వరుణ్‌గాంధీ రాయని డైరీ
అమిత్ షా నాతో ఎప్పుడూ నేరుగా మాట్లాడరు. నేరుగా నావైపు చూడరు. ఆయనకు గాంధీజీ అంటే ఇష్టం లేదు. నెహ్రూజీ అంటే గౌరవం లేదు. నా ముఖంలో వాళ్లిద్దరూ కనిపిస్తారో ఏమో మరి! ఎటో చూస్తూ, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉంటారు.. నేనూ ఆయనా కలుసుకున్నప్పుడు, కలుసుకోవలసి వచ్చినప్పుడూ!
ఎప్పుడూ నేరుగా మాట్లాడని మనిషి, ఎప్పుడూ నేరుగా చూడని మనిషి.. ఇవాళ నేరుగా నాకే ఫోన్ చేశారు! అమిత్.. అమిత్ అని ఫోన్ బ్లింక్ అవుతూ ఉంది. నేను లిఫ్ట్ చెయ్యలేదు.
నా ముందు.. రైతు ఆత్మహత్యల డేటా ఉంది. రోహిత్ వేముల సూసైడ్ నోట్ ఉంది. గంగానదీ జలాల ప్రక్షాళన ఫైల్ ఉంది. ఈ రెండున్నరేళ్ల ప్రభుత్వ వైఫల్యాల జాబితా ఉంది. ముక్కలు ముక్కలుగా రాసిపెట్టుకున్న నా థాట్స్ ఉన్నాయి. ఈ ఏడాది తేబోతున్న నా మూడో కవితా సంకలనం ఉంది.
ఇంతకీ.. నేనెక్కడ ఉన్నాను?! ఇండోర్‌లోనా, కొచ్చిలోనా, జమ్మూలోనా, హైదరాబాద్‌లోనా, రాజస్తాన్‌లోని చురూలోనా? కిటికీలోంచి బయటికి చూశాను. ఎక్కడైతేనేం? యూపీ అయితే కాదు!
మళ్లీ అమిత్ షా కాల్! అమిత్ అమిత్ అని ఫోన్ బ్లింక్ అవుతోంది. బీజేపీని వదిలించుకుందామని యూపీని వదిలి తిరుగుతుంటే.. ఈ పెద్ద మనిషేంటీ వదలకుండా నా వెంట పడ్డాడు! ఫోన్ ఎత్తితే పనులన్నీ ఆగిపోతాయి. ఫోన్ ఎత్తకపోతే పనులన్నీ పాడైపోతాయి. బీజేపీలో ఉన్న గొప్పతనం అదే. దేన్నీ తిన్నగా సాగనివ్వదు. ఉన్నదాన్ని ఉన్నట్టూ ఉండనివ్వదు.
ఫోన్ లిఫ్ట్ చెయ్యబోయాను. కట్ అయింది! పని మానేసి, ఫోన్ మళ్లీ అమిత్ అమిత్ అని బ్లింక్ అవడం కోసం చూశాను. బ్లింక్ అవలేదు. ఫోన్ చూడ్డం మానేసి పనిలో పడబోయాను. అప్పుడు మళ్లీ అమిత్ అమిత్ అని ఫోన్ బ్లింక్ అవడం మొదలుపెట్టింది. బీజేపీలో ఉన్న ఇంకో గొప్పదనం ఇదే! ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఉండదు. ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉంచదు.
‘‘వరుణ్‌బాబూ.. యూపీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు యూపీ నుంచి వెళ్లిపోయావు. రేపు ఐదో విడత పోలింగ్. నీ నియోజకవర్గంలో కూడా నేనే కాంపెయిన్ చేసేశా. ఏమైపోయావు వరుణ్ బాబూ.. బీజేపీ నచ్చడం లేదా? మోదీజీ నచ్చడం లేదా?’’ అని అడిగారు అమిత్ షా. ‘‘ఎందుకలా అనుకుంటు న్నారు అమిత్‌జీ?’’ అన్నాను.
‘‘బీజేపీకి నచ్చని విషయాలన్నీ మాట్లాడుతున్నావంటే బీజేపీ నీకు నచ్చట్లేదనేగా’’ అన్నారు.
నా మదిలో ఒక కవితాత్మక భావం మెదిలింది. అది మిస్ అవకుండా నోట్ చేసుకుంటున్నాను. ‘‘చెప్పు వరుణ్‌బాబూ. నీకు బీజేపీ నచ్చట్లేదా? మోదీజీ నచ్చట్లేదా’’ అని మళ్లీ అడిగారు అమిత్ షా.
అమిత్ షా లోని గొప్పదనం అదే. వాళ్లు నచ్చట్లేదా, వీళ్లు నచ్చట్లేదా అని అడుగుతారు కానీ, నేను నచ్చట్లేదా అని అడగరు!
- మాధవ్ శింగరాజు