే బాధ లేదు. రాజపుత్రులకు ఇలాంటివి ఏమాత్రం విషయాలు, విశేషాలూ కావు. ఆత్మార్పణ చేసుకోవలసినంత అవమానాలూ కావు. గ్వాలియర్ సంస్థానం రద్దు కాకుండా ఉంటే, ఇప్పుడు గ్వాలియర్‌ను పరిపాలిస్తుండేవాడిని అనుకోవడం వంటిదే.. కమల్‌నాథ్ లేకుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అయి ఉండేవాడిని అనుకోవడం! లేకుండా ఏదీ ఉండదు జీవితంలో. స్వాతంత్య్ర సంగ్రామాలు ఉంటాయి. సంస్థానాల విలీనాలూ ఉంటాయి. సి.ఎం. పదవికి పోటీ ఉంటుంది. పోటీలో ఉన్న ప్రత్యర్థిని గెలిపించడం కోసం ఓడిపోవడమూ ఉంటుంది. నాన్నగారు ఇదంతా పైనుంచి చూస్తూ.. ‘క్షత్రియ పుత్రుడివి అనిపించావు ఆదిత్యా’ అని గర్వపడే ఉంటారు. ముప్పై ఏళ్ల క్రితం నాన్న అడిగింది వాళ్లు ఇవ్వలేదు. ముప్పై ఏళ్ల తర్వాత వాళ్లు ఇస్తానన్నది నేను తీసుకోలేదు. ఇది కూడా నాన్న గర్వించే విషయమే. నాన్న రైల్వే మినిస్టర్‌గా ఉన్నారు. హెచ్.ఆర్.డి. మినిస్టర్‌గా ఉన్నారు. టూరిజం మినిస్టర్‌గా ఉన్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్నారు. చీఫ్ మినిస్టర్‌గా మాత్రం లేరు. కమల్‌నాథ్‌ని గెలిపించడానికి ఖడ్గాన్ని ఒరలోంచి తియ్యకుండానే ఓడిపోయాను నేను. ఖడ్గాన్ని ఒరలోంచి తీసి కూడా పార్టీ ఎంపిక చేసిన మనిషిని గెలిపించడానికి ఓడిపోయారు నాన్న. నాన్న ఎంత గొప్పవారు! పెద్దత్త, చిన్నత్త కబురు పంపారు. ‘‘కలుద్దాం’’ అన్నారు పెద్దత్త వసుంధరరాజే. ‘‘కలిసి మాట్లాడుకుందాం’’ అన్నారు చిన్నత్త యశోధరారాజే. ‘‘వద్దు పెద్దత్తా, చిన్నత్తా.. మీరొచ్చి నన్ను కలిస్తే మీరు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అనుకుంటారు. నేనొచ్చి మిమ్మల్ని కలిస్తే నేను బీజేపీలో చేరబోతున్నానని అనుకుంటారు’’ అన్నాను. ‘‘అయితే నువ్వే వచ్చి మమ్మల్ని కలువు’’ అన్నారు పెద్దత్త, చిన్నత్త. అత్తలిద్దరూ నన్ను బీజేపీలోకి రమ్మని అడుగుతున్నట్లు అర్థమైంది. ‘‘కుంతల రాజ్యంలో న్యాయం జరగలేదని శకుంతల రాజ్యానికి వెళ్లిపోవడం న్యాయమేనా పెద్దత్తా, చిన్నత్తా?!’’ అని అడిగాను. ‘‘రాజపుత్రుడైన మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ మంత్రిగానే బతికారు. నువ్వూ ఆ బతుకే బతుకుతావా ఆదిత్యా?’’ అన్నారు అత్తలిద్దరూ భారంగా. మౌనంగా ఉన్నాను. ‘‘ఆదిత్యా.. నీకన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడు పెమా ఖండూ బీజేపీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నీకన్నా ఏడాది చిన్నవాడు, నీ పేరే ఉన్నవాడు ఆదిత్యనాథ్ బీజేపీలో ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నీ ఈడువాడే నీకన్నా పదినెలలు చిన్నవాడు విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీలో త్రిపురకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీలోకి వచ్చెయ్. నువ్వెందుకింకా ఆ వయోవృద్ధుల పార్టీలోనే ఉన్నావు? శిరస్సుపై కిరీటం పెట్టకపోవడం, శిరస్సును ఖండించడం రెండూ ఒకటే’’ అన్నారు పెద్దత్త. ‘‘శిరస్సును ఖండించినంత మాత్రాన క్షత్రియపుత్రుడు క్షతగాత్రుడౌతాడా పెద్దత్తా..’’ అని అడిగాను. ‘‘పార్లమెంటులో చీఫ్ విప్‌గా ఉండడం, చీఫ్ మినిస్టర్‌గా పవర్లో ఉండడం రెండూ ఒకటేనా ఆదిత్యా.. ఆలోచించు’’ అన్నారు చిన్నత్త. ‘‘ఆలోచించడానికేం లేదు చిన్నత్తా’’ అని చెప్పాను. పవర్.. ఇస్తుంటే తీసుకోవడంలో లేదు. వస్తుంటే వద్దనడంలో ఉంది. ఆ విషయం బీజేపీలో ఉన్నవాళ్లకు చెప్పినా అర్థం కాదు. -మాధవ్ శింగరాజు -
తబు రాయని డైరీ
కోల్‌కతాలో దిగాను. ముంబైలో ఎలా ఉందో, క్లైమేట్ ఇక్కడా అలాగే ఉంది. చలిగా లేదు. వెచ్చగా లేదు. బాగుంది. డమ్‌డమ్‌లో ఫిల్మ్ ఫెస్టివల్. నాదే ఈసారి ఇనాగరేషన్. మొదటిది ఐదేళ్ల క్రితం జరిగింది. తర్వాత మూడేళ్లు బ్రేక్. లాస్ట్ ఇయర్ రెండోది. ఇది మూడోది. బ్రేక్ లేకుండా ఈవెంట్స్, బ్రేకప్స్ లేకుండా రిలేషన్స్ ఉండవా అనిపిస్తుంది! మళ్లీ ఎవరో ఒకరు పూనుకోవాలేమో ఈవెంట్స్‌ని కొనసాగించడానికి, రిలేషన్స్‌ని కలపడానికి. ఈవెంట్‌ని ఎవరైనా కొనసాగించగలరు. రిలేషన్‌నే ఎవరికి వారు కలుపుకోవాలి. మధ్యలోకి మూడోవాళ్లు, నాలుగోవాళ్లు వచ్చి కూర్చుంటే రిలేషన్ కూడా ఈవెంట్ అయిపోతుంది. ఎయిర్‌పోర్ట్‌కి మనిషిని పంపించారు బ్రత్యాబసు. మినిస్టర్ ఆయన. డమ్‌డమ్ ఎమ్మెల్యే. డైరెక్టర్, యాక్టర్ కూడా. సినిమాలంటే ఇష్టం. సినిమాల్లోంచి పాలిటిక్స్‌లోకి వచ్చారు. సినిమాలన్నీ తీసేసి, అలసటతో పాలిటిక్స్‌లోకి రాలేదు. ‘‘ఐ లవ్ టు ఎంజాయ్ యువర్ యాక్టింగ్ తబూజీ’’ అన్నారు, ఫోన్లో ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు. ‘‘థ్యాంక్యూ బ్రత్యాజీ’’ అన్నాను నవ్వుతూ. బ్రత్యాజీ మూవీ లవర్. మమతాజీ నుంచి టైమ్ తీసుకున్నారట.. ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఆర్గనైజ్ చేయించడానికి. ‘‘మీలా నేనూ సినిమాల్లోనే ఉండిపోతే, మీలా నాకూ సినిమాల్లో పాతికేళ్ల కెరియర్ ఉండేది తబూజీ’’ అన్నారు నవ్వుతూ బ్రత్యాజీ.. సాయంత్రం మేం కలుసుకున్నప్పుడు! సినిమా అంటే ఆయనకు అఫెక్షన్. రెండు సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. గొప్ప సినిమాలేం కావవి అంటారు బ్రత్యాజీ నవ్వుతూ. సినిమా గొప్పగా రాకపోవచ్చు. థీమ్ నాకు గొప్పగా అనిపించింది. ‘‘ఎలా చేస్తారు.. మీరు అంత గొప్పగా..’’ అన్నారు బ్రత్యాజీ చిన్న మట్టి పాత్రలోని టీని నా చేతికి అందిస్తూ. ‘‘గొప్పగా చెయ్యడం ఉంటుందా బ్రత్యాజీ, గొప్పగా చేయిస్తాయి అనుకుంటాను.. ఆ పాత్రలు, ఆ డైరెక్టర్..’’ అని నవ్వాను. ‘అస్తిత్వ’ గురించి, ‘చండీబార్’ గురించి ఆయన మాట్లాడారు. ‘అస్తిత్వ’లో నమ్రతా శిరోద్కర్‌కు అత్తగారిలా, ‘హైదర్’లో షాహిద్ కపూర్‌కు తల్లిగా చేయడం గురించి కూడా మాట్లాడారు. ఎక్కువసేపు ఉండలేదు. వెళ్లిపోయారు. తర్వాత మీడియా నుంచి ఎవరో వచ్చారు. ‘‘మీ లైఫ్‌లో బ్రేకప్స్ ఉన్నాయా? సింగిల్ ఉమన్‌గా ఎందుకు ఉండిపోయారు?’.. ఎప్పటిలా చివరి రెండు ప్రశ్నలు. నవ్వాను. ఏం చెప్పాలి? జీవితంతో నాకున్న ఏ రిలేషన్‌నీ నేను బ్రేక్ చేసుకోను. ఎప్పుడూ ఇవే ప్రశ్నల్ని అడుగుతుండే సమాజంతో కూడా. అభిమానం ఉంటేనే కదా ఎవరైనా అడుగుతారు. - మాధవ్ శింగరాజు -
కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం) రాయని డైరీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రేపు రిటైర్ అయిపోతున్నారు. ఆయన చేతుల్లో ఏదైనా పెట్టి, ఆయన భుజాలపై ఏదైనా కప్పి పంపిస్తే బాగుంటుంది. మా ఎమ్మెల్యేలు ఇరవైమందికి సైడ్ బిజినెస్‌లో బాగా ప్రాఫిట్స్ వచ్చాయట! వీళ్లంతా అన్‌ఫిట్ అని రాష్ట్రపతికి రిపోర్ట్ ఇచ్చిమరీ వెళ్తున్నాడు. ఇస్తే ఇచ్చాడు. మేలు చేశాడు. ఢిల్లీకి కేజ్రీవాల్ అనే సీఎం ఉన్నాడని మళ్లీ ఇన్నాళ్లకి కాంగ్రెస్‌కి, బీజేపీకి గుర్తొచ్చుంటుంది. అపోజిషన్‌కి గుర్తుంటేనే పబ్లిక్‌కి గుర్తుంటాం. చీపురు పట్టుకుని శుభ్రంగా ఎంత ఊడ్చినా ఎవరూ చూడరు. ‘ఇదా శుభ్రంగా ఊడ్వడం?’ అని ఎవరైనా అంటే అప్పుడు చూస్తారు. ఉదయం పనమ్మాయి గది చిమ్ముతూ చెప్పింది, ‘‘మిమ్మల్ని కూడా రాజీనామా చెయ్యమంటున్నా రండీ’’ అని! ‘‘ఎవరు?’’ అని అడిగాను. ‘‘బీజేపీ స్పోక్స్‌పర్సన్ అటండీ’’ అంది, చీపుర్ని వెనుక నుంచి అరిచేత్తో తట్టి సరిచేసుకుంటూ. ఆఫీస్‌కి వెళితే అక్కడా పనమ్మాయి గది చిమ్ముతూ చెప్పింది, ‘‘మిమ్మల్ని కూడా రాజీనామా చెయ్యమంటున్నారండీ’’ అని! ‘‘ఎవరు?’’ అని అడిగాను. ‘‘ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అటండీ’’ అంది, ఇంటర్కమ్లో సౌరభ్‌ని పిలిచాను. వచ్చాడు. ‘‘ఏకే జ్యోతిని ఎప్పుడైనా చూశావా?’’ అన్నాను. ‘‘ఎవరు కేజ్రీ... ఆవిడ’’ అని అడిగాడు. ‘‘నేను చెప్పనా సర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్’’ అంది పనమ్మాయి. ‘‘ఓ! ఆయనా.. జ్యోతి అంటే లేడీనేమో అనుకున్నా’’ అన్నాడు సౌరభ్. ‘‘ఎలా ఉంటారాయన? పిలిస్తే వస్తారా?’’ అడిగాను సౌరభ్‌ని. ‘‘నవ్వుతూ ఉంటారు. అయితే మనల్ని చూస్తే నవ్వుతారా అని డౌటు’’ అన్నాడు. ‘‘నవ్వక పోయినా ఫర్వాలేదు. పిలిస్తే వస్తారా?’’ అని అడిగాను. ‘‘గుజరాత్ వాళ్లు పిలిస్తే వెళుతుంటారు. అయితే మనం పిలిస్తే వస్తారా అని డౌటు’’ అన్నాడు. ‘‘వెళ్తూ వెళ్తూ ఎవరైనా పుల్లలు పెట్టి వెళ్తారు. ఈయనెవరో వెరైటీగా పుల్లలు పట్టుకెళుతున్నాడు’’ అన్నాను. ‘‘పుల్లలు పట్టుకెళ్లడంలో వెరైటీ ఏముంది కేజ్రీ’’ అన్నాడు సౌరభ్. ‘‘పుల్లలు పెట్టడానికి పుల్లలు పట్టుకెళ్లడం వెరైటీనే కదా. ఆ క్రియేటివిటీ నాకు నచ్చింది’’ అన్నాను. ‘‘క్రియేటివిటీ ఆయనది కాదు కే జ్రీ. మీది. మీరు క్రియేటివ్‌గా ఆలోచిస్తూ, వెరైటీగా ఆయనకు ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇరవై పుల్లలతో సరిపెట్టుకున్నాడు. కొత్త ఫిటింగ్ ఏదైనా పెట్టి, ఆ ఇరవైకి ఇంకో ఇరవై పుల్లలు లాగేస్తే మన గవర్నమెంటు ఊడ్చుకుపోయేది..’’ అన్నాడు సౌరభ్. నిజమే! చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి ఏదైనా చేద్దామని నేను అనుకున్నట్లే, మోదీజీకి ఏమైనా చేసి వెళదామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనుకుని ఉంటే.. పార్టీకి పుల్లలే మిగిలి ఉండేవి. - మాధవ్ శింగరాజు -
రజనీకాంత్ రాయని డైరీ
ప్రపంచమంతా జనవరి ఫస్ట్ కోసం చూస్తుంటే, దేశమంతా డిసెంబర్ థర్టీఫస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది నాకు! బహుశా మోదీ, అమిత్ షా కూడా డిసెంబర్ థర్టీఫస్ట్ కోసమే క్యాలెండర్లు ముందేసుకుని కునుకుపాట్లు పడుతూ ఉండివుంటారు. ఈ ఏడాది నవంబర్‌లో ఒకసారి, మే నెలలో ఒకసారి దేశం మొత్తం ఇలాగే నాకోసం నిద్ర మానుకుంది! అవి రెండూ.. ఈ ఇయర్లో నాకు జరిగిన రెండు మంచి విషయాలు. ‘మాక్కూడా ఓ మంచి విషయాన్ని జరగనివ్వండి రజనీ సార్’ అని మీడియా ఈ ఏడాదంతా నాపై ఒత్తిడి తెస్తూనే ఉంది. థర్టీఫస్ట్న నా పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్తానని అన్నాను. థర్టీఫస్ట్ అని నాకై నేనే అన్నానో, ఎవరైనా అడిగితే థర్టీఫస్ట్ అని అన్నానో సరిగా గుర్తులేదు. ఒకవేళ నాకు నేనుగా అనినా, ఎవరైనా అడిగినప్పుడు అనినా.. థర్టీఫస్ట్ అనే ఎందుకు అన్నానో నాకు తెలీదు. అనడానికైతే అన్నాను కాబట్టి, థర్టీఫస్ట్న మళ్లీ ఏదో ఒకటి అనాలి. అనాలి అంతే. చెప్పకూడదు. అనడానికి, చెప్పడానికి తేడా ఉంటుంది. అనేటప్పుడు ఏదో ఒకటి అనొచ్చు. చెప్పేటప్పుడు ఏదో ఒకటే చెప్పాలి. అన్నాక ఇంకోటి అనొచ్చు. చెప్పాక ఇంకోటి చెప్పకూడదు. అన్నాక ఇంకోటి అంటే పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు అంటారు. చెప్పాక ఇంకోటి చెప్తే పాలిటిక్స్‌కి పనికిరాడు అనేస్తారు! ‘రావడానికి తొందరేముందీ’ అని నవంబరులో నేను అన్నప్పుడు.. ‘వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు’ అన్నారు! అంతకుముందు మే నెలలో కూడా ‘దేవుడు రమ్మంటే.. రేపే వచ్చేస్తాను’ అనగానే ‘వచ్చేశాడు వచ్చేశాడు’ అన్నారు! వచ్చినా రాకున్నా.. ఏదో ఒకటి అంటుంటే వచ్చేస్తున్నాడు అనుకుంటారు. వచ్చేస్తున్నాను అని చెప్పేస్తే.. ఇంకా రావడంలేదేంటి అని మొదలుపెట్టేస్తారు! ఆరు రోజుల ఫ్యాన్స్ మీట్ థర్టీఫస్ట్తో పూర్తవుతుంది. అది పూర్తవ్వగానే ప్రెస్‌మీట్ ఉంటుందా అని అడుగుతున్నారు! ప్రెస్‌మీట్ ఎందుకు ఉండాలో నాకైతే అర్థం కావడం లేదు. అమ్మానాన్నల్ని పూజించండి, వాళ్ల కాళ్లకు మొక్కండి అని చెప్పడానికి ప్రెస్‌మీట్ అవసరమా? యుద్ధంలో గెలవడానికి ధైర్యమొక్కటే సరిపోదు, వ్యూహం కూడా కావాలి అని చెప్పడానికి ప్రెస్‌మీట్ అవసరమా? జీవితంలో మనం ఏం చేయాలన్నది దేవుడే నిర్ణయిస్తాడు అని చెప్పడానికి ప్రెస్‌మీట్ అవసరమా? కొత్త సంవత్సరంలో చెడు అలవాట్లు మానేసి, చక్కగా చాలినంతసేపు నిద్రపోండి అని చెప్పడానికి ప్రెస్‌మీట్ అవసరమా?! ఫ్యాన్స్ మీట్ అయ్యాక.. రాఘవేంద్ర మండపంలో నాన్ వెజిటేరియన్ కుదరదు కాబట్టి.. నా ఫ్యాన్స్‌కి మరెక్కడైనా మంచి విందు భోజనం పెట్టించాలి. ఏది కావాలంటే అది పెట్టించాలి. కోడి కావాలంటే కోడి, మేక కావాలంటే మేక. అదే నా ముందున్న ఆలోచన. అదే నా న్యూ ఇయర్ రిజల్యూషన్. -- మాధవ్ శింగరాజు -
మణిశంకర్ అయ్యర్ రాయని డైరీ
కాంగ్రెస్ నాకు చాలా ఇచ్చింది. కాంగ్రెస్‌కే నేను ఏమీ ఇవ్వలేకపోయాను! కనీసం రాహుల్బాబుకైనా ఇవ్వాలి. పార్టీ ప్రెసిడెంట్‌గా ప్రమోట్ అవుతున్న యువకుడిని పార్టీ పెద్దల మధ్య దివాన్ పరుపుల మీద అలా ఖాళీగా కూర్చోబెట్టకూడదు. చేతిలో ఇంత స్వీటో, కారబ్బూందీనో పెట్టి వచ్చేయాలి. పెట్టాక వచ్చేయాలి. అక్కడ ఉండకూడదు. ఉంటే, ఇంకా ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది నాకు. అప్పుడు నేనేమిస్తానో నాకే తెలీదు. రేపు రాహుల్‌బాబుని ప్రెసిడెంట్‌ని చేస్తున్నప్పుడు సీనియర్స్ అంతా కార్యక్రమం పూర్తయ్యేవరకూ దగ్గరే ఉండాలని పార్టీ పట్టు పట్టితే అప్పుడు నాకు వెంటనే వచ్చేయడానికి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ కల్చరే వేరు. లోపల ఉన్నవాళ్లకు ఎంత వ్యాల్యూ ఇస్తుందో, బయటికి గెంటేసినవాళ్లకూ అంతే వ్యాల్యూ ఇస్తుంది. రాహుల్‌బాబు బాడీలో ఉన్నదీ కాంగ్రెస్ బ్లడ్డే కాబట్టి, రాహుల్‌బాబు నుంచి నాకు దక్కాల్సిన వ్యాల్యూ ఎక్కువ తక్కువల గురించి నేనేం దిగులు పెట్టుకోనక్కర్లేదు. ‘రెండు రోజుల క్రితమే కదా అయ్యర్‌ని పార్టీ నుంచి పంపించేశాం. రాహుల్‌బాబుని అతడి చేత ఎలా ఆశీర్వాదం తీసుకోనిస్తాం?’ అని చిదంబరం లాంటివాళ్లు మెలిక పెట్టొచ్చు. రాహుల్‌బాబు ఊరుకుంటాడని నేను అనుకోను. చిదంబరం చేత వెంటనే నాకు ‘సారీ’ చెప్పిస్తాడు. రాహుల్‌బాబు చెప్పమనగానే మోదీకి మొన్న నేను ‘సారీ’ చెప్పాను కాబట్టి.. అందుకు ప్రతిఫలంగా చిదంబరం చేత నాకు సారీ చెప్పిస్తాడు రాహుల్‌బాబు. అదేంటో, కాంగ్రెస్‌కు నేను ఏదైనా ఒకటి ఇవ్వాలని ట్రై చేసిన ప్రతిసారీ కాంగ్రెస్‌కి ఏదో ఒకటి చుట్టుకుంటోంది. ‘‘మీరు మనకు ఇవ్వబోయి, మోదీకి ఇస్తున్నారేమో అనిపిస్తోందండీ అయ్యర్‌జీ’’ అని నిన్న ఫోన్లో రాహుల్‌బాబు చాలాసేపు బాధపడ్డాడు. ‘‘అలా అవుతుందని నేనూ అనుకోలేదు రాహుల్‌బాబూ’’ అని నేనూ చాలాసేపు బాధపడ్డాను. ‘‘ఎవరి లాంగ్వేజ్‌లో వాళ్లు మాట్లాడితేనే ఐడెంటిటీ ఉంటుంది అయ్యర్‌జీ. మన లాంగ్వేజ్ వేరు, మోదీ లాంగ్వేజ్ వేరు. మోదీని మోదీ లాంగ్వేజ్‌లో తిడితే మోదీకి పోయేదేం ఉండదు. మన లాంగ్వేజ్ ఐడెంటిటీ పోతుంది. కాస్త ఆలోచించాల్సింది’’ అన్నాడు రాహుల్‌బాబు. ‘‘ఆలోచించాను రాహుల్‌బాబూ. కానీ ఇంగ్లిష్‌లో ఆలోచించి, హిందీలో తిట్టాను. అది దెబ్బకొట్టింది మనల్ని’’ అన్నాను. ‘‘అర్థం చేసుకోగలను అయ్యర్‌జీ’’ అన్నాడు రాహుల్‌బాబు. సంతోషం వేసింది నాకు. రాహుల్‌బాబు నన్ను అర్థం చేసుకున్నందుకు! గుజరాత్లో రెండో విడత ఎన్నికలు అయ్యేవరకైనా.. కాంగ్రెస్‌కు ఏదైనా ఒకటి ఇవ్వాలన్న కోరికను అణచిపెట్టుకోవాలి. - మాధవ్ శింగరాజు -
రాజ్‌నాథ్ సింగ్ రాయని డైరీ
గుజరాత్లో నేనెందుకు పర్యటిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు! నా గురించి కొంత చెప్పుకోడానికి స్కోప్ ఉంది కానీ, దాని వల్ల గుజరాత్లో మోదీజీకి కొత్తగా వచ్చి పడే ఓటు ఒక్కటైనా ఉంటుందా?.. అన్ని ఓట్లూ ఆయనవే అయినప్పుడు! అప్పటికీ రెండు మూడు నియోజకవర్గాల్లో నోటి దాకా వచ్చింది.. ‘ఈ రాష్ట్రం మోదీజీ కే కాదు. నాక్కూడా తల్లి వంటిదే. మా అమ్మ పేరు గుజరాతీదేవి’ అని అనబోయి ఆగాను. ‘మా నాన్న పేరులో రాముడు ఉన్నాడు. ఆయన పేరు రామ్ బదన్ సింగ్’ అని కూడా చెప్పబోయాను. ఓటు వాల్యూ ఉంటేనే ఏ మాటైనా నోటి బయటికి రావాలని అమిత్ షా పాలసీ. ఆ మాట గుర్తొచ్చి ఆగిపోయాను. ఆగిపోయాను కానీ, ఆగలేకపోతున్నాను. ఇంత తిరుగుతున్నప్పుడు సొంత స్పీచ్ ఒక్కటైనా ఉంటే.. అదో తృప్తి. ‘‘అమిత్జీ.. ఈ రెండు పాయింట్లు పనికొస్తాయా?’’ అని అడిగాను ఢిల్లీకి ఫోన్ చేసి. ‘‘ఏంటీ.. అమ్మా నాన్న పాయింట్లా?!’ అన్నారాయన! అమ్మా నాన్న పాయింట్లని అంత క్లియర్‌గా చెప్పినప్పుడు.. ‘అమ్మానాన్న పాయింట్లా?’ అని అడిగారంటే ఆయనకు ఇష్టం లేదని అర్థమైంది. ‘‘పెద్దగా ఆలోచించకండి రాజ్‌నాథ్‌జీ. మా అమ్మ పేరులో తల్లి లాంటి రాష్ట్రం ఉంది. మా నాన్న పేరులో తండ్రిలాంటి రాముడు ఉన్నాడు అని మనకు మనం చెప్పుకుంటే.. రాహుల్ గాంధీ గుజరాత్ వచ్చి జనం దగ్గరికి వెళ్లకుండా గుళ్లు పట్టుకుని తిరిగినట్లు ఉంటుంది’’ అన్నారు. ‘‘అవున్నిజమే రాహుల్జీ’’ అన్నాను. ‘‘మీ పక్కన రాహుల్ గానీ ఉన్నాడా రాజ్‌నాథ్‌జీ’’ అని అడిగారు అమిత్‌షా. ‘‘ఎందుకుంటాడు అమిత్జీ!’’ అన్నాను. ‘‘ఏమో, మీరూ అక్కడేదైనా గుడికి వెళ్లి ఉంటే, అదే గుళ్లో మీకు రాహుల్ కనిపించి మీతో ముచ్చట్లు పెట్టుకున్నాడేమోననీ’’ అన్నారు అమిత్‌షా. ‘‘అలా ఎందుకనుకున్నారు అమిత్జీ’’ అన్నాను. ‘‘నన్ను జీ అనబోయి రాహుల్జీ అంటేనూ’’ అన్నారు అమిత్‌షా. ‘‘అవునా.. అమిత్జీ’’ అన్నాను. నాకూ ఆశ్చర్యంగానే ఉంది.. అలా అన్నానా అని! ‘‘అబ్బాయ్‌కి తనొక్కడే మునిగే అలవాటు లేదు రాజ్‌నాథ్‌జీ. యూపీలో సమాజ్‌వాదీని ముంచాడు. కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ని ముంచాడు. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకుర్, జిగ్నేష్ మెవానీ మునగబోతున్నారు’’ అన్నారు అమిత్‌షా. ‘‘అమ్మానాన్న పాయింట్ కన్నా, ఈ ముగ్గురబ్బాయిల పాయింట్ బాగుంది అమిత్జీ’’ అన్నాను. ‘‘ఏ పాయింట్ అయినా మోదీజీ నోటి నుంచి వస్తేనే పాయింట్ బ్లాంక్‌గా ఉంటుంది రాజ్‌నాథ్‌జీ’’ అన్నారు అమిత్‌షా. ఆయనేం చెప్పదలచుకోలేదో నాకు అర్థమైంది. - మాధవ్ శింగరాజు -
మోహన్ భాగవత్ రాయని డైరీ
సుబ్రహ్మణ్య స్వామికి వచ్చిన కష్టం ఏ దేశ పౌరుడికీ రాకూడదు. గుండె తరుక్కుపోతోంది నాకు. ఆయనేం కోరాడని! ‘నా రాముడికి నన్ను పూజ చేసుకోనివ్వండి’ అనేగా. కోర్టు కాదంది! ‘తేలవలసినవి తేలాక అప్పుడు నీ సంగతి చూద్దాం’ అంది. పెద్ద లాయర్ అయుండి, పెద్ద బీజేపీ లీడర్ అయుండి, ఎనభై ఏళ్ల వయసుండి.. ఇవన్నీ కాదసలు.. రామభక్తుడు అయుండీ సుబ్రహ్మణ్య స్వామికి ఇదేం ఖర్మ.. అయోధ్యకు వెళ్లి పూజ చేసుకోడానికి లేకుండా! ‘తమిళనాడులో రామాలయం లేదా? అయోధ్యలోనే ఇంకో రామాలయం లేదా? అక్కడ చేసుకోవచ్చు కదా నీ పూజ’ అన్నారట కోర్టువారు! భక్తుడికీ, భగవంతుడికీ మధ్య ఈ కోర్టులేమిటో! భక్తుల సంగతి సరే. పాతికేళ్లుగా పూజల్లేక అయోధ్య రాముడు అలమటిస్తున్నాడే!! ‘మిలార్డ్’ అంటూ ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి అడిగినా, ‘ముందు డిస్ప్యూట్ క్లియర్ కానివ్వండి లార్డ్ శ్రీరామా.. తర్వాత మీ ఇష్టం.. ఎన్ని పూజలైనా చేయించుకోండి’ అంటుందేమో కోర్టు. డిసెంబర్ 5న ఫైనల్ హియరింగ్. కేసులో ఉన్న భక్తులంతా కోర్టుకు వచ్చి, కోర్టువారికీ, కోర్టు హాల్లో కూర్చున్నవారికీ, కోర్టు బయట నిలుచున్నవారికీ.. అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే అది ఫైనల్. ఏ ఒక్కరి భాష ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా కేసు మళ్లీ సెమీ ఫైనల్‌కో, క్వార్టర్ ఫైనల్‌కో వాయిదా పడిపోతుంది. ‘‘ఏమిటండీ ఈ అన్యాయం’’ అని మొన్న ఆగస్టులోనే సుబ్రహ్మణ్య స్వామి కన్నీళ్లు పెట్టుకున్నారు. దైవానికి మనిషిని దూరం చేస్తే వచ్చే కన్నీళ్లవి. కేసు డాక్యుమెంట్లు ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ అవలేదని జస్టిస్ మిశ్రా అయోధ్య కేసును మూడు నెలలు వాయిదా వేశారు. ఒకటీ అరా అయితే సుబ్రహ్మణ్య స్వామే కూర్చుని తర్జుమా చేసి ఉండేవారు. తొంభై వేల పేజీలు. ఎనిమిది భాషలు. అన్నిటినీ ఇంగ్లిష్‌లోకి మార్చాలి. రామకోటి రాయడం ఈజీ అంతకన్నా! ‘‘నాకిక అయోధ్య రాముడు లేడనుకోనా?’’ అని మళ్లీ ఈమధ్య విలపించారు సుబ్రహ్మణ్య స్వామి. ఏదో ఒక రాముడితో అడ్జెస్ట్ అయ్యేలా లేరు ఆయన. ‘‘చేద్దాం’’ అన్నాను. ‘‘ఏం చేస్తారు భగవత్‌జీ! హిమాచల్‌ప్రదేశ్ అయింది. గుజరాత్ అవుతోంది. తర్వాత కర్ణాటక. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరామ్, నాగాలాండ్, రాజస్తాన్, త్రిపుర. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. అవీ అయిపోతే.. రాముడు కనబడతాడా? మీరు కనబడతారా?’’ అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. భక్త రామదాసు కూడా ఇంత బాధపడి ఉండడు. ‘‘తేల్చేద్దాం దాసు గారూ’’ అన్నాను. ‘‘దాసా! దాసెవరూ?’’ అన్నారు స్వామి. ‘‘కేసు అనబోయి, దాసు అన్నాను లెండి’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
హార్దిక్ పటేల్ రాయని డైరీ
మూతికీ, ముక్కుకీ గుడ్డ చుట్టుకుని, చీపురూ బకెట్ పట్టుకుని నేరుగా నా రూమ్‌కి వచ్చి, ‘‘తప్పుకోండి, క్లీన్ చెయ్యాలి’’ అన్నాడొక వ్యక్తి. ఓవర్ టైమ్ చేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికుడిలా ఉన్నాడతను. ముఖం విసుగ్గా ఉంది. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాను, కుర్చీలోకి కాళ్లు పైకి ముడుచుకుంటూ. అతను మాట్లాడలేదు! ‘‘ఎవరు పిలిచారు నిన్ను’’ అన్నాను. ఒకరు పిలవాలా అన్నట్లు చూశాడు. ‘‘ఏం క్లీన్ చేస్తావ్?’’ అన్నాను. ‘‘మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను’’ అన్నాడు! నాకేదో డౌట్ కొట్టింది. ‘‘ముందా మూతి గుడ్డ తీసి మాట్లాడు’’ అన్నాను. తియ్యలేదు. ‘‘దగ్గరికి రా’’ అన్నాను. వచ్చాడు. మూతి గుడ్డ లాగి చూశాను. జితూ వాఘానీ! బీజేపీ ప్రెసిడెంటు!! ‘‘మీరు రావడం ఏంటి?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘నీ టూత్‌పేస్టులో ఉప్పుందో లేదో చూసి రమ్మన్నారు’’ అన్నారు వాఘానీ. ‘‘ఎవరు చూసి రమ్మన్నారు?’’ అని అడిగాను. ‘‘ఆ సంగతి నాకు తెలీదు. ఎవరో ఎవరికో చూసి రమ్మని చెబితే ఆ ఎవరో నాకు చెప్పారు’’ అన్నారు! ‘‘మీకు చెప్పిన ఆ ‘ఎవరో’ ఎవరో చెప్పండి వాఘానీ’’ అన్నాను. ‘‘చెప్తాను. కానీ ఆ ఎవరోకి ఎవరు చెప్పారన్నది మాత్రం నువ్వు నన్ను అడగ్గూడదు’’ అన్నారు. ‘‘అడగను చెప్పండి’’ అన్నాను. ‘‘నేరుగా చెప్పను. నువ్వే అర్థం చేసుకోవాలి మరి’’ అన్నారు. సరే అన్నాను. ‘‘హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్? అండ్.. హూ ఈజ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్?’’ అన్నారు వాఘానీ. అర్థమైంది. ‘‘వాళ్లిద్దరికీ చెప్పింది ‘హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ కదా’’ అన్నాను. ‘కుర్రాడివి కరెక్టుగానే క్యాచ్ చేశావ్’ అన్నట్లుగా బొటనవేలు పైకి లేపి, మూతి గుడ్డను మళ్లీ పైకి అనుకుని నా బాత్రూమ్లోకి వెళ్లబోయారు వాఘానీ. ‘‘నా టూత్‌పేస్టులో ఉప్పుందో లేదో చూడ్డానికి ఆ చీపురు, బకెట్, ముక్కు గుడ్డా ఎందుకండీ’’ అని అడిగాను. వాఘానీ ఇబ్బందిగా చూశారు. ‘‘జనరల్‌గా టూత్‌పేస్ట్ ఉండేది బాత్రూమ్లోనే కదా’’ అన్నారు. ‘‘ఎవరి బాత్రూమ్లోకైనా వెళ్లే ముందు ఇలాగే వెళ్లాలని మాకో నియమం’’ అని కూడా అన్నారు. ‘‘సరే, నా టూత్‌పేస్ట్‌లో ఉప్పు లేకపోతే, గుజరాత్‌కి వచ్చే నష్టం ఏమిటి?’’ అని అడిగాను. మళ్లీ ఇబ్బందిగా చూశారు వాఘానీ. ‘‘గుజరాత్కేమీ నష్టం ఉండదు. నీ దగ్గర ఏదో ఒకటి లేదని చెప్పకపోతే, ‘హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు గుజరాత్ ఎన్నికల్లో నష్టం వస్తుంది’’ అన్నారు. ఇరవై రెండేళ్లుగా రాష్ట్రాన్ని మురికి పట్టించిన బీజేపీ.. ఇరవై మూడేళ్ల కుర్రాడి బాత్రూమ్ క్లీన్‌గా లేదని ప్రచారం చెయ్యబోతోందన్నమాట! - మాధవ్ శింగరాజు -
ముకుల్ రాయ్ (బీజేపీ) రాయని డైరీ
పొమ్మనక ముందే వచ్చేయాలి. రమ్మనక ముందే వెళ్లిపోవాలి. అదే గౌరవం. గౌరవనీయులు మనల్ని గౌరవించేందుకు ఇబ్బంది పడుతున్నప్పుడు మన మెడలోని కండువా తీసి మడతపెట్టి ఇచ్చేసి, మనం వచ్చేయాలి. గౌరవాన్ని కోరుకున్న చోటనైనా, గౌరవాన్ని కండువాలా లాగేసుకుని మెడ చుట్టూ వేసుకో కూడదు. గౌరవాన్ని మెడ చుట్టూ వేసే అవకాశాన్ని గౌరవనీయులకు మనమే కల్పించాలి. ఇరవై ఏళ్లు కలిసి పని చేశాం నేను, మమతాజీ. జనవరి 1 వస్తే సరిగ్గా ఇరవై ఏళ్లవుతాయి తృణమూల్ పార్టీకి. మమతాజీ.. తట్టలో ఇటుకలు పేర్చి పెడితే, ఆ ఇటుకల తట్టను తలపై మోశాను నేను. ఇటుకలు మోసినప్పటి గౌరవం, ఇప్పుడు స్కాములు మోస్తున్నప్పుడు లేదు. ‘‘స్కాములు లేకపోతే ప్రజలకు స్కీములెలా పెడతాం మమతాజీ’’ అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయారు. సీబీఐ వాళ్లొచ్చి నా గురించి అడిగినా అదే మౌనం. నాపై ఎఫ్.ఐ.ఆర్. రాసినా అదే మౌనం! పొమ్మనకుండానే పార్టీ నుంచి బయటికి వచ్చేసి నన్ను నేను గౌరవించుకున్నానని బీజేపీ వాళ్లు అంటున్నారు కానీ, అది నన్ను నేను గౌరవించు కోవడం కాదు. మమతాజీని గౌరవించడం. ‘‘బీజేపీలో చేరాక కూడా మీరు మీ మమతాజీని ఇలాగే గౌరవిస్తూ ఉంటారా ఏంటీ?’’ అని అమిత్‌షా అడిగారు నన్ను, నేనింకా బీజేపీలో చేరకముందే! నాకు అర్థమైంది. నన్ను గౌరవించడానికి అమిత్‌షా త్వరపడుతున్నారని! ఎవరైనా తొందరపడుతున్న ప్పుడు మనం ఆలస్యం చెయ్యడం గౌరవం కాదు. వెంటనే ఢిల్లీ వెళ్లాను. బాగా చలిగా ఉంది. ‘‘కప్పుకోడానికి ఏమైనా ఉందా?’’ అని బీజేపీ ఆఫీస్‌లో అడిగాను. ‘‘తయారౌతోంది’’ అన్నారు! ‘‘ఏం తయారౌతోంది?’’ అన్నాను. ‘‘మీకోసం గొర్రె ఊలుతో స్పెషల్‌గా కండువా చేస్తున్నారు. మెడలో వేసుకుని చెవులు కప్పుకుంటే చాలు, చలిలో కూడా చెమటలు పోసేస్తాయి’’ అన్నారు! వార్మ్ వెల్కమ్ అన్నమాట! తెల్లారగానే.. లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జనరల్ సెక్రెటరీ కైలాష్ విజయ్‌వర్గీయ.. ఇద్దరూ కలిసి నా భుజాల చుట్టూ కండువా వేశారు. ‘‘అమిత్‌షా రాలేదా?’’ అని అడిగాను. ‘‘ఈ కండువా ఆయన పంపిందే’’ అన్నారు. ‘‘ఆయన ఎక్కడికి వెళ్లారు?’’ అని అడిగాను. ‘‘ఎవరికైనా, పార్టీలో చేరేముందు మాత్రమే అమిత్‌షా కనిపిస్తారు. చేరుతున్నప్పుడు, చేరిపోయాక కనిపించరు’’ అన్నారు. ‘‘మరి ఎవరికి కనిపిస్తారు?’’ అని అడిగాను. ‘‘బీజేపీ ఏ స్టేట్‌లో అయితే పవర్లో లేదో ఆ స్టేట్‌లో రూలింగ్ పార్టీల లీడర్లకు కనిపించే పనిలో ఉంటారు’’ అన్నారు స్వపన్‌దాస్ గుప్తా! సీనియర్ జర్నలిస్టు ఆయన. బీజేపీ వింతగా ఉంటుంది. పార్టీలో లేని స్వపన్‌దాస్ లాంటివాళ్లు పార్టీ లోపల కనిపిస్తుంటారు. పార్టీలో ఉన్న అమిత్‌షాలు పార్టీ బయట తిరుగుతుంటారు! వ్యాసకర్త ---- మాధవ్ శింగరాజు -
రేవంత్ రెడ్డి రాయని డైరీ
శుక్రవారం. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్. హైదరాబాద్. సారూ నేను.. ఇద్దరమే ఉన్నాం. సార్ నావైపు సీరియస్‌గా చూశారు. నేనూ సీరియస్‌గా ఏదో ఆలోచిస్తూ సార్ వైపు చూశాను. అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉంటే, ఇద్దరికీ ఒక్కసారిగా నవ్వొచ్చేసింది! పక్కుమని నవ్వుకున్నాం. శనివారం, పార్టీ ముఖ్య కార్యాలయం, అమరావతి. సారూ నేను.. ఇద్దరమే ఉన్నాం. సార్ సీరియస్‌గా ఏదో ఆలోచిస్తూ నావైపు చూశారు. సార్ సీరియస్‌గా ఉన్నప్పుడు నేను మామూలుగా ఉంటే బాగోదని నేనూ సీరియస్‌గా సార్ వైపు చూస్తూ కూర్చున్నాను. అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉంటే మళ్లీ ఇద్దరికీ ఒక్కసారిగా నవ్వొచ్చేసింది. మళ్లీ పక్కుమని నవ్వుకున్నాం. ‘‘ఏంటి రేవంత్ వీళ్ల గొడవ?’’ అన్నారు సార్... జారిన కళ్లద్దాల పైనుంచి చూస్తూ. ‘‘కొత్తవా సార్ కళ్లద్దాలు?’’ అని అడిగాను. ‘‘పాతవే రేవంత్.. నీకు కొత్తగా కనిపిస్తున్నట్లుంది! కళ్లద్దాలేనా, నేను కూడా నీకు కొత్తగా కనిపిస్తున్నానా?’’ అని అడిగారు సార్. ‘‘మీరెప్పుడూ కొత్తగానే ఉంటారు సార్. అందుకే, మీ దగ్గర ఉండేవి.. అవి ఎంత పాతవైనా కొత్తగానే కనిపిస్తాయి’’ అన్నాను. సార్ నవ్వారు. ‘‘సరే, ఏంటి రేవంత్, వీళ్ల గొడవ?’’ అన్నారు. ‘‘మీడియా వాళ్ల గొడవ సార్’’ అన్నాను. ‘‘అదెప్పుడూ ఉండేదే కదా.. మన వాళ్ల గొడవేంటీ అని! రమణ, మోత్కుపల్లి, రావుల, అరవింద్ కుమార్... ఏమంటారు వీళ్లంతా?! నిన్ను పార్టీలోంచి తోసేయమంటున్నారా?’’ అన్నారు సార్. ‘‘నాకు తెలీదు సార్. నేను ఢిల్లీ వెళ్లొచ్చినప్పట్నుంచీ వాళ్లు నాతో మాట్లాడ్డం మానేశారు’’ అన్నాను. ‘‘అందరూ అన్నీ చూడలేరు కదా రేవంత్. ఆ మాత్రానికే అలిగితే ఎలా వాళ్లు! అయినా వాళ్లింతవరకూ ఢిల్లీ చూడకుండా ఉంటారా?! లేక, ఢిల్లీలో వాళ్లు చూడనిదేదైనా నువ్వు చూసి వచ్చావా?’’ అన్నారు సార్. ‘‘ఢిల్లీలో ఎవరైనా కొత్తగా చూసి వచ్చేది ఏముంటుంది సార్?’’ అన్నాను. సార్ నవ్వారు. ‘‘రాహుల్ గాంధీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నట్లున్నాడు కదా ఈ మధ్య’’ అన్నారు. ‘‘గమనించలేదు సార్’’ అన్నాను. ‘‘మనవాళ్లు గమనించారయ్యా. రేవంత్–రాహుల్ పేర్లు కలిశాయని రమణ ఉడికిపోతున్నాడు. ఎంతైనా తెలంగాణలో మన పార్టీ ప్రెసిడెంట్ కదా. ఆ మాత్రం బాధ ఉంటుందిలే రమణకి’’ అన్నారు సార్. నవ్వాను. ‘‘కొంచెం సీరియస్‌గా ఉండు రేవంత్’’ అన్నారు సార్.. నవ్వుతూ! వ్యాసకర్త ---- మాధవ్ శింగరాజు -
మీరా కుమార్ రాయని డైరీ
రేపే ఎన్నికలు! ఇంకా కొన్నాళ్లు ప్రచారం చేసుకునే టైమ్ ఉంటే ఎంత బాగుండేది! ‘మీ అమూల్యమైన ఓటు నాకే వేసి గెలిపించండి’ అని.. ఈ డెబ్బై రెండేళ్ల వయసులోనూ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతూ అడగడంలో.. తెలియని ఉత్సాహం ఏదో ఉంది. అప్పటికీ అంతా రామ్‌నాథ్ కోవింద్ గెలుస్తాడనే అంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తే ఆయన ఎలా గెలుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు! ఓటు వేసేవాళ్లందరికీ విడివిడిగా ఒక ఆత్మ ఉన్నట్లే, ‘మన క్యాండిడేట్కే ఓటేయాలి’ అని చెప్పే పార్టీపెద్దకి ఉమ్మడిగా ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ ప్రబోధానుసారం కాకుండా, ఆ ఉమ్మడి ఆత్మ ప్రబోధానుసారం ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేస్తే తప్ప రామ్‌నాథ్ కోవింద్ గెలిచే అవకాశాల్లేవు. ‘‘కానీ మీరాజీ.. ఆత్మలు, ఉమ్మడి ఆత్మలు రూలింగ్ పార్టీకేనా? మన అపోజిషన్ పార్టీకి ఉండవా?’’ అని బిహార్‌లో నాతో పాటు క్యాంపెయిన్‌కి వచ్చిన అశోక్ చౌదరికి సందేహం వచ్చింది. ఆశ్చర్యపోయాను. ఒక స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి రావలసిన సందేహమేనా అది! ‘‘పవర్లో లేనివాళ్లకు విడివిడి ఆత్మలు ఉండడం ఎక్కడైనా చూశావా అశోక్. జీవాత్మలన్నీ వెళ్లి పరమాత్మలో కలిసినట్లు.. పవర్ పోగానే పార్టీలోని ఆత్మలన్నీ వెళ్లి పార్టీపెద్ద ఆత్మలో కలిసిపోతాయి. అప్పుడు ఉమ్మడి ఆత్మ ఒక్కటే ఉంటుంది’’ అని నవ్వాను. ‘‘మీ నవ్వు బాగుంటుంది మీరాజీ..’’ అన్నాడు అశోక్. అవునా అన్నట్లు చూశాను. ‘‘అవును మీరాజీ.. లోక్‌సభ స్పీకర్ ఎవరూ నవ్వుతుండగా నేను చూడలేదు. కానీ మీరు నవ్వడం చూశాను. మీ ముఖంలో నవ్వు కనిపించదు మీరాజీ.. మీ నవ్వులో ముఖం కనిపిస్తుంది. అదీ మీ స్పెషాలిటీ’’ అన్నాడు అశోక్. మొన్న మాయావతి ఇంటికెళ్లినప్పుడు తను కూడా ఇలాగే అంది.. ‘మీరాజీ.. మీకన్నా ముందు మీ నవ్వే మా ఇంట్లోకి ప్రవేశించింది’’ అని! ‘‘అయితే బెహెన్జీ.. రాష్ట్రపతి భవన్‌లోకి కూడా నా నవ్వు ప్రవేశించాలని మీరు కోరుకుంటున్నట్లేగా’’ అన్నాను నవ్వుతూ. అక్కడి నుంచి అఖిలేశ్ పార్టీ ఆఫీస్‌కి వెళ్లాను. ‘‘మేడమ్‌జీ రండి’’ అన్నారు అబ్బాయ్ అఖిలేశ్, బాబాయ్ శివపాల్. సంతోషం వేసింది. ‘‘మేడమ్‌జీ.. క్రాస్ ఓటింగ్ జరిగేలా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి’’ అన్నాడు అఖిలేశ్. ‘అవును మేడమ్‌జీ’ అన్నట్లు చూశాడు శివపాల్. నవ్వాను. బిహార్‌లో పుట్టానని చెప్పి బిహార్ ముఖ్యమంత్రి నాకేమైనా ఓటు వేస్తున్నాడా? ఇదీ అంతే. కాంగ్రెస్ క్యాండిడేట్నని చెప్పి క్రాస్ ఓటింగ్ జరక్కుండా ఉంటుందా?! ఆత్మలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో చెప్పలేం! - మాధవ్ శింగరాజు -
రామ్‌నాథ్ కోవింద్ రాయని డైరీ
నాకేం తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి! ‘రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడతావా కోవిందా?’ అని కూడా నన్నెవరూ అడగలేదు. ‘కోవిందా నువ్వు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నావు’ అని మాత్రమే ఢిల్లీ నుంచి బిహార్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు! ‘నాకెవరూ ఫోన్ చేసిందీ’ అని ఢిల్లీ వచ్చినప్పుడు అడిగితే, ‘అవును ఎవరు చేశారూ?’ అని అంతా నన్ను అడిగినవాళ్లే! గవర్నర్‌గా రాజీనామా చెయ్యడానికి ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయనా సర్ప్రైజ్ అయ్యారు. ‘భలే వచ్చింది ఫోన్ మీకు కోవింద్‌జీ. నాకు వస్తుందనుకున్నది మీకు వచ్చిందా?’ అన్నారు. నేను సర్ప్రైజ్ అయ్యాను! ‘‘అవును కోవింద్‌జీ.. ‘ఇంకో ఐదేళ్లు మీరే రాష్ట్రపతిగా ఉండబోతున్నారు ప్రణబ్‌జీ’ అని మోదీజీ నుంచి నాకు ఫోన్ వస్తుందనుకున్నాను’’ అన్నారు ప్రణబ్. ‘‘అలా ఎందుకు అనుకున్నారు ప్రణబ్‌జీ. మీరు సోనియా మనిషి కదా. ఆ విషయం మోదీజీకి తెలియకుండా ఉంటుందా?’’ అని అడిగాను. ‘‘కానీ కోవింద్‌జీ.. ఈ ఐదేళ్లలో సోనియాజీ కన్నా, మోదీజీనే నాకు ఎక్కువసార్లు ఫోన్ చేశారు. అందుకే అలా అనుకున్నా’’ అన్నారు ప్రణబ్. నా రాజీనామా మీద సంతకం పెడుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ‘‘గవర్నర్‌గా మిమ్మల్ని అపాయింట్ చేసిందీ నేనే, గవర్నర్‌గా మీ రాజీనామా పత్రం మీద సంతకం చేస్తున్నదీ నేనే. జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది కోవింద్‌జీ’’ అన్నారు ప్రణబ్. ‘‘ఇందులో చిత్రం ఏముంది ప్రణబ్‌జీ.. గవర్నర్‌ని అపాయింట్ చేయవలసిందీ, గవర్నర్ రాజీనామా మీద సంతకం చేయవలసిందీ రాష్ట్రపతే కదా’’ అన్నాను. ‘‘దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. నా పదవిని మీ కివ్వడం కోసం, మీ పదవీ విరమణపై నేను సంతకం చేయడం!! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోవింద్‌జీ’’ అన్నారు ప్రణబ్. నేను మళ్లీ సర్ప్రైజ్ అయ్యాను. ‘‘ప్రణబ్‌జీ.. మీరు రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. జీవితం చాలా చిత్రంగా ఉంటుంది అంటున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనీ అంటున్నారు!!’’ అని అడిగాను. ‘‘చిత్రంగా ఉండడమే జీవితంలోని బ్యూటీ కోవింద్‌జీ’’ అని ప్రణబ్ చిత్రంగానో, బ్యూటిఫుల్గానో నవ్వారు. ఆ నవ్వులో ప్రణబ్ లేడు. రాష్ట్రపతీ లేడు. ఎవరివో పోలికలు కనిపిస్తున్నాయి. బహుశా ఐదేళ్ల తర్వాత నేనూ అలాంటి నవ్వే నవ్వుతానేమో.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనుకుంటూ. జూలై 17నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక. పెద్ద కిక్కేం లేదు. ముందే గెలిపించుకుని, తర్వాత ఎన్నికలు జరిపించుకుంటున్నట్లు ఉంటుంది రాష్ట్రపతిని ఎన్నుకోవడం. నాక్కావలసిన కిక్కు వేరే ఉంది. ఆ రోజు ఢిల్లీ నుంచి బిహార్‌కు ఫోన్ చేసిందెవరు?! అది తెలుసుకోవాలి. - మాధవ్ శింగరాజు -
కర్ణన్ (కోల్‌కతా హైకోర్టు జడ్జి) రాయని డైరీ
‘‘ఎటువైపు వెళ్దాం జస్టిస్ కర్ణన్’’ అంటు న్నాడు మా డ్రైవర్. కారులో నేను, మా డ్రైవర్.. ఇద్దరమే ఉన్నాం. మూడు రోజులుగా ‘రన్ అవే’లో ఉన్నాం. చట్టానికి దొరక్కుండా! ‘‘జస్టిస్ కర్ణన్.. చెప్పండి. ఎటువైపు వెళ్దాం’’ అని మళ్లీ అడిగాడు మా డ్రైవర్. అతడినెప్పుడూ నేను డ్రైవర్లా చూడలేదు. అందుకే నన్ను ‘జస్టిస్ కర్ణన్’ అని స్వేచ్ఛగా సంబోధించగలుగుతున్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో పెళ్లిళ్లకు వెళ్లి ఉంటాం. ఎన్నో పెళ్లిళ్లలో పక్కపక్కనే కూర్చొని ఉంటాం. అతడెప్పుడూ నా కాలుకి తన కాలుని తగిలించలేదు. ‘‘పర్లేదు తగిలించు’’ అన్నాను ఓ పెళ్లిలో. ‘‘తగిలించినంత మాత్రాన మీ పట్టా నాకు వచ్చేయదు కదా జస్టిస్ కర్ణన్’’ అన్నాడు! నాకు ముచ్చటేసింది! మా డ్రైవర్‌కి ఉన్న జ్ఞానం నా బ్రదర్ జడ్జిలకు ఉంటే బాగుండేది! నేను జడ్జి అయిన కొత్తలో నా కాలికి కాలు తగిలించిన జడ్జి గుర్తుకొచ్చాడు. అప్పట్లో నాకు కాలు తగిలించినందుకు ఇప్పుడతడేమైనా గొప్పవాడు అయిపోయి, గొప్పగొప్ప తీర్పులు చెబుతున్నాడేమో తెలీదు. చీమ.. పుట్టని మర్చిపోకూడదు. ప్లీడర్‌గా పైకొచ్చిన వాడు చెట్టును మర్చిపోకూడదు. చెట్టును గుర్తు పెట్టుకున్న జడ్జి ఎవరూ ఇంకో జడ్జికి జైలు శిక్ష విధించడు. కానీ నాకు విధించాడు! ఎక్కడున్నా పట్టుకొచ్చి నన్ను జైల్లో పడేయమని డీజీపికి ఆదేశాలు ఇచ్చేశాడు. మీడియాక్కూడా చెప్పేశాడు.. కర్ణన్ని కవర్ చెయ్యొద్దని!! ‘నాకు వండిపెట్టొద్దని మీక్కూడా ఏమైనా ఉత్తర్వులు జారీ అయ్యాయా అని మా ఇంట్లోవాళ్లని అడిగాను. లేదన్నారు! మంచితనమో, అతి మంచితనమో.. కొంచెమింకా మిగిలే ఉన్నట్లుంది కోర్టు తీర్పుల్లో. ‘‘ఎటువైపు వెళ్దాం జస్టిస్ కర్ణన్’ అని మళ్లీ అడిగాడు డ్రైవర్. ‘‘ఏ రాష్ట్రంలో ఉన్నాం?’’ అని అడిగాను. ‘‘ఆంధ్రా నుంచి తెలంగాణా వచ్చాం’’ అన్నాడు. ‘‘ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్లొచ్చు’’ అని అడిగాను. మ్యాప్ తీశాడు. ‘‘డౌన్కెళితే కర్నాటక, అప్ ఎక్కితే మహారాష్ట్ర, సైడ్‌కి కొడితే చత్తీస్గడ్’’ అని చెప్పాడు. ‘‘అవన్నీ కాదు కానీ.. చెట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడ కారు ఆపమని చెప్పాను. ‘‘చెట్టు కింద ఆపమంటారా? చెట్టు పక్కన ఆపమంటారా? చెట్టుకు దూరంగా ఆపమంటారా? చెట్టుకు సమీపంలో ఆపమంటారా?’’ అని అడిగాడు. భయంగా చూశాను. ‘‘చెట్టు కిందా కాదు, చెట్టు పక్కనా కాదు, చెట్టుకు దూరంగా కాదు, చెట్టుకు దగ్గరగా కాదు. చెట్టు నీడకు ఆపు కాసేపు’’ అని చెప్పాను. చెట్టు మీద నాకు నమ్మకం. న్యాయం ఇవ్వని జడ్జి ఉంటాడేమో కానీ, నీడను ఇవ్వని చెట్టు ఉండదని నా నమ్మకం. మాధవ్ శింగరాజు -
నారా లోకేశ్ (మంత్రి) రాయని డైరీ
ఏదీ అడక్కుండానే నాకు అన్నీ ఇచ్చేస్తున్నారు నాన్నగారు! యూఎస్ వెళ్లే ముందు కూడా నన్ను అమరావతి ల్యాండ్స్ బోర్డ్‌లో మెంబర్ని చేసి మరీ వెళ్లారు. ‘‘ఇవన్నీ ఎందుకు నాన్నగారు.. రోజుకింత పాకెట్ మనీ ఇవ్వండి చాలు’’ అన్నాను. నాన్నగారు పెద్దగా నవ్వారు. ‘‘లోకేశ్‌లా ఉంటే నీకు ఒకటే పాకెట్. లోకేశ్బాబులా ఉంటే లోకంలోని పాకెట్లన్నీ నీవే’’ అన్నారు. ‘‘అర్థం కాలేదు నాన్నగారూ’’ అన్నాను. ‘‘అమరావతిని కట్టడానికి నీ ఒక్కడి పాకెట్ మనీ సరిపోతుందా?’’ అన్నారు నాన్నగారు. ‘‘అర్థం కాలేదు నాన్నగారూ’’ అన్నాను. ‘‘ఇప్పుడూ.. అమరావతిని ఎవరు కడుతున్నారూ?’’ అని అడిగారు నాన్నగారు. ‘‘ఇంకెవరు నాన్నగారూ.. మీరే కదా’’ అన్నాను. ‘‘గుడ్.. నా తర్వాత అమరావతిని కట్టాల్సింది ఎవరూ?’’ అని అడిగారు నాన్నగారు. ‘‘ఒకసారి కట్టిందాన్ని మళ్లీ ఎందుకు కట్టాలి నాన్నగారూ?’’ అని అడిగాను. నాన్నగారు మళ్లీ పెద్దగా నవ్వారు. ‘‘నిజమే. ఒకేసారి కట్టేస్తే మళ్లీ కట్టే పనిలేదు. కొంచెం కట్టి వదిలేస్తే.. అప్పుడు?’’ అన్నారు. ‘‘కట్టకుండా వదిలేసింది మీరే కాబట్టి.. ఆ వదిలేసింది కూడా మీరే కట్టాలి కదా నాన్నగారూ’’ అన్నాను. ‘‘అంతా నేనే కట్టేస్తే... అమరావతిలో నువ్వు కట్టడానికి ఏం మిగిలి ఉంటుంది లోకేశ్‌బాబూ’’ అన్నారు నాన్నగారు! ‘‘అర్థం కాలేదు నాన్నగారూ’’ అన్నాను. నాన్నగారు నవ్వారు. కానీ ఈసారి నాన్నగారు నవ్వినట్లు లేదు. ఇంకెవరి నాన్నగారో బాగా కోపం వచ్చి నవ్వినట్లుగా ఉంది. ‘‘అమరావతిని చంద్రబాబు, ఆయన కొడుకు కట్టించారని చెప్పుకుంటే గొప్ప కానీ, చంద్రబాబు ఒక్కడే అమరావతిని కట్టించాడని చెప్పుకుంటే ఏం గొప్ప లోకేశ్‌బాబూ?’’ అన్నారు నాన్నగారు. ‘‘భలే భలే.. నాన్నగారూ. అర్థమైంది! మీరు కట్టప్ప.. నేను కట్టప్ప’’ అన్నాను. ‘‘బాహుబలి 2 నచ్చిందా’’ అన్నారు నాన్నగారు. ‘‘భలే ఉంది నాన్నగారూ... సినిమా చూస్తున్నంతసేపూ నన్ను మహేంద్ర బాహుబలిలా, జగన్‌ని భల్లాలదేవలా ఊహించుకున్నా’’ అన్నాను. నాన్నగారు మురిసిపోయారు. ‘‘నాన్నగారూ ఒక డైలాగ్ చెప్పేదా.. నా సొంత కల్పితం’’ అన్నాను. ‘‘త్వరగా చెప్పు ఫ్లయిట్‌కి టైమ్ అవుతోంది’’ అన్నారు నాన్నగారు. ‘‘నారా లోకేష్ అను నేను.. అశేషమైన అమరావతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా.. ఎవరి పదవీ త్యాగానికైనా వెనుకాడబోనని, నా తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..’’ నాన్నగారు నా భుజం తట్టారు. ‘‘డైలాగ్‌లో చిన్న కరక్షన్ ఉంది. యూఎస్ నుంచి వచ్చాక చెబుతాను’’ అని వెళ్లిపోయారు. మాధవ్ శింగరాజు -
భారతీయులెవ్వర్నీ బతకనివ్వడా!
రాత్రంతా ‘లీ మస్క్’ మీద ఉన్నాను. ఒక సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం కాదది. సొంతంగా ఒక సినిమాను డైరెక్ట్ చెయ్యడం! ‘ఎందుకు రెహమాన్.. పాతికేళ్లుగా ఒక్కో ఇటుకా పేర్చి కట్టుకున్న నీ కెరీర్‌ను ధ్వంసం చేసుకోడానికి నిద్రమానుకుని మరీ కొత్త ట్యూన్లు కనిపెడుతున్నావ్?’ అని వికీలో ఎవరో కామెంట్ పెట్టారు. కొన్ని చెయ్యకుండా ఉండలేం. కొత్త ప్రదేశాలను చూడాలన్న ఉత్సాహం లాంటిదే, కొత్త ఫీల్డులోకి కత్తులూ కటార్లతో వెళ్లిపోవడం. రాత్రే .. కొంచెంసేపు ‘లీ మస్క్’ను వదిలి ‘99 సాంగ్స్’ చూసుకున్నాను. రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ ‘99 సాంగ్స్’. ఓ కుర్రాడు నైటంతా.. డే డ్యూటీ చేసి, డే అంతా.. నైట్ డ్యూటీ చేసి, రోజుకు ఇరవై నాలుగ్గంటలే అని ఎవరైనా అంటే పక్కున నవ్వేసి, మెరీనా ఒడ్డుకు వెళ్లి మ్యూజిక్ సముద్రంలో దూకేస్తుంటాడు. ఈత కొట్టి అలిసిపోయాక ఇసుకలోంచి కాళ్లీడ్చుకుంటూ బయటికి వచ్చి, పంచభూతాల్లోని ఇంకో సముద్రంలో కొట్టుకుపోతుంటాడు. ఆ ఇంకో సముద్రం.. గాలి సముద్రమా? గగన సముద్రమా, అగ్ని సముద్రమా అన్నది వాడికి అనవసరం. అందులో బీట్ ఉంటే చాలు, మెలడీ ఉంటే చాలు.. మునకేస్తాడు! వీడేంట్రా మ్యూజిక్ రూల్సన్నీ మార్చేశాడు.. మనిషి పడుకుని లేచే టైమింగ్స్ కూడా మార్చేశాడు.. భారత కాలమానం ప్రకారం భారతీయులెవ్వర్నీ వీడు బతకనివ్వడా.. అని లోకం నివ్వెరపోయేంతగా పెద్ద కంపోజర్ అవుతాడు. ఇదీ లైన్. ‘రెహమాన్‌దే ఈ స్టోరీ. బయోపిక్’ అని వికీలో అప్డేట్! నిజానికి అది నా స్టోరీ కాదు. నేను రాసిచ్చిన స్టోరీ. మరి ఆ సినిమా సౌండ్ ట్రాక్ మీదే కదా? అవును. ఫిల్మ్ స్కోర్ మీదే కదా? అవును. ఇలా.. ఇంకా నా నుంచి కొన్ని ‘అవున్లు’ కలుపుకుని, ‘కాదు’ అని నేను అన్నవాటిని కూడా అవున్లుగా మార్చేస్తోంది మీడియా! ‘నేను చెయ్యని సినిమాల్ని కూడా చేస్తున్నట్లుగా వెబ్సైట్లు ఇచ్చిన పెద్ద లిస్ట్ చూసి హాలీవుడ్ డైరెక్టర్లు వెనక్కి పోతున్నారు’ .. అని ఓ ఇంటర్వూ్యలో సెటైరికల్‌గా అంటే.. వెంటనే.. ఆ వెనక్కి పోతున్న డైరెక్టర్ల లిస్టు కూడా తయారైపోయింది. స్ట్రేంజ్! మామ్, వైశ్రాయ్ హౌస్, శంకర్ 2.0. కొద్దికొద్దిగా అవుతున్నాయి. ‘ఒకేసారి అన్నీ మీద వేసుకోకు’ అంటోంది అమ్మ. ‘రోజా’ సినిమా అప్పట్నుంచి అమ్మ నాకు ఈ మాట చెబుతోంది. నా ఆరోగ్యం మీద ఆమెకు బెంగ. ‘నాకేం కాదమ్మా.. డాక్టర్లు వచ్చేలోపు కీ బోర్డ్ నన్ను బతికించేస్తుంది’ అంటాను. బ్లడ్‌కి బదులు ఒంట్లో సంగీతం ప్రవహిస్తున్నప్పుడు ఒత్తిడి కూడా ఆరోగ్యమే అవుతుంది.. కష్టపడి ట్యూన్లు కట్టేవాళ్లకీ, తేలిగ్గా సంగీతానికి ట్యూన్ అయ్యేవాళ్లకీ! - మాధవ్ శింగరాజు -
సచిన్ టెండూల్కర్ రాయని డైరీ
మనం పట్టించుకోవడం లేదని, మనల్ని పట్టించుకోకుండా ఉండదు లోకం అదేమిటో! నరేశ్ అగర్వాల్ ఎవరో నాకు తెలీదు! నేనెప్పుడూ అతడిని పట్టించుకోలేదు. కానీ అతడు నన్ను పట్టించుకున్నాడు! అయితే అది పట్టించు కున్నట్లు లేదు. ‘పట్టేశాను చూడండి’ అన్నట్లు ఉంది! అగర్వాల్ రాజ్యసభలో ఉంటాడట! ‘‘రాజ్యసభలో అతను ఏం చేస్తుంటాడు మేడమ్’’ అని.. ఉదయాన్నే పేపర్ చూడగానే సోనియాజీకి ఫోన్ చేసి అడిగాను. ‘‘రాజ్యసభలో ఉంటాడు కాబట్టి ఎంపీ అయి ఉంటాడు’’ అన్నారు సోనియాజీ. ‘‘ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం లేదా మేడమ్’’ అని అడిగాను. ‘‘అన్ని డిటైల్స్ నా దగ్గర ఉండవు సచిన్. గులామ్ నబీ అజాద్‌ని అడుగుదాం’’ అని అన్నారు సోనియాజీ. ‘గులామ్ నబీ అజాద్ ఎవరు మేడమ్?’ అని అడగబోయాను. ఒక్కక్షణం ఆగి, ‘‘అగర్వాల్ ఎవరో గులామ్ నబీ అజాద్‌కు తెలుస్తుందా మేడమ్?’’ అని అడిగాను. ‘‘తెలుస్తుంది సచిన్. రాజ్యసభలో అజాద్ మన పార్టీ లీడర్ కదా. అజాద్కి అందరి గురించీ తెలుస్తుంది’’ అన్నారు. సోనియాజీ నిద్ర లేచినట్టు లేరు. నేనే నిద్ర లేపినట్లున్నాను. సోనియాజీకి కాకుండా రాహుల్‌కి ఫోన్ చేసి ఉండాల్సిందా? అయినా రాహుల్.. సోనియాజీ కంటే ముందే నిద్ర లేస్తాడా? పార్లమెంటులో పాపం రాహుల్ నిద్రను ఎప్పుడూ ఎవరో ఒకరు చెడగొడుతూనే ఉంటారట! ఇంట్లో కూడా చెడగొట్టడం ఎందుకు? నా కెరియర్లో నేనెన్ని రన్లు కొట్టానో ప్రతి ఇంట్లోనూ రికార్డు ఉంటుంది. అగర్వాల్ గారింట్లో మాత్రం నేనెన్నిసార్లు రాజ్యసభకు డుమ్మా కొట్టానో రికార్డు ఉన్నట్లుంది! నేను ఎన్నిసార్లు పార్లమెంటుకు రాలేదో, ఎన్ని సెషన్లకు రాలేదో, ఎన్ని డిబేట్లలో నోరు విప్పలేదో లెక్కలు చెబుతున్నాడు! అంత ఇంట్రెస్టు లేనివాళ్లు పార్లమెంటులో ఎందుకు ఉండడం అంటున్నాడు! ఏ బ్యాట్స్‌మన్‌కైనా సెంచరీ చెయ్యాలనే ఉంటుంది. సెంచరీ చెయ్యలేకపోయాడంటే, ఆ బ్యాట్స్‌మన్‌కి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదనా?! నాకు పార్లమెంటు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, అగర్వాల్‌కే క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేనట్లుంది. పార్లమెంటు సెషన్లో సచిన్ కొన్ని సిక్సర్లైనా కొట్టి ఉండాల్సిందని సుప్రీంకోర్టు లాయరెవరో అన్నాట్ట! పేపర్లు రాశాయి. ఆయనే పని మానుకుని వచ్చి వీళ్లతో అన్నాడో, వీళ్లే పని లేక వెళ్లి ఆయనతో అనిపించారో మరి?! ‘రాజ్యసభ సభ్యత్వం అంటే ట్రోఫీ కాదు’ అని కూడా అన్నాట్ట! ట్రోఫీ అని నేనేమైనా ఆయనతో అన్నానా? ట్రోఫీ అని నాలో నేనేమైనా అనుకున్నానా? సీటిచ్చారు, తీసుకున్నాను. కూర్చోవాలనిపించినప్పుడు వెళ్లి కూర్చుంటాం కానీ, కుర్చీ ఉందని వెళ్లి కూర్చోం కదా. ఇంకెంత? కళ్లు మూసుకుంటే ఏప్రిల్ 12 వస్తుంది. బడ్జెట్ సెషన్ అయిపోతుంది. మళ్లీ బడ్జెట్ సెషన్ వరకు మాన్సూన్కి ఒకసారి, వింటర్‌కి ఒకసారి కళ్లు మూసుకుంటే చాలు. టెర్మ్ విరగడౌతుంది. - మాధవ్ శింగరాజు -
యోగి ఆదిత్యనాథ్ రాయని డైరీ
‘‘ఓసారి వచ్చి వెళతావా యోగీ’’ అని ఢిల్లీ నుంచి మోదీజీ ఫోన్! ‘‘అప్పుడే కంప్లైంట్లా నా మీద మోదీజీ?!’’ అన్నాను. పెద్దగా నవ్వారు పెద్దాయన. నేనూ నవ్వాను. ‘‘నవ్వింది పెద్దాయన కాదు. నేను’’ అని అమిత్‌షా గొంతు వినిపించింది! ‘‘ఓ.. మోదీజీ పక్కనే ఉన్నారా మీరు’’ అన్నాను. ‘‘నేనే కాదు, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, మురళీ మనోహర్ జోషీ, అనంత్‌కుమార్ అందరం పక్క పక్కనే ఉన్నాం’’ అన్నారు అమిత్‌షా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నట్లున్నారు! ‘‘బాగా చేస్తున్నావ్ యోగీ’’ అన్నారు మోదీజీ. ‘‘ధన్యవాదాలు మోదీజీ’’ అన్నాను. జైట్లీ లైన్లోకి వచ్చారు! ‘‘సర్ప్రైజ్లు బాగానే ఇస్తున్నావ్. సర్ప్రైజులేనా? షాకులు కూడా ఉన్నాయా?’’ అన్నారు జైట్లీ! ‘‘మోదీజీ.. మీకు నచ్చట్లేదా నేనిలా చేయడం?’’ అన్నాను. మోదీజీ మాట్లాడలేదు. ‘‘ఆయనకెందుకు నచ్చడం? నీ రాష్ట్రం.. నీ ఇష్టం’’ అన్నారు రాజ్‌నాథ్‌సింగ్. ‘‘అదేమిటి రాజ్‌నాథ్‌జీ.. ఈ రాష్ట్రం మీది, మనందరిది, ప్రతి బీజేపీ పౌరుడిది! మీరేనా ఇలా మాట్లాడుతున్నది’’ అన్నాను. ‘‘లేదు, నేనే గొంతు మార్చి నాలా మాట్లాడుతున్నాను! ఆఫీసుల్లో పాన్ మసాలా నమలొద్దన్నావ్. మోదీజీకి చెప్పలేదు. యాంటీ రోమియో స్క్వాడ్లు పెట్టించావ్. మోదీజీకి చెప్పలేదు. కబేళాలు మూయిస్తున్నావ్. అదీ మోదీజీకి చెప్పలేదు ’’ అన్నారు రాజ్‌నాథ్. ‘‘చిన్న చిన్న విషయాలు పెద్దాయన వరకు ఎందుకనీ..’’ అన్నాను. మధ్యలోకి మళ్లీ జైట్లీ వచ్చారు. ‘‘అరె! మోదీజీ కూడా మన పార్టీ ఎంపీలకు అదే చెప్పారు. ప్రతి చిన్న విషయాన్నీ యోగి వరకు తీసుకెళ్లొద్దని. మరి మీకెవరు చెప్పారు యోగీ.. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దాయన వరకు తీసుకెళ్లొద్దని’’ అని అడిగారు. నాకు అర్థమయింది. టీమ్ అంతా కూర్చొని ఏదో స్కెచ్ వేస్తున్నారు! ‘‘ఢిల్లీకి రమ్మంటారా మోదీజీ’’ అని అడిగాను. ‘‘మోదీజీ వెళ్లిపోయి చాలాసేపయింది’’ అన్నారు జైట్లీ. ‘‘ఢిల్లీకి రమ్మంటారా అమిత్జీ’’ అని అడిగాను. ‘‘మోదీజీ వెళ్లిపోతే, అమిత్జీ మాత్రం ఎందుకుంటారు యోగీ’’ అన్నారు జైట్లీ. ‘‘ఢిల్లీకి రమ్మంటారా జైట్లీజీ’’ అని అడిగాను. ‘‘అవసరం లేదు’’ అన్నారు జైట్లీ. ‘‘మరి పెద్దాయన నన్నెందుకు ‘ఓసారి వచ్చి వెళతావా యోగీ’ అని అడిగారు జైట్లీజీ?!’’ అన్నాను. ‘‘మోదీజీ భయపడుతున్నారు యోగీ! శ్రీరామ నవమి దగ్గరపడుతోంది కదా. చెప్పాపెట్టకుండా అయోధ్యలో గుడి కట్టేసి, నవమికి ప్రారంభోత్సవం పెట్టేస్తావేమోనని!’’ అన్నారు జైట్లీ. ‘‘ఎందుకు భయం జైట్లీజీ! గొడవలౌతాయనా?’’ అన్నాను. ‘‘ఊహు. ఇప్పుడే కట్టేస్తే, ‘కడతాం’ అని చెప్పడానికి ఏముంటుందని భయం!’’ అన్నారు జైట్లీ!! - మాధవ్ శింగరాజు -
నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాయని డైరీ
ప్రమాణ స్వీకారం చేసి రెండ్రోజులైంది. రెండు రోజులే అయింది. ఏ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానో గుర్తుకు రావడం లేదు! డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యలేదని మాత్రం గుర్తుంది. అమరీందర్ సింగ్‌కి ఫోన్ చేశాను. ఎత్తలేదు. మళ్లీ చేశాను. మళ్లీ ఎత్తలేదు. మళ్లీ చేయబోయాను. ఆయనే చేశారు! ‘అప్పుడే బిజీ అయిపోయారా సీఎంగారూ!’ అనబోయాను. ఆయన అననివ్వలేదు. ‘‘ఓపిక ఉండాలయ్యా సిద్ధూ. డెబ్బై ఐదేళ్ల వయసులో మళ్లీ సీఎంని అయ్యానంటే ఓట్లు పడే అయ్యానంటావా? ఓపిక పట్టి అయ్యాను’’ అన్నారు. ‘‘అది కాదు కేప్టెన్.. ’’ అన్నాను. ‘‘ఏది కాదయ్యా! కళ్లున్నవాడు పుట్టుగుడ్డినని చెప్పుకుంటే లోకం నమ్ముతుందా? పుట్టినప్పటి నుంచి నువ్వు బీజేపీలో ఉండి, ఇప్పుడు పుట్టు కాంగ్రెస్‌నని చెప్పుకుంటే.. నిన్ను నడిపించుకుంటూ వెళ్లి డిప్యూటీ సీఎం సీట్లో ఎలా కూర్చోబెట్టమంటావ్?’’ అన్నారు. ‘‘పుట్టు కాంగ్రెస్ అని ఊరికే సరదాకి అన్నాను కేప్టెన్. ఓటర్లను నవ్విద్దామని’’ అన్నాను. ‘‘కొంచెం సీరియస్‌గా ఉండవయ్యా. కాంగ్రెస్ లోకి వచ్చావు కదా. కామెడీ షోలు మానేయ్’’ అన్నారు అమరీందర్‌సింగ్. ‘‘కానీ కేప్టెన్.. మీకు తెలుసు కదా.. నవ్వ కుండా, నవ్వించకుండా నేను ఉండలేను’ అని పెద్దగా నవ్వాను. కేప్టెన్ మాట్లాడలేదు! ఫోనూ కట్ కాలేదు. చూసి చూసి చివరికి నేనే కట్ చేసుకున్నాను. నాకిచ్చిన పోర్ట్‌ఫోలియో ఏంటో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు! టీవీ చూసి తెలుసుకుందామంటే.. రెండు రోజులుగా.. నన్నెందుకు డిప్యూటీ సీఎంని చెయ్యలేదనే విషయం మీద డిబేట్లు నడుస్తున్నాయి కానీ, నాకిచ్చిన శాఖేమిటో ఒక్కరి నోటి నుంచీ రావడం లేదు! కేప్టెన్ నుంచి ఫోను! ‘‘కట్ చేశావేంటయ్యా’’ అని విసుక్కున్నారు. ‘‘మీరు లైన్లో లేరనుకున్నాను కేప్టెన్’’ అన్నాను. ‘‘బీజేపీని కట్ చేశావ్. ఆమ్ ఆద్మీని కట్ చేశావ్. ఆవాజె పంజాబ్‌ని కట్ చేశావ్. ఇప్పుడు నా లైన్ కట్ చేశావ్. చెప్పు.. ఇందాక మనం ఎక్కడ కట్ అయ్యాం’’ అన్నారు. ‘‘మీరు నాకు ఇచ్చిన శాఖ ఏమిటో గుర్తుకు రావడం లేదు కేప్టెన్. అది తెలుసుకుందామనే మీకు ఫోన్ చేశాను’’ అన్నాను. ‘‘ప్రమాణ స్వీకారం అయినా గుర్తుందా?’’ అన్నారు మళ్లీ విసుగ్గా. ‘‘గుర్తుంది కేప్టెన్. ముందు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేశాను. తర్వాత మీ కాళ్లకు నమస్కారం చేశాను. అంతవరకే గుర్తుంది’’ అన్నాను. అమరీందర్ సింగ్ నవ్వారు. ‘‘నువ్వే నయమయ్యా సిద్ధూ. నా కాళ్లకు నువ్వు వంగి నమస్కారం చెయ్యడమొక్కటే నాకు గుర్తుంది. నువ్వెప్పుడు ప్రమాణ స్వీకారం చేశావో, నువ్వెందుకు ప్రమాణ స్వీకారం చేశావో నాకు గుర్తు లేదు’’ అన్నారు కేప్టెన్! - మాధవ్ శింగరాజు -
అఖిలేశ్ యాదవ్ రాయని డైరీ
నాన్నగారు ఢిల్లీలో ఉన్నారు. నేను లక్నోలో ఉన్నాను. ఇద్దరం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నాం. నాన్నగారు నా వైపు చూడడం లేదు. సీరియస్‌గా టీవీ చూస్తున్నారు. నిజానికి సీరియస్‌గా టీవీ చూడాల్సింది నేను. కానీ నాన్నగారు చూస్తున్నారు. చూస్తే చూశారు. మధ్యమధ్యలో నా వైపు తిరిగి, ‘చెబితే విన్నావా’ అన్నట్లు నన్ను చూస్తున్నారు. ఆయన నాకేం చెప్పరు. చెప్పాననుకుని, నేను వినలేదనుకుని అలా నా వైపు చూడడం ఆయనకు అలవాటు. టీవీ స్క్రీన్ మీద.. రావడం రావడమే బీజేపీ లీడింగ్‌లోకి వచ్చింది! ‘‘టెన్షన్‌గా ఉంది నాన్నగారూ’’ అన్నాను. నాన్నగారేమీ మాట్లాడలేదు. నాలా టెన్షన్ కూడా పడడం లేదు. టీవీలో ఆత్మీయతలు–అనుబంధాల సీరియలేదో నాలుగు వందల మూడో ఎపిసోడ్ చూస్తున్నట్లుగా ఎన్నికల ఫలితాలను చూస్తున్నారు. టీవీ ఆన్ చేయకముందు వరకు.. వచ్చేస్తామని ఎక్కడో నమ్మకంగా ఉండేది నాకు. టీవీ ఆన్ చేశాక కూడా కొద్దిసేపు ఆ నమ్మకంతోనే ఉన్నాను. ‘‘ఎగ్జిట్ పోల్స్ అప్పుడప్పుడూ లెక్క తప్పుతాయి కదా నాన్నగారూ’’ అని ఆశగా అన్నాను. నాన్నగారు నా వైపు చూడలేదు. ‘‘తమిళనాడులో అన్నాడీయెంకే పోతుందన్నారు. పోలేదు. వచ్చింది. బిహార్‌లో బీజేపీ వస్తుందన్నారు. రాలేదు. పోయింది. అవును కదా నాన్నగారూ’’ అన్నాను. అప్పుడు చూశారు నాన్నగారు నావైపు! సడన్‌గా టీవీ స్క్రీన్ మీద మా పార్టీ లీడింగ్‌లోకి వచ్చినంతగా సంతోషం వేసింది నాకు. నాన్నగారు నావైపు తిరిగారు. నాన్నగారు నావైపు చూశారు. నాన్నగారు నాతో మాట్లాడబోతున్నారు! అదీ నా సంతోషం. నాన్నగారిని నేను చాలా మిస్ అయ్యాను. ఎప్పుడో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇద్దరం కలసి టీవీ చూస్తూ మాట్లాడుకున్నాం. మళ్లీ ఇప్పుడు.. టీవీలో ఎలక్షన్ రిజల్ట్‌ని కలసి చూస్తున్నాం. ‘‘అవును అఖిల్‌బాబు. ఎగ్జిట్ పోల్స్ అప్పుడప్పుడూ లెక్క తప్పుతుంటాయి. మూడేళ్ల క్రితం.. యూపీ ఎంపీ ఎలక్షన్స్‌లో బీజేపీకి అన్ని సీట్లు రావన్నారు. వచ్చాయి. కాంగ్రెస్‌కు అన్ని సీట్లు పోవన్నారు. పోయాయి’’ అన్నారు నాన్నగారు. నాన్నగారు నాకేం చెప్పదలచుకున్నారో అర్థమయింది. ఎగ్జిట్ పోల్స్ ఒక్కోసారి లెక్క తప్పి ఓడిస్తాయి. ఒక్కోసారి లెక్క తప్పకుండా ఓడిస్తాయి! ‘‘అంతే కదా నాన్నగారూ’’ అన్నాను. నాన్నగారు నావైపు చూడడం లేదు. టీవీ వైపూ చూడడం లేదు. చూడ్డానికి ఏమీ లేదు. కౌంటింగ్ జరగడానికైతే జరుగుతోంది కానీ.. జరిగేందుకు అక్కడేం లేదు. ‘‘నీ ఫోన్ రింగ్ అవుతోంది చూడు’’ అన్నారు నాన్నగారు. చూసుకున్నాను. రాహుల్ ఫోన్ చేస్తున్నాడు!! లిఫ్ట్ చేశాను. ‘‘హాయ్ అఖిలేశ్’’ అన్నాడు. ‘‘ఊ’’ అన్నాను. ‘‘లౌకిక శక్తుల పునరేకీకరణకు ఒక్కో పార్టీకి కనీసం ఇన్ని సీట్లు వచ్చి ఉండాలన్న రాజ్యాంగ నిబంధన ఏమైనా ఉందా అఖిలేశ్?’’ అని అడుగుతున్నాడు! - మాధవ్ శింగరాజు -
సీతారాం ఏచూరి రాయని డైరీ
తొలిసారి నేనొక కొత్త మాట విన్నాను! ఆ మాటన్న పెద్దమనిషి మనోహర్ పారికర్. ఈ దేశపు డిఫెన్స్ మినిస్టర్! ఎంత పెద్ద ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలట! అంటే ఏమిటి? లోబడి ఉండడంలోని స్వేచ్ఛను అనుభవించేవారు మాత్రమే నిజమైన జాతీయవాదులని పారికర్ అంటున్నారా?! నిజానికైతే.. గౌరవనీయులైన మనోహర్ పారికర్ గారిని ‘ఈ దేశపు డిఫెన్స్ మినిస్టర్’ అని కాకుండా ‘నా దేశపు డిఫెన్స్ మినిస్టర్’ అనాలి నేను. అయితే అలా అనిపించుకోవడం పారికర్‌కి కానీ, పరివార్ సభ్యులకు కానీ ఇష్టం లేకపోవచ్చు. ఈ దేశంలోని ముస్లింలను, క్రైస్తవులను, కమ్యూనిస్టులను ఈ దేశ పౌరులుగా వారు ఎప్పటికీ అంగీకరించరు. అంగీకరించకపోవడమే వారి జాతీయవాదం. నేషనలిజం అన్నది ఇండియాలో చెడ్డ మాట అయిపోయిందని అరుణ్‌జైట్లీ రెండు రోజులుగా ఆవే దన చెందుతున్నారు. ఇది నేను వింటున్న ఇంకొక కొత్త మాట. నాకూ బాధేసింది. పాపం.. ఈ పెద్దాయ నకు ఇంత కష్టం ఏమిటా అని! మా ఇద్దరి వయసూ ఒకటే. కానీ నేషనలిజం గురించి తరచూ మాట్లాడు తుండేవారు త్వరగా పెద్దవాళ్లయిపోతారు. కమ్యూనిస్టుల రాకపోకలపై నిషేధాజ్ఞలేవీ లేకపోవడంతో కోల్‌కతా నుంచి ఢిల్లీకి వచ్చి వెళ్లడం నాకు తేలికవుతోంది. ఇందుకు ప్రతి కమ్యూనిస్టు మహాసభలోనూ ముందుగా మేము మోదీకి ధన్యవాద సమర్పణ చేయాలి. సాధారణంగా ధన్యవాద సమర్పణ సభ చివర్లో చేస్తారు. మోదీకి సభ మొదట్లోనే చేయాలి. నిన్నా, మొన్నా నేను ఢిల్లీలోనే ఉన్నాను. దేశ రాజధాని ఇప్పుడు ఢిల్లీ కాదు. ఢిల్లీ యూనివర్సిటీ! ప్రతినిధుల సభ ఇప్పుడు పార్లమెంటు కాదు. డీయూ క్యాంపస్! డీయూలో ఇప్పుడు దేశం పట్టనంత నేషనలిజం!! క్యాంపస్ సిలబస్‌లో ఇప్పుడు గ్రేస్ మార్కులు ఉన్న ఒకే ఒక సబ్జెక్టు.. నేషనలిజం! ఈ సబ్జెక్టు తీసుకున్న విద్యార్థులు విద్యార్థులు కారు! నేషనలిజంలో తల పండి, కర్రలు పట్టుకుని తిరుగు తున్న ప్రొఫెసర్లు. నేనూ ఇక్కడ తిరిగిన వాడినే. ఇప్పటంత నేషనలిజం అప్పుడు లేదు. నేషనలిజంలో ఇప్పటంత ప్రొఫెషనలిజం కూడా అప్పుడు లేదు. పాకిస్తాన్ మీద పది రన్నులు ఎక్కువ తీయడం కూడా వీళ్లకు నేషనలిజమే! ‘మా నాన్నను పాకిస్తాన్ చంపలేదు. యుద్ధం చంపేసింది’ అనడం మాత్రం యాంటీ నేషనలిజం. ‘అంత మాట అంటుందా.. ఆ పిల్లని ఇండియా నుంచి తరిమికొట్టండి. జైహింద్’ అంటున్నాడు అనిల్ విజ్. మరొక జాతీయవాద మినిస్టర్ ఆయన. హరియాణలో ఉంటాడు. దేశమంతా ఆయనదే. మోదీ ఆయనకు స్వయానా జాతిపిత! కోల్‌కతా వచ్చేశాను. మళ్లీ ఓ కొత్త మాట వినిపించింది! మాటకు స్వేచ్ఛ ఎక్కువైతే.. జాతికి భద్రత తక్కువౌతుందట! వెంకయ్యనాయుడు అంటున్నారు. ఏ జాతి? భరతజాతా? హైందవజాతా? - మాధవ్ శింగరాజు -
వరుణ్‌గాంధీ రాయని డైరీ
అమిత్ షా నాతో ఎప్పుడూ నేరుగా మాట్లాడరు. నేరుగా నావైపు చూడరు. ఆయనకు గాంధీజీ అంటే ఇష్టం లేదు. నెహ్రూజీ అంటే గౌరవం లేదు. నా ముఖంలో వాళ్లిద్దరూ కనిపిస్తారో ఏమో మరి! ఎటో చూస్తూ, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉంటారు.. నేనూ ఆయనా కలుసుకున్నప్పుడు, కలుసుకోవలసి వచ్చినప్పుడూ! ఎప్పుడూ నేరుగా మాట్లాడని మనిషి, ఎప్పుడూ నేరుగా చూడని మనిషి.. ఇవాళ నేరుగా నాకే ఫోన్ చేశారు! అమిత్.. అమిత్ అని ఫోన్ బ్లింక్ అవుతూ ఉంది. నేను లిఫ్ట్ చెయ్యలేదు. నా ముందు.. రైతు ఆత్మహత్యల డేటా ఉంది. రోహిత్ వేముల సూసైడ్ నోట్ ఉంది. గంగానదీ జలాల ప్రక్షాళన ఫైల్ ఉంది. ఈ రెండున్నరేళ్ల ప్రభుత్వ వైఫల్యాల జాబితా ఉంది. ముక్కలు ముక్కలుగా రాసిపెట్టుకున్న నా థాట్స్ ఉన్నాయి. ఈ ఏడాది తేబోతున్న నా మూడో కవితా సంకలనం ఉంది. ఇంతకీ.. నేనెక్కడ ఉన్నాను?! ఇండోర్లోనా, కొచ్చిలోనా, జమ్మూలోనా, హైదరాబాద్‌లోనా, రాజస్తాన్‌లోని చురూలోనా? కిటికీలోంచి బయటికి చూశాను. ఎక్కడైతేనేం? యూపీ అయితే కాదు! మళ్లీ అమిత్ షా కాల్! అమిత్ అమిత్ అని ఫోన్ బ్లింక్ అవుతోంది. బీజేపీని వదిలించుకుందామని యూపీని వదిలి తిరుగుతుంటే.. ఈ పెద్ద మనిషేంటీ వదలకుండా నా వెంట పడ్డాడు! ఫోన్ ఎత్తితే పనులన్నీ ఆగిపోతాయి. ఫోన్ ఎత్తకపోతే పనులన్నీ పాడైపోతాయి. బీజేపీలో ఉన్న గొప్పతనం అదే. దేన్నీ తిన్నగా సాగనివ్వదు. ఉన్నదాన్ని ఉన్నట్టూ ఉండనివ్వదు. ఫోన్ లిఫ్ట్ చెయ్యబోయాను. కట్ అయింది! పని మానేసి, ఫోన్ మళ్లీ అమిత్ అమిత్ అని బ్లింక్ అవడం కోసం చూశాను. బ్లింక్ అవలేదు. ఫోన్ చూడ్డం మానేసి పనిలో పడబోయాను. అప్పుడు మళ్లీ అమిత్ అమిత్ అని ఫోన్ బ్లింక్ అవడం మొదలుపెట్టింది. బీజేపీలో ఉన్న ఇంకో గొప్పదనం ఇదే! ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండదు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంచదు. ‘‘వరుణ్బాబూ.. యూపీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు యూపీ నుంచి వెళ్లిపోయావు. రేపు ఐదో విడత పోలింగ్. నీ నియోజకవర్గంలో కూడా నేనే కాంపెయిన్ చేసేశా. ఏమైపోయావు వరుణ్ బాబూ.. బీజేపీ నచ్చడం లేదా? మోదీజీ నచ్చడం లేదా?’’ అని అడిగారు అమిత్ షా. ‘‘ఎందుకలా అనుకుంటు న్నారు అమిత్జీ?’’ అన్నాను. ‘‘బీజేపీకి నచ్చని విషయాలన్నీ మాట్లాడుతున్నావంటే బీజేపీ నీకు నచ్చట్లేదనేగా’’ అన్నారు. నా మదిలో ఒక కవితాత్మక భావం మెదిలింది. అది మిస్ అవకుండా నోట్ చేసుకుంటున్నాను. ‘‘చెప్పు వరుణ్బాబూ. నీకు బీజేపీ నచ్చట్లేదా? మోదీజీ నచ్చట్లేదా’’ అని మళ్లీ అడిగారు అమిత్ షా. అమిత్ షా లోని గొప్పదనం అదే. వాళ్లు నచ్చట్లేదా, వీళ్లు నచ్చట్లేదా అని అడుగుతారు కానీ, నేను నచ్చట్లేదా అని అడగరు! - మాధవ్ శింగరాజు -
ఇవాంకా ట్రంప్ రాయని డైరీ
ఆడవాళ్ల ఒంటి మీద ఫ్యాషన్ ఉంటుంది. మగాళ్ల మాటల్లో ఫ్యాషన్ ఉంటుంది. ఈ సంగతి నేను వైట్‌హౌస్ మీటింగ్ హాల్లో కనిపెట్టాను. మగాళ్ల మాటల్లో.. అమ్మాయిలు ముతకతనాన్ని ఇష్టపడతారా లేక మెతకతనాన్ని ఇష్టపడతారా అన్నది ఆ అమ్మాయిల టేస్ట్. ఎవరికి ఏ స్టిచింగ్ నచ్చితే దాన్నే కదా చేతుల్లోకి తీసుకుని మునివేళ్లతో ఆ అల్లికల్లోని ఎగుడుదిగుళ్లను ఆపేక్షగా తాకి చూస్తారు. నేనూ అలాగే జస్టిన్ ట్రూడోని తాకి చూశాను. అయితే వేళ్లతో కాదు. కళ్లతో తాకి చూశాను. జస్టిన్ ట్రూడో కెనడా దేశ ప్రధాని! ట్రూడో మాట బాగుంది. ఇంగ్లిష్ భాష బాగుంది. మీటింగ్ హాల్లోకి వస్తూనే ‘ఈజ్ దిస్ సీట్ టేకెన్’ అని స్టయిల్‌గా అన్నాడు. కాదు కాదు.. అతడు స్టయిల్‌గా అనలేదు. ఆ అనడం స్టయిల్‌గా ఉంది. ట్రూడో అడిగింది నా పక్క సీటు గురించే. అయితే అది నా పక్క సీటు అని గ్రహించి మాత్రం అతడు అడిగి ఉండడు. నేను అనుకోవడం ఏంటంటే.. అతని దృష్టిలో అది కేవలం ఏదో ఒక సీటు. ట్రూడో.. ‘ఈజ్ దిస్ సీట్ టేకెన్’ అనగానే, ‘ఎస్, బై యు’ అన్నాను. మా అమ్మాయిలంతా ‘ఓ..’ అని లేచారు. ‘ఊ..’ అని కొందరు! ట్రూడో నవ్వాడు. అతడు నాకన్నా పదేళ్లు పెద్ద. ఒక దేశానికి పెద్ద. అయితే ఆ పెద్దరికాన్ని నేను మా ఇద్దరి మధ్యలోకి ఏ మాత్రం రానివ్వదలచుకోలేదు. చెయిర్ హ్యాండిల్‌పై చేత్తో తట్టి అతడిని నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. అతడినే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాను. నాకేదైనా ఫ్యాషనబుల్‌గా అనిపిస్తే వెంటనే దాన్ని తొడుక్కుంటాను. తొడుక్కుని తీసి, తగిలించాక కూడా దాన్నే కొద్దిసేపు చూస్తూ కూర్చుంటాను. ట్రూడో ఒకవేళ తన నడుముకు ఆకులు తప్ప వేరే బట్టలేమీ లేని ఆదిమానవుడిలా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించినా కూడా అదేం నాకు పట్టింపు కాదు. అతడి మాటల్లో డిజైనింగ్ ఉంటే చాలు.. అది నన్ను పట్టేస్తుంది. అప్పుడు కూడా నేనిలాగే బిడియం లేకుండా అతడినే చూస్తూ కూర్చొని ఉండేదాన్ని. బిడియపడితే ఫ్యాషన్‌ని మిస్సవుతాం. ఆడపిల్లలు దేన్ని మిస్సయినా ఫ్యాషన్‌ని మిస్ కాకూడదు. ‘ఉమెన్ ఇన్ వర్క్‌ఫోర్స్’.. మా రౌండ్ టేబుల్ డిస్కషన్ పాయింట్. అందరం అమ్మాయిలం. ట్రూడో ఒక్కడే మగాడు! నవ్వొస్తోంది నాకు. టేబుల్ మీద వాటర్ గ్లాస్లు ఉన్నాయి. ‘మంచినీళ్లు తాగుతారా?’ అని అడిగితే, ‘మంచినీళ్లు తాగొచ్చా?’ అని అడిగేలా ఉన్నాడు! మీటింగ్ అయ్యాక డాడీ వచ్చి నన్ను మురిపెంగా తన ‘ప్రెసిడెంట్ సీట్’లో కూర్చోబెట్టారు. నాకు ఈ వైపు డాడీ, ఆ వైపు ట్రూడో నిలుచున్నారు. ట్రూడో నన్ను తాకకుండా ఎడంగా నిలుచున్నాడు. అది నా హార్ట్‌ని టచ్ చేసింది! - మాధవ్ శింగరాజు -
పన్నీర్ సెల్వం రాయని డైరీ
గవర్నర్‌కి ఏదో అయిందన్నట్లుగా అంతా వెళ్లి ఆయన్ని కలిసొస్తున్నారు! గవర్నర్ కూడా తనకేదో అయిందన్నట్లుగా అందర్నీ రాజ్‌భవన్‌కి పిలిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇప్పుడిది గవర్నర్ పదవీ విరమణలా ఉంది కానీ, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతున్న బల నిరూపణలా లేదు! సాయంత్రం గవర్నర్‌ని కలిశాను. తీక్షణంగా నా వైపు చూశారు! నేను చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయనలో అంత లోతైన చూపు లేదు. అంత ఘాటైన భావన లేదు. ‘ఉన్న దాన్ని ఊడదీసుకుని, మళ్లీ ఇప్పుడొచ్చి నన్ను తగిలించమంటే ఎలా?’ అన్నట్లు చిరాగ్గా చూశారు. ‘మీరు మునుపటిలా లేరు’ అనబోయి ఆగిపోయాను. ఆయన మునుపటిలానే ఉన్నారు గవర్నర్‌గా! నేనే.. మునుపటిలా లేను ముఖ్యమంత్రిగా! అందుకే ఆగిపోయాను. ‘మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు’ అని మొదలుపెట్టాను. మళ్లీ ఆయన చిరాగ్గా చూశారు. ‘ఏంటి చూసేది! నువ్వే అన్నీ చూపిస్తున్నావు’ అన్నారు. హర్ట్ కాబోయి ఆగిపోయాను. హర్ట్ అయినప్పుడు నాకు కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లొస్తే తుడుచుకోమని చెప్పడానికి ఇప్పుడు అమ్మ లేదు. తుడుచుకోమని అమ్మ చెప్పందే తుడుచుకునే అలవాటు నాకూ లేదు. అందుకే ఆగిపోయాను. ‘ఉత్తి పుణ్యానికి నా నెత్తిన బండెత్తేశావు కదయ్యా సెల్వం. నా ఫ్యామిలీ టూర్ మొత్తం పాడు చేసేశావ్. కాసేపలా కూర్చో, ఏం చేయాలో ఆలోచిద్దాం’ అన్నారు ఆనరబుల్ గవర్నర్. ఆయన చెప్పినట్లే కూర్చున్నాను. కానీ ఆయనే.. ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు లేదు! ‘ఒక్క చాన్సివ్వండి’ అని అడగబోయి ఆగిపోయాను. మూడుసార్లు ముఖ్యమంత్రిని అయ్యానన్న గౌరవం లేకుండా, ఎంత మాట పడితే అంత మాట అనేసేలా ఉంది ఆయన వాలకం! అందుకే ఆగిపోయాను. నేనక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి చీఫ్ సెక్రెటరీ గిరిజా వైద్యనాథన్ వచ్చారు. ఆమె అక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి పోలీస్ చీఫ్ రాజేందర్ వచ్చాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి చీఫ్ జస్టిస్ కౌల్ వచ్చారు. వాళ్ల ముగ్గురూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి శశికళ వస్తోందన్న కబురొచ్చింది! అంతా కలిసి శశికళను రాజ్‌భవన్ నుంచే ఊరేగింపుగా తీసుకెళ్లరు కదా!! ‘ఎక్స్‌క్యూజ్‌మీ సర్..’ అనుకుంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. ‘సార్.. ముందు నాకే అవకాశం ఇస్తారు కదా.. బల నిరూపణకు’ అన్నాను. ‘నీకే ఇస్తానయ్యా పన్నీర్ సెల్వం’ అన్నారు గవర్నర్. ‘మరి.. వాళ్లెందుకొచ్చారు సార్’ అని అడిగాను. గవర్నర్ మళ్లీ చిరాగ్గా చూశారు. ‘మీ ఇద్దరిలో ఎవరు బలాన్ని నిరూపించు కున్నా.. తర్వాత నేనే కదయ్యా లా అండ్ ఆర్డర్లో నా బలాన్ని నిరూపించుకోవలసింది’ అన్నారు! - మాధవ్ శింగరాజు -
జైరా వసీమ్ (దంగల్ ఫేమ్) రాయని డైరీ
ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేస్తున్నాయి! డాడీ ఇవాళ కూడా అన్నారు.. ‘‘ఇన్సీ.. లైఫ్‌లో టెన్త్ అనేది రియల్ దంగల్’’ అని. నిజానికి అది మమ్మీ అనవలసిన మాట. మమ్మీ టీచర్. కానీ నా గురించి తనకేమీ బెంగలేదు. డాడీకి కూడా నాపై నమ్మకం. బాగా చదువుతానని. ‘దంగల్’ తర్వాతే ఆయన నా చదువు గురించి కాస్త ఆందోళనగా మాట్లాడుతున్నారు! అంతకుముందు అలా ఉండేది కాదు. నా చదువు గురించి తప్ప, లోకంలోని అన్ని విషయాలూ ఆయన నాతో మాట్లాడేవారు. నేను సినిమాల్లోకి వెళ్లడం కూడా డాడీకి ఇష్టమే. ‘ఇన్సీ’ అనేది నెక్స్ట్ మూవీలో నా పేరు. ఆ పేరుతోనే డాడీ నన్నిప్పుడు పిలుస్తున్నారు! సాయంత్రం డాడీ బ్యాంకు నుంచి వచ్చారు. మమ్మీ కూడా అదే టైమ్‌కి వచ్చింది. వచ్చీ రావడంతోనే ‘‘హౌయూ బేబీ’’ అంటూ నా రూమ్‌లోకి వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి, కిచెన్‌లోకి వెళ్లిపోయింది మమ్మీ. బ్యాంకు నుండి రాగానే డాడీకి మమ్మీ గ్రీన్ టీ ఇవ్వాలి. టీ తాగుతూ డాడీ నాతో మాట్లాడ్డానికి వచ్చేస్తారు. టీ ఇచ్చేది మమ్మీ. మాట్లాడేది నాతో. ఇక చూడాలి మమ్మీ ఫీలింగ్స్. ‘‘మీ డాడీకి నాతో మాట్లాడ్డానికి టైమ్ దొర కడం లేదు పాపం’’ అంది మమ్మీ. డాడీ నవ్వారు. ‘‘మార్చి తర్వాత మాట్లాడుకుందాం’’ అన్నారు. మమ్మీ.. డాడీ వైపు వింతగా చూసింది. ‘‘మీ కూతురు టెన్త్ మాత్రమే రాయబోతోంది. అంతరిక్షంలోకి వెళ్లడం లేదు. అలా కౌంట్ డౌన్ ఫేస్ పెట్టేయకండి’’ అంది. డాడీ నా వైపు చూశారు. ‘‘అంతరిక్షం నా కూతురికి లెక్క కాదు. అయినా తనిప్పుడు ఉన్నది అంతరిక్షంలోనే కదా. అంతా కలసి దంగల్ స్పేస్‌షిప్‌లో పైకి పంపించేశారు. అక్కడి నుంచి భద్రంగా కిందికి ఎలా దిగిరావాలో చెబుతున్నాను’’ అన్నారు. డాడీ భయం అర్థమైంది. ఎగ్జామ్స్ అంటే నాకేం భయం లేదు. మమ్మీకి, డాడీకి అసలే లేదు. డాడీ భయం వేరే ఉంది. లేని పోని కాంట్రవర్సీల్లోకి నన్ను లాగేస్తారని, నా మనసు పాడవుతుందనీ. ‘‘బరి లోపల కుస్తీకి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి ఇన్సీ. బరి బయట లోకంలో అవేవీ ఉండవు. నువ్వసలు పోటీలోనే ఉండవు. కానీ నిన్ను బరిలోకి లాగేస్తారు. నువ్వు గెలిచావనో, ఓడావనో తీర్పు కూడా ఇచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి’’ అని చెప్పారు డాడీ. డాడీ చెప్పింది నిజమే. సెంట్రల్ మినిస్టర్ గోయెల్‌జీ నన్ను ఇలాగే బరిలోకి నెట్టేశారు! ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న ఓ యువతి ఫొటోను ట్వీటర్లో షేర్ చేసి, ‘మన అమ్మాయిలంతా ఆంక్షల సంకెళ్లను తెంచుకుని జైరా వసీమ్‌లా స్వేచ్ఛా విహంగమై బయటికి వచ్చేయాలి’ అని కామెంట్ పెట్టారు!! నాకూ, ఆ ఫొటోలో ముసుగు వేసుకుని ఉన్న యువతికీ పోలిక ఏమిటో నాకు అర్థం కాలేదు. ‘‘అమ్మాయిలకు ఆ ముసుగే అందమూ స్వేచ్ఛా.. సర్ జీ’’ అని రిప్లయ్ పెట్టాను. మాధవ్ శింగరాజు -
నజీబ్ జంగ్ (లెఫ్ట్‌నెంట్ గవర్నర్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు మోదీజీని నేనెప్పుడూ అలా చూడలేదు. మోదీజీని అలా చూస్తున్నప్పుడు నేనెలా ఉన్నానో చూసుకునే అవకాశం కూడా నాకు లేదు. నేనున్నది ‘రాజ్ నివాస్’లో కాదు. ప్రధాని నివాసంలో! ఏ సమయంలోనైనా మోదీజీ ఒక్కరే అక్కడ స్వేచ్ఛగా అద్దం చూసుకోగలరు. కానీ ఆయనకు అద్దం చూసుకునే అవసరం ఉంటుందని నేను అనుకోను. తన ముఖం ఎప్పుడు ఎలా ఉండాలో మోదీజీకి క్లారిటీ ఉంటుంది. అద్దంలో చూసుకుని క్లారిటీ తెచ్చుకోవలసిన ముఖం కాదు మోదీజీది. అద్దానికే క్లారిటీ ఇవ్వగల ముఖం. ‘‘చెప్పండి నజీబ్ జీ. నేను హిందువు, మీరు ముస్లిం. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ తన కళ్లలోని ఆర్ద్రత స్థాయిని ఏమాత్రం తగ్గనివ్వకుండా. ‘‘మోదీజీ.. అలా మాట్లాడకండి. నా మనసు చివుక్కుమంటుంది. మీరు హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం’’ అన్నాను. ‘‘మరేంటి చెప్పండి నజీబ్ జీ. నేను ఎన్.డి.ఎ., మీరు యు.పి.ఎ. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ అదే స్థాయి ఆర్ద్రతను కంటిన్యూ చేస్తూ! ‘‘అయ్యో మోదీజీ.. మీరలా అనకండి. నేను యు.పి.ఎ.మనిషినని మీరు అనుకుని ఉంటే.. ప్రధానిగా మీ ప్రమాణ స్వీకారం రోజే, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నా పదవీభ్రష్టత కూడా జరిగి ఉండేదని నాకు తెలుసు’’ అన్నాను. ‘‘ఇంకేంటి నజీబ్ జీ.. మీ ప్రాబ్లం! ఎందుకిలా చేశారు? పాత నోట్లేమైనా మీ దగ్గర మిగిలిపోయాయా.. ‘యా అల్లా.. డిసెంబర్ 31 దగ్గరపడుతోంది ఎలా..’ అని మీరు దిగులు చెందడానికి? చెప్పండి నజీబ్ జీ! మన కుర్రాళ్లు ఉన్నారు. క్యాష్ చేసి పెడతారు’’ అన్నారు మోదీజీ. ‘‘అయ్యో! అలాంటిదేమీ లేదు మోదీజీ. రిజర్వు బ్యాంకు గవర్నరే డబ్బుల్లేక ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని తిరుగుతుంటే, ఈ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంత మోదీజీ’’ అన్నాను. ‘‘అయినా నాకు అంత డబ్బు అవసరం లేదు మోదీజీ. ఢిల్లీ గవర్నరుకు ఖర్చేముంటుంది చెప్పండి’’ అన్నాను. ‘‘మాణింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా డబ్బులు కావాలి కదా నజీబ్ జీ’’ అన్నారు మోదీజీ! నవ్వాను. ‘‘నేనెంత తింటాను మోదీజీ.. ఒక పరోటా, లైట్‌గా ఆలూ కర్రీ’’ అన్నాను. మోదీజీ నావైపు పరిశీలనగా చూశారు. ‘‘మరి.. పూరీ, సబ్జి?’’ అని అడిగారు! ఆ వెంటనే, ‘‘కేజ్రీవాల్‌కు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అదే కదా నజీబ్ జీ’’ అని అన్నారు!! నాకు అర్థమైంది! మోదీజీలోని ఆ ఆర్ద్రత.. సడన్‌గా నేను రిజైన్ చేసి వచ్చేసినందుకు కాదన్నమాట! ‘‘కానీ మోదీజీ.. కేజ్రీవాల్ తన బ్రేక్‌ఫాస్ట్ తనే తెచ్చుకుని నాతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు’’ అన్నాను. ఆయన వినలేదు. ఆయన ఆర్ద్రతలోనూ మార్పు లేదు! -
‘ప్రధానిగా నాకా ప్రివిలెజ్ లేదు’ అన్నారు!
బయటికి అడుగుపెట్టి యుగాలు అయి నట్లుంది! కారు అద్దాల్లోంచి చూస్తున్నాను. ఇండియా భారత్‌లా లేదు. ఇండియన్స్ భారతీయుల్లా లేరు! సూటు బూటు వేసుకుని, హ్యాటు తొడుక్కుని రెండు చుక్కల గంజి కోసం క్యూలో నిలబడిన ఆర్థిక మాంద్యపు అమెరికన్ పౌరుల్లా ఉన్నారు! ‘‘ఉర్జిత్.. నువ్వు సున్నిత హృదయుడివి. బయటికి వెళ్లకు. సర్జరీ జరుగుతున్నప్పుడు కారే రక్తాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు’’ అని నవంబర్ 9న మోదీజీ నాతో అన్నారు. అది సింగిల్ డే సర్జరీ అనుకున్నాను. ఇలా రోజుల తరబడి రోడ్లపై రక్తం బారులు బారులుగా, «ధారలు ధారలుగా గడ్డకట్టి పోతుందని అనుకోలేదు! ‘‘మోదీజీ.. మన దేశ రక్త ప్రసరణ మెల్లిమెల్లిగా ఆగిపోతున్నట్లుంది’’ అన్నాను భయంగా, బెంగగా. ఆయనతో నేను ఆ మాట అన్నరోజు డిసెంబర్ 9. నవంబర్ తొమ్మిది కన్నా డిసెంబర్ తొమ్మిది నయంగా ఉండాలి. కానీ డిసెంబర్ తొమ్మిది నవంబర్ తొమ్మిది కన్నా అధ్వానంగా ఉంది. భారతదేశపు రోడ్లపై నేనెప్పుడూ ఇంతమంది బిచ్చగాళ్లను చూడలేదు! టక్ చేసుకున్న బిచ్చగాళ్లు, టైలు కట్టుకున్న బిచ్చగాళ్లు, సీనియర్ సిటిజన్ బిచ్చగాళ్లు, హాఫ్‌డే లీవ్ పెట్టొచ్చిన బిచ్చగాళ్లు, ఫుల్ డే పర్మిషన్ తెచ్చుకున్న బిచ్చగాళ్లు, సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు, సామాన్య బిచ్చగాళ్లు, బిడ్డల్ని చంకనేసు కొచ్చినవాళ్లు.. మొత్తం దేశమే బిచ్చమెత్తుతోంది! ‘బాబ్బాబ్బాబ్బాబు’ అంటూ చేయి చాస్తోంది. ‘‘రక్తం చూడకుండా కళ్లు మూసుకోగలిగాను కానీ, ఆ దేబిరింపులు విని తట్టుకోలేక పోతున్నాను మోదీజీ’’ అన్నాను. మోదీజీ కళ్లజోడు సవరించుకున్నారు. ‘‘పిల్లాడిలా మాట్లాడకు ఉర్జిత్. నువ్వు రిజర్వు బ్యాంకు గవర్నర్‌వి. గట్టిగా ఉండాలి. నా కన్నా నువ్వే గట్టిగా ఉండాలి. ఇండియన్ కరెన్సీ నీది. కరెన్సీ మీద ఉండే సంతకం నీది. ప్రధానిగా నాకా ప్రివిలెజ్ లేదు’’ అన్నారు! చేతులు కట్టుకుని, తల వంచుకుని మోదీజీ పక్కనే లోక్ కల్యాణ్ మార్గ్‌లో నడుస్తున్నాను. ఆయన నాకు శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపిస్తున్నారు. కానీ నన్ను నేను అర్జునుడిని అనుకునే సాహసం చేయలేకపోతున్నాను. ‘‘పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి మోదీజీ’’ అన్నాను. మోదీజీ నా వైపు తీక్షణంగా చూశారు. ‘‘ముందు మన మైండ్‌సెట్ మారాలి ఉర్జిత్’’ అన్నారు. ‘‘ఒకప్పుడిది రేస్ కోర్స్ రోడ్డు. ఇప్పుడు లోక్ కల్యాణ్ మార్గ్. పేరు మార్చింది నేనే. లోక కల్యాణం కోసం! లోక కల్యాణం కోసం మనం ఏదైనా చేస్తున్నప్పుడు లోకంలోని పెళ్లిళ్లు ఆగిపోతే మాత్రం నష్టం ఏముంది చెప్పు ఉర్జిత్? క్యాష్ లేకపోతే క్యాష్‌లెస్ పెళ్లిళ్లు చేసుకుంటారు!’’ అన్నారు! ఆ మాట అన్నాక మోదీజీ నాకు లార్డ్ కృష్ణలా అనిపించలేదు. లార్డ్ నరేంద్ర మోదీలా కనిపించారు. (ఉర్జిత్ పటేల్ రాయని డైరీ) - మాధవ్ శింగరాజు -
ఫిడెల్ క్యాస్ట్రో రాయని డైరీ
(మాధవ్ శింగరాజు) రెండు గంటల విమాన ప్రయాణానికే ప్రాణం అలసిపోతోందంటే గమ్యం దగ్గరవుతున్నట్లు కాదు. గమ్యానికి దగ్గరవుతున్నట్లు! ఓపిక పోయాక కూడా ఊపిరి తీసుకుంటూ కూర్చోవడం నాకు సాధ్యం కావడం లేదు. క్యూబాకి ఆ చివర్న హవానా. ఈ కొసన శాంటియాగో. ఇక్కడ ఇల్లు. అక్కడ పార్టీ ఆఫీసు. వెళ్లొచ్చే సరికి ఒళ్లు వెచ్చగా అయింది. ఏళ్ల విరామం తర్వాతి బయటి ప్రయాణం! క్యాస్ట్రో పెద్దవాడై పోయాడని రాశాయి అమెరికన్ పత్రికలు. మాట సరిగా రావడం లేదని, మనిషి స్థిరంగా లేడనీ రాశాయి. ‘అవన్నీ చదువుతూ కూర్చోకండి’ అంటోంది డాలియా. క్యాస్ట్రో వృద్ధాప్యం గురించి కలలోనైనా మాట్లాడడానికి ఇష్టపడని అచ్చమైన క్యూబా దేశపు పౌరురాలు నా భార్య! క్యాస్ట్రోకి మరణం లేదని క్యూబా అనుకుంటున్నట్లే ఆమె కూడా అనుకుంటోందా? పార్టీ దినపత్రిక ‘గ్రాన్మా’ ఆవేళ్టి నా సంపాదకీయం కోసం ఎదురుచూస్తోంది. ఏం రాయాలి? ఇక రాసేందుకు ఏమీ లేదని రాయాలా? ఇక ముందు రాయలేకపోవచ్చు అని రాయాలా? ‘పార్టీ మీటింగులో కూడా మీరిలాగే మాట్లాడారు మిస్టర్ క్యాస్ట్రో’ అంటోంది డాలియా. కానీ నాకు తెలుస్తోంది. త్వరలోనే కొన్ని రోజులకు అందరికీ జరిగినట్లే నాకూ జరుగుతుంది. ఎవరి వంతు వారికి వస్తుంది కదా. అలాగే నా వంతు. విప్లవంలో నా వంతు. అజ్ఞాతంలో నా వంతు. పోరాటంలో నా వంతు. విజయంలో నా వంతు. విరామంలో నా వంతు. విశ్రమణలో నా వంతు. మరణంలో నా వంతు! నా వంతు కనుక నాక్కాస్త వ్యవధిని ఇస్తే.. మళ్లొకసారి క్యూబాకు చెప్పాలి. మనకు కావలసినంత చక్కెర ఉంది.. తియ్యటి మాటలు నమ్మొద్దని చెప్పాలి. ఒబామా మంచివాడా కాదా అని కాదు. అమెరికా మంచిదా కాదా అని తెలుసుకుని ఉండాలి.. పుట్టిన ప్రతి ఒక్క క్యూబన్ పిల్లవాడు అని చెప్పాలి. ‘ఒబామా పని గట్టుకుని వచ్చాడు కదా నువ్వొకసారి మాట్లాడి ఉంటే బాగుండేదేమో’ అన్నాడు నా తమ్ముడు రౌల్. శత్రువును ఎప్పుడూ శత్రువు గానే చూడాలి. స్నేహహస్తం ఇచ్చామంటే ధైర్యంగా ముందుకు వస్తాడు. ధైర్యంగా భుజంపై చెయ్యి వేస్తాడు. అప్పుడు వాడిని దూరంగా ఉంచే ధైర్యం మనం చెయ్యలేం. క్యూబా అమెరికాకు వంద మైళ్ల దూరంలో ఉంటూ అమెరికాను వేల మైళ్ల హద్దుల్లో ఉంచగలిగిందంటే.. స్నేహధర్మం కన్నా శత్రుధర్మం ముఖ్యమని నమ్మడమే. రౌల్ ఒబామాతో కరచాలనం చేశాడు. ఒబామాతో కలిసి డిన్నర్ చేశాడు. ఒబామాతో కలిసి యు.ఎస్.-క్యూబా బేస్‌బాల్ గేమ్ చూశాడు. ‘మనం ఫ్రెండ్స్‌లా ఉందాం. ఇరుగుపొరుగులా ఉందాం. ఒక ఫ్యామిలీలా ఉందాం’ అని చెప్పి వెళ్లాడు ఒబామా. గతాన్ని ఎక్కడ పూడ్చి పెట్టాలన్నది మాత్రం ఆయన చెప్పలేదు. అమెరికన్ ప్రజలు, క్యూబా ప్రజలు కలిస్తే ఎన్ని పనులైనా జరగొచ్చు. అమెరికా, క్యూబా కలవడం మాత్రం ఎప్పటికీ జరగని పని. (కమ్యూనిస్టు శిఖరం కూలిపోయింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూశారు. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు క్యూబా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.) -
రాఖీ సావంత్ (బాలీవుడ్ నటి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు చెడులో ఎట్రాక్షన్ ఉంటుంది. మంచిలో మహాత్ముడు ఉంటాడు. మంచీచెడు కలసిన ఎట్రాక్షన్.. మోదీ మహాత్ముడు! కానీ ఈ మాటను బీజేపీవాళ్లు ఒప్పుకోరు. ఎట్రాక్షన్‌ని మోదీలోంచి లాగేసి, మహాత్ముడి నొక్కడినే ఆయనలో చూడమని ఉపదేశిస్తారు! ఇదేం న్యాయం? మోదీ ఈ దేశ ప్రధాని. నేను ఈ దేశ పౌరురాలిని. ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటానో అలా చూడడం నా హక్కు. దేశం వెలిగిపోవాలంటే బ్యాగ్రౌండ్ బ్లాక్ కలర్లో ఉండాలి. మోదీ వెలిగిపోవాలంటే ఆయనకు బ్యాగ్రౌండ్‌గా బ్లాక్ డ్రెస్ ఏదైనా ఉండాలి. ప్రధాని ప్రజల్ని వెలిగించడం, ప్రజలు ప్రధానిని వెలిగించడం ఒక్క డెమోక్రసీలోనే సాధ్యం. దేశాన్ని వెలిగించడం కోసం మోదీ దేశాలు పట్టుకుని తిరుగుతున్నప్పుడు, మోదీని వెలిగించడం కోసం ఆయన ఫొటోలు అంటించుకున్న బ్లాక్ డ్రెస్ వేసుకుని నేనెందుకు తిరగకూడదు? ఆ మాత్రం దేశభక్తి నాకు ఉండదా? ఉండకూడదా? ఎవరో నా మీద కేసు పెట్టారు.. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నన్ను కఠినంగా శిక్షించాలట! ఇంతకన్నా ఎట్రాసిటీ ఆన్ ఉమెన్ ఉంటుందా? నచ్చిన డ్రస్‌ను వేసుకునే స్వేచ్ఛ, నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేసుకునే స్వాతంత్య్రం భారతీయ స్త్రీకి లేదా? నేను భారతీయ స్త్రీని కాదా? ఇండియాలోనే కదా ఉన్నాం. అదీ మోదీ ఇండియాలో! ఎంత బ్రాడ్ లుక్ ఆయనది! ఆయన పేరు చెడగొట్టడానికి కాకపోతే నాపై ఏంటీ కేసులు ఇండీసెంట్‌గా! డ్రస్ డిజైన్లంటే ఎప్పుడూ ఆ పూలు, పిందెలేనా? మోదీ ఎందుకు కాకూడదు? మోదీ ముఖచిత్రాలను ఇన్స్పైరింగ్గా నా బట్టల మీద నేనెందుకు ఉంచుకోకూడదు? ఈ దేశాన్నే ఆయన డిజైన్ చేస్తున్నప్పుడు, ఆయననే ఒక డిజైన్‌గా నేనెందుకు స్వీకరించకూడదు?! మోదీకి తెలియకుండా నా మీద కేసు పెట్టి ఉంటారు. తెలిస్తే ఆయన ఊరుకోరు. తెలిసీ ఆయన ఊరుకున్నారంటే ఊరెళ్లో, టూరెళ్లో ఉండాలి. ఈమధ్యెక్కడో కెమెరాతో కనిపించారు... పులిని ఫొటో తీస్తూ! ఆయన్ని అలా చూస్తుంటే .. మనిషి పులిని ఫొటో తీస్తున్నట్టుగా లేదు. సింహం.. పులిని ఫొటో తీస్తున్నట్లుగా ఉంది. గ్రేట్ మ్యాన్. ఆ రాజసం ఎన్డీయేలో ఎవరికుంది? మోదీ పులిలా ఉంటారు. సింహంలానూ ఉంటారు. అదే ఆయన ప్రత్యేకత. పులిలా ఉన్నప్పుడు సింహంలా గర్జిస్తారు. సింహంలా ఉన్నప్పుడు పులిలా గాండ్రిస్తారు. అది ఇంకో ప్రత్యేకత. ఈ రెండు ప్రత్యేకతలు లేకపోతే కాంగ్రెస్, కశ్మీర్ కలిసి ఏనాడో ఆయన ముందు తోకాడించేవి! అందుకే ఆయన నా డ్రీమ్ మ్యాన్. మోదీజీ మళ్లీ చికాగో వచ్చినప్పుడో, నేను ఢిల్లీ వెళ్లినప్పుడో ఈసారి మోదీ ఫొటోలతో పాటు కొన్ని సింహాలు, కొన్ని పులులు ఉన్న డ్రెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని ఆయనతో సెల్ఫీ దిగాలి. -
రతన్ టాటా (టాటా చైర్మన్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు టాటాలు ఏం చేసినా టైమ్లీగా ఉంటుంది. సైరస్ మిస్త్రీ దగ్గరే.. ఫస్ట్ టైమ్ టాటా టైమ్ తప్పింది! మిస్త్రీని తప్పించడానికి తొందరపడింది. రెండురోజులు ఆగి ఉండాల్సింది. నరక చతుర్థి రోజు తొలగించి ఉంటే టైమ్లీగా ఉండేది. టాటాలోని ఆరు లక్షల మంది ఉద్యోగులకు దీపావళి బోనస్ ఇచ్చినట్టూ ఉండేది. ఏటా ఇచ్చేదానికి అడిషనల్‌గా. మిస్త్రీలను టాటాలను చేద్దామనుకుంటే, టాటాలను మిస్త్రీలను చెయ్యాలని చూశాడు మిస్త్రీ! ద్రోహి. ఫ్రీడమ్ ఇస్తే, ఫ్రీహ్యాండ్ తీసుకున్నాడు. నయం. టాటా సన్స్.. మిస్త్రీ సన్స్ కాలేదు! మిస్త్రీ మోటార్స్, మిస్త్రీ స్టీల్, మిస్త్రీ డొకోమో, మిస్త్రీ సాల్ట్, మిస్త్రీ స్కై, మిస్త్రీ టెక్నాలజీస్.. గాడ్! ఊహించుకుంటేనే వేరే గ్రహంలో ఉన్నట్లుంది. దేశ ప్రజలకు రోజూ టీవీల్లో, పేపర్లలో, బయట హోర్డింగ్స్‌లో ఆ గ్రహాంతర భాష అర్థం కాక, జికా వంటి వైరస్ ఏదో గొంతు పట్టుకుని ఉండేది. పెద్ద విపత్తు తప్పింది. టాటాలు ఎవర్నీ నమ్మరు. నమ్మి ఎవర్నీ చైర్మన్లను చెయ్యరు. టాటాలకు నమ్మకమైన వాళ్లు అవసరం లేదు. నమ్మకంగా ఉండేవాళ్లు కావాలి. ఈ లాజిక్ మిస్త్రీకి అర్థం కాలేదు! చెప్పకపోయినా చేసుకుపోయేవాళ్లు టాటాలకు అక్కర్లేదు. చెప్పిన పని చేసుకుపోయేవాళ్లు కావాలి. ఈ లాజిక్కూ మిస్త్రీకి అర్థం కాలేదు. శిక్ష అనుభవించాడు. మిస్త్రీని నేను చైర్మన్‌ని చేసినంత తేలిగ్గా, జే నన్ను చైర్మన్‌ని చేయలేదు! జే నన్ను యాభై నాలుగేళ్లకు చైర్మన్‌ని చేస్తే, మిస్త్రీని నేను నలభై నాలుగేళ్లకే చైర్మన్‌ని చేశాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అది నేను టాటా గ్రూప్‌కి చైర్మన్ అయిన రోజు కాదు. టాటా గ్రూప్‌కి ఏదో ఒక రోజు చైర్మన్‌ని కాబోతున్నానని తెలిసిన రోజు. ఆ మధ్యాహ్నం జే ని కలవడానికి ఆసుపత్రికి వెళ్లాను. గుండెపోటు నుంచి కోలుకుంటున్నారు జే. దగ్గరగా వెళ్లి కూర్చున్నాను. ‘‘ఏంటి కొత్త విషయాలు?’’ అని అడిగారు. ‘‘కొత్తగా ఏమీ జరగలేదు’’ అని చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ‘‘నా దగ్గర ఓ కొత్త సంగతి ఉంది చెప్పేదా?’’ అని అడిగారు. ఆయన కళ్లలోకి చూశాను. ‘‘చైర్మన్ పదవి నుంచి నేను రిటైరవుదామని నిర్ణయించుకున్నాను’’ అన్నారు జే! అదేం నన్ను ఆశ్చర్యపరచలేదు. కొద్దిగా పాజ్ ఇచ్చి, ‘‘టాటా సన్స్ చైర్మన్‌గా నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను’’ అన్నారు జే! అదీ నన్ను ఆశ్చర్యపరచలేదు. టాటాలు ఏం చేసినా టైమ్లీగా చేస్తారు. టైమ్ చూసి చేస్తారు. కానీ.. నేనే, రాంగ్ టైమ్‌లో మిస్త్రీని చైర్మన్‌ని చేసినట్లున్నాను! కాలింగ్ బెల్ మోగింది. కణేల్ కణేల్మని మోగింది. మిస్త్రీ అలాగే నొక్కుతాడు. ‘కమ్ ఇన్’ అన్నాను చికాగ్గా. ఎదురుగా... ఆఫీస్ బాయ్! సైరస్ మిస్త్రీ మూలమూలలా పట్టేసినట్టున్నాడు. పండగయ్యాక టాటా సిస్టమ్స్ అన్నిట్లో యాంటీ–సైరస్ను ఇన్స్టాల్ చేయించాలి. -
ఓం పురి (బాలీవుడ్ నటుడు) రాయని డైరీ
మనాలిలో దిగాం. ‘దిగాం’ కాదు, ‘ఎక్కాం’! గొప్ప ఔన్నత్యంతో ఉంటుంది మనాలి ఎప్పుడూ. ఫ్లయిట్‌లోంచి కిందికి దిగినా, మనాలిలో అది పైకి ఎక్కడమే. ఫ్లైట్లు, హైట్లు అన్నీ మనాలి పాదాల దగ్గర ఒత్తిగిలాల్సిందే. మనిషి చేసే ఈ స్కీయింగ్, ట్రెక్కింగ్, గ్లైడింగ్, రాఫ్టింగ్.. అన్నీ పిల్లాటల్లా కనిపిస్తాయేమో మనాలికి! ‘ట్యూబ్‌లైట్’ షూటింగ్‌కి వచ్చాం. దేశభక్తి చిత్రం. ఇండో చైనా వార్ అండ్ లవ్ మూవీ. పూర్తవొచ్చింది. కబీర్‌ఖాన్, సల్మాన్, మిగతా ఆర్టిస్టులు చాయ్ తాగుతూ డిబేట్లో పడిపోయారు. కశ్మీర్... క్రికెట్.. కరణ్‌జోహార్. ఏ దిల్ హై ముష్కిల్! ఏ టాపిక్ మీదైనా డిబేట్ జరగొచ్చు. డిబేట్ మాత్రం టాపిక్ కాకూడదు. డిబేట్‌ను వదిలేసి చాయ్ గ్లాసు పట్టుకుని కూర్చున్నాను. డిబేట్లలో కూర్చున్నప్పుడు చాయ్ తాగుతున్నంత సుఖంగా ఏమీ ఉండదు. మనది కాని మాట మన నోట్లోంచి వచ్చేస్తుంది! దేవుడా. అది మనం అనుకున్న మాట అయుండదు. మనం అనాలనుకున్న మాట కూడా అయుండదు. అయినా అనేస్తాం. ఎవరి కడుపులోనిదో మన నోట్లోంచి రావడం ఎంత దరిద్రం!! మొన్న నా బర్త్‌డేకి ఎటావా వెళ్లినప్పుడు బల్బీర్ యాదవ్‌తో ఇదేమాట అన్నాను. ‘దరిద్రం నా నెత్తికెక్కింది. మీ పాదాల దగ్గర నాకు నేను చితిపేర్చుకుని దగ్ధమై పోవడానికి వచ్చాను’ అన్నాను. ‘పుట్టిన రోజు అదేం మాట’ అన్నారు బల్బీర్ పెద్ద మనసుతో నన్ను దగ్గరకు తీసుకుంటూ! దూరంగా జరిగాను. ఆయన నన్ను హత్తుకోబోయారు. ఆ చేతుల్లో ఒత్తిగిలే అర్హతే నాకు లేదు. మనాలి కన్నా ఉన్నతుడిలా ఉన్నాడాయన. చేతులు జోడించాను. ఆయన కొడుకు సైనికుడు. అమర వీరుడు. సరిహద్దు కాల్పుల్లో అతడు చనిపోయినప్పుడు, టీవీలో నేను అన్న మాటకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఎటావా వెళ్లాను. ఎంత అశుద్ధం నా నోట్లోంచి! ‘ఆర్మీలో చేరమని వారినెవరు బలవంతం చేశారు?’ అన్నాను. నిజానికి నా ఉద్దేశం అది కాదు. ఇంకొకటేదో! ఆ ఇంకొకటి సైనికులను తక్కువ చేసేది కాదని మాత్రం చెప్పగలను. నా మనసులో ప్రతి సైనికుడి మీద గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఒక గౌరవ వందనంలా డిబేట్లో వినిపించలేక పోయాను. మా నాన్న సైనికుడు. నేనూ ఒకప్పుడు సైన్యంలో చేరాలని తపించినవాడినే. కానీ నా మాట మిస్‌ఫైర్ అయింది. అది మా నాన్నను అవమానించినట్టు. నా దేశాన్ని అవమానించినట్టు. ఇంకో దేశం అయితే నన్ను ఉరితీసి ఉండేది. ఆ అమర వీరుడి ఫొటో ముందు తలబద్దలు కొట్టుకుంటున్నాను. ‘జీ ఆప్ ఠీక్ హో’ అన్నారు సల్మాన్ నా దగ్గరికొచ్చి. ‘ఏక్ దమ్ ఠీక్ హు సల్మాన్‌జీ’ అన్నాను. ‘ఎక్కడికో వెళ్లిపోయారు’ అంటున్నాడు నవ్వుతూ. వెళ్లిపోలేదు. ఉండిపోయాను.. ఎటావాలో. నా కొత్త బర్త్ ప్లేస్ అది. -మాధవ్ శింగరాజు -
నా నవ్వును మోదీ పట్టించు కోలేదు!
గోవాలో క్లైమేట్ బాగుంది. ఇండియాలోనే.. చైనాకు ఏమంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదు. మోదీ తీరు కూడా అన్‌ఫ్రెండ్లీగా ఉంది. గోవాలో ల్యాండ్ అయినప్పటి నుంచీ చూస్తున్నాను. ఆయన నన్ను చైనా ప్రెసిడెంట్లా కాకుండా పాకిస్తాన్ ప్రధానిలా ట్రీట్ చేస్తున్నారు! సమ్మిట్‌కి వచ్చి తప్పు చేశానా?! మధ్యాహ్నం ఒకటీ పదికి ఇండియాకు వస్తే, ఐదూ నలభై దాకా మోదీ బిగదీసుకునే కూర్చున్నారు! తిన్నారా అని అడగలేదు. కాసేపు బీచ్‌లో అలా తిరుగుతారా అని అడగలేదు. నేనే వెళ్లి తిందామా అని అడిగాను. కాసేపు బీచ్‌లో అలా తిరుగుదామా అని కూడా అడిగాను. ‘‘సారీ మిస్టర్ షరీఫ్.. మీటింగ్‌కి ప్రిపేర్ అవ్వాలి కదా. మీరు కానిచ్చేయండి’’ అన్నారు మోదీ! పక్కనే ఉన్నాయన మోదీ చెవిలో ఏదో చెప్పాడు. ‘‘సారీ మిస్టర్ జిన్‌పింగ్.. పాకిస్తాన్ గురించి ఆలోచిస్తూ, మిమ్మల్ని మర్యాద లేకుండా షరీఫ్ అనేశాను’’ అన్నారు మోదీ. ‘ఇట్సాల్ రైట్’ అని నవ్వాను. నా నవ్వును మోదీ పట్టించు కోలేదు! లాప్టాప్లో ఏదో కొట్టుకుంటున్నారు. పాక్ మీద మోదీ ఎంత కసిగా ఉన్నారో ప్రతి మూవ్‌మెంట్‌లోనూ కనిపిస్తోంది. ఆయన ప్రతి మూవ్మెంట్లో కాదు. నా ప్రతి మూవ్మెంట్లో. నేను ఎలా కదిలినా మోదీకి నచ్చడం లేదు. మీటింగ్ హాల్ ఎంట్రెన్స్‌లో సెక్యూరిటీకి కూడా నేను నచ్చినట్టు లేదు. పైనుంచి కిందికి నన్నొకసారి చూసి వదిలేశాడు! ఇండియాలో నాకంతా మోదీల్లానే కనిపిస్తున్నారు. మోదీ నేనూ ఎనిమిదిసార్లు కలుసుకుని ఉంటాం. ఎప్పుడూ ఆయన ఇలా లేరు! బీజింగ్‌లో ఫ్లయిట్ ఎక్కేముందు మోదీ నుంచి ట్వీట్స్ ఏమైనా ఉన్నాయేమోనని చూశాను. లేవు! పుతిన్‌కి మాత్రం పెట్టారు. ‘విషింగ్ యు ఎ ఫ్రూట్‌ఫుల్ ఇండియా విజిట్’ అని! హర్ట్ అయ్యాను. చైనా పండ్లూ ఫలాలూ మోదీకి అక్కర్లేదు, చైనా ప్రాడక్ట్స్ ఇండియాకు అక్కర్లేదు! మీటింగ్ మొదలైంది. నేను, మోదీ ఇద్దరమే ఉన్నాం. జేబులో ఉన్న స్లిప్ తీశాను. మోదీతో నేను డిస్కస్ చెయ్యాల్సిన పాయింట్లు అందులో ఉన్నాయి. ఇండియాలోని చైనా అంబాసిడర్ తన జేబులోంచి తీసి నా జేబులో పెట్టిన స్లిప్ అది. ఇండియాలోని పాకిస్తాన్ హైకమిషనర్ తీసుకొచ్చి ఆ స్లిప్పును మా అంబాసిడర్ జేబులో పెట్టాడట! మోదీ నవ్వారు. హమ్మయ్య! దేశాలు ఎలా ఉన్నా, మనుషులు సంతోషంగా ఉండాలి. అదే అన్నాను మోదీతో. మోదీ మళ్లీ నవ్వారు. ‘మనుషులు ఎలా ఉన్నా దేశాలు సంతోషంగా ఉండాలని మీ కారిడార్ మిత్రుడు అనుకుంటున్నాడు కదా.. మిస్టర్ జిన్‌పింగ్’ అన్నారు! గాటిట్! మోదీ పీస్ మోడ్‌లో లేరు. స్లిప్‌ని మడతపెట్టి జేబులో పెట్టేసుకున్నాను. ‘ఆ స్లిప్ ఏమిటి మిస్టర్ జిన్‌పింగ్’ అని అడిగారు మోదీ నవ్వుతూ. ఏం లేదు అన్నాను. అందులో... భారత్‌కి పాక్ పంపిన శాంతి రాయబారం ఉంది. ..మాధవ్ శింగరాజు -
రాడ్రిగో, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ (రాయని డైరి)
మగాడు మగాడిలా ఉండాలి. చేతిలో గన్ ఉండాలి. ట్రాఫిక్‌లో బైక్ ఉండాలి. నోట్లో నిరంతరం ఒక ‘సన్ ఆఫ్ ఎ బిచ్’ ఉండాలి. ఊరికే షేక్‌హ్యాండ్ ఇస్తుండే మగాణ్ని, మర్యాదగా మాట్లాడుతుండే మగాణ్ని, లగ్జరీ కార్లలో తిరుగుతుండే మగాణ్ని మగాడిగా గుర్తించను నేను. అలిగే మగాడు, హర్ట్ అయ్యే మగాడు, తప్పుకుపోయే మగాడు కూడా మగాడు కాదు. శత్రువుతో ఫైట్ చెయ్యాలి. శత్రువుని ఫినిష్ చెయ్యాలి. కనీసం ‘పనిష్’ చెయ్యాలి. సిడ్నీషెల్డన్నీ, రాబర్ట్ లడ్లుమ్నీ చదవని మగాడు కూడా మగాడు కాదు నా దృష్టిలో. వియంటియాన్ సమ్మిట్‌లో ఉన్నాం. సౌతీస్ట్ ఏషియన్ నేషన్స్‌ని ఉద్ధరించేందుకు కూర్చొని ఉన్నారు పెద్దలందరూ. బరాక్ ఒబామా కూడా ఉన్నాడు. అతడితో పాటు మరికొందరు మర్యాదస్థులు! మర్యాదస్తుల మధ్య ఎంతోసేపు మగాడిగా ఉండలేనని అర్థమౌతోంది నాకు. ఫిలిప్పీన్స్‌లో నేనేదో చేయరాని పాపం చేసి, దాన్ని కడిగేసుకోడానికని దక్షిణ చైనా సముద్రాన్ని దాటి, ఇంతదూరం.. ఈ పరమ పావనమైన సదస్సులోని వాష్ బేసిన్ కోసం వచ్చినట్టు నాకు దూరదూరంగా జరిగిపోతున్నారంతా! ఒబామా ఒక్కడు.. ‘వాట్ రాడ్రిగో’ అన్నాడు. మగాడనిపించాడు! క్రితం రోజే అతడిని తిట్టాను. ‘ఫిలిప్పీన్స్‌లో డ్రగ్ డీలర్ల క్రాక్‌డౌన్ గురించి ఫోరమ్‌లో మాట్లాడితే నీ స్పీచ్ కాగితాలు లాగేసుకుని చింపిపారేస్తాను ఏమనుకున్నావో... సన్నాఫే బిచ్’ అని తిట్టాను. సమ్మిట్‌కి రాడనుకున్నాను. వచ్చాడు! రిటార్ట్ ఇస్తాడనుకున్నాను. ఇవ్వలేదు. తర్వాత ఇచ్చాడు. ఫోరమ్‌లో నా క్రాక్‌డౌన్ గురించి మాట్లాడి!! రైట్ వే లో ఫైట్ చెయ్యమంటాడు ఒబామా. ఏది రైట్ వే ? అవతలివాడు రాంగ్ రూట్లో వస్తుంటే మనం రైట్ వేలో వెళ్లి ఏం చేస్తాం? చచ్చిపోతాం. ఫిలిప్పీన్స్ అమెరికన్ కాలనీగా ఉన్నప్పుడు అమెరికా మాత్రం చేసిందేమిటి? క్రాక్డౌనే కదా. హిస్టరీని మర్చిపోయాడా ఒబామా? లేక నన్ను మర్చిపొమ్మంటున్నాడా?! ‘రాడ్రిగో.. యు ఆర్ ఎ ప్రెసిడెంట్. నాట్ ఎ విజిలాంటీ’.. యు.ఎన్.కు నన్ను నిందించడం ఓ అలవాటు. నావన్నీ ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్స్ అట! ‘చట్టం ఉంది కదా. గన్ ఎందుకు నీ చేతుల్లో?’ అంటుంది! ఓకే దెన్. ఒక్కరోజు గన్ లేకుండా బయటికి వస్తా. రెండోరోజుకి ప్రెసిడెంట్ ఉంటాడా ఫిలిప్పీన్స్‌కి?! సమ్మిట్‌లో చైనా టాపిక్ వచ్చింది. ఒక్కరూ గన్ తియ్యలేదు! పసిఫిక్ సముద్రం చైనాకు దక్షిణం వైపున ఉంది కాబట్టి అది ‘దక్షిణ చైనా సముద్రం’ అయిపోతుందా? అలాగైతే అది ‘పశ్చిమ ఫిలిప్పీన్స్ సముద్రం’ కూడా అవ్వాలి. ఫిలిప్పీన్స్‌కి పశ్చిమాన ఉంది కదా. ఇవన్నీ కాదు. సముద్రంపైకి ఒక్కణ్నీ ‘జెట్ స్కీ’లో వెళ్తా. పోల్ పట్టుకుని, నా కంట్రీ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తా. ఫ్లాగ్‌ని ఒడ్డున పాతి, చైనా ప్రెసిడెంట్ వస్తాడేమో రమ్మంటా. చూసుకుందాం రమ్మంటా. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ జితిన్ ప్రసాద (కాంగ్రెస్)
దేవుడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. తీన్ మూర్తి లేన్స్‌లో ఇంకా సూర్యుడు ఉదయించలేదు. దేవుడి కన్నా ముందు దేవుడి గురించిన ఆలోచన మనుషుల్లో ఉదయించడం అందమైన విషయం. అప్పుడిక మనుషుల గురించి ఆలోచించడానికి దేవుడు ఉదయాన్నే పనిగట్టుకుని లేవనక్కర్లేదు. ఆయనక్కొంత రెస్ట్. స్థిమితం! దేవుడు చాలా ఇచ్చాడు మనిషికి. చూడమని పక్షుల్ని. తిరగమని అడవుల్ని. వినమని మ్యూజిక్‌ని. చదవమని పుస్తకాల్ని. టేస్ట్ చెయ్యమని మంచి మంచి రెసిపీలని, మాట్లాడుకొమ్మని ఫ్రెండ్స్‌ని. ఆట్లాడుకొమ్మని రాఫ్టింగ్నీ, రోయింగ్నీ, యాటింగ్నీ, సాకర్నీ ఇచ్చాడు. ఇప్పుడివన్నీ వదిలి యూపీ వెళ్లిపోవాలి! అదే ఆలోచిస్తున్నాను. ఢిల్లీలో తెల్లవారుజామునే ఒళ్లు విరుచుకునే ఒక్క పక్షిని వదిలి వెళ్లినా, దేవుణ్ణి వదిలి వెళ్లినట్టే నేను. ‘‘ఎక్కడా?’’... గులామ్ నబీ ఆజాద్ ఫోను. ‘‘ధ్యానంలో’’ అన్నాను. ‘‘ధ్యానం సరే... ఎక్కడా అని’’ అన్నారు ఆజాద్. చెప్పాను. ‘‘ఢిల్లీలో మనం ఇప్పటికిప్పుడు చెయ్యవలసిన ధ్యానసాధనలు ఏమీ లేదు కానీ, వెంటనే ఫ్లయిటెక్కి యూపీ వచ్చేయ్’’ అన్నారు ఆజాద్. ఎన్నికలు పూర్తయ్యే వరకు వీళ్లు నా దగ్గరికి దేవుణ్ణి, దేవుడి దగ్గరికి నన్నూ రానిచ్చేలా లేరు, పోనిచ్చేలా లేరు. యూపీలో దిగాక, ఎట్లీస్ట్ షాజహాన్పూర్లో మా ఇంటికెళ్లి దేవుడి పటానికి దండం పెట్టుకొని వస్తానన్నా ఆజాద్‌కి కోపం వచ్చేలా ఉంది! ఆ కోపం నా మీద కాదు. దేవుడి మీద. ఎన్నికల ప్రచారానికి రానివ్వకుండా దేవుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని. కాంగ్రెస్‌కి ఓటేసే వారు, కాంగ్రెస్‌కి ఓటు వేయించేవారు ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ ఆజాద్‌కీ, రాజ్బబ్బర్కీ! ఇద్దరూ మా కాంపెయిన్ లీడర్స్. షీలాదీక్షిత్‌ను సీయెంను చేసే బాధ్యతను వాళ్లిద్దరి మీదా పెట్టించాడు ప్రశాంత్ కిశోర్. ది గ్రేట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అతడిని మించిన స్ట్రాటజిస్టులు ఆజాద్, బబ్బర్. వాళ్ల బరువును కొంత తీసి నా మీద పెట్టారు. ఇప్పుడు ‘బరువు, భారం, బాధ్యత పూర్తిగా నీదే.. యంగ్ లీడర్’ అంటున్నారు! దేవుడు నాకు జన్మనిచ్చాడు. మా నాన్న నాకు కాంగ్రెస్‌ను ఇచ్చి దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. అందుకని దేవుడు, కాంగ్రెస్ ఒకటే నాకు. ఒకటే కానీ, దేవుడి ముందు అబద్ధాలాడకూడదు. కాంగ్రెస్ దగ్గర నిజాలు మాట్లాడకూడదు. యూపీలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. యూపీ సమస్యలపై ప్రియాంక మాట్లాడుతున్నారు. యూపీని షీలాదీక్షిత్ నడిపించబోతున్నారు. అంతా క్లియర్‌గా ఉంది. యూపీలో కాంగ్రెస్ వస్తుందా లేదా అన్నదొక్కటే అన్క్లియర్. మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాను. దేవుణ్ణి నేనేమీ కోరుకోలేదు. ఎన్నికల్ని మాత్రమే ఆయన ప్రసాదిస్తాడు. గెలిచే ప్రయత్నం మాత్రం మానవులే చెయ్యాలి. -మాధవ్ శింగరాజు -
పుస్తకం ఫస్ట్ కాపీ కనిమొళికేనా!
నవంబర్‌లో బుక్ రిలీజ్ పెట్టుకున్నాను. ‘ఇన్ మై డిఫెన్స్’. మొదటి కాపీ ఎవరికి ఇవ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాతో పాటు తీహార్ జైల్లో ఉండి వచ్చిన వాళ్లలో పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు, ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. వాళ్లలో ఎవరైనా ఒకరికి ఇవ్వాలా? నేను జైల్లో పడడానికి కారణమైన గౌరవనీయులు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గారికి ఇవ్వాలా? లేక కనిమొళి.. పాపం ఎంతైనా ఆడపిల్ల.. పిల్లల్ని చూడకుండా ఉండలేకపోతున్నానని బెయిల్ కోసం ఎంతగా ఏడ్చిందో... తనకు తొలి కాపీ ఇవ్వాలా? ‘ఇన్ మై డిఫెన్స్’.. నా జ్ఞాపకాల పుస్తకం. జైలు జ్ఞాపకాల పుస్తకం కాదు. నన్ను జైల్లో తోసినవాళ్లను నేను గుర్తుంచుకుంటాను కదా, అలా గుర్తుంచుకున్న వాళ్ల జ్ఞాపకాల పుస్తకం. ‘‘ఏంటయ్యా రాజా.. కొంప ముంచేలా ఉన్నావే..’’ అన్నారు మాజీ గౌరవనీయులు పి.చిదంబరం ఫోన్ చేసి. నేను జైల్లో పడక ముందు, పడ్డాక కూడా ఆయనే హోమ్ మినిస్టర్. ఆయన్దీ తమిళనాడే. నాదీ తమిళనాడే. ఆ విషయం ఆయనకు గుర్తులేనట్టుంది. నాకు గుర్తుంది. మునగని కొంపలేవో ఇంకా మిగిలే ఉన్నాయని పి.చిదంబరం భావిస్తున్నట్లుగా ఉంది! ‘‘ముంచకుండా... కాంగ్రెస్ ఏ కొంపనైనా మిగిల్చే ఉంచుతుందని ఈ డెబ్బయ్ ఏళ్ల వయసులోనూ మీరు విశ్వసిస్తున్నారా తిరు ఆనరబుల్ చిదంబరం సార్’’ అన్నాను. ‘‘ఎందుకయ్యా ఈ పుస్తకాలు! మొదలుపెట్టి నప్పటి నుంచీ ఎవరో ఒకరి మీద రాయాలని నాలుక పీకుతుంటుంది. వదిలెయ్ ఈ పాడు లోకాన్ని.. దాని కర్మకు దాన్ని’’ అన్నారు చిదంబరం. ‘‘వదలడానికి నేనేం ఈ లోకాన్ని పట్టుకుని కూర్చోలేదు తిరు ఆనరబుల్ చిదంబరం సార్. ఈ లోకమే నన్ను పట్టుకుని జైల్లో పడేసింది’’ అన్నాను. ‘‘బాగా కోపంగా ఉన్నట్లున్నావ్ ఈ లోకం మీద’’ అన్నారు చిదంబరం. ఆయన అంటున్న లోకం, ఆయన ఉంటున్న లోకం రెండూ ఒకటే. కాంగ్రెస్ పార్టీ. అందులో డాక్టర్ మన్మోహన్సింగ్ ఒక్కరే లేరు. పి.చిదంబరం ఒక్కరే లేరు. చిదంబరం కొడుకు కార్తీ కూడా ఉన్నాడు. అందుకే ఈ పాడు లోకం మీద ఆయనకంత ప్రేమ! ‘‘అది కాదయ్యా రాజా... మా వాడి పేరు లేకుండా నీ పుస్తకం కంప్లీట్ కాదా’’ అన్నారు పి.చిదంబరం. ‘‘ఏం చెయ్యమంటారు? మీ వాడు నా జ్ఞాపకాల్లో ఉన్నాడు మరి!’’ అన్నాను. తండ్రి హృదయం తల్లడిల్లి ఉంటుంది. ‘‘సునీల్ మిట్టల్‌ని మొదట మావాడే మీ ఇంటికి తీసుకొచ్చాడని రాశావట! అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి మా వాడి అవసరం ఉంటుందా చెప్పు.. నిన్ను కలవడానికి..’’ అంటున్నారు పి.చిదంబరం. కొడుక్కి ఉన్న సైడ్ ఇండస్ట్రీల గురించి తిరు ఆనరబుల్ చిదంబరం సార్‌కి తెలియనట్లుంది! నా పుస్తకం ఫస్ట్ కాపీని ఆయనకే ఇవ్వాలి. - మాధవ్ శింగరాజు -
హిల్లరీ క్లింటన్ (అధ్యక్ష అభ్యర్థి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు ‘‘చూస్తున్నాను’’ అన్నారు డొనాల్డ్ ట్రంప్ ఉదయాన్నే ఫోన్ చేసి. ఎంబారసింగ్! ‘అప్పుడే ఏం చూశారూ...’ అనబోయి, ‘‘గుడ్మాణింగ్ మిస్టర్ ట్రంప్.. ఏమిటి ఇంత పొద్దున్నే!’’ అన్నాను. ‘‘యా.. యా.. గుడ్మాణింగ్ మిసెస్ క్లింటన్. యాక్సెప్టెన్స్ స్పీచ్‌లో మీ మాటలు విన్నప్పటి నుంచీ నేను అమెరికాను ప్రేమించడం మొదలుపెట్టేశాను తెలుసా’’ అన్నారు ట్రంప్. డిజ్గస్టింగ్! ఆహ్లాదకరమైన నా న్యూయార్క్ ఉదయాన్ని పాడు చేయడానికి ఇదే న్యూయార్క్‌లో మరోవైపున పనిగట్టుకుని నిద్రలేచాడా ఏంటి.. ఈ ట్రంప్ మహాశయుడు! ‘‘కమ్ అగైన్’’ అన్నాను విసుగ్గా. పెద్దగా నవ్వాడు ట్రంప్. ‘‘మీ డ్రీమ్ బాగుంది’’ అన్నాడు! ‘‘ఇప్పుడేగా తెల్లారింది. అప్పుడే నాకొచ్చిన కల ఏమిటో మీకు తెలిసిపోయిందా మిస్టర్ ట్రంప్. లేక... నా కలనే మీరు కూడా నాతో పాటు ప్యారలల్‌గా కంటూ ఉన్నారా?’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్. ‘‘నిద్రలో మీరు కంటున్న కలల గురించి కాదు మిసెస్ క్లింటన్... నేను మాట్లాడుతున్నది. అమెరికన్ ప్రజల్ని నిద్రపుచ్చడానికి రోజూ కాంపెయిన్లలో మీరు వినిపిస్తున్న మీ పగటి కలల గురించి’’ అన్నాడు. ‘‘మిస్టర్ ట్రంప్.. నాకివాళ చాలా పనులున్నాయి’’ అన్నాను. ‘‘చాలా పనులు అనకండి మిసెస్ క్లింటన్. చాలా కలలు అనండి’’ అని మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్. ‘‘ఫోన్ మీరు పెట్టేస్తారా? నన్ను పెట్టేయమంటారా?’’ అని అడిగాను. ‘‘అర్థం కాలేదు మిసెస్ క్లింటన్’’ అన్నాడు! ‘‘క్లింటన్స్ హోమ్‌లో మాణింగ్ అన్నది కొన్ని కనీస మర్యాదలతో మొదలవుతుంది మిస్టర్ ట్రంప్. అందుకే అడుగుతున్నాను.. ఫోన్ మీరు పెట్టేస్తారా? నేను పెట్టేయనా?’’. మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్! ‘‘ఈ ఉషోదయ క్షణాలలో మీ అర్థవంతమైన నవ్వును ఆస్వాదించే స్థితిలోకి నేను సిద్ధం కాలేకపోతున్నందుకు గొప్ప సహృదయంతో మీరు నన్ను క్షమించగలరా మిస్టర్ ట్రంప్’’ అని వేడుకున్నాను. ట్రంప్ వదలడం లేదు! ‘‘క్లింటన్స్కి ఒక రకంగా, ఒబామాలకు ఒక రకంగా; డెమోక్రాట్లకు ఒక రకంగా, రిపబ్లికన్లకు ఒక రకంగా; వైట్‌హౌస్‌కి ఒక రకంగా, బాల్టిమోర్, చికాగోలకు ఒక రకంగా... రోజు మొదలవకూడదు మిసెస్ క్లింటన్. అమెరికా మొత్తానికీ ఒకే విధమైన మాణింగ్ ఉండాలి’’ అంటున్నాడు ట్రంప్. ‘‘తప్పకుండా ఉంటుంది మిస్టర్ ట్రంప్.. మీరిలా ఉదయాన్నే ఫోన్లు చేసి... అమెరికన్లకున్న ‘ఆవలిస్తూ లేచే స్వేచ్ఛ’ను హరించకుండా ఉంటే గనుక... అందరికీ ఒకే విధమైన మాణింగ్ ఉంటుంది’’ అని అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్. జీసెస్! ఇంతకీ ఈ మనిషి ఎందుకు ఫోన్ చేసినట్టు? పెద్దగా నవ్వడానికా! నేనూ నవ్వగలనని చెప్పడానికా!! చిన్న ట్వీట్‌కే కోపం తెచ్చుకునే ట్రంప్.. నవ్వడం బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నాడు! -
కోదండరాం రాయని డైరీ
యూనివర్సిటీ పిలగాండ్లకు జెప్పిన. అబిడ్స్‌కి బోయేటప్పుడు నేను గూడ వస్తనని. అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతరు. ముప్పై రోజులల్ల ఇంగ్లిష్, ముప్పై రోజులల్ల హిందీ, ముప్పై రోజులల్ల తమిళం పుస్తకాలు ఉంటయ్ అక్కడ. గట్లనే ముప్పై రోజులల్ల మనకు రావొద్దనుకున్న భాష ముక్కున బడకుండా ఎట్ల దాస్కోవాల్నో నేర్పించే బుక్కు కూడా ఉంటే బాగుంటది. దాన్నెవరైన రాసి బుక్కేసిన్రేమో తెల్వది. గానీ అసొంటి బుక్కు ఉండాలె. తెలంగాణ వచ్చినంక, మినిస్టర్లైనంక నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగ దీశ్‌రెడ్డి.. ఏదో కొత్త భాష మాట్లాడుతుండ్రు. ఆంధ్రోల్ల భాషే నయంగుంటది. గట్ల మాట్లాడుతుండ్రు! బాల్క సుమన్ ఢిల్లీల విలేకర్ల మీటింగ్ బెట్టి నోటికొచ్చిన భాష మాట్లాడిండు. అమెరికా పోయొచ్చినంక నాకేదో అయ్యిందట. ఏమైతది! నీకు భయమైతది. రాజేంద రైతే ‘పార్టీ బెట్టి మాట్లాడు కోదండ రామ్’ అంటున్నడు! మాట్లాడేటందుకు పార్టీ వెట్టాల్న? నీగ్గావాలె పార్టీ.. మంత్రి అయ్యేటందుకు. నాకెందుకు? నేను ఏమన్న! నీకు కావల్సినట్టు గాదు, జనానికి ఏం గావాల్నో గది చెయ్యిమన్నా. అంతే గదా. గింత పెద్ద ఉద్యమం నడిపి ఆంధ్రా పాలకుల్ని తరిమినం. వాళ్లు ఇక్కడ జేసినయన్నీ వాళ్లతోనే పోవాల్నా లేదా? మల్లా హైద్రాబాదేనా? మల్లా గీ రియల్ ఎస్టేట్ డీలర్లు, కార్పొరేట్ శక్తులేనా? తెలంగాణకు వేరే అభివృద్ధి లేదా? తెలంగాణ సంస్కృతి అభివృద్ధి చెందకూడదా? సీతాఫల్ మనకు ఒక అస్తిత్వం గదా. అది ఒక్క మన దగ్గరే దొరుకుతది గదా. ఒక్క సీతాఫల్ ఫెస్టివల్ చేసినమా? నేను మొన్న అమెరికా పోతే నాకు ఆశ్చర్యమైంది. ఆ ఊళ్లల్ల ఎల్లిపాయలు పండుతయట. ఎల్లిపాయల ఫెస్టివల్ పెట్టుకుంటరు వాళ్లు! నాయకులు ప్రజల వెనకాలె ఉండాలె. ముందు గాదు. ప్రజలు ఎటు పొమ్మంటే అటుపోవాలె. గీ నాయకులు అట్లా జేస్తున్నరా? చేయాలనుకున్నదే చేస్తున్నరు. అమెరికా పోయినప్పుడు అక్కడి ప్రొఫెసర్లు జె ప్పిన్రు నాకు. ప్రపంచంలో ఎక్కడ గూడా గిట్ల ప్రజల తరుఫున నిలబడి ప్రభుత్వానికి ‘మాకిది కావాలె’ అని చెప్తున్న ప్రజాసంఘాలు తెలంగాణలో తప్ప లేవట! ప్రతిపక్షం అధికారం కోసం కొట్లాడుతది. అధికారపక్షమేమో పవర్లో కూర్చోవాలని ప్రయత్నం జేస్తది. జేఏసీకి ఈ రెండు కోరికలూ లేవు. జేఏసీ వీళ్లతో లేదు. వాళ్లతో లేదు. ప్రజలతో ఉంది. ‘ఎవరో ఉన్నరు వెనుక’ అంటున్నడు మినిస్టర్ జోగు రామయ్య. ఎవరుంటరు నా వెనుక. వచ్చి చూడు. హరగోపాల్ ఉంటడు. సచ్చిపోయిన ప్రొఫెసర్ జయశంకర్‌గారు ఉంటరు. మా ముందట ప్రజలుంటరు. విద్యార్థులుంటరు. నిరుద్యోగు లుంటరు. పైసల్లేని రైతులుంటరు. గిప్పుడు మెదక్ జిల్లా ఉంది. మల్లన్నసాగర్ బాధితులున్నరు. గీ ప్రభుత్వం గిట్లనే ఉంటే.. వచ్చే మూడేండ్లల్ల మల్లా తెలంగాణ మొత్తం మా ముందట ఉంటది. ప్రజలు ముందుండి నడిపిస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినంక ప్రజల్ని వెనకొదిలి, ముందటికి పోతమంటే తెలంగాణ ఊకుంటదా? మల్లా జెండా ఎత్తకుంటదా? మల్లా ‘జై తెలంగాణ’ అనకుంటదా? -
'నమ్మించి చేసిన ద్రోహమే నయం'
ఆజమ్‌ఖాన్, నేనూ.. ఇద్దరమే ఉన్నాం! ఇద్దరు బద్ధ విరోధులకు కొవ్వొత్తుల కాంతిలో సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేసిన స్నేహపూర్వకమైన డిన్నర్ మీట్ అది. ఒక్క డిష్ కూడా కదలడం లేదు. తనకు మింగుడు పడని ఒక విషయాన్ని నాతో చర్చించడానికి ఆజమ్ ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఆయనతో నాకు మితిమీరిన శత్రుత్వమేమీ లేదని ఆయనకూ తెలుసు. అలాగని నాతో స్నేహానికి ఆయనేం ఉవ్విళ్లూరడం లేదన్న సంగతి ఆయన ముఖంలో అస్థిమితంగా కదులుతున్న నీడలను బట్టి నాకూ తెలుస్తూనే ఉంది. ‘‘పెద్దాయన నిన్ను రాజ్యసభకు అడుగుతున్నారు’’ అన్నారు ఆజమ్. ‘‘మరి.. మీకు ఇష్టమేనా ఆజమ్జీ.. నేను మళ్లీ పార్టీలోకి రావడం?’’ అన్నాను నవ్వుతూ. ఆజమ్ ఇంకా పెద్దగా నవ్వారు. అది రాని నవ్వు. ‘‘నీ విషయంలో ఒక కేబినెట్ మినిస్టర్‌గా నేను గానీ, పార్టీ జనరల్ సెక్రెటరీగా రామ్ గోపాల్ యాదవ్ గానీ సర్దుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉందని ములాయంజీ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు’’ అన్నారు ఆజమ్. ‘‘ఎంతైనా అంటే?’’ అన్నాను. ఆజమ్ చికాగ్గా ముక్కు విరిచారు. ‘‘ఎన్నికలొస్తున్నాయి. పార్టీకి ఫండ్స్ కావాలి. క్రౌడ్ పుల్లర్స్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యం.. రాజ్‌నాథ్ సింగ్ లాంటి ఒక బలిష్టుడైన ఠాకూర్‌కి చెక్ పెట్టడం ఇంకో ఠాకూర్ వల్లనే అవుతుంది. ఇవన్నీ నువ్వు మాత్రమే చెయ్యగలవని నా చేత చెప్పించడానికి ఎందుకింత ఉత్సాహపడుతున్నావు అమర్’’ అన్నారు. ఆయనకు నా ప్రశ్న అర్థమైనట్టు లేదు! అవసరాలకు అతీతమైన స్నేహం పెద్దాయనలో గానీ, పార్టీ పెద్దల్లో గానీ ఏ కాస్తయినా మిగిలి ఉందా అన్నది తెలుసుకోవాలని నా ఆరాటం. పార్టీ నుంచి బయటకి వచ్చిన ఈ ఆరేళ్లలో నన్నొక్కరూ.. ‘స్నేహితుడా’ అని హత్తుకోలేదు. నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన సంగతి, నా పేగుల్లోని కొంత భాగానికి డాక్టర్లు అనవసరంగా కోత పెట్టిన సంగతి, నేను అతి కొద్దిగా మాత్రమే తినగలనన్న సంగతి, ఆ కొద్దిగానైనా ఒంటికి పట్టడానికి బలమైన మందులు వాడుతున్నానన్న సంగతి తెలుసుకోలేనంత సమీపానికి మాత్రమే ఇప్పటికీ నా పూర్వపు సన్నిహితులు రాగలుగుతున్నారు! దుబాయ్ ప్రయాణంలో ఓసారి నా షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా డౌన్ అయి, ఫ్లైట్‌లోనే కోమాలోకి వెళ్లిపోయాను. ‘ఇక బయటికి రాడు’ అన్నారట డాక్టర్లు. కానీ వచ్చాను. దేవుడికి కూడా నేను తనకి దగ్గరవడం ఇష్టం లేనట్లుంది! ములాయంజీని దేవుడికంటే గొప్పవాడు అనుకోవాలి. వద్దనుకున్న మనిషిని.. మళ్లీ వస్తే బాగుండని అనుకుంటున్నాడు కదా! అందుకు. ఏమైనా.. పెద్ద పెద్ద స్నేహాలు, పెద్ద పెద్ద పొజిషన్లు అశాంతికి లోను చేస్తాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నమ్మకస్నేహాలను తట్టుకోలేక ఎప్పుడో కుప్పకూలిపోతాం. నమ్మించి చేసిన స్నేహం కన్నా, నమ్మించి చేసిన ద్రోహమే నయం అనిపిస్తుంది. అమితాబ్‌లు, ఆజమ్ఖాన్ల కన్నా... దాదర్‌లో పాన్వాలాతోనో, చౌపాటీలో భేల్వాలాతోనో స్నేహం ఆహ్లాదాన్నిస్తుంది. ఆరోగ్యానిస్తుంది. - మాధవ్ శింగరాజు -
హరీశ్ రావత్, ముఖ్యమంత్రి రాయని డైరీ
నెల రోజులుగా పని లేదు. మొత్తం రాష్ట్రపతే చూసుకుంటున్నారు ఢిల్లీ నుంచి. పైనున్న బృహస్పతిలా! ఉత్తరాఖండ్ దేవభూమి. దేవుళ్లు, దేవతలు ఉండే భూమి. రాష్ర్టపతి పాలన అన్నప్పుడు.. తప్పదు, ప్రజలతో పాటు దేవుళ్లూ ప్రణబ్ ముఖర్జీ పాలన కిందికి వెళ్లవలసిందే. రాష్ర్టం కన్నా, రాష్ట్ర ప్రజల కన్నా, రాష్ట్రంలోని దేవుళ్ల కన్నా ముఖ్యమంత్రి గొప్పవాడేం కాదు కనుక అతడూ.. అధికరణాల ముందు నిలబడవలసిందే. ‘కూర్చోండి సార్, మీరు నిలబడడం ఏమిటి?’ అంటున్నారు నా ఎమ్మెల్యేలు. కూర్చుని ఏం చెయ్యాలి? పని లేనప్పుడు కూర్చున్నా ఒకటే, సచివాలయం లాన్లో నడుచుకుంటూ వెళ్లినా ఒకటే. ‘బల నిరూపణలో ఎప్పటికైనా మనమే గెలుస్తాం సార్’ అంటున్నాడు కిశోర్ ఉపాధ్యాయ్. ఆయన మా పార్టీ ప్రెసిడెంటు. పక్కకు రమ్మన్నాను. ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ లీడర్లు కొందరు పక్కకు వచ్చారు. సెంటర్లో బీజేపీ ఉన్నంత కాలం ఎవల్యూషన్ థియరీలు, రివల్యూషన్ థియరీలు పనిచెయ్యవని వీళ్లకెలా అర్థమయ్యేలా చెప్పాలి? చెప్పలేదు. వాళ్లూ చెప్పమని అడగలేదు. దటీజ్ కాంగ్రెస్. పార్టీనుంచి వెళ్లిపోయిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలదీ సేమ్‌టుసేమ్. డి.ఎన్.ఎ. వెళ్లేముందు ఎందుకు వెళ్లిపోతున్నదీ చెప్పలేదు. వెళ్లాకైనా ఎందుకు వెళ్లిపోయిందీ చెప్పలేదు. ‘బల నిరూపణకు తొందరేముంది? ముందసలు మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టారో తేలనివ్వండి’ అంది కోర్టు! మా లాయర్ ఏదో చెప్పబోయాడు. కోర్టు ‘ ష్..’ మంది. నోటి మీద వేలేసుకుని వెనక్కి వచ్చేశాడు. మా చీఫ్ సెక్రెటరీ ఏదో అడగబోయాడు. నీకిక్కడ పనేమిటంది కోర్టు. ఆయనా హర్ట్ అయ్యాడు. కోర్టులు వినేది వింటాయి. చెప్పేది చెప్తాయి. విన్నదీ, చెప్పిందీ మ్యాచ్ అవ్వాలని ఆశించడం కోర్టువారి ధర్మాన్ని, కోర్టువారి న్యాయాన్ని శంకించడమే. శంకల్లేకుండా మా వాళ్లు కోర్టు మెట్లు దిగి వచ్చేశారు. కేసు తెగే లోపు కోర్టు సెలవులు వచ్చేశాయంటే.. మళ్లీ ఇంకో నెల రోజులు రాష్ట్రపతి పాలన. చార్ధామ్ యాత్ర కోసమని ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కోర్టువారు నాకు సెలవులు ప్రసాదించబోతున్నట్టే ఉంది చూస్తుంటే. ‘ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు సార్’ అన్నాడు కిషోర్ ఉపాధ్యాయ్ మళ్లీ వచ్చి. మోదీ పేరో, అమిత్‌షా పేరో, వాళ్లిద్దరూ కాకపోతే ఉత్తరాఖండ్ బీజేపీ ప్రెసిడెంట్ అజయ్ భట్ పేరో చెప్తాడనుకున్నాను. అవేవీ చెప్పకుండా, ‘రాష్ట్రపతి ఆత్మ ప్రబోధానుసారం పని చెయ్యడం లేదు సార్’ అన్నాడు. నాకైతే అలా అనిపించలేదు. ఆత్మలు లేవు, అంతరాత్మలు లేవు. ఒకవేళ ఉన్నా 2014 నుంచి ఎవరి ఆత్మలు, అంతరాత్మలు వారి దగ్గర ఉండడం లేదు. ఎవర్నని తప్పు పడతాం? ఉత్తరాఖండ్ నిండా గుళ్లున్నాయి. గుళ్లల్లో దేవుళ్లున్నారు. ఊళ్లున్నాయి. ఊళ్లలో ప్రజలున్నారు. ఒక దండం పెట్టి వాళ్లకు వదిలేస్తే సరి.. బలాబలాలు వాళ్లే తేల్చేస్తారు. బల నిరూపణలతో పని లేకుండా. మాధవ్ శింగరాజు -
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ రాయని డైరీ
ప్రతి మనిషీ జీవితంలో ఒక్కసారైనా తెలిసో తెలియకో జైల్లో పడేంత నేరం ఏదైనా చెయ్యాలి. అప్పుడు సరిగ్గా చెప్పగలడు మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని! జైల్లో ఇంకో రెండ్రోజులు ఎక్కువుంటే.. స్వాతంత్య్రం మనకు మిడ్నైట్ వచ్చిందని కూడా చెప్పగలడు. చెప్పకపోయినంత మాత్రాన దేశం మళ్లీ వెనక్కి పోయేదేం లేదు బ్రిటన్‌లోకి. మన దేశ చరిత్రలో ఆగస్టు పదిహేను అనేది ఒకటుందని, లేదా ఆగస్టు పదిహేనుతో మన దేశ భవిష్యత్తు మొదలైందనీ తెలిసి ఉండడం దేశభక్తితో సమానం. దేశభక్తి లేకుండా దేశంలో తిరుగుతుండడం తోటి పౌరులకు అసౌకర్యం కనుక.. అస్తమానం అసౌకర్యానికి చింతించడం కన్నా, ఒకసారి జైలుకు వెళ్లి రావడం సుఖం. జైల్లో స్వాతంత్య్రం ఉండదు కాబట్టి, స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలుస్తుంది. స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. స్వాతంత్య్రాన్ని ఎవరు తెచ్చారో తెలుస్తుంది. ఎవరు ఇచ్చి వెళ్లారో తెలుస్తుంది. ఇవికాక.. జైల్లో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. రోజూ ఉదయాన్నే టైమ్‌కి లేవడం, టైమ్‌కి స్నానం చెయ్యడం, టైమ్‌కి తినడం, టైమ్‌కి పనిలో పడడం, టైమ్‌కి పనిలోంచి లేవడం, మళ్లీ టైమ్‌కి తినడం, టైమ్‌కి లైట్లు ఆపి పడుకోవడం.. అంతా టైమ్ ప్రకారమే నడుస్తుంది. టైమ్‌సెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. బయట స్వాతంత్య్రం ఉన్నప్పుడు ఇవేవీ టైమ్‌కి చెయ్యలేదని తెలుస్తుంది. టైమ్సెన్సే కాదు.. కనీసం కామన్సెన్సు, సివిక్సెన్సు కూడా లేకుండా గడిపామని తెలుస్తుంది. ఇంకా.. ఆ జైలు ఏకాంతంలో, ఆ ధ్యాన మందిరంలో మన ఊపిరి మనం తీసుకోవడం వినిపిస్తుంది. మన మౌనం మనకు ప్రతిధ్వనిస్తుంది. లంచ్‌బ్రేక్‌లో ప్లేటు పట్టుకుని లైన్లో నిలబడ్డప్పుడు మనుషుల్ని మనుషులుగా గుర్తుపడతాం. మనుషుల్లో మనుషుల్లా కలసిపోతాం. సెల్‌లోకి వెళ్లి పడుకున్నాక సడెన్‌గా ఏ నడిరేయి నక్షత్రంలోనో మానవజన్మ ఎత్తుతాం. మనల్ని మనం వెతుక్కుని, మనల్ని మనం ఉతుక్కుని, మనల్ని మనం జాడించుకుని, మనల్ని మనం ఆరేసుకుని.. ఆరేంతవరకు దేహాన్ని జాముల గంటకు తగిలించుకుని, ఆ తర్వాత పొడి ఆత్మని తొడుక్కుంటాం. ఫ్రెష్ ఎయిర్. ఫ్రెష్ బ్రీత్. ఫ్రెష్ సోల్. మర్నాటికి మళ్లీ ఫ్రెష్ బాత్. ఫ్రెష్ బర్త్. ఎరవాడ నుంచి వచ్చి మూడు రోజులైంది. వచ్చానా? విడుదలై వచ్చానా తెలియడం లేదు. బందిఖానా నుంచి వచ్చానా? బందిఖానాలోకి వచ్చానా తెలియడం లేదు. బాల్కనీలోంచి చూసినా, బయటికొచ్చి చూసినా ముంబై ఒకేలా ఉంది. ఉక్కిరిబిక్కిరి ఊపిరితిత్తిలా ఉంది. ఎరవాడ ఉన్నంత ఓపెన్‌గా లేదు! ఇరుకిరుగ్గా మనుషులు వస్తున్నారు, వె ళుతున్నారు, తోసుకుంటున్నారు, తొక్కుకుంటున్నారు. ఎక్కడా క్షణం నిలబడడం లేదు. ఎక్కడికీ చేరుతున్నట్లూ లేదు. పరుగులు మాత్రం అలలై పడుతూ లేస్తున్నాయి. బతుకుల జాతీయ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఒక్క మనిషినైనా ఆపి, సెల్యూట్ కొట్టి, గుండెల నిండా గాలి పీల్చుకుందామంటే ఛాతీ సరౌండింగ్స్‌లో అంగుళమైనా ఉప్పొంగేందుకు స్పేస్ లేదు! - మాధవ్ శింగరాజు -
మమతా బెనర్జీ రాయని డైరీ
రాజకీయాల్లో సంకేతాలు వెళ్లడం తేలిక. నవ్వు, పువ్వు కూడా ఇక్కడ రాజకీయ సంకేతాలు అయిపోతాయి. నవ్వని మనిషి నవ్వడం ఒక సంకేతం. నచ్చని మనిషి పక్కన నడవడం ఒక సంకేతం. ఈ నవ్వులు, నడకలు నిజంగా మనవే కానక్కర్లేదు. మన పక్కవాళ్లవి కూడా అయి ఉండొచ్చు. ఎవరివి అన్న దానితో నిమిత్తం లేదు. ఎవరు అనుకున్నారు అనే దాన్ని బట్టి మన గురించి ఒక సంకేతం వెళ్లిపోతుంది. మార్క్సిస్టులు అనుకుంటే ఒకలా వెళుతుంది. పొలిటికల్ ఎగ్జార్సిస్ట్లమని చెప్పుకునేవారు అనుకుంటే ఒకలా వెళుతుంది. రాజకీయ సంకేతానికి ఉన్న గుణమే అది. దాన్ని ఎవరూ ఇవ్వనవసరం లేదు. దానంతట అదే వెళ్లిపోతుంది! పుష్పగుచ్ఛంతో మొన్న సోనియాజీ ఇంటికి వెళ్లి వచ్చాను. బద్ధశత్రువుకు బర్త్‌డే విషెస్ ఏంటని మార్క్సిస్టులు! ఇది దేనికి సంకేతమోనని అంతా రోడిన్ మ్యూజియంలో ‘థింకర్’ విగ్రహంలా కూర్చుండిపోయారు. దీర్ఘకాలం పదవిలో ఉన్న మార్క్సిస్టు యోధులు ఇంత దీర్ఘంగా ప్రజలకోసం ఒక్కరోజైనా కూర్చొని ఆలోచించి ఉంటారా?! మార్క్సిస్టులకు అమెరికా నచ్చదని చెప్పి నాకూ నచ్చకుండా పోతుందా? మార్క్సిస్టులకు అప్పుడప్పుడూ కాంగ్రెస్ కూడా నచ్చకుండా పోవచ్చని ఊహించి, నేను టెన్ జన్‌పథ్‌కు వెళ్లడం మానుకుంటానా?! కాంగ్రెస్ నాకేమీ బద్ధ శత్రువు కాదు. అది నా బర్త్ ప్లేస్. తృణమూల్ కాంగ్రెస్‌కి తాతగారిల్లు. ‘మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే మీ ఇంటికి రావడం సోనియాజీ’ అన్నాను బొకేని చేతికి అందిస్తూ. ‘అవునా?’ అన్నారు మేడమ్ నన్ను ఆప్యాయంగా స్పృశిస్తూ. ‘బాగా చిక్కిపోయారు’ అన్నాను. ‘కాంగ్రెస్ పార్టీ కన్నానా’ అన్నట్లు నవ్వారు. ఆ నవ్వులో నాకు బెంగ కనిపించింది. అంత బెంగలోనూ ‘బెంగాల్ ఎలా ఉంది మమతా’ అన్నారు. ‘మా మాటీ మనుష్’ అని నవ్వాను. అంతవరకే మేం మాట్లాడుకుంది. వెంటనే సోమ్‌నాథ్ చటర్జీ నా గురించి కాంపెయిన్ మొదలుపెట్టేశారు! వచ్చే ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, సీపీఎం కలవకుండా ఉండేందుకు బొకేలు పట్టుకుని నేను ఆ గడపా ఈ గడపా తిరుగుతున్నానట! అక్టోబర్‌లో సోనియాజీకి దీపావళి శుభాకాంక్షలు పంపిందీ, ఆగస్టులో పార్లమెంటు సెంట్రల్ హాల్లో మేడమ్‌ని హగ్ చేసుకుందీ, నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాజీకి నేను సపోర్ట్ చేసిందీ ఇందుకేనట! బయటికి గెంటేసినా తానింకా సీపీఎంకి విధేయుడిగానే ఉన్నాననే సంకేతాన్ని పంపుకోడానికి చటర్జీ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. కేజ్రీవాల్‌ని కూడా రెండు రోజుల క్రితం పార్లమెంటు హౌస్‌లో పలకరించాను. ఇద్దరం కలిసి కాసేపు వరండాలో తిరిగాం. 294 సీట్లలో అతడికి నేను ఇచ్చేది ఒక్కటీ లేదు. అతడు తీసుకునేదీ ఒక్కటీ లేదు. ఇవ్వని, తీసుకోని సీట్లతో కూడా సర్దుబాటు సంకేతాలు ఇవ్వగల సమర్థులు బెంగాల్ మార్క్సిస్టులు! - మాధవ్ శింగరాజు -
మార్క్ జుకర్‌బర్గ్ రాయని డైరీ
‘మాక్స్’ కళ్లు తెరిచి చూస్తోంది! ‘సిల్లా’ కళ్లు మూసుకుని ఉన్నా, ముఖం మీది అలసట నవ్వుతో మాక్స్నే చూస్తున్నట్లుగా ఉంది. గత ఐదు రోజులుగా ఈ తల్లీబిడ్డల మధ్య ఎడతెరిపి లేకుండా ‘మాటలు’ సాగుతున్నాయి. మధ్యలోకి వెళ్లి ముద్దాడేందుకు ఇద్దరిలో ఒక్కరూ నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఏం మాట్లాడుకుంటున్నారు? వట్టి చూపులతో! చప్పుడు కాని చిన్నపాటి నవ్వుతో మాటల్ని షేర్ చేసుకోవడంలో సిల్లా ఎక్స్పర్ట్. ఆ విద్యనే నేర్పుతోందా.. అప్పుడే తన కూతురికి! ‘బీస్ట్’ దూరం నుండి చూస్తోంది. ‘దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ జెంటిల్మన్’ అన్నట్లు చూస్తోంది! దగ్గరికి రావడం లేదు. ఈ హంగేరియన్ షీప్డాగ్కి మాక్స్ పుట్టినప్పటి నుంచీ క్షణంసేపైనా కాలు నిలవడం లేదు. మాక్స్‌తో స్నేహం కోసం తొందరపడుతోంది. ‘అప్పుడే కాదు’ అని తల నిమిరితే అలిగి వెళ్లి, నేలకు గొంతు ఆన్చి కూర్చుంటుంది. కూర్చుని, అలా కళ్లలోకి చూస్తూ ఉంటుంది. మాక్స్ కంటే ముందు నా జీవితంలోకి వచ్చిన అపురూపం.. సిల్లా. పన్నెండేళ్ల క్రితం.. పార్టీలో డిన్నర్ అయ్యాక వాష్ రూమ్‌కి వెళ్లే క్యూలో తనని తొలిసారి చూశాను. ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాను. ‘ఏంటి?’ అన్నట్లు చూసింది సడెన్‌గా! నేనూ అలాగే చూశాను.. ‘ఏంటి?’ అని భుజాలు ఎగరేస్తూ! అబ్బాయిలను అర్థం చేసుకోడానికి అమ్మాయిలకు డిక్షనరీలు కావాలా? నవ్వుకుంది నా ఏంజెల్. ‘జ్యూక్.. ఏమిటాలోచిస్తున్నావ్..’ అంటోంది సిల్లా. ‘మాక్స్‌కి డాడీని ఎప్పుడు పరిచయం చేస్తావ్’ అని అడిగాను సిల్లా బుగ్గ పట్టి లాగుతూ. ‘నాకంటే ముందు నువ్వే కదా తనకు పరిచయం అయ్యావు జ్యూక్’ అంది సిల్లా నవ్వుతూ. ఆ స్మైల్‌లో యాభై శాతానికి పైగా షేర్లు జెలసీవే! నవ్వొచ్చింది. ‘లవ్యూ సిల్లా’ అన్నాను. ‘మొత్తం నాకేనా?’ అంటూ మళ్లీ నవ్వింది. ‘ఈక్వల్ ఈక్వల్.. మామ్కీ, బేబీకి’ అన్నాను. ‘మొత్తం తనకే ఇచ్చేయ్.. నాకేం అక్కర్లేదు’ అంది సిల్లా.. మూతి విరుపు ఎమోజితో. మాక్స్ ఏదో ధ్యాసలో ఉంది. అల్ట్రాసౌండ్ స్క్రీన్‌లో మాక్స్ తన బొటనవేలు ఎత్తి నాకు ‘లైక్’ కొట్టినప్పుడే మా ఇద్దరి పరిచయం జరిగింది. క్లినిక్ నుంచి బయటికి వస్తూ ఆ సంగతి చెప్పినప్పుడు సిల్లా ఎమోషనల్‌గా బర్ట్స్ అయింది. మిస్క్యారేజ్ అయిన తొలి మూడు పరిచయాల గురించి తను ఆలోచిస్తోంది! ‘సిల్లా ప్లీజ్.. ఇది మామూలే’ అన్నాను. వినడం లేదు. చిన్న పిల్లలా ఏడుస్తోంది. ఎలా చెప్పడం? ‘నువ్వెంత బిజీగా ఉన్నా రోజులో కనీసం వంద నిమిషాలైనా నాతో ఉండాలి’.. పెళ్లికి ముందు సిల్లా పెట్టిన కండిషన్. ‘నువ్వొక్కదానివే ఎప్పుడూ బాధను దాచుకోవద్దు’.. పెళ్లయ్యాక నేను పెట్టిన కండిషన్. మాట్లాడుకోడానికి, మనసులో ఉన్నది చెప్పుకోడానికి ఈ కండిషన్లు. మాటలు లేకపోతే ప్రేమ వాడిపోతుంది. వాడిపోతున్న ప్రేమైనా మాటలు చిలకరిస్తూ ఉంటే వికసిస్తుంది. - మాధవ్ శింగరాజు -
నితిన్ గడ్కారీ రాయని డైరీ
గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాను. చల్లటి ఉదయపు గాలి ఒంటికి హాయిగా తాకుతోంది. ఎకరం స్థలంలో రంగురంగుల పూల మొక్కలు, పరిమళాలు! అసలు నేనొచ్చాకే లుట్యన్స్ జోన్ బంగ్లాలోని ఈ పూలతోట కళకళలాడుతోంది. నాకన్నా ముందు ఇక్కడ సోనియాజీ ఉండేవారు. దేశాన్ని నిర్లక్ష్యం చేసినట్లే, ఈ పూలతోటనూ ఆవిడగారు ఆలన, లాలన లేకుండా వదిలేశారు. కాషాయవర్ణంలోని పూల మొక్కలనైతే అసలే పట్టించుకున్నట్టు లేదు! రాలి, కుళ్లిన ఆకుల చెత్తను ఏరి మొక్కల పాదుల్లో వేస్తున్నాను. మోదీజీ నుంచి ఫోన్.‘‘ ఏం చేస్తున్నావ్ గడ్కారీ’’ అని. ఆయన గొంతులో విసుగు. ‘‘చెత్త ఎత్తిపారేస్తున్నా మోదీజీ’’ అని చెప్పాను. ‘‘ఎత్తిపారేస్తున్నావా? నెత్తికి ఎత్తుకుంటున్నావా?’’ అన్నారు! పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పెద్దాయన ఆవేదన. ప్రతిపక్షాల మీద చల్లాల్సిన బురదను మా మంత్రులు, ఎంపీలమంతా సొంత పార్టీ మీద చల్లుతున్నామట! ‘‘నేనెప్పుడు బురద చల్లాను మోదీజీ’’ అన్నాను. ‘‘బురద చల్లినా బాగుండేది. కానీ తమరు యూరియా, నత్రజని చల్లుతున్నారు’’ అన్నారు. ఆయన మాట్లాడుతున్నది నాగపూర్‌లో నేను చేసి వచ్చిన ప్రసంగం గురించి. ‘‘కరువు ప్రాంతానికి వెళ్లినవాడివి నీళ్ల గురించి మాట్లాడాలి గానీ, ఎరువుల గురించి మాట్లాడ్డం ఏమిటి? నీ ఇంట్లో మొక్కలకి నీళ్లకు బదులుగా నువ్వేం పోసి పెంచుతున్నావన్నది జనానికెందుకు?’’ అన్నది మోదీజీ పాయింట్. ‘‘పరువు తీస్తున్నారయ్యా, ట్వీటర్ చూళ్లేదా? ‘మోదీజీ టాయ్లెట్లో పోయమంటారు. గడ్కారీ గార్డెన్లో పోయమంటారు. ఇంతకీ ఈ దేశం ఎక్కడ పోసుకోవాలి’ అని అడుగుతున్నారు’’ అన్నారు మోదీజీ. ‘‘కానీ నా ఉద్దేశం వేరు మోదీజీ’’ అని చెప్పబోయాను. అటువైపు ఫోన్ కట్ అయింది. చల్లటి గాలి వడగాల్పులా మారిపోయింది. గార్డెన్లో ప్రహరీ గోడకు లోపలి వైపు ఓ చోట పూలబొకేలు కుప్పగా పడి ఉన్నాయి. ‘‘గులాబ్‌సింగ్’’ అని గట్టిగా కేకేశాను. గార్డు పరుగున వచ్చాడు. ‘‘ఏమిటిది’’ అని అడిగాను. కుప్పవైపు చూశాడు గులాబ్ సింగ్. ‘‘జీ.. మన బంగ్లా నుంచి వెళ్లిన బొకేలే ఇవన్నీ. మళ్లీ మన బంగ్లాలోకే ఎలా వచ్చి పడుతున్నాయో తెలియడం లేదు!’’ అన్నాడు. మోదీజీ నుంచి మళ్లీ ఫోను. ‘‘అచ్ఛా... గడ్కారీ, మనం గవర్నమెంట్‌ని ఫామ్ చేసి మే 26కి ఏడాది అవుతోంది. గుర్తుందా?’’ అన్నారు మోదీజీ. ‘‘ ఉంది ఉంది మోదీజీ. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాను’’ అని చెప్పాను. ‘‘గుడ్... నీ ఏర్పాట్లు నువ్వు చేస్కో. నాకు మాత్రం బొకే పంపకు’’ అని టప్పున ఫోన్ కట్ చేసేశారు మోదీజీ. - మాధవ్ శింగరాజు -
నారా చంద్రబాబునాయుడు రాయని డైరీ
కాళ్ల వాపు తగ్గలేదు. ఏజింగ్ ప్రాబ్లమా అని అడిగితే, కాదు బీజింగ్ ప్రాబ్లం అన్నాడు డాక్టర్. బహుశా చైనాలో రోడ్లన్నీ... గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాదిరిగా... బాగా లాంగ్ అయి ఉండాలి. ఉపప్రధాని వాంగ్ యాంగ్ కూడా! మనిషి చూడ్డానికి పట్టిసీమలా ఉన్నా, ముందుచూపులో పోలవరంలా ఉన్నాడు. ‘అమరావతిలో ఇన్వెస్ట్ చెయ్యండి సార్’ అంటే, ‘కష్టం నాయుడుగారూ’ అన్నాడు! ‘అదేంట్సార్’ అని అడిగితే ‘సింగపూర్‌కి ఇచ్చిన కాంట్రాక్టేదో మావాళ్లకే ఇవ్వొచ్చు కదా’ అన్నాడు. ‘అలాక్కాద్సార్... వాళ్లు కట్టిపెడతారు. మీరు కొట్లు పెడతారు’ అన్నాడు పరకాల.. వాంగ్ యాంగ్తో. ‘మీరు కొట్లు పెట్టమన్నట్టు లేదు. కోట్లు పెట్టమన్నట్టు ఉంది’’ అన్నాడు వాంగ్ యాంగ్. ‘లేద్సార్, ఇటుక, సున్నం, సిమెంట్, తారూ కంకర సప్లయ్ అంతా మీదే. జస్ట్ ప్లానింగ్ ఒక్కటే సింగపూర్ వాళ్లది’ అని చెప్పాడు యనమల. వాంగ్ యాంగ్ కన్విన్స్ అవలేదు. ‘సార్, అమరావతికీ, బుద్ధుడికీ చాలా పెద్ద లింకులున్నాయి సార్. మా దేశపు మాంక్ నాగార్జున మీ దేశానికొచ్చి ప్రచారం కూడా చేశాడ్సార్’ అన్నాడు అచ్చెన్నాయుడు. ఆ ఎమోషన్‌కి వాంగ్ యాంగ్ షేక్ అయ్యాడు. హ్యాండ్‌షేక్ ఇచ్చాడు. చైనాలో ఉన్నన్ని డ్యాములు ఇంకెక్కడా లేవని చివరి రోజు మేము చైనాలో ఉన్నప్పుడు లోకేశ్‌బాబు ఫోన్ చేసి చెప్పాడు. ప్రపంచంలో పెద్ద డ్యామ్ ‘త్రీ గోర్జెస్’.. చైనాలోనే ఉందట. ‘వచ్చేటప్పుడు దాన్ని చూసి రండి డాడ్’ అన్నాడు లోకేశ్‌బాబు. డ్యాముని కట్టిన వాళ్లని చూడాలి గానీ, డ్యాముని ఏం చూస్తాం? గూగుల్‌లో కొట్టి చూస్తే డ్యామ్‌ని కట్టిన కంపెనీ పేరు కనబడింది. ఆ కంపెనీ మనకెలా వర్కవుట్ అవుతుందా అని ఆలోచిస్తుంటే లోకేశ్‌బాబు నుంచి మళ్లీ ఫోన్. ‘డ్యామ్‌ని ఇంకా చూళ్లేదు బాబూ’ అన్నాను. ‘డ్యామ్ ఇట్ డాడ్... మీరక్కడ అమరావతి అమరావతి అంటూ చైనా వాళ్ల వెంటపడి తిరుగుతున్నారు. జగన్ ఇక్కడ పట్టిసీమ, పోలవరం అంటూ రైతుల్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు. కొంపలు ముంపుకు గురయ్యేలా ఉన్నాయి డాడ్’ అన్నాడు. ఇండియా వచ్చేశాం. జగన్ ఆగట్లేదు. ఆపడం ఎలా? నీటిని అదుపు చేసేందుకు డ్యామ్‌లు ఉంటాయి కానీ, ప్రతిపక్షం నోటికి అడ్డుకట్టవేసే డ్యామ్‌లు ఉంటాయా? ఇంకా నయం... వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాల్లా... వేసవికాల సమావేశాలు లేవు. ‘వాపును చూసి ఇంకేదో అనుకోవద్దని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షా’ అని అసెంబ్లీ హాల్లో నా వాపుపై కామెంట్ చేసినా చేస్తాడు జగన్. - మాధవ్ శింగరాజు