పీయుష్‌ గోయల్‌ (కేంద్ర మంత్రి) రాయని డైరీ | Madhav Singaraju Unwritten Diary On Piyush Goyal | Sakshi
Sakshi News home page

పీయుష్‌ గోయల్‌ (కేంద్ర మంత్రి) రాయని డైరీ

Published Sun, Oct 20 2019 1:14 AM | Last Updated on Sun, Oct 20 2019 1:14 AM

Madhav Singaraju Unwritten Diary On Piyush Goyal - Sakshi

‘‘గుడ్‌ ఈవెనింగ్‌ మిస్టర్‌ మినిస్టర్, మీ ఒపీనియన్‌ కావాలి’’ అన్నాడతను నా క్యాబిన్‌లోకి వచ్చీ రావడంతోనే!!
అతడిని ఎక్కడో చూసినట్లుంది. అది కూడా గడ్డంతో చూసినట్లుంది. నా క్యాబిన్‌లోకి వచ్చినప్పుడు మాత్రం గడ్డం లేదు. 
‘‘కూర్చోండి ప్లీజ్‌! ఇఫ్‌ ఐయామ్‌ నాట్‌ మిస్టేకెన్‌.. అండ్‌.. అన్‌లెస్‌ ఐయామ్‌ వెరీమెచ్‌ మిస్టేకెన్‌.. మీకు గడ్డం పెంచే అలవాటు ఉంది కదా’’ అన్నాను. 
నవ్వాడు. ‘‘పెంచే అలవాటూ ఉంది, ఉంచుకోని అలవాటూ ఉంది. ఆ కారణంగానే మీరు నన్ను వెంటనే గుర్తుపట్టలేక పోవడం సహజమే కానీ,  మిమ్మల్ని విమర్శించిన వ్యక్తిని కూడా మీరు పోల్చుకోలేక పోవడంలో కొంత సహజత్వమేదో లోపించినట్లుగా ఉంది మిస్టర్‌ మినిస్టర్‌! విమర్శించిన మనిషిని ఎవరూ తమ కెరీర్‌లో మర్చిపోలేరు కదా..’’ అన్నాడు. 
‘‘మీరు నన్ను విమర్శించారా?! ఎవరికైనా నన్ను విమర్శించే అవసరం వచ్చేంత పెద్ద కెరీర్‌లో నేనేమీ లేనే!!’’ అన్నాను ఆశ్చర్యపోతూ. 
‘‘అఫ్‌కోర్స్‌ మిస్టర్‌ మినిస్టర్‌.. మిమ్మల్ని నేను మీ ఎదురుగా విమర్శించలేదు. మీ పక్కనా విమర్శించలేదు. నా మానాన నేను మిమ్మల్ని ట్విట్టర్‌లో విమర్శించుకున్నాను. అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది. నా ట్విట్టర్‌ అకౌంట్‌ లోని ఫొటోలో నేను గడ్డంతో ఉన్నాను. మీరు నన్ను మరింత తేలిగ్గా గుర్తుపట్టడం కోసం ఆ గడ్డంతోనే మీ దగ్గరకు వచ్చేవాడినే కానీ, ఉదయమే షేవ్‌ చేసుకున్నాను. షేవ్‌ చేసుకున్నాక తెలిసింది నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ తన పుస్తకావిష్కరణ కోసం యు.ఎస్‌. నుంచి ఇండియా వస్తున్నారని!!’’ అన్నాడు. 

అప్పుడు గుర్తుకొచ్చాడతను!
‘‘రవీ నాయర్‌.. రైట్‌?!’’ అన్నాను. 
చిరునవ్వుతో తల ఊపాడు. 
‘‘మిస్టర్‌ నాయర్‌.. మీరు మీ ట్విట్టర్‌లో నన్నొకర్నే విమర్శించలేదు. మా టీమ్‌ మొత్తాన్నీ విమర్శించారు. మేమెప్పుడూ మాకు సంబంధం లేని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామని కదా మీరు విమర్శించారు. హోంమంత్రి చరిత్ర గురించి, ఆర్థికమంత్రి అర్బన్‌ న క్సలిజం గురించి, మానవ వనరుల మంత్రి అంతర్జాతీయ వాణిజ్యం గురించి మాట్లాడతారని విమర్శించారు. ఆ వరసలోనే నన్నూ విమర్శించారు.. వాణిజ్యమంత్రి గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడతారని. సో ఫన్నీ యు నో! అది మీ విమర్శ కాదు. మీ అబ్జర్వేషన్‌. చెప్పండి ఏ విషయం మీద మీకు నా ఒపీనియన్‌ కావాలి ఇప్పుడు?’’ అన్నాను. 
‘‘అది కూడా మీకు సంబంధం లేని విషయం మీదే మిస్టర్‌ మినిస్టర్‌’’ అన్నాడు. 
పెద్దగా నవ్వాను. ‘‘నాకు సంబంధం లేనిదైతేనే నేను చక్కగా చెప్పగలనని కదా మిస్టర్‌ నాయర్‌ మీ నమ్మకం. అడగండి. మీ జర్నలిస్టులకు అన్నీ కావాలి. మేము మాత్రం మా శాఖల గురించే మాట్లాడాలి’’ అన్నాను. 

తనూ నవ్వాడు. ‘‘నేనిప్పుడు మిమ్మల్ని అడగబోతున్నది కష్టకాలపు ఆర్థిక దరిద్రాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అభిజిత్‌ బెనర్జీ రాసిన పుస్తకం మీద మీ ఒపీనియన్‌ గురించి. చెప్పండి. అలాంటి ఒక పుస్తకం ఈ దేశానికి అవసరమనే మీరు భావిస్తున్నారా?’’ అని అడిగాడు. 
అతడి వైపు చూశాను.

‘‘భారతదేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే ఉంది మిస్టర్‌ నాయర్‌. ఒకరు నిర్మలా సీతారామన్‌. ఈ దేశ ఆర్థికశాఖ మంత్రి. ఇంకొకరు నిర్మలా బెనర్జీ. అభిజిత్‌ తల్లి. ఆమెకున్న అర్హత కూడా అభిజిత్‌ తల్లి అవడం కాదు. కొడుకు అమెరికా పౌరుడిగా మారినప్పటికీ ఆమె ఇంకా ఈ దేÔ¶  పౌరురాలిగానే ఈ దేశంలోనే ఉండిపోవడం..’’ అన్నాను. 
లేని గడ్డాన్ని బరుక్కుంటూ నా వైపే చూస్తుండిపోయాడు రవీ నాయర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement